Kaal Bhairav Jayanti 2025 in November: ఉత్తర భారత పంచాంగం ప్రకారం, మార్గశీర్ష మాసంలో కృష్ణ పక్ష అష్టమ తిథి నాడు కాల భైరవ జయంతిని జరుపుకుంటారు. అదే సౌత్ ఇండియాలో కార్తీక మాసం కృష్ణపక్ష అష్టమిని కాలాష్టమిగా జరుపుకుంటారు. శివుడి యెుక్క ఉగ్రరూపమే కాలభైరవుడు. కాలభైరవున్ని పూజిస్తే మీ జాతకంలోని గ్రహ దోషాలు, అపమృత్యుదోషాలు తొలగిపోతాయి. కాలభైరవుడిని కాశీ క్షేత్ర పాలకుడిగా శాస్త్రాలు చెబుతున్నాయి. నవంబర్ నెలలో కాలభైరవ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారో తెలుసుకుందాం.
తేదీ, శుభ ముహూర్తం
కాల భైరవ జయంతిని భక్తులు 2025 నవంబర్ 12న జరుపుకుంటారు. మార్గశిర మాసం అష్టమి తిథి నవంబర్ 11 రాత్రి 11:08 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 12 రాత్రి 10:58 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా కాలభైరవ తిథిని నిర్ణయిస్తారు. ఉదయం 07:17 గంటల నుండి 08:40 వరకు అమృత కాలం ఉంటుంది. నిషిత కాలం రాత్రి 11 గంటల నుండి 11:52 వరకు ఉంటుంది.
కాల భైరవ జయంతి ప్రాముఖ్యత
కాల భైరవుడిని కాశీ కొత్వాల్ లేదా వారణాసి సంరక్షకుడు అని కూడా పిలుస్తారు. కాలభైరవుడిని భక్తితో పూజిస్తే అన్ని రకాల భయాలు తొలగిపోతాయి. రాహు-కేతువు లేదా శని యొక్క దుష్ప్రభావాల నుండి బయటపడాలంటే కాల భైరవుడిని పూజించడం ఉత్తమం. భైరవుడిని ఆరాధించడం వల్ల మీ ఇంట్లోని ప్రతికూల శక్తులు, దుష్టశక్తులు తొలగిపోతాయి.
Also Read: Astrology -తిరోగమనంలో శని-గురుడు.. నవంబరులో అదృష్టమంటే వీరిదే..
కాల భైరవ జయంతి పూజా విధానం
ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే తలస్నానం చేసి మంచి బట్టలు ధరించి ఇంటి పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి. అనంతరం శివుడు మరియు కాలభైరవుడు విగ్రహాలు లేదా ప్రతిమలను పెట్టి పూజలు చేయాలి. ముందుగా గంగా జలంతో భైరవుడికి అభిషేకం చేయండి. ఆ దేవుడి ముందు నెయ్యితో అఖండ దీపం వెలిగించండి. తర్వాత పువ్వులు, పండ్లు, స్వీట్లు, తమలపాకులు సమర్పించండి. ధూప దీప ధారణ చేయండి. పూజలో కాలభైరవ అష్టకం చదవండి. చివరగా హారతి ఇచ్చి పూజను విరమించండి. ఈరోజున కాల భైరవుడి వాహనమైన కుక్కకు ఆహారం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. మీ ఇంటికి దగ్గరలో భైరవుడి మందిరం ఉంటే సందర్శించండి.


