ఇంట్లో శాంతి, ఐశ్వర్యం నెలకొనాలంటే వాస్తు ఎంతో ముఖ్యమని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహిణులు కొన్ని సూత్రాలను అనుసరిస్తే… కుటుంబ సౌభాగ్యం, భర్తకు అభివృద్ధి, ఇంట్లో ఆర్థిక స్థిరత్వం బలపడతాయని పండితులు చెబుతున్నారు. కొన్ని చిన్న మార్పులతోనే ఇంట్లో శుభ ఫలితాలు చేకూరతాయని చెబుతున్నారు.. ఇలాంటివే కొన్ని వాస్తు సూచనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు చిట్కాలు:
వాస్తు శాస్త్రం ప్రకారం భార్య చేయాల్సిన కొన్ని ముఖ్య మైన పనులు చేయాలి వాటిలో కొన్ని ఈ కథనంలో చూద్దాం. ఇంటి యజమాని ఉత్తర దిశలో.. పని చేసే విధంగా ఉండేలా ప్లాన్ చేయాలి. అక్కడ శుభ్రత కాపాడుతూ, ఆకుపచ్చ, నీలం వంటి ప్రశాంతతను ఇచ్చే రంగులు వాడటం మంచిది. కార్యాలయ డెస్క్‌పై చిన్న మెటల్ తాబేలు పెట్టడం వృత్తిలో స్థిరత్వాన్ని తీసుకురావచ్చని నమ్మకం. అలాగే ఆ స్థలంలో మంచి గాలి, వెలుతురు ఉండటం అవసరం. అక్కడ అద్దాలు పెట్టకూడదు.. అవి ఏకాగ్రతకు అంతరాయం కలిగిస్తాయి.
ఇంట్లో నగలు, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంచే లాకర్ ఉత్తర దిశలో ఉండాలి. కుబేరునికి ఆ దిక్కు చెందుతుంది కాబట్టి సంపదకు అనుకూలంగా పనిచేస్తుంది. లాకర్‌లో ఎర్ర గుడ్డలో చుట్టిన వెండి నాణెం లేదా పసుపు కొమ్ము ఉంచితే ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుందని నమ్ముతారు. ప్రతి ఉదయం పక్షులకు గింజలు పెట్టడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది ఒక సులభమైన, శక్తివంతమైన వాస్తు పరిహారం. గ్రహ దోషాలు తగ్గుతాయి, ఇంట్లో శుభ శక్తులు ప్రవేశిస్తాయి. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది.
వారానికి కనీసం ఒకసారి ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల దుష్ట శక్తులు తొలగిపోతాయి. దీని వాసన వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. శుభ శక్తి, దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఇక ప్రతి శనివారం రావి చెట్టుకి పచ్చి పాలు, నల్ల నువ్వులు, బెల్లం లేదా గంగాజలంతో అభిషేకం చేయాలి. ఆవ నూనెతో దీపం వెలిగించి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇది పనుల్లో విజయం, కెరీర్‌కు పెరుగుదల ఇస్తుందన్న విశ్వాసం ఉంది.
పూజ గదిని తూర్పు దిశలో ఏర్పాటు చేయడం మంచిది. ఒక్కో దేవునికి ఒక్కో విగ్రహం లేదా ఫొటో మాత్రమే ఉంచాలి. రోజూ ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో దైవిక శక్తి పెరిగి, శాంతి నెలకొంటుంది. ఇంట్లో ఎక్కడైనా నీటి లీకేజీ ఉంటే వెంటనే మరమ్మతు చేయించాలి. వాస్తు ప్రకారం ఇది ధననష్టానికి సూచన. అలాగే ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అక్కడ చీకటి, అడ్డంకులు లేకుండా ఉండాలి – అలా ఉండటం వల్ల మంచి అవకాశాలు ఇంటికి వచ్చే మార్గం తేలికవుతుంది.
ఈశాన్య మూల సంపదను ఆకర్షించే ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ చిన్న నీటి ఫౌంటెన్ లేదా కుబేరుడి విగ్రహం ఉంచితే ఆదాయం పెరుగుతుందన్న నమ్మకం. డబ్బుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇంట్లో నైరుతి మూలలో భద్రంగా ఉంచితే ఆర్థిక స్థిరత్వం నిలబడుతుంది. ఇంట్లో శుభత, శాంతి, ఆర్థిక స్థిరత్వం కోసం వాస్తు మార్గదర్శకాలను పాటించడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గృహిణులు కొన్ని చిన్న ఆచారాలను పాటిస్తూ.. ఇంటికి శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.