శ్రావణ శోభ అంటే..
శ్రావణమాసం శోభతో మీరు, మీ ఇల్లు కళకళలాడాలి. ఇల్లంతా శుభ్రంగా, ఎక్కడ ఏదుండాలో అలా ఉండేలా చక్కదిద్ది, రెండు పూటలా దీపారధన చేస్తూ, అమ్మవారిని ఇంట్లోవారంతా మనస్ఫూర్తిగా స్మరించుకుంటే శ్రావణ శోభ అలాంటి ఇంట్లో ఉట్టిపడుతుంది. మీరు మీ ఇంటికి శ్రావణ శోభను తెచ్చారా. శ్రావణ శోభ వచ్చాకే లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించాలి.
సెంటిమెంటల్ మంత్
మన తెలుగువారందరికీ ఇష్టమైన నెల శ్రావణమాసం. సెంటిమెంటల్ మంత్ కూడా. శుభకార్యాలకు ఇది కేరాఫ్ మంత్. పైగా ఈనెల్లో ప్రతిరోజూ ఓ స్పెషల్ డేనే. అందుకే చాలామంది ఈనెలలో నాన్ వెజ్ తినకుండా, నిష్టగా పూజలు చేస్తారు. మార్కెట్లో వెజిటబుల్ రేట్లు ఈనెలలో అందుకే చాలా ఎక్కువ రేటుంటాయి.
శ్రావణ లక్ష్మి
శ్రావణ లక్ష్మి అనుగ్రహం పొందాలంటే.. శ్రావణమాసంను సెలబ్రేట్ చేసుకోవాలి. ముందు ఇల్లు, వాకిలి క్లీన్ చేసుకోవాలి. బూజు, దుమ్ము లేకుండా శుభ్రంగా ఉండే ఇళ్లలోకే లక్ష్మీదేవి వస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆయురారోగ్య ఐశ్వర్యాలకు లోటేముంటుంది. అందుకే మనందరం అమ్మవారి అనుగ్రహం కోసం శ్రావణ మాసం గొప్పతనం తెలుసుకుని పాటిద్దాం.
పల్లెల్లో ప్రతి ఇల్లూ గుడి అయ్యే వేళ..
పల్లెల్లో అయితే..శ్రావణం వచ్చిందంటే చాలు ప్రతి ఇల్లు ఒక గుడిలా కనిపిస్తుంది. తోరణాలు, శుభ్రంగా ఉన్న ఇళ్లు, పూజలు, వ్రతాలు, నైవేద్యాలు, దానాలు.. వాట్ నాట్. ఈనెల రోజులూ మార్నింగ్, ఈవినింగ్ ఎక్కడ చూసినా ప్రవచనాలు, డివోషనల్ సాంగ్స్, మంత్రాలు వినిపిస్తూనే ఉంటాయి. అమ్మవారి గుళ్లకు భక్తులు పోటెత్తుతారు.
పౌర్ణమి రోజు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరిస్తాడు కాబట్టి ఈ నెలకు శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. చంద్రమానం ప్రకారం మనకున్న 12 నెలల్లో 5వది శ్రావణం. మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన నెల ఈ శ్రావణ మాసమే. అందుకే లక్ష్మీ దేవి ఆరాధనకు ఈనెల సర్వ శ్రేష్టం. విష్ణువు జన్మన క్షత్రం శ్రావణ నక్షత్రం. ఈ నక్షత్రం పేరుతో వచ్చిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు అత్యుత్తమైంది. దక్షిణాయనంలో వచ్చే ముఖ్యమైన, పవిత్రమైన నెలల్లో శ్రావణం ఒకటి.
శివ-కేశవులిద్దరికీ..
శివుడు, కేశవుడు అనే డిఫరెన్సెస్ లేకుండా పూజలు చేసే నెల ఇదే. కాబట్టి ఇది వైష్ణవులకు, శైవులకు ఇద్దరికీ ముఖ్యమైన నెలలే. ఈ నెలలో చేసే ఏ చిన్న పూజా కార్యక్రమమైనా. వేల రెట్లు శుభ ఫలితం ఇస్తుంది. ఈ నెలలో మంగళ, శుక్రవారాలు అమ్మవారికి చాలా ముఖ్యమైంది. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ శనివారం కూడా చాలా ముఖ్యమైనవి. శ్రావణ సోమవారాల్లో పగలంతా ఉపవాసం ఉండి, రాత్రిపూట శివుడికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు పోతాయని పెద్దలు చెబుతారు.
మంగళవారం రోజున..
శ్రావణ మాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతం చేస్తారు. దీన్నే శ్రావణ మంగళగౌరీ వ్రతం అని, మంగళగౌరీ నోము అంటారు. ఈ వ్రతాన్నిసావిత్రికి నారదుడు చెప్పాడని, ద్రౌపదికి కృష్ణుడు చెప్పాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక మంగళగౌరీ వ్రతం ఆచారం ఉన్న ఇళ్లలో పెళ్లైన మొదటి శ్రావణ మాసం నుంచి 5 ఏళ్లు ఈ వ్రతం చేసి చివర్లో ఉద్యాపన చేయాలి. దీంతో నిండు సుమంగళిగా ఉండే యోగం ప్రాప్తిస్తుంది. ఫ్యామిలీల్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు కూడా మంగళగౌరీ నోము ద్వారా సిద్ధిస్తుంది.
వరలక్ష్మీ వ్రతం
శ్రావణ శుక్లపక్షంలో 15 రోజులు చాలా విశేషమైనవి. ఈ 15 రోజుల్లో ప్రతిరోజూ ఒక్కో దేవుడికి పూజలు చేయాలని మన శాస్త్రాల్లో వివరంగా ఉంది. పౌర్ణమికి ముందు శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతం గురించి మన తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. పూజా మండపంలో నిండు కలశాన్ని ప్రతిష్ఠించాలి. కలశానికి వరలక్ష్మీ దేవి ముఖ ప్రతిమను శక్తిమేర అలంకరించి, పూజించాలి.
సౌభాగ్యం, మాంగల్య బలాన్ని ఇచ్చే వ్రతంగా లక్ష్మీ వ్రతాన్ని శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పినట్టు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ పౌర్ణమికి ముందు శుక్రవారం వీలు లేకపోతే తమకు వీలైన శుక్రవారంలో లక్ష్మీ వ్రతం చేయవచ్చు. అప్పుడు కూడా వీలు లేకపోతే దసరాలో కూడా చేసుకోవచ్చు. దక్షిణాదిలోముఖ్యంగాతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటకల్లో తప్పకుండా శ్రావణమాసంలో వరలక్ష్మీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తారు.
ద్వాదశి, ఏకాదశి రెండూ..
శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అనే రెండు శుభమైన రోజులుకూడా..ఈనెలలో వస్తాయి. శుక్ల పక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి.. మహావిష్ణువు పూజ చేస్తే.. మోక్షం లభిస్తుంది. ఏకాదశి అంటేనే విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు. అలాంటిది శ్రావణ ఏకాదశి మరింత ముఖ్యమైనది.
రాఖీ పౌర్ణమి
రాఖీ పౌర్ణమి కూడా శ్రావణ మాసంలోనే వస్తుంది. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా సెలబ్రేట్ చేసుకుంటాం. తమ సోదరులకు..అక్కా-చెల్లుళ్లు రాఖీ కట్టి రక్షాబంధనం జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ లో భాగంగా అన్నలు, తమ్ముళ్లు తమ చెల్లెళ్లు, అక్కలకు రాఖీ గిఫ్ట్ ఇవ్వటం ఆచారంగా వస్తోంది. సాయంత్రం అన్నాదమ్ముళ్లకు అక్కా చెల్లెళ్లు హారతులు ఇస్తారు.
వేదాభ్యాసం ప్రారంభించే సమయం
వేదాభ్యాసాన్ని ప్రారంభించేందుకు శ్రావణ పౌర్ణమి చాలా మంచిరోజు. యజ్ఞోపవిత్ర ధారణకు కూడా ఈరోజు ముఖ్యమైన రోజు. కృష్ణ పాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విదియ, రాఘవేంద్రస్వామి ఆరాధన ..ఇలాంటి ఎన్నో అకేషన్స్, ఫెస్టివల్స్ వచ్చే మంత్ మన శ్రావణ మాసం. కృష్ణాష్టమి, పొలాల అమావాస్య, గోపూజ ఇవన్నీ ఈ నెలలోనే వస్తాయి. సకల సౌభాగ్యాలు కలగాలంటే ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తప్పకుండా ఫాలో కావాలి.
పూలు-పళ్ల మాసం
ప్రకృతి పచ్చగా ఉండే నెల శ్రావణమాసం. వర్షాలు విస్తారంగా కురిసిన కారణంగా ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు, పళ్లు, పూలు, కూరగాయలు బాగా పండి పల్లెలన్నీ కళకళలాడుతుంటాయి. అందుకే వీటన్నింటినీ సెలబ్రేట్ చేసుకునేందుకే మనకు ఈ నెలలో ఇన్ని పండుగలు వస్తాయి. పూల అలంకరణలు, పంచభక్ష్య పరమాన్నాలు, పండుగ వంటలు చేసుకునేందుకు శ్రావణ మాసం పంటలపరంగా ఉత్తమమైన నెల. ఇక మనిషికి-పశువుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చాటే పండుగే పొలాల అమావాస్య. ఇప్పటికీ చాలా పల్లెల్లో ఈ పండుగను తమ శక్తికి మించి గొప్పగా జరుపుకుంటారు రైతులు.
సత్యనారాయణ స్వామి జయంతి
శ్రావణ శుద్ధ విదియ అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామివారి జయంతి. శ్రావణ శుద్ధ చతుర్థి నాగుల పంచమి, శ్రావణ శుద్ధ పంచమి, గరుడ పంచమి, కల్కి జయంతి. శ్రావణ శుద్ధ త్రయోదశి శని త్రయోదశి. శ్రావణ శుద్ధ చతుర్దశి వరాహ జయంతి. శ్రావణ పూర్ణిమ రాఖీ పండుగగా జంధ్యాల పౌర్ణమిగా, హయగ్రీవ జయంతిగా జరుపుకుంటారు. శ్రావణ సప్తమి రోజున భాను సప్తమిని జరుపుకుంటారు. ఈ లోకానికి వెలుగునిచ్చే ప్రత్యక్షదైవం సూర్యుడికి సూర్యనమస్కారాలు చేస్తారు.
లౌకిక, ఆధ్యాత్మిక ఆనందం ఇచ్చే నెల
శ్రావణమాసం వచ్చిందంటే పిల్లా-పెద్దలకు, ఆడ-మగ, బ్రహ్మచారులకు, గృహస్థులకు ఇలా అందరికీ లౌకిక ఆనందంతో పాటు ఆధ్యాత్మిక ఆనందం ఇస్తుంది. ఈ నెలలో వేదాధ్యనం ప్రారంభించటం, వేదాధ్యయనం ఎక్కువ సేపు చేయటం అనే విధానాన్ని అమలు చేస్తారు. ఇక ఆడవారికైతే వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామ స్తోత్రం వంటివి చదవమని చెబుతారు.
ఆడాళ్లు ఆనందంగా ఉంటే చాలు..
“గృహిణీ గృహముచ్యతే” అని పెద్దలు అంటారు అంటే ఏ ఇంట్లో ఆడవాళ్లు ఆనందంగా ఉంటారో ఆ ఇంట్లోని వారంతా ఆనందంగా ఉంటారని అర్థం. శ్రావణ మాసం ఇలా ఇంటిని పచ్చగా ఉంచుతూ ఆడవారిని ఆనందంగా ఉంచే నెల. శ్రావణమాస మహత్యం అనే వివరాలు అన్నీ స్కాంద పురాణాల్లో ఉన్నాయి.
కృష్ణావతారం ప్రారంభమైన నెల
పెళ్లి ప్రయత్నాలు, పెళ్లిళ్లు కూడా ఈ నెలలో ఎక్కువగా చేస్తారు. శుభ కార్యక్రమాలకు ఈనెల మంచిది. మంచి పనులు ప్రారంభించాలంటే ఈనెల సరైనది. దశావతారాల్లోని కృష్ణావతారం ఈ నెలలో ప్రారంభమైంది ఎందుకంటే..శ్రావణ అష్టమినాడే కృష్ణుడు జన్మించాడు. శ్రావణ మాసమంటేనే సందడి. అలాంటిది కృష్ణాష్టమి అంటే అల్లరి కృష్ణుడికి ఎన్నో సేవలు, పూజలు. ఉట్టి కొట్టే పండుగగాపల్లెలు, సిటీల్లో ఈ వేడుకను చాలా గొప్పగా చేస్తారు. ఇంట్లో పిల్లలకు రాధాకృష్ణుల అలంకారం చేస్తారు. ఇంట్లో చిన్నికృష్ణుడి పాదముద్రలు వేస్తారు. తులసి మాలతో కృష్ణుడిని అలంకరిస్తారు. ‘ఛప్పన్ భోగ్’ పేరుతో 56 రకాల వంటలు కృష్ణుడికి నైవేద్యంగా పెడతారు. కృష్ణుడి తత్వాన్ని, లీలలను లాలి పాటలు, కీర్తనలు, భజనలతో భక్తులంతా గుర్తుచేసుకుని తరిస్తారు. అటుకులు, వెన్న ప్రసాదంగా పంచి ఆనందిస్తారు. ఈరోజు గీత పఠనం చేస్తే మరింత మంచిది. ఇక సాయంత్రం కృష్ణుడికి లాలి సేవ చేస్తూ, లాలి పాటలు పాడి, ప్రసాదం పంచి, తాంబూలాలు ఇస్తారు. రాధా, కృష్ణుడు, గోపికల గెటప్లో పిల్లలకు పోటీలు పెడతారు. ఉట్టి కొట్టే పోటీలు ఉంటాయి. వీటికి బోలెడంత ప్రైజ్ మనీ కూడా ఉంటుంది.
మహారాష్ట్ర, ఉత్తరాదిన దీన్ని దహీహండి ఉత్సవం అని..ఊరంతా కదిలివచ్చి సెలబ్రేట్ చేస్తారు. సంతానం కోరుకునేవారు కృష్ణాష్టమి చాలా ఘనంగా జరుపుతారు. సంతాన గోపాలుడిగా పూజిస్తే సంతానం లేని వారికి సంతానం తప్పకుండా కలుగుతుంది పురాణాల ప్రకారం ఇప్పటికి శ్రీకృష్ణుడు జన్మించి 5248 సంవత్సరాలు అయింది. ఇస్కాన్ వారు ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తారు. కృష్ణాష్టమికి ఉదయం, మధ్యహ్నం, అర్ధరాత్రి మూడు పూటలా పూజలు చేస్తారు.
గరుడ పంచమి వ్రతం
అన్నా-తమ్ముళ్లు ఉన్న ఆడవాళ్లంతా గరుడ పంచమి వ్రతం చేస్తారు. అన్నదమ్ముళ్లకు వీపు రుద్ది, సేవ చేస్తారు. ఇలా చేస్తే గౌరీ దేవికి సంతృప్తి కలుగుతుంది. 10 ఏళ్ల పాటు గరుడ పంచమి చేసి, ఆతరువాత ఉద్యాపన చెప్పాలి. గరుడ పంచమి రోజు గరుడుడి పూజ చేస్తే, ఆరోగ్యవంతులు, ధైర్యవంతులు అవుతారు. కాలసర్పదోషంవంటి దోషాలున్నవారు ఈరోజు పూజలు తప్పకుండా చేయాలి. సర్పదోషాలన్నీ పోతేనే ఉద్యోగం, ఆరోగ్యం, సంతానం కలుగుతుంది. అందుకే ఆ ఆదిశేషుడిని మనం ఈరోజు పూజిస్తాం.
ప్రకృతి ఆరాధన
ఇలా శ్రావణ మాసంలో ప్రతిరోజూ ఓ స్పెషల్ డేనే. మనం ఆధ్యాత్మికంగా వికసించేందుకు ఈనెల ఎంతో సహకరిస్తుంది. అమ్మవారి అనుగ్రహం సంపాదిస్తే ఇక కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవితాన్ని గడపవచ్చనేది భక్తుల తాపత్రయం. శ్రావణ మాసంలో మనం ఏరకంగా చూసినా ప్రకృతి ఆరాధన చాలా ఎక్కువ. నాగుల పంచమి లేదా గరుడ పంచమి పేరుతో పాములకు పూజలు, మిగతా అన్ని రోజుల్లోనూ ఎన్నో రకాలు పువ్వులు, కూరగాయలు, పళ్లు ప్రత్యేకంగా ఉపయోగించటం మనం చూస్తూనే ఉన్నాం. భారతీయుల జీవన విధానంలో పండుగలు స్పెషల్ గా మారటం వెనకున్న సీక్రెట్ ఇదే. సనాతనంగా వస్తున్న ఈ ధర్మాన్ని మనం కూడా భక్తితో ఫాలో అవుదాం.