హిందూ ధర్మంలో పాటించే ప్రతి పద్ధతి వెనుక ఓ కారణం ఉంటుందని.. పండితులు చెబుతుంటారు. అయితే చాలా మందికి అది తెలియక గుడ్డిగా వాటిని ఫాలో అవుతుంటారు. హిందువులు ప్రకృతిని కూడా దైవంగా భావిస్తారు. దేశంలో నదులను పూజించడం ఒక ఆనవాయితీ. నదులు ప్రాచీన కాలం నుంచి మానవులకు జీవనాధారంగా ఉన్నాయి. అందుకే నదులను పవిత్రంగా భావించడం మొదలైంది. చాలా సంస్కృతులు నదులను దేవతలుగా లేదా దేవత స్వరూపాలుగా భావిస్తారు. హిందూమతంలో నదులు దేవతల ప్రతిరూపాలని నమ్ముతారు.
గంగా నది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదుల్లో ఒకటి. ఈ పవిత్ర నదిని సమస్త జీవరాశిని పోషించే తల్లిగా గౌరవిస్తారు. గంగమ్మ తల్లి గురించి మన పురాణాల్లో చాలా అంశాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం, గంగమ్మ శివుడి జటాజూటం నుంచి భూమిపై పడుతుందని చెబుతారు. అందుకే గంగానతిని అంత పవిత్రమైనదిగా చూస్తారు. మరో పురాణ కథ ప్రకారం.. భగీరథుడు అనే రాజు తన పూర్వీకులు చనిపోయాక వాళ్ల బూడిదను శుద్ధి చేయడానికి గంగమ్మను భూమి మీదకు తీసుకురావాలని చాలా కాలం తపస్సు చేశాడంట.. భగీరథుడి కోరిక మేరకు గంగమ్మ భూమికి వచ్చి తన పవిత్రతతో అందరి పాపాలు పోగొట్టిందని నమ్ముతారు. అందుకే గంగా నదిని పవిత్రంగా పూజిస్తారు.
నదులకు పూజ చేయడంతో పాటు.. వాటిలో నాణేలను వేయడం ఒక ఆచారం ఉంది. ఇలాంటి ఆచారం కేవలం మనదేశంలో మాత్రమే ఉంది అనుకుంటే పోరపాటే. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి పద్ధతి ఉంది. అయితే కొందరు ఇది కేవలం మూఢనమ్మకం అని కొట్టి పడేస్తారు. అయితే ఈ ఆచారం వెనుక శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలతో పాటు.. గొప్ప మానవత్వం దాగి ఉంది. గతంలో నాణేలను రాగితో చేసేవాళ్లు. సాధారణంగా రాగికి నీటిని శుద్ధి చేసే లక్షణం ఉంది. రాగి నాణేలను నదుల్లో వేసినప్పుడు, అవి నీటిని శుభ్రం చేయడానికి సహాయపడేవి. దీనివల్ల ఆ నీరు తాగడానికి, స్నానం చేయడానికి, ఇతర రోజువారీ అవసరాలకు సురక్షితంగా ఉండేది. ఇది కేవలం తమ కోసమే కాకుండా.. అందరి కోసం ఆలోచించి పూర్వం పెద్దలు తీసుకొచ్చిన సంప్రదాయం.
ఇక నదుల్లో నాణేలు వేయడానికి ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. దీన్ని సంపద, శ్రేయస్సు అందించే దేవత లక్ష్మీ దేవికి సమర్పించే కానుకగా భావిస్తారు. ఈ పని చేయడం వల్ల లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు లభిస్తాయని, అదృష్టం వరిస్తుందని ప్రజలు నమ్ముతారు. పాశ్చాత్య సంస్కృతుల్లో ఫౌంటెన్‌లలో నాణేలు వేస్తే కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన నమ్మకాలు ఉన్నాయి.