Kojagari Purnima 2025 Date and Puja timings: సంపదలకు అధిదేవత లక్ష్మీదేవి. ప్రతి ఒక్కరూ ఆ తల్లి ఆశీస్సులు తమపై ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం కటాక్షం పొందాలంటే కోజాగారి లక్ష్మీ పూజ చేయాలి. ఇది ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలో శుక్ల పక్ష పౌర్ణమి రాత్రి దీనిని జరుపుకుంటారు. దీనినే శరద్ పూర్ణిమ లేదా కోజాగారి పూర్ణిమ లేగా బెంగాలీ లక్ష్మీ పూజ అని పిలుస్తారు. ఈ పండుగను ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, ఒడిశా మరియు అస్సాంలలో జరుపుకుంటారు. ఆ రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. పౌర్ణమి నాడు లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీ ఇంట్లో ఆ తల్లి కొలువుదీరి ఉంటుంది. పైగా మీకు డబ్బుకు లోటు ఉండదు.
కోజాగారి పూజ తేదీ, ముహూర్తం
పంచాంగం ప్రకారం, కోజాగారి లక్ష్మీదేవి పూజను శరద్ పూర్ణిమ రాత్రి జరుపుకుంటారు. ఈ సంవత్సరం అశ్వినీ పూర్ణిమ తిథి సోమవారం, అక్టోబర్ 6న మధ్యాహ్నం 12:23 గంటలకు ప్రారంభమై… మంగళవారం, అక్టోబర్ 7న ఉదయం 9:16 గంటలకు ముగుస్తుంది. తిథి ఆధారంగా, కోజాగార పూజను అక్టోబర్ 6న సోమవారం నిర్వహిస్తారు. నిషిత కాలంలో పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. పూజకు అనువైన సమయం రాత్రి 11:45 నుండి 12:34 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:39 నుండి 5:28 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 మరియు మధ్యాహ్నం 12:32 గంటల వరకు ఉంటుంది. ఇదే సమయంలో ధ్రువ యోగంతోపాటు ఉత్తర భాద్రపద నక్షత్రం కూడా ఉంటాయి. అక్టోబర్ 6న, సాయంత్రం 5:27 గంటలకు చంద్రోదయం జరిగి.. తర్వాత రోజు ఉదయం 6:14 గంటలకు చంద్రాస్తమయం అవుతుంది.
Also Read: Ahoi Ashtami 2025 -మీ పిల్లలు దీర్ఘాయుష్షుతో ఉండాలంటే.. కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించాల్సిందే..
కోజాగారి పూజ విధానం
గ్రంథాల ప్రకారం, శరద్ పౌర్ణమినాడు రాత్రి లక్ష్మీదేవి భువిపైకి వచ్చి తిరుగుతుందట. పైగా శుభ్రంగా మరియు అందంగా వెలుగుతున్న ఇళ్లలోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందని భక్తుల నమ్మకం. కోజాగారి అనే పదానికి అర్థం మేల్కొని ఉండటం. ఈరోజున భక్తులు రాత్రంతా మేల్కొని అమ్మవారి రాక కోసం ఎదురుచూస్తారు. పౌర్ణమి రాత్రి భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేస్తారు. పైగా ఆ దేవత కోసం పండ్లు మరియు స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు. దీంతో ఆ అమ్మవారు సంతోషించి ఆ ఇళ్లపై కనకవర్షం కురిపిస్తుందట. ఇదే రోజున కొన్ని ఇళ్లలో హిల్స్ చేపలను కూడా ఇచ్చే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా స్త్రీలు కోజాగ్రి అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తారు.


