Vijayadashami-Ravana Dahanam: అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. ఈ రోజున ముఖ్యంగా రావణ దహనం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. పలు రాష్ట్రాల్లో భారీ ప్రతిమలను నిర్మించి వాటిని దహనం చేయడం ద్వారా చెడుపై మంచి గెలుపు అనే సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నారు. రావణ దహనానికి ఉన్న ప్రాముఖ్యత, రావణుడి జీవితంలోని మలుపులు, ఆయన గుణదోషాలు ఈ సందర్భంలో ప్రత్యేకంగా చర్చనీయాంశమవుతాయి.
రావణ దహనం..
రావణ దహనం జరిపే ఉద్దేశం ఒకే ఒక్కటి కాదు. తప్పుడు మార్గంలో నడిచే వారికీ, ఇతరులపై ఆకాంక్ష పెంచుకునే వారికీ, స్త్రీలపై దౌర్జన్యానికి పాల్పడే వారికీ సమాజం స్పష్టమైన సందేశం ఇవ్వడమే ఈ సంప్రదాయం. తప్పు పనులు చేసే వారు ఎప్పటికీ నిలబడలేరనే ఆలోచన ప్రజల్లో బలంగా ప్రతిష్ఠించడానికి ఇది ఒక చిహ్నంగా మారింది.
రావణుడు ఎవరు?…
రావణుడు ఎవరు? ఆయన మంచి వాడా లేక చెడు వాడా అన్న ప్రశ్న తరచూ వినబడుతునే ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే రావణుడి పుట్టుక నుంచి చివరి వరకు జరిగిన సంగతులను అవగాహన చేసుకోవాలి. రావణుడు విశ్రావసు మహర్షి, ఆయన భార్య కైకసి నుంచి జన్మించాడు. విశ్రావసుకు మొదటి భార్య వరవర్ణినితో కుబేరుడు జన్మించగా, కైకసికి రావణుడు, కుంభకర్ణుడు, శూర్పణఖ, విభీషణులు పుట్టారు. అందువల్ల రావణుడు రాక్షస వంశానికి చెందినవాడే అయినా, బ్రాహ్మణ సంప్రదాయ జ్ఞానాన్ని కూడా పొందాడు.
అధికారం మీద కోరిక..
చిన్న వయస్సు నుంచే రావణుడికి అధికారం మీద కోరిక ఎక్కువగా ఉండేది. వేదాలు, పరిపాలన సంబంధిత విషయాలు నేర్చుకుంటూ పెద్దవాడయ్యాడు. లోకాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే తపనతో కఠినమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరాలు పొందాడు. అమరత్వం ఇవ్వలేమని బ్రహ్మ చెప్పడంతో, దేవతలు, రాక్షసులు, పిశాచాలు, జంతువులు ఎవరూ తనకు మృత్యువుకి కారణం కాకూడదని ఆశీర్వాదం పొందాడు. అయితే మానవుడి చేతిలో తన వధం జరుగుతుందని ఆయన గమనించలేదు. ఆ కారణంగా విష్ణువు శ్రీరాముడిగా అవతరించి రావణ సంహారం చేశారు.
రావణుడి పేరు వెనుక కథ…
‘రావణుడు’ అనే పేరుకి వెనుక కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఆయన అసలు పేరు దశగ్రీవుడు. కైలాస పర్వతాన్ని ఎత్తే ప్రయత్నం చేసిన సమయంలో శివుడు తన కాలివేళ్లతో పర్వతాన్ని క్రిందికి నొక్కాడు. దాంతో దశగ్రీవుడి చేతి నలిగిపోయింది. ఆ నొప్పితో గట్టిగా కేకలు వేయడంతో ఆయనకు ‘రావణ’ అనే పేరు వచ్చి స్థిరపడింది. శివుడిపై అత్యంత భక్తి కలిగిన ఆయన శివతాండవ స్తోత్రాన్ని రచించినవాడని కూడా కథలు చెబుతున్నాయి.
ఇక్ష్వాకు వంశంలో..
