గోపీనాథ్ మహంతి గారు ఒరియా భాషలో కోంధ తెగపై రాసిన అద్భుతమైన నవల ని పురిపండా అప్పలస్వామి గారు “అమృత సంతానం” పేరుతో అనువదించారు. ఆ రకంగా మన తెలుగు అనువాద సాహిత్యంలో ఓ మణిపూస వచ్చి చేరింది. 543 పేజీలు గల ఈ పుస్తకాన్ని కాస్త మెల్లగానే చదవవలసి వచ్చింది. మిగతా లౌకిక వ్యవహారాల సందడిలో పడి..!
నా అభిప్రాయాన్ని పంచుకోవాలని ఎంతో ప్రయత్నించగా ఇప్పటికి పడింది. ఒక మహా తేజస్సుని కంటితో చూసినప్పుడు ఒక్కసారిగా మ్రాన్ పడిపోతాము. దాని గురించి ఎక్కడ మొదలు పెట్టి ఏమి చెప్పాలో అర్ధం కాని స్థితి ఉంటుంది. ఈ నవల చదివిన తర్వాత సరిగ్గా అలాగే అనిపించింది. దేనిని వదిలి వేయాలి దేనిని చెప్పాలి అలా అయింది నా పరిస్థితి.
ఎక్కడో అవిభక్త కోరాపుట్ జిల్లా లోని ఓ మారుమూల అరణ్య వాసాల్లోకి వెళ్ళిపోతాము. అక్కడి చెట్లుపుట్టలు, రుతువులు, జంతువులు, కోంధ జీవనంలోని ఎగుడు దిగుళ్ళు ఇంకా అది ఒక్కటే కాక సగటు మానవ జీవనంలోని రంగులు..ఎన్నని ? అన్నిటిని మహంతి గారు రాశారు అనడం కంటే తాను సాక్షిగా నిలిచి మనకి చూపించారు అనాలి. ఆయన లియో టాల్స్ టాయ్ ని అనువదించారు. గొప్పగా అర్ధం చేసుకున్నారు. కనుకనే ఒక సౌందర్యాన్ని, దాని రెండు వైపుల్ని ఎంతో నేర్పుగా మన కళ్ళముందుంచారు.
ఎంత చిన్న వాక్యాలు. ఎంత గుండెల్ని పట్టి ఊపి వేసే నేర్పు. ఏ పాత్ర స్వభావం దానిదే, ఎక్కడా తెచ్చిపెట్టుకున్న శైలి లేదు. అంత అందంగానూ పురిపండా వారి అనువాద నైపుణ్యం సాగింది. ఒరియా సొబగులు క్షుణ్ణంగా ఎరిగిన కళింగాంధ్రుడు ఆయన. వాడ్రేవు చిన వీరభద్రుడు గారి చొరవ వలన అనేక మంది ఈ నవలపై తమ అభిప్రాయాల్ని రాశారు. అది ఒక చక్కని ప్రయోగం. అక్కడ ప్రస్తావించినవి కాక ఇంకొన్ని ఇతర విషయాలు ముచ్చటించ యత్నిస్తానుసరే..నావల్ల అయినంత మేరకు రాస్తాను.
ఊరి పెద్ద, వయో వృద్దుడు అయిన దివుడు సావోతా తండ్రి మరణంతో కధ మొదలవుతుంది. దివుడు ఒక ప్రధాన పాత్ర అనాలి. ఎవరినో ఒకరిని నాయకీ నాయకులుగా ఊహించలేము. చాలా పాత్రలు పోటీకి వచ్చి నిలుస్తాయి. అదే దీనిలోని గమ్మత్తు. దివుడు భార్య పుయు గాని, మన తెలుగు నేల మీద పెరిగి అచటికి వెళ్ళి కొంధ సమాజంలో కలిసిపోవడానికి ప్రయత్నించి, చివరికి దివుడిని చేసుకున్న పియోటి గాని, పుబులి అనబడే దివుడి చెల్లెలు గాని, వయస్సు పరంగా తానే తన అన్న తర్వాత ఊరి పెద్ద కావాలని తపించే లెంజు కోదు గాని, ఇంటిలో వెలితితో బయటికి చూసే సోనా దేయి గాని ఇలా ఏ పాత్ర స్థానం దానిదే. ఇంకా చాలా చిన్న పాత్రలు తారసపడతాయి.
ఒక ముఖ్య విషయం చెప్పాలి. మహాంతి గారు ఎక్కడ కూడా ఎవరి వైపూ నిలబడి తీర్పు ఇవ్వడు. అలాగే శృంగార సన్నివేశాలు కూడా ఒక పరిధి దాటి వర్ణించడు కాని ఆ అనుభూతిని కొన్ని మాటల్లోనే చెప్పి ఆ సంఘటనని బలపరుస్తాడు. సోనా దేయిని సోదా చేయడానికి అధికారులు వచ్చినప్పటి సన్నివేశాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చును. అలాగే దివుడికి, అతని భార్యకి మధ్య వచ్చే ఎడం కూడా ఎంత సున్నితంగా ఉంటుందో. అక్కడ ఆ యిద్దరిలో ఎవరిని తప్పని అనలేము. ఎంతో ఏరి కోరి దివుడు ఆమెని చేసుకుంటాడు. పిల్లవాడు పుట్టిన తర్వాత భార్య భర్త మీద కాక ధ్యాసని ఎక్కువ పిల్లవాడైన హాకినా మీద పెట్టడం, తన సొగసు మీద కూడా దృష్టి పెట్టకపోవడం, భర్త దగ్గరకి వచ్చినప్పుడు దూరం పోవడం ఇవన్నీ దివుడులో ఆ భాషలో చెప్పాలంటే సిర్ర పుట్టిస్తుంది.
