Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: "దోసపాటి శతకం! పూసపాటి సాహిత్యం"

Telugu literature: “దోసపాటి శతకం! పూసపాటి సాహిత్యం”

సమాజ నిర్మాణంలో సాహిత్యం కీలకపాత్ర వహిస్తుంది. సమాజంలోని విద్యార్థులలో యువతలో సృజనాత్మక శక్తి పెంపొందాలన్నా సామాజిక సాంస్కృతిక చారిత్రక రాజకీయ పరమైన అంశాలపై యువతకు అవగాహన రావాలంటే సాహిత్యం చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో కథ కవిత నవల సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అంతకంటే ఎక్కువ ప్రాధాన్య పద్యానికి ఉంది అనుటలు ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే క్రీస్తు శకం పదో శతాబ్దము నుండి 20వ శతాబ్దం మధ్యకాలం వరకు శ్రీ కాళహస్తీశ్వర శతకం, నరసింహ శతకం, దాశరధి శతకం, మొదలైన భక్తి శతకాలు. భాస్కర శతకం, సుమతీ శతకం, వేమన శతకం, మొదలైన సామాజిక అంశాలపై వ్రాయబడిన శతకాలు తెలుగు సాహిత్యానికి జీవాన్ని పోశాయి.
నేడు 21వ శతాబ్దంలో పద్య శతక సాహిత్యము రాసే వారి సంఖ్య తగ్గినప్పటికీ పద్య సాహితీ ప్రాముఖ్యత మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అనుటకు సాక్ష్యం దోసపాటి శతకం మనకు నిదర్శనంగా కనిపిస్తుంది.
దోసపాటినాగేశ్వరరావు వృత్తిరీత్యా ఉపాధ్యాయుడు అయినప్పటికీ, ప్రవృత్తి రీత్యా ప్రముఖ రచయిత. సమసమాజ నిర్మాణంలో నేటి విద్యార్థులలో, యువకులలో, సాహితి ఆలోచన రేకెత్తించి విద్యార్థులకు కవితలు కథలు రాయటం నేర్పిస్తూ, వారిచే పుస్తకాలు చదివిస్తూ, తనకున్న కాస్త సమయాన్ని గ్రంథాలయాల్లో గడుపుతూ నేటి సమాజానికి తనదైన శైలిలో సాహితీ సేవ చేస్తున్నారు.
దోసపాటి నాగేశ్వరరావు గారు తనలోని ఆలోచనలను అనుభవాలను సమ్మేళనం చేసి ఆటవెలది పద్యాలతో దోసపాటి శతకం రచించారు. మాతృమూర్తి గురించి మాతృభాష గురించి గురు శిష్యులు గురించి రాజకీయ నాయకులు వారి ప్రమాణాలు గురించి కరోనా గురించి ఇలా అనేక సామాజిక రాజకీయ ఆర్థిక మానసిక ఆరోగ్యానికి సంబంధించినా అనేక అంశాలను ఆటవెలది పద్యాలతో దోసపాటి శతకం రాయడం అంత ఆశామాషా విషయమేమీ కాదు దీనికి తగిన చందో జ్ఞానంతో పాటు లోకజ్ఞానం ఉంటే తప్ప సాధ్యపడదు అనేది దోసపాటి ద్వారా నిరోపితమవుతుంది.

- Advertisement -

*అమ్మ నాన్నల ఎడ అనురాగముంచుము
ఆస్తికన్న మిన్న అమ్మ నాన్న
తల్లిదండ్రులిలలో దైవాల సములురా!
పసిడి మూట దోసపాటి మాట
నేటి సమాజంలో ఆస్తికి ఉన్న విలువ అమ్మ నాన్నల మీద లేదు ముఖ్యం వారి ప్రేమ వారిపై ప్రేమ పిల్లలకు అదే ఆశీర్వాదం తల్లిదండ్రుల ఆశీర్వాదం దైవంతో సమానమని కవి ఆలోచన.

*తెలుగు భాష కన్న తీయని రుచియేది
మాతృభాష కన్న మధుర మేది
అమ్మ భాష కన్న అమృతమ్ము లేదయ్యా!
పసిడిమూట దోసపాటి మాట
ప్రకృతిలోని ప్రతి ప్రాణి తనకు జన్మనిచ్చిన తల్లిని తల్లి భాషను అనుసరిస్తూ అనుకరిస్తూ ఉంటాయి. అలాగే మన తెలుగు వారమైన మనం మన భాష యొక్క మాధుర్యాన్ని మమకారాన్ని అమ్మ నేర్పిన కమ్మనైన మన మాతృభాష తెలుగు భాష గొప్పతనాన్ని తెలుసుకొని తెలుగు భాష స్పష్టంగా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని రచయిత దోసపాటి నాగేశ్వరరావు గారి భావన.

