బహు ప్రత్యేకతల సమాహారం ఒంటిమిట్ట కోదండ రామాలయం దుష్టశిక్షణ కోసం, శిష్ట రక్షణ కొరకు శ్రీ మహా విష్ణువు యుగయుగాలలో అవతరిస్తూ ఉంటాడు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడుగా అవతరించి దండకారణ్యంలో సీతాలక్ష్మణ సమేతుడై సంచరించాడు. సీతాదేవి దప్పిక తీర్చడానికి భూమిలోనికి బాణం వేయగా నీటి బుగ్గ పుట్టింది. అదే ఒంటిమిట్టలోని రామతీర్థం అయింది. సీతాన్వేషణ కోసం, రావణ సంహారం కోసం శ్రీ రామచంద్రునికి సహకరించిన హనుమత్, సుగ్రీవాదులతో పాటు జాంబవంతుడున్నాడు. ఆయన ద్వాపరయుగంలోనూ ఉండి శ్రీ కృష్ణ భగవానునికి తన కూతురునిచ్చి పెండ్లి చేశాడు. ఆ జాంబవంతుడు సేవించిన సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడే నేడు ఒంటిమిట్ట గుడిలో కొలువై ఉన్నాడు. ఒకే రాతిపై సీతారామ లక్ష్మణ దేవతా మూర్తులుండడం వల్ల ఒంటిమిట్టను ఏకశిలానగరం అని కూడా అంటారు.
కోదండ రామాలయం భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రంలోని కడప జిల్లా వొంటిమిట్ట మండలంలో వొంటిమిట్ట పట్టణంలో ఉన్న రామ దేవునికి సంబందించిన హిందూ దేవాలయం.. క్రీ.శ.1356లో బుక్కరాయలు ఆలయాన్ని ప్రారంభించాడు. ఆ తరువాత కాలంలో విజయనగర రాజులు, చాళుక్య రాజులు క్రమంగా గుడికి అంతరాలం, రంగమంటపం, మహాప్రాంగణం, గోపురాలు, రథం నిర్మించారు. ఒంటిమిట్ట చుట్టుప్రక్క గ్రామాల రాబడి ఆలయ కైంకర్యాలకు వినియోగించారు. ఈ దేవాలయం మూడు దఫాలుగా నిర్మించారు. 14 శతాబ్దంలో ప్రారంభమై 17 శతాబ్దానికి పూర్తి అయినట్లు ఇక్కడ ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి విజయనగర నిర్మాణ శైలిని పోలి ఉన్న ఆలయం ఇది.
ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీగా బ్రతికారని, వారి పేరు మీదుగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందని ఇంకొక కథనం కూడా ఉంది. మిట్టను సంస్కృతంలో శైలమంటారు. ఈ ఆలయంలో సీతారామలక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు. కాబట్టి ఏకశిలానగరమనీ పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్రాచరిత్రయైన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రలో భాగంగా మజిలీలైన అత్తిరాల నుంచి భాకరాపేట వెళ్ళే మార్గమధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్ళారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో నాల్గుపక్కల కొండలే కలిగిన భారీ చెరువున్నది. చెరువు కట్టమీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళు ఉన్నాయన్నారు.
గ్రామంలో ఓ ముసాఫరుఖానా యాత్రికుల నిలయం ఉండేదని, అప్పటికే అది బస్తీ గ్రామమని పేర్కొన్నారు. రామ లక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, విశ్వామిత్రుడు వారిని తమ యాగరక్షణకు తీసుకు వెళ్ళాడు. సీతారామ కల్యాణం జరిగాక కూడా, అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. అప్పుడు మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం, ఆ స్వామి సీతా లక్ష్మణ సమేతుడై అంబుల పొది, పిడిబాకు, కోదండం, పట్టుకుని ఈ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశాడని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామ లక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారనీ, తరువాత జాంబవంతుడు ఈ విగ్రహాలను ప్రాణప్రతిష్ఠ చేశారనీ ఈ ప్రాంత ప్రజల విశ్వాసం.
ఆలయ మండపంలో 32 స్తంభాలు ఉన్నాయి, ఈ ఆలయ ప్రధాన విగ్రహం రాముడు కోదండ రామ స్వామిగా పూజించబడ్డాడు. కుడి చేతిపై విల్లు, ఎడమ చేతిలో బాణం, ఒకే రాతితో చేసిన సీత మరియు లక్ష్మణుడితో పాటు నిలబడి ఉన్న భంగిమలో ఉన్నాడు. ఇక్కడ పరమేశ్వరుని లింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్యస్వామి, భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. ఎందరో మహాకవులు శ్రీరామచంద్రుని కరుణకు పాత్రులైనారు. పోతన ఇక్కడే భాగవతాన్ని తెనిగించి నట్లు చెపుతారు. అయ్యలరాజు తిప్పయ్య ఒంటిమిట్ట శ్రీ కోదండరామునిపై రఘువీరశతకం రచించి, అంకితమిచ్చారు. రామభద్రకవి రామాభ్యుదయమును రచించారు. నల్లకాల్వ అయ్యప్ప ఒంటిమిట్ట రాముని వరం పొంది వరకవి అయ్యారు.
ఉప్పుగుండూరు వేంకటకవి ఒంటిమిట్ట దశరథరామ శతకం రచించారు. ఆంధ్రవాల్మీకిగా ప్రసిద్ధి పొందిన వావిలికొలను సుబ్బారావు ఆంధ్రవాల్మీకి రామాయణం మందరవ్యాఖ్యతో రచించారు. తాళ్ళపాక అన్నమయ్య రామునిమీద సంకీర్తన చెప్పారు. శ్రీ కోదండరామస్వామివారి దేవాలయాన్ని దేవదాయ ధర్మాదాయశాఖ నుంచి 9-9-2015వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం విలీనం చేసుకున్నది. ఈ సంవత్సరం స్వామి వారి క్షేత్రంలో ఏటా శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్టలో ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ విదియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చతుర్దశి నాడు కళ్యాణం, పౌర్ణమి నాడు రథోత్సవం ఉంటాయి.
- రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494