Thursday, March 12, 2026
HomeదైవంMaha Sivaratri: మహా శివరాత్రి ఉపవాసం.. తర్వాతి రోజు ఏం తినాలి?

Maha Sivaratri: మహా శివరాత్రి ఉపవాసం.. తర్వాతి రోజు ఏం తినాలి?

After Maha Shivaratri Fasting:మహాశివరాత్రి రోజున ఉపవాసం చేసే భక్తులు ఆ రోజు మాత్రమే కాదు, తర్వాతి రోజు కూడా నియమ నిష్టలు పాటించాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. ఉపవాస దీక్ష అనేది కేవలం ఒకరోజు ఆచరణగా కాకుండా, దానికి అనుసంధానంగా వచ్చే రోజున కూడా శాంతంగా, నియంత్రణతో ఉండడం ముఖ్యమని చెబుతున్నారు.

- Advertisement -

రోజంతా ఆహారం తీసుకోకుండా…

మహాశివరాత్రి సందర్భంగా చాలామంది రోజంతా ఆహారం తీసుకోకుండా దైవచింతనలో గడుపుతారు. కొందరు సాయంత్రం ఫలాహారంతో ఉపవాసాన్ని ముగిస్తారు. అయితే ఉపవాసం ముగిసిందని మరుసటి రోజు సాధారణంగా ఎలా పడితే అలా జీవనం సాగించడం సరైన పద్ధతి కాదని భావిస్తున్నారు. ఆ రోజు కూడా భగవన్నామ స్మరణతో, శివారాధనతో గడపాలని సూచిస్తున్నారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/rare-planetary-conjunction-in-aquarius-after-120-years/

అజీర్తి వంటి …

ఉపవాసం అనంతరం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. రోజంతా ఆహారం తీసుకోకుండా ఉన్న తర్వాత ఒక్కసారిగా ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి ఇబ్బందులు రావొచ్చు. అందువల్ల తర్వాతి రోజు మితంగా, సాత్వికంగా ఆహారం తీసుకోవాలి. పాలతో చేసిన అన్నం లేదా పెరుగన్నం వంటి తేలికపాటి వంటకాలు మంచివిగా భావిస్తారు. అధిక నూనె, ఉప్పు, కారం ఉన్న వంటకాలకు దూరంగా ఉండడం ఆరోగ్యానికి అనుకూలం.

మాంసాహారం, మద్యం, ధూమపానం…

మరుసటి రోజే కాకుండా ఉపవాసం అనంతరం మాంసాహారం, మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. రోజువారీ పనులు చేసుకుంటూనే శివుని స్మరిస్తూ గడిపితే ఉపవాస దీక్షకు సంపూర్ణత వస్తుందని భావిస్తున్నారు.

తెల్లవారుజాము వరకు …

మహాశివరాత్రి రోజున చాలామంది జాగరణ చేస్తారు. తెల్లవారుజాము వరకు మెలకువగా ఉండి శివుని స్మరించడం జాగరణకు అసలు ఉద్దేశ్యం. అయితే రాత్రంతా అలా తిరగడం, వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జాగరణగా పరిగణించబడదు. అవసరమైతే భక్తికి సంబంధించిన విషయాలకే సమయం కేటాయించాలి. నిజమైన జాగరణ అనేది దైవస్మరణతో గడపడం ద్వారా సాధ్యమవుతుంది.

ఆహార నియంత్రణ..

మహాశివరాత్రి ఆధ్యాత్మికంగా ఎంత ప్రాధాన్యం కలిగినదో, ఆరోగ్యపరంగా కూడా అంతే ప్రయోజనకరమని భావిస్తున్నారు. ఉపవాసం ద్వారా ఆహార నియంత్రణ అలవాటు అవుతుంది. ఆకలి విలువ తెలుసుకుని ఆహారాన్ని వృథా చేయకుండా ఉండే అలవాటు ఏర్పడుతుంది. ఇంద్రియ నియంత్రణకు ఉపవాసం ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. శరీరంపై నియంత్రణ పెరిగి మానసిక స్థిరత్వం కలుగుతుంది.

Also Read: https://teluguprabha.net/devotional-news/maha-shivaratri-2026-lingodbhava-kalam-timings-and-significance/

కాబట్టి మహాశివరాత్రి ఉపవాసం చేసిన భక్తులు ఆ రోజు మాత్రమే కాకుండా తర్వాతి రోజున కూడా నియమాలను పాటిస్తే ఆ ఆచరణకు పూర్తి ఫలితం లభిస్తుందని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News