Vastu Tips For Placing Clocks: మన ఇంట్లో గడియారం ఎక్కడ పెట్టాలి అనే విషయానికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. చాలామంది గడియారాన్ని గోడపై ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడే అమర్చేస్తారు. కానీ వాస్తు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం అది సరైన విధానం కాదని తెలుస్తుంది. గడియారం ఎక్కడ ఉంచామో, దాని దిశ ఎలా ఉందో అనేది కుటుంబ సౌఖ్యంపై, మనసుకు కలిగే శాంతిపై ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది.
ఉత్తరం, తూర్పు…
వాస్తు ప్రకారం గడియారం పెట్టడానికి ఉత్తమమైన దిశలు ఉత్తరం, తూర్పు. ఈ రెండు దిశల్లో గడియారం అమర్చితే ఇంటి వాతావరణం సానుకూలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇల్లు ప్రశాంతంగా ఉండడమే కాకుండా కుటుంబ సభ్యులు మంచి ఉత్సాహంతో ముందుకు సాగుతారని విశ్వాసం ఉంది.
దక్షిణ దిశ..
ఇక దక్షిణ దిశ విషయానికి వస్తే, అక్కడ గడియారం ఉంచడం వాస్తు శాస్త్రం ప్రకారం మంచిది కాదని భావిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆ దిశలో గడియారం పెట్టడం వల్ల పురోగతి ఆగిపోవడం, వ్యాపారంలో అడ్డంకులు రావడం, కుటుంబ ఆర్థిక స్థితి క్షీణించడం వంటి సమస్యలు తలెత్తుతాయని సూచిస్తున్నారు. తప్పుగా అక్కడ పెట్టినా అది అశుభకరమని చెబుతున్నారు.
విరిగిపోయిన గడియారం..
వాస్తు నిపుణులు మరొక ముఖ్యమైన సూచన చెబుతున్నారు. విరిగిపోయిన గడియారం లేదా దెబ్బతిన్న గడియారం ఇంట్లో ఉంచకూడదు. ఎందుకంటే అది చెడు సమయానికి సూచనగా పరిగణిస్తారు. అలాగే ఆగిపోయిన గడియారం కూడా ఇంట్లో ఉంచడం మంచిదికాదు. అలాంటి గడియారాన్ని వెంటనే బయటకు తీసేయడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు.
అలాగే గడియారం ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. దుమ్ము పట్టిన గడియారం చెడు కాలాన్ని గుర్తు చేస్తుందని నిపుణులు వివరించారు. అందుకే గడియారాన్ని తరచూ శుభ్రం చేసి పరిశుభ్రంగా ఉంచడం అవసరం.
సమయాన్ని వెనక్కి..
గడియారంలో సమయం సెట్ చేసే విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం అని వాస్తు చెబుతోంది. సమయాన్ని వెనక్కి సెట్ చేయకూడదని, అవసరమైతే కొన్ని నిమిషాలు ముందుకు సెట్ చేయొచ్చని చెబుతున్నారు. అది శ్రేయస్సుకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.
గోడల రంగులు…
ఇంటి గోడల రంగుల విషయానికొస్తే నీలం, నలుపు, కుంకుమరంగు, మురికిగా కనిపించే గోడలపై గడియారం ఉంచకూడదని సూచించారు. అలాంటి ప్రదేశాల్లో గడియారం అమర్చడం వల్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక ప్రధాన ద్వారం పైన గడియారం అమర్చడం కూడా వాస్తు నియమాలకు విరుద్ధమని నిపుణులు తెలిపారు. అలాగే గడియారాన్ని ఇతరులకు బహుమతిగా ఇవ్వడం మంచిది కాదని వారు సూచిస్తున్నారు. ఎందుకంటే అది మీ అదృష్టాన్ని వారికిచ్చినట్టే అవుతుందని పండితులు వివరిస్తున్నారు.