అందువల్ల తను బయటకి చూడటం మొదలవుతుంది. మళ్ళీ ఒకవైపు భార్యని చూసినప్పుడు తనలో ఆత్మశోధన మొదలవుతుంది. ఎంత బక్కగా అయిపొయింది, పిల్లవాని ఆలనా పాలనా, ఇంటి పనులు ఇవన్నీనూ ఆమెకి అని దివుడు మరోవైపు ఆలోచిస్తాడు. ఊరుకి పెద్ద తలకాయ తను కోరితే ఎంతో మంది వస్తారు కాని అప్పటికీ ఎంతో సమ్యమనంతో వ్యవహరించినట్లే అనుకోవాలి. పియోటి వంటి జాణతనం ఉన్న స్త్రీతో కూడా ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తాడు, ఆమె ఇతడిని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ. సరే..చివరకి ఆమె సఫలమవుతుంది.
ఎంత అనుకున్నా మనిషిని నడిపించే చోదకశక్తులలో ప్రధానమైనది శృంగారమే, అది ఏ సమాజమైనా. డబ్బు మీద ప్రేమ బయటకి కనబడుతుంది. దాన్ని బయటకి చూపించడంలో తప్పు లేదనుకుంటాడు మనిషి. కానీ మొదటి దాన్ని ఉన్నది ఉన్నట్లు ఒప్పుకోడానికి సంఘ నీతి గట్రా అడ్డం నిలుస్తాయి. మళ్ళీ ఇంకో కోణాన్ని చూడవచ్చు. సోనా దేయి దివుడు పట్ల ఆసక్తి చూపించి, రెచ్చగొట్టి చివరకి అతను ఆమెని చేరుదామన్న తరుణంలో ఆమె రచ్చ చేయడం, తాను ద్వేషించిన తన మగడిని పైకెత్తినట్లు చేయడం ఒక్కసారిగా నివ్వెరపరుస్తుంది. ఈ పాత్ర స్వభావంని మనం ఎన్నో చోట్లా చూశామా అనిపిస్తే మన తప్పు కాదు. అలాగే వయసులో నలభై అయిదు దాటి, భార్య చనిపోయి, ఇంకో తోడు కోసం చూసే లెంజు కోదుతో సైతం ఈమె చనువు చూపుతుంది. శృంగార భావనలు రేపడమే తప్పా శృంగారం నెరిపినట్లు ఎక్కడా ఉండదు, ఆ చెకింగ్ అధికారి వచ్చిన సందర్భంలో తప్పా.
బాగా తరచి చూస్తే ప్రతినాయకుల్లాంటి వారు తెలుగు వారే అని తేలుతుంది. దక్షిణాది నుంచి వచ్చిన వారని వ్యాపారస్తుల గురించి చెప్పడం, ఆ పేర్లు అవీ ..ఇంకా పియోటి పెరిగిన, ఎరిగిన ఊర్లు మనుషులు గూర్చి రచయిత చెపుతున్నప్పుడు ఈ భావన మనకి కలుగుతుంది. బారికి వంటి వారు ఆ కొంధ సమాజంలో దళారి వంటి వారే. బెజుణి, డిసారి వంటి వారు ఆ సంస్కృతి లోని భాగాలు. పులి అనేది ఎంత గొప్ప భాగమో ఆ జీవితంలో. అచటి కొంధ ప్రజలు వేటకి తుపాకులు ఉపయోగించడం మన జీవనంతో పోల్చితే కొత్తగా అనిపిస్తుంది.
సరే..మిగతా సంప్రదాయ ఆయుధాలతో పాటు దీనిలో చాలా వర్ణనలు అనేక ఏళ్ళ పాటు మనలో నిలిచిపోతాయి. ఎప్పటికప్పుడు కొత్తగా తోస్తాయి. దానికి కారణం రచయిత జీవితాల్ని మన ముందు ఉంచుతాడే తప్పా ఏ రకమైన గ్లాసుల్లో నుంచి చూడకపోవడం అని భావిస్తాను. ఈ నవలలోని కొన్ని చక్కటి భాగాల్ని మీ ముందు ఉంచుతాను. వీలు కుదిరినప్పుడల్లా వాటిని చదివినప్పుడల్లా మహంతి గారి ఆలోచనా విధానమూ, ప్రత్యేకత మనకి అవగతమవుతాయి.
1955 లో ఈ నవలకి సాహిత్య అకాడెమి బహుమతి ప్రదానం చేయడం వలన ఇతర భాషల్లోకి ఆ సంస్థ కృషిచే వెళ్ళగలిగింది. అందుకు గాను ఆ సంస్థని అభినందించవలసిందే. ఆ రకంగా మనం తెలుగులో చదవగలిగాము. కానీ ఒకటి కటక్ లోని రావెన్ షా విశ్వ విద్యాలయం ఎంత గొప్పది అనిపిస్తుంది, అటు ఒరియా సాహిత్యంలో గాని ఇటు ఆంగ్ల సాహిత్యంలో గాని తారా తోరాణాలుగా నిలిచిన జయంత మహాపాత్ర, మనోజ్ దాస్ ఇంకా ఈ గోపీనాథ్ మహంతి ఇలాంటి వారు కొన్ని డజన్ల మంది అక్కడ ఆంగ్ల సాహిత్యం, ఇతరములు చదువుకుని బయటకి వచ్చారు. ఒక ప్రాంతానికి గాని, ఊరికి గాని, విద్యాలయానికి గానీ వన్నె తెచ్చేది అక్కడి నుంచి వచ్చిన మహానుభావుల వల్లనే గదా.
—— మూర్తి కెవివిఎస్ (7893541003)