Ahoi Ashtami 2025 date and Significance: భర్తల దీర్ఘాయుష్షు కోసం కార్తీక మాసంలో కర్వా చౌత్‌ను ఆచరించినట్లే..వివాహిత స్త్రీలు కూడా తమ పిల్లల దీర్ఘాయుష్షు కోసం అహోయ్ వ్రతాన్ని చేసుకుంటారు. రెండింటికి తేడా ఏంటంటే.. చంద్రుడు కనిపించిన తర్వాత కర్వా చౌత్‌ను జరిపితే. ఈ వ్రతంలో మాత్రం నక్షత్రాలను పూజిస్తారు. ఈ సంవత్సరం అహోయ్ అష్టమి ఎప్పుడు వచ్చింది, పూజా ముహూర్తం, ప్రాముఖ్యత తదితర విషయాలు తెలుసుకుందాం.
అహోయ్ అష్టమి ఎప్పుడు?
ప్రతి ఏటా కార్తీకమాసం కృష్ణపక్షం అష్టమి తిథి నాడే అహోయ్ అష్టమి జరుపుకుంటారు. ఈ తిథి ఈ ఏడాది అక్టోబరు 13, 2025 మధ్యాహ్నం 12:24 గంటలకు ప్రారంభమై..అక్టోబర్ 14 ఉదయం 11:09 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా ఈ వ్రతాన్ని అక్టోబర్ 13న ఆచరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 05:53 – రాత్రి 07:08 గంటల మధ్య పూజ చేసుకోవడానికి అనుకూల సమయం. అష్టమి నాడు నక్షత్ర వీక్షణ సమయం సాయంత్రం 06:17కు, చంద్రోదయ సమయం – రాత్రి 11:20కు ఉంటుంది.
ఉపవాసం ఎలా ఆచరించాలి?
అహోయ్ అష్టమి నాడు, తల్లులు తమ కొడుకుల దీర్ఘాయుష్షు కోసం తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. సాయంత్రం ఆకాశంలో నక్షత్రాలను చూసిన తర్వాత ఉపవాసం విరమిస్తారు. కొంతమంది మహిళలు చంద్రుడిని చూసిన తర్వాత ఉపవాసం ముగిస్తారు. ఈ వ్రతాన్నే అహోయ్ ఆథే అని కూడా అంటారు.
Also Read: Dasara 2025-దుర్గాదేవి వాహనంగా సింహం ఉండటానికి గల రహస్యం తెలుసా?
అహోయ్ అష్టమి వ్రత విధానం
అహోయ్ అష్టమి నాడు తెల్లవారుజామునే లేచి తలస్నాన మాచరించి.. ఉపవాస దీక్షకు పూనుకోవాలి. తర్వాత గంగాజలంతో ఇంటి పూజా గదిని శుభ్రం చేయాలి. అనంతరం పీఠంపై అహోయ్ మాత ఫోటోను పెట్టాలి. పువ్వులు, ధూపం కర్రలు, ఆవు నెయ్యి, రోలి, పవిత్ర దారం, గోధుమ పిండి, పొడి ఆవు పాలు, మేకప్ కిట్ మరియు కర్వాతో నిండిన కుండ అమ్మవారికి సమర్పించాలి. పూజ చేస్తూ.. అమ్మవారి వ్రత కథను చదవాలి. చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని అందరికీ పంచాలి. పూజ ముగిసిన తర్వాత స్త్రీలు తమ మెడలో వెండితో తయారు చేసిన సాహు లాకెట్ ను ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఈ మాలను ధరించడం వల్ల వారి పిల్లలకు దీర్ఘాయుష్షు లభిస్తుందని నమ్ముతారు. సాహు మాలా యొక్క వెండి లాకెట్ మీ జాతకంలో చంద్రుని స్థానాన్ని బలపరుస్తుంది.