గురువులన్న జాతి గుoడియ లేన్నడున్
గురువు దేశ భవితకున్ను దన్ను
గురువు లేక యున్న గుడ్డిదగును విద్య
పసిడి మూట దోసపాటిమాట.
నేటి సినిమా ప్రపంచంలో గురువుల మీద కామెంట్ దృశ్యాలు పొందుపరచడం వల్ల రాను రాను సమాజంలో గురువు యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది కానీ ఇది తప్పుడు భావన అనే కవి దోసపాడు దేశ భవిష్యత్తు యువత భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువు అనే విషయాన్ని మర్చిపోకుండా గురువును గౌరవించవలసిన బాధ్యత సమాజంలోని అందరిమీద ఉండాలని కవి భావన.
రైతుమోములోన రాగాలు బలికిన
రాళ్లు కరిగి పుడమి రతనమిచ్చు
నేల దున్ను రైతు నీరజ గర్బుడే
పసిడిమూట దోసపాటి మాట.
రాత్రింబవళ్లు శ్రమించి రైతన్న రతనాలను పండిస్తున్నారు ఆకలను తీర్చే రైతన్న ఘనుడు అని కవి భావిస్తూ రాసిన పద్యం.

చినుకు రాలి తేనె చిగురించు పుడమిన
పచ్చనైన యట్టి పంట పైరు
నింగి పులకరముతో నీళ్ళాడు నేలమ్మ
పసిడి మూట దోసపాటి మాట.
పుడమి పై చెట్లు చిగురించాలన్న పంట పైరు పెరగాలన్న నేలమ్మ నీళ్ళాడితేనే చినుకు ర్యాలీ చెట్లు చిగురించి జీవరాశుల మనుగడ సాధ్యమవుతుందని కవి భావన.

మొక్క నాటి చూడు ఒక్కటైనతుదకు
నీడ ఫలము కట్టే నీకు దొరకు
చెట్టు లేకయున్న చెరుపు నీభవితకు
పసిడి మూట దోసపాటి మాట.
రైతుల పంటలు చినుకుపై ఆధారపడింది చినుకు రాలితేనే చెట్లు చిగురిస్తాయి చెట్లు లేకపోతే ఫలము లేదు నీడ లేదు గాలి లేదు చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదానికి నిదర్శనం ఈ పద్యం.

మహిళలన్న మనకు మహిలోన దేవతల్
ఆదరించవలయు అమ్మవోలె
మహిళ లేక యున్న మనుగడేది మనకు
పసిడి మూట దోసపాటి మాట.
ఈ జగతికి మూలం మహిళ లేకుంటే మానవుడి మనుగడ సాధ్యపడదు అందుకని మహిళలను దేవతలతో సమానంగా పూజించకపోయిన పరవాలేదు కానీ అవమానించకూడదు వారిని ఆదరించటం మన ధర్మం.

ఫేసబుక్కు రోత పేడ కంపును గొట్టు
వాటు సప్పు జుడ వాంతి వచ్చు
సెల్లు ఫోనులోన సొల్లుకబురులేను
పసిడి మూట దోసపాటి మాట.
నేడు చిన్నపిల్లల నుండి వయోవృద్ధుల వరకు అందరూ ఫోన్లోనే గజిబిజిగా ఉంటున్నారు వాట్సాప్ లో యూట్యూబ్ లో ఫేస్ బుక్కులో కాలయాపన చేస్తూ ప్రపంచాన్ని మరిచిపోతూ మైమరిచిపోతూ అనవసరమైన విషయాల్లో ఆందోళన చెందుతున్నారు ఈ సెల్ఫోన్ ఫేస్బుక్లో నుంచి బయటికి వచ్చి బయట ప్రపంచాన్ని ఆనందించాలని కవి భావన.

మాసుక్ శానిటైజ్ మనిషికి మనిషికి
మధ్య దూరముగను మనము యున్న
అదుపు చేయవచ్చు అంటుక కరోనాను
పసిడి మూట దోసపాటి మాట.
ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో కల్లోలాన్ని రేకెత్తించిన అంశం కరోనా