Staircase Vastu:ఇంటి నిర్మాణంలో ప్రతి మూలకు వాస్తు ప్రకారం ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. చాలా మంది గదుల దిశ, తలుపుల స్థానం, కిటికీల దిశలపై దృష్టి పెడతారు కానీ మెట్ల దిశ, స్థానం గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ వాస్తు నిపుణుల మాటల్లో చెప్పాలంటే, మెట్లు కేవలం పై అంతస్తుకు వెళ్లే మార్గం మాత్రమే కాదు, అవి ఇంటి మొత్తం శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేసే ముఖ్య భాగం. మెట్లు సరైన దిశలో లేకపోతే ఆరోగ్యం, సంపద, మానసిక శాంతి వంటి అంశాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని వారు హెచ్చరిస్తున్నారు.
ఎల్లప్పుడూ సవ్యదిశలో…
వాస్తు ప్రకారం ఇంట్లో మెట్లు ఎలాంటి దిశలో ఉండాలో నిర్ణయించడం చాలా ముఖ్యం. నిపుణులు చెబుతున్న ప్రకారం, మెట్లు ఎల్లప్పుడూ సవ్యదిశలో ఉండటం మంచిదని సూచిస్తున్నారు. అంటే తూర్పు నుండి పడమర వైపు లేదా ఉత్తరం నుండి దక్షిణ దిశగా తిరిగే విధంగా ఉండాలి. దీనివల్ల ఇంట్లో శక్తి ప్రవాహం సజావుగా జరుగుతుంది. కానీ అపసవ్య దిశలో ఉన్న మెట్లు ఆర్థికంగా, వృత్తిపరంగా ఆటంకాలు తీసుకువచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
Also Read:https://teluguprabha.net/lifestyle/solar-eclipse-2026-date-visibility-and-complete-details/
ఇంటి లోపల మెట్లు..
ఇంటి లోపల మెట్లు ఎక్కడ నిర్మించాలో కూడా వాస్తు ప్రకారం కొన్ని సూచనలు ఉన్నాయి. సాధారణంగా నైరుతి, దక్షిణం లేదా పశ్చిమ దిశల్లో మెట్లు ఏర్పాటు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తారు. కానీ ఈశాన్య భాగంలో మెట్లు నిర్మించడం మాత్రం వాస్తు దృష్ట్యా పూర్తిగా తప్పు. ఈశాన్యం పవిత్ర దిశగా పరిగణించబడుతుంది, అక్కడ మెట్లు ఉండటం వల్ల ఆర్థిక నష్టాలు మరియు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.
స్పైరల్ మెట్లు..
మెట్ల రూపకల్పనలో కూడా జాగ్రత్తలు అవసరం. కొంతమంది గుండ్రంగా తిరిగే స్పైరల్ మెట్లు అందంగా కనిపిస్తాయని భావించి అలాంటి డిజైన్‌ను ఎంచుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం అలాంటి మెట్లు ఇంటి శక్తి ప్రవాహాన్ని దెబ్బతీస్తాయి. వీటి వలన నివాసితుల మానసిక స్థిరత్వం తగ్గి, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతారు. కాబట్టి సాధ్యమైనంత వరకు సాదా డిజైన్‌లో ఉన్న మెట్లను ఎంచుకోవడం మంచిది.
వాస్తు సిద్ధాంతాల ప్రకారం మెట్ల సంఖ్య కూడా ప్రాధాన్యమైందే. మెట్లు బేసి సంఖ్యల్లో ఉండటం శుభంగా భావిస్తారు. ఉదాహరణకు 9, 15, 21 వంటి సంఖ్యలు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని నమ్మకం. అయితే మెట్ల సంఖ్య సున్నాతో ముగియకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు, ఎందుకంటే అది శక్తి ప్రవాహంలో అడ్డంకి కలిగిస్తుందనే భావన ఉంది.
