Tuesday, September 17, 2024
HomeదైవంVisa Balaji: వీసాల స్వామి .. చిల్కూర్ బాలాజీ

Visa Balaji: వీసాల స్వామి .. చిల్కూర్ బాలాజీ

భక్తుల పాలిట కొంగుబంగారం కలియుగదైవం శ్రీవేంకటేశ్వరుడు. స్వామిని భక్తితో తలచుకుని రెండు చేతులెత్తి మొక్కితే చాలు ఏడుకొండలపై ఉన్న ఏడుకొండలవాడు కరుణిస్తాడని భక్తుల నమ్ముతారు. అందుకే .. ఎన్ని కష్టాలు ఎదురైనా .. జీవితంలో ఒక్కసారైనా సరే కలియుగ వేంకటేశ్వరుని దర్శించుకోవాలని వారు తపిస్తారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ఇప్పుడు ఎన్నో సదుపాయాలున్నాయి. ఇండియాతో పాటు భూమండలంపై ఏ మూలన ఉన్న వారైనా శ్రీవారిని దర్శించుకునేందుకు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. అయితే, నలభై, యాభై ఏళ్ల క్రితం వేంకటరమణుడి భక్తులకు ఇన్ని సౌకర్యాలు అందుబాటులో లేవు. అందుకే.. వారు జీవితంలో ఒక్కసారి శ్రీనివాసుడిని దర్శించుకున్నా జన్మధన్యమైందని భావించేవారు. తిరుమల శ్రీనివాసుడికి పరమ భక్తుడైన మాధవరెడ్డి మాత్రం తిరుపతికి ఏమాత్రం రవణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రతి ఏటా తిరుపతికి వెళ్లి స్వామిని దర్శించుకునే వారు. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే స్వామివారి దగ్గరకు క్రమం తప్పకుండా వెళ్లేవారు. అయితే .. వృద్ధాప్యంలో కూడా ఆయన అతిప్రయాసతో స్వామి దర్శనానికి బయలుదేరి మార్గమధ్యలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో స్వామి ఆయనకు కలలో ప్రత్యక్షమయ్యారు. నీకోసం నువ్వు ఉన్న చోటకే వచ్చాను అని చెప్పారట. ఆయనే వీసాలస్వామిగా పూజలందుకుంటున్న చిల్కూర్ బాలాజీ.
చిలుకూరు బాలాజీ దేవాలయం భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు నిత్యం పెద్దసంఖ్యలో బాలాజీని దర్శించుకుంటారు. తెలంగాణ తిరుపతిగాఈ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి స్వామివారిని వీసాల బాలాజీ అని కూడా పిలుస్తుంటారు. చిలుకూరు దేవాలయం హైదరాబాద్‌ నుంచి 25 కి.మీ.ల దూరంలో వికారాబాద్‌ వెళ్లే మార్గంలో ఉంది. మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామంలో ఉంది. హైదరాబాద్ కు చేరువలో ఉండటం, రవాణా సౌకర్యాలు కూడా చక్కగా అందుబాటులో ఉండటం వల్ల బాలాజీ ఆలయాన్ని దర్శించటానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తుంటారు. ప్రతి రోజూ 20 – 30 వేల మంది భక్తులు దర్శించుకంటారు. వారానికి 75 వేల నుంచి లక్షమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. శుక్ర, శనివారాల్లో ఇక్కడ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.వీఐపీ దర్శనాలు, టికెట్లు, హుండీలు లేని దేవాలయంగా చిలుకూరు ఆలయం ప్రసిద్ధికెక్కింది. ఒకే ప్రాంగణంలో ఒకవైపు వెంకటేశ్వర స్వామి, మరోవైపు శివుడు పూజలందుకోవటం ఈ ఆలయ విశిష్టత. ఈ ఆలయంలో 108 ప్రదక్షిణలు ప్రసిద్ది చెందాయి. 11 దర్శనాలు చేసుకుని కోరిక కోరిన వారు..అది నెరవేరితే 108 ప్రదక్షిణాలు చేయడం ఈ ఆలయ ప్రత్యేకత. అంతే కాదు.. గర్భగుడిలోనికి భక్తులను అనుమతించరు. మహాద్వారం నుంచే దర్శనాలు కొనసాగిస్తారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూడు చోట్ల ప్రత్యక్షమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. తిరుమలలో వెలసిన శ్రీ వెంకటేశ్వరుడు, ద్వారకా తిరుమల మరొకటి తెలంగాణలోని చిలుకూరుగా ప్రతీతి. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయానికి 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది.
దేవాలయ చరిత్ర:
సుమారు 500 ఏళ్ల కిత్రం.. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి పరమభక్తుడైన గున్నాల మాధవరెడ్డి ఈ చిలుకూరులో ఉండేవాడు. అతను ఏటా ఎంత కష్టమైనా.. కాలినడకన తిరుపతి వెళ్లి.. స్వామివారిని దర్శించుకుని వచ్చేవాడు. వృద్ధాప్యంలో సైతం ఆయన వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడకన వెళ్లి వస్తుండేవాడు.అలా ఒకసారి తిరుమలకు బయల్దేరిన మాధవరెడ్డి.. ప్రయాణ బడలిక కారణంగా మార్గమధ్యంలోనే సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ మగత నిద్రలో వచ్చిన కలలో అతనికి స్వామివారు ప్రత్యక్షమయ్యారు. ‘మాధవా.. ఇకపై నువ్వు నా దర్శనం కోసం ఇంతదూరం ప్రయాసపడి రావాల్సిన అవసరం లేదులే. నేను చిలుకూరిలోని ఒక పుట్టలో కొలువై ఉన్నా.. వెలికి తీసి గుడి నిర్మించు’.. అని చెప్పి మాయమయ్యాడట! నిద్ర నుంచి మేలుకున్న మాధవరెడ్డి ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు. అంతా కలిసివచ్చి.. అక్కడ ఉన్న పుట్టను గునపాలతో పెకిలిస్తుండగా.. గునపం బాలాజీ ఎదభాగంలో తగిలి రక్తం వచ్చింది. వెంటనే అపచారమైందంటూ అంతా ఆ దేవదేవుణ్ని క్షమాపణలు కోరి ఆపై విగ్రహాన్ని పాలతో కడిగి బయటకు తీశారు. అలా దొరికిన బాలాజీకి అక్కడే ఆలయాన్ని నిర్మించి.. పూజలు చేయడం ప్రారంభించారు. ఈ స్థలపురాణం నిజమేననడానికి ఇప్పటికీ ఆలయంలో కొలువైన బాలాజీ ఎదభాగంలో గునపం గుచ్చుకున్న ఆనవాళ్లు కనిపిస్తాయి.
వీసాల స్వామి
వెంకటేశ్వర స్వామి కోరిన కోర్కెలను తీర్చే కలియుగ వైకుంఠుడిగా ప్రసిద్ధి. అయితే, చిలుకూరు బాలాజీకి కూడా మరో ప్రత్యేకత ఉంది. ఈ ఆలయాన్ని మొదటిసారి దర్శించి 11 ప్రదక్షిణలు చేసి కోర్కెలను కోరుకోవటం, ఆ కోరిక నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేసి మొక్కును చెల్లించుకొనే పద్ధతి ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. చిలుకూరు బాలాజీ ఆలయానికి వీసా గాడ్ అని కూడా పేరు. కొన్నేళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న స్గూటెంట్స్‌ వీసా దొరకక ఇబ్బందిపడేవారు. వీసా కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులు చిలుకూరి బాలాజీ విశిష్టత తెలుసుకొని ఈ ఆలయానికి వచ్చి స్వామిని త్వరగా వీసా రావాలని కోరుకోవటం .. ఆ కోరిక నెరవేరటం వెంటనే జరిగిపోయాయి. దాంతో చిల్కూర్ బాలాజీకి వీసా దేవుడిగా పేరొచ్చింది.
అక్కన్న మాదన్నలు
ఈ ఆలయానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. గోల్కొండ సామ్రాజ్యంలో మంత్రులుగా ఉన్న అక్కన్న, మాదన్నలు దేవాలయానికి అవసరమైనపలు నిర్మాణాలను చేపట్టారు. అప్పటి సినీనటి భానుమతి, మార్వాడీలు అద్దాలమహల్, కోనేరులను కట్టించి దేవాలయానికి మరింత శోభను తెచ్చారు. ఈదేవాలయంలో ఏకశిలలోనే శ్రీదేవి, భూదేవి, వే ంకటేశ్వరస్వామి ఉండటం ప్రత్యేకతగా చెప్పుకుంటారు.
రాజ్యలక్ష్మి అమ్మవారు
ఈ దేవాలయంలో 1963లో ‘రాజ్యలక్ష్మి’ అమ్మవారిని ప్రతిష్ఠించారు. నాలుగేళ్ల కిందట దేవాలయం వద్ద నూతనంగా ఆలయ గోపురాన్ని నిర్మించారు. రెండేళ్ల కిందట పురాతన ధ్వజస్తంభాన్ని తొలగించి, నారేపచెట్టుతో రూపొందించిన కొత్త ధ్వజాన్ని ఏర్పాటు చేశారు. ఆ పై గరుత్మంతులవారి గుడిని నిర్మించారు. పూలంగి, అన్నకోట, బ్రహ్మోత్సవాలను ఇక్కడ ప్రత్యేకంగా నిర్వహిస్తారు.