ఇక్ష్వాకు వంశానికి చెందిన అనారణ్య మహారాజును రావణుడు యుద్ధంలో హతమార్చాడు. మరణించేటపుడు అనారణ్యుడు ఒక శాపం ఇచ్చాడు. తన వంశంలో పుడిన వ్యక్తి చేతిలోనే రావణుడు చనిపోతాడని శపించాడు. అదే శాపం కారణంగా ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్రీరాముడి చేతిలో రావణుడు హతమయ్యాడు.
రావణుడి అహంకారమే ఆయనకు అనేక పరాజయాలను తెచ్చింది. వాలి, మాంధాత వంటి శక్తివంతమైన యోధుల చేతిలో ఓటమిపాలైన తర్వాత వారితో స్నేహం చేసుకోవడం ఆయన వ్యూహంలో భాగమైంది. అయినప్పటికీ ఆయన గర్వం ఎప్పుడూ తగ్గలేదు.
చావు ముహుర్తం..
రావణుడు తండ్రి నుంచి వేద శాస్త్రాలు నేర్చుకున్నందున ఆయనకు ముహూర్తాలపై మంచి పరిజ్ఞానం ఉండేది. రామ-రావణ యుద్ధానికి తానే ముహూర్తం నిర్ణయించుకోవడం, దాంతో తన మరణ సమయాన్ని తానే ఖరారు చేసుకోవడం ఒక విశేషం. వృత్తి ధర్మం పట్ల ఆయనలో ఉన్న కట్టుబాటు ఇక్కడ కనిపిస్తుంది.
జ్యోతిషశాస్త్రంలో రావణుడి పాండిత్యం విశేషం. తన కుమారుడు మేఘనాథుడు జన్మించినప్పుడు గ్రహాలు అన్నీ ఉచ్ఛస్థితిలో ఉండాలని ఆదేశించాడు. కానీ ఆ సమయంలో శని తన స్థానాన్ని మార్చుకోవడంతో యుద్ధంలో మేఘనాథుడు కూడా మృతి చెందాడు.
మరణ రహస్యాన్ని…
రావణుడు యుద్ధంలో ఓడిపోతాడనే విషయం తెలిసినా చివరి వరకు ధైర్యంగా నిలిచాడు. తన మరణ రహస్యాన్ని కూడా తానే తన సోదరుడికి చెప్పాడు. తనను ఓడించాలంటే నాభి మీద దాడి చేయాలని వెల్లడించాడు. ఇది ఆయన వ్యక్తిత్వంలోని మరో ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
పనిమనిషి, వంటవాడు, రథసారథి, సోదరులు ..
మరణానికి చేరువలో ఉన్నప్పుడు శ్రీరాముడు లక్ష్మణుడిని రావణుడి దగ్గరికి పంపాడు. జీవితంలో అనుభవించిన విషయాలను ఆయన నుంచి నేర్చుకోవాలని సూచించాడు. అప్పుడు రావణుడు చెప్పిన ఉపదేశాలు ఇవాళ కూడా సమాజంలో వర్తిస్తూనే ఉన్నాయి. పనిమనిషి, వంటవాడు, రథసారథి, సోదరులు వంటి వారితో ఎప్పుడూ సఖ్యతగా ఉండాలని, వారిని విస్మరించరాదని ఆయన హెచ్చరించాడు. మనతోనే ఉంటూ మన తప్పులను చెబుతున్నవారినే నమ్మాలని, పొగడ్తలు చెప్పేవారిని విశ్వసించవద్దని ఆయన స్పష్టంగా చెప్పారు.
విజయం శాశ్వతం కాదని, శత్రువు ఎంత చిన్నవాడైనా తక్కువగా అంచనా వేయకూడదని ఆయన అనుభవం చెప్పింది. హనుమంతుడిని కోతిగా తీసిపారేయడం చివరికి తనకు ప్రమాదం తెచ్చిందని ఆయన చివరి క్షణాల్లో అంగీకరించాడు.
యుద్ధంలో గెలవాలనే కోరిక అవసరం కానీ, అధిక ఆశలు పెట్టుకోవద్దని ఆయన సూచించాడు. సైన్యానికి విశ్రాంతి ఇచ్చి, రాజు ధైర్యంగా నిలబడితేనే విజయం సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డాడు.