ఇంటి మధ్య భాగం, అంటే బ్రహ్మస్థానం అత్యంత పవిత్ర స్థలంగా పరిగణిస్తారు. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణం చేయకూడదు. ముఖ్యంగా మెట్లు ఈ భాగానికి దగ్గరగా నిర్మిస్తే ఇంటి సానుకూల శక్తి తగ్గిపోతుందని చెబుతారు. కనీసం ఒకన్నర మీటర్ల దూరంలోనే మెట్లు ఉండాలని సూచిస్తున్నారు.
మెట్ల రంగుల విషయంలో కూడా వాస్తు సూచనలు ఉన్నాయి. లేత రంగులు ఎల్లప్పుడూ సానుకూలతను పెంచుతాయి. లేత పసుపు, లేత నీలం, ఆఫ్ వైట్ లేదా లేత గోధుమ రంగులు మెట్లకు అనుకూలంగా ఉంటాయి. ఇవి మానసిక ప్రశాంతతను పెంచి ఇంటిలో సంతోష వాతావరణాన్ని తీసుకువస్తాయి. అయితే నలుపు లేదా ఎరుపు వంటి ముదురు రంగులు ప్రతికూల భావనలను ప్రేరేపిస్తాయని చెబుతారు.
వాయువ్యం లేదా నైరుతి భాగాలు..
ఇంటి బాహ్య భాగంలో మెట్లు నిర్మించే సమయంలో కూడా దిశకు ప్రాధాన్యం ఉంది. తూర్పు వైపు ముఖంగా ఉన్న ఇళ్లకు ఆగ్నేయం భాగంలో మెట్లు ఉండటం మంచిదని, ఉత్తరం వైపు ఉన్న ఇళ్లకు వాయువ్యం లేదా నైరుతి భాగాలు సరైనవని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా సరైన దిశల్లో మెట్లు ఉంచడం వలన ఇంట్లో శక్తి ప్రవాహం సమతుల్యంగా ఉంటుంది.
మెట్ల కింద ఖాళీగా ఉండే స్థలాన్ని ఎలా ఉపయోగించాలో కూడా వాస్తు సూచనలు ఉన్నాయి. చాలా మంది ఆ స్థలాన్ని నిల్వ స్థలంగా ఉపయోగిస్తారు. అయితే వాస్తు ప్రకారం ఆ ప్రదేశాన్ని నగదు, ఆభరణాలు లేదా పూజా గది కోసం ఉపయోగించడం మంచిది కాదు. ఇది ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుందనే నమ్మకం ఉంది. కాబట్టి సాధారణ వస్తువులు, ఆట సామగ్రి లాంటి వాటిని మాత్రమే ఆ ప్రాంతంలో ఉంచడం ఉత్తమం.
ఇంకా ఒక ముఖ్యమైన అంశం తలుపుల స్థానం. మెట్ల ప్రారంభం లేదా ముగింపు వద్ద మాత్రమే తలుపులు ఉండాలి. తూర్పు లేదా ఉత్తర గోడలకు మెట్లు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా వాస్తు మార్గదర్శకాలను పాటిస్తే ఇంటి శక్తి ప్రవాహం సక్రమంగా కొనసాగి శాంతి, ఆరోగ్యం, సంపద లభిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
Also Read:https://teluguprabha.net/devotional-news/saturn-second-phase-effects-on-pisces-in-2025-explained/
ఆధ్యాత్మిక దృష్టికోణం మాత్రమే..
మెట్ల స్థానం, ఆకారం, రంగు, సంఖ్య వంటి విషయాల్లో వాస్తు సూచనలు పాటించడం ద్వారా ఇంటిలోని ప్రతికూల ప్రభావాలను తగ్గించవచ్చు. ఇది కేవలం ఆధ్యాత్మిక దృష్టికోణం మాత్రమే కాకుండా, ఇంటి సమతుల్యత, ఆచరణ సౌలభ్యం, మనసుకు శాంతి కలిగించడంలో కూడా ఉపకరిస్తుంది. సరైన ప్రణాళికతో వాస్తు ప్రకారం మెట్లు నిర్మిస్తే కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.