- Advertisement -

స్వయంప్రతిపత్తి హోదా:
ఈ దేవాలయానికి నాలుగేళ్ల కిందట స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయంలో ఎలాంటి హుండీ ఉండదు. నిత్య పూజా ఫండ్‌ కోసం భక్తులు విరాళాలు ఇవ్వాలనుకుంటే ఆ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేసేలా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఒక కమిటీ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది.

చిలుకూరులో ప్రధాన పూజలు:
ఇక్కడ నిత్య పూజలంటూ ఏమీ ఉండవు. ఉదయం 5 గంటలకు గుడి తెరుస్తారు. అర్చకులు స్వామివారిని పూలతో అలంకరించి అర్చిస్తారు. అనంతరం భక్తులకు అనుమతిస్తారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. ఇక్కడ స్వామివారి బ్రహ్మోత్సవాలనూ ఏటా చైత్రశుక్ల మాసంలో వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు.
ప్రత్యేక పూజలు కూడా ఏమీ ఉండవు.
దర్శన సమయంలో విరామం ఉండదు.
ఫోన్‌లో, ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవడం వంటివేవీ లేవు.
ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలుగా సుందరేశ్వర, హనుమాన్‌ ఆలయాలు ఉన్నాయి.
ఆర్జిత సేవలు, ప్రధాన పూజలు
బ్రహ్మోత్సవాల సమయంలో ఎలాంటి పూజలు జరపాలో అవే ఉంటాయి. అవి కూడా ఉచిత దర్శనమే.
బాలాజీ దర్శన సమయాలు:
ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7.45 వరకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. వీఐపీ దర్శనాలు, ప్రత్యేకపూజ టికెట్‌ వంటివేవీ లేవు. బాలాజీ దర్శనానికి ఎంతటి వారైనా సాధారణ భక్తుల మాదిరిగా క్యూలో వెళ్లాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News