Vastu Tips- North Direction: ప్రతి మనిషి తన ఇంటి నిర్మాణం లేదా అలంకరణలో వాస్తు శాస్త్రాన్ని ప్రముఖంగా చూసుకుంటాడు. ఎందుకంటే వాస్తు ప్రకారం ఇంటిలోని ప్రతి దిశకు ఒక ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సరైన దిశలో సరైన వస్తువులను ఉంచితే సానుకూల శక్తి ప్రవహించి, మన జీవితంలో శాంతి, సంపద, సౌభాగ్యం నెలకొంటాయి. అయితే చాలాసార్లు మనం తెలియకుండానే కొన్ని వస్తువులను తప్పుడు దిశలో ఉంచుతాము. దాని వల్ల ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు, ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఉత్తర దిశ ..
వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశ అత్యంత శుభప్రదమైనదిగా వాస్తు నిపుణులు వివరిస్తుంటారు. ఈ దిశకు ధనాధిపతి అయిన కుబేరుడు అధిపతిగా ఉన్నారు. కాబట్టి, ఇంట్లో ఈ దిశను సక్రమంగా ఉపయోగిస్తే ఆర్థికంగా స్థిరత్వం, అభివృద్ధి లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కుబేరుడి అనుగ్రహం పొందేందుకు ఉత్తర దిశలో ఉంచవలసిన కొన్ని వస్తువులు ఉన్నాయని వారు సూచిస్తున్నారు.
బీరువా లేదా సేఫ్ …
ఇంటి ఉత్తర భాగం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా, ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ధనప్రవాహానికి సంబంధించిన అన్ని వస్తువులు ఈ దిశలో ఉంచితే మంచిదని చెబుతున్నారు. మొదటగా ఇంట్లో డబ్బు, ఆభరణాలు లేదా ముఖ్యమైన పత్రాలు ఉంచే బీరువా లేదా సేఫ్ ఎక్కడ ఉంచాలో చాలా మందికి సందేహం ఉంటుంది.
వాస్తు ప్రకారం, ఈ బీరువాను ఉత్తర దిశలో ఉంచడం ఉత్తమం. అయితే అది కేవలం స్థానం మాత్రమే కాదు, బీరువా తలుపు తెరిచినప్పుడు ఉత్తరం వైపునకు తిరిగి తెరుచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇలా ఉంచితే కుబేరుడి ఆశీర్వాదం లభించి ధనం సురక్షితంగా ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో ధనప్రవాహం నిలకడగా కొనసాగుతుందని భావిస్తారు.
కుబేరుడి విగ్రహాన్ని
ఉత్తర దిశలో కుబేరుడి విగ్రహాన్ని లేదా కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడింది. కుబేరుడి విగ్రహం ఇంట్లో సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఈ శక్తి ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచి, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతను పెంచుతుంది. రోజూ లేదా వారానికి ఒకసారి దీపం వెలిగించి కుబేరుడిని ప్రార్థిస్తే ఆర్థికంగా ఎటువంటి లోటు ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
నీరు ఉన్న పాత్రను..
నీటికి వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రవహించే నీరు ఆర్థిక ప్రవాహానికి సంకేతం. అందుకే ఉత్తర దిశలో చిన్న వాటర్ ఫౌంటెన్ లేదా నీరు ఉన్న పాత్రను ఉంచడం మంచిదని చెబుతారు. ఫౌంటెన్ అందుబాటులో లేకపోతే, చిన్న నీటి కుండ లేదా వాటర్ ప్యూరిఫైయర్‌ను ఉంచినా సరిపోతుంది. ఈ విధంగా నీరు సున్నితంగా కదిలే ప్రదేశం ఇంట్లో ఉంటే సానుకూల శక్తి సులభంగా ప్రసరిస్తుంది. నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం. మురికిగా ఉన్న నీరు ప్రతికూల ఫలితాలు ఇస్తుందని నమ్మకం ఉంది.
ఉత్తర దిశలో అక్వేరియం…
ఇంకా ఉత్తర దిశలో అక్వేరియం ఉంచడం అత్యంత శుభప్రదం. జీవం ఉన్న చేపలు నిరంతర కదలికను, చైతన్యాన్ని సూచిస్తాయి. అక్వేరియం నీరు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండాలి. అందులో కనీసం తొమ్మిది చేపలు ఉండడం ఉత్తమ ఫలితాలను ఇస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఎనిమిది గోల్డ్ ఫిష్, ఒక బ్లాక్ ఫిష్ ఉంటే అదృష్టం మరింత పెరుగుతుందని చెబుతారు. గోల్డ్ ఫిష్ సానుకూల శక్తిని, బ్లాక్ ఫిష్ ప్రతికూల శక్తిని శోషించే శక్తిని కలిగి ఉంటుందని విశ్వసిస్తారు. అక్వేరియం ఇంట్లో ఉంచడం వల్ల వాతావరణం ప్రశాంతంగా మారి, ఆరోగ్యకరమైన శక్తి చుట్టుపక్కల వ్యాప్తి చెందుతుంది.
ధన వృద్ధికి మాత్రమే..
ఉత్తర దిశలోని ఈ వస్తువులు వాస్తు ప్రకారం ధన వృద్ధికి మాత్రమే కాకుండా, మానసిక ప్రశాంతతకూ దోహదం చేస్తాయని చెబుతారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ దిశ ఎప్పుడూ ఆపెన్‌గా ఉండి, అడ్డంకులు లేకుండా గాలి, వెలుతురు ప్రవహించేలా చూసుకోవాలి. గోడల మీద గాఢ రంగులు వేసి ఉండకూడదు. వీలైనంతవరకు లైట్ కలర్స్ వాడటం మంచిదని సూచిస్తున్నారు.
బాత్రూమ్, స్టోర్ రూమ్..
ఇంట్లో ఉత్తర దిశకు ఎదురుగా ఉన్న వస్తువులు కూడా సానుకూలతకు విఘాతం కలిగించకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు బాత్రూమ్, స్టోర్ రూమ్ లేదా చెత్త నిల్వ చేసే ప్రదేశం ఈ దిశలో ఉండకూడదు. ఇలా ఉంటే ఆర్థిక ప్రవాహం అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.
వాస్తు ప్రకారం ఉత్తర దిశలో వస్తువులను సరైన విధంగా ఉంచితే కుబేరుడి ఆశీస్సులు లభించి, ఇంట్లో ధనం నిలకడగా ఉంటుందని నమ్మకం ఉంది. అయితే వాస్తు ఒక శాస్త్రం మాత్రమే. దాన్ని పాటించడం వల్ల సానుకూల శక్తిని పెంపొందించవచ్చు. కానీ ముఖ్యమైనది మన ఆలోచనల శుభ్రత, కృషి, నమ్మకం. వీటిని పాటిస్తేనే వాస్తు సూచించే ఫలితాలు మరింత బలంగా అనుభూతి చెందుతాయి.


