Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Farmers agitation: ఎన్నికల వేళ రైతాంగం ఒత్తిడి

Farmers agitation: ఎన్నికల వేళ రైతాంగం ఒత్తిడి

మూడేళ్ల తర్వాత రైతులు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఢిల్లీ చలో నినాదంతో మళ్లీ ఢిల్లీకి వెళ్లడం ప్రారంభమైంది. గత వారం కేంద్ర మంత్రులతో చండీగఢ్ లో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత రైతులంతా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీ చలో ప్రదర్శన చేపట్టారు.
కొందరు కేంద్ర మంత్రులతో రైతు నాయకులు చర్చలు జరిపినప్పుడు రైతులకు సంబంధించిన కొన్ని డిమాండ్లకు కేంద్రం అంగీకారం తెలిపింది కానీ, ఈ మేరకు ఒప్పందం మాత్రం జరగలేదు. పంటలన్నిటికి కనీస మద్దతు ధర ప్రకటించాలని, స్వామినాథన్ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, రైతులకు పింఛను చెల్లించాలని, రైతుల రుణాలు మాఫీ చేయాలని, పోలీసు కేసులు ఉపసంహరించాలని, 2021లో లఖింపూర్ ఖేరి హింసాకాండలో దెబ్బతిన్న రైతులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం వాగ్దానం చేసింది కానీ వాటిని ఇంతవరకూ అమలు చేయలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో తమను పాలక పక్షం దూరం చేసుకునే అవకాశం లేదనే ఉద్దేశంతో రైతులు ఇప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడికి సిద్ధపడినట్టు అర్థమవుతోంది.

- Advertisement -

కాగా, మూడేళ్ల క్రితం మాదిరిగానే ఈసారి కూడా రైతుల ఉద్యమాన్ని ఏదో విధంగా అణచివేయ డానికే ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మార్చి 12 వరకూ దేశ రాజధాని ఢిల్లీలో 144వ సెక్షన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ చుట్టుపక్కల బ్యారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. భారీ వాహనాలను మోహరించడంతో పాటు, భద్రతా దళాలను కూడా దించి, రైతులు తమ ఇళ్ల నుంచి బయటికి కదలకుండా చేయడం జరిగింది. ఢిల్లీకి శివార్లలో ఉన్న హర్యానాలో జాతీయ రహదారులను మూసేయడం కూడా జరిగింది. కాగా, రైతులు కూడా అంతే పట్టుదలగా వ్యవహరిస్తున్నారు. సుమారు 200 రైతు సంఘాలు తమ కుటుంబాలతో ఢిల్లీ శివార్లలో బైఠాయింపులు జరుపుతున్నారు. నిజానికి 2021-22లో జరిగిన రైతు ఉద్యమం దేశ చరిత్రలో ఒక మైలు రాయిలాంటిది. రైతుల ఆందోళన కారణంగా ప్రభుత్వం అప్పట్లో తమ రైతు చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. రైతులకు ప్రభుత్వ నిర్ణయం పాక్షిక విజయాన్ని తెచ్చిపెట్టింది. అప్పట్లో ప్రభుత్వం అంగీకరించని తమ మిగిలిన డిమాండ్లను ఈసారి సాధించాలని రైతులు కృత నిశ్చయంతో ఉన్నారు.

సాధారణంగా రైతులు కూడా తమ డిమాండ్ల సాధనకు సమ్మె చేయడానికి, ఆందోళనలు సాగించడానికి హక్కుంది. అయితే, అందులో అరాచక శక్తులు చేరినప్పుడు, రైతులు హింసా విధ్వంసకాండలకు దిగినప్పుడు ప్రభుత్వం తప్పకుండా వాటిని అడ్డుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం రైతులు శాంతియుతంగానే ఆందోళన చేస్తున్నందువల్ల ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా మాత్రమే కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతోంది. నిజానికి, తమ స్థితిగతులను మెరుగుపరచుకోవడానికి ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో రైతులు ఆందోళనకు దిగడం జరుగుతుంటుంది. ఏ దేశంలోనైనా రైతులు తమ డిమాండ్లకు ఆందోళనకు దిగడానికి స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ కూడా ప్రభుత్వం వారిపై ఎటువంటి అణచివేతకూ దిగడం లేదు. ప్రభుత్వం, రైతు నాయకులు చర్చలకు దిగి సమస్యలను పరిష్కరించుకోవడం మంచిది. ప్రతి పంటకూ మద్దతు ధర నిర్ణయించడం, స్వామినాథన్ కమిటీ సిఫారసులన్నిటినీ ఆమోదించడం అనేది ఆచరణ సాధ్యం కాని విషయమని ప్రభుత్వం వివరించే ప్రయత్నం చేస్తోంది. అయితే, రైతులు తమ పంటలకు సరైన రాబడి పొందేలా, వ్యవసాయం వారికి లాభసాటిగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News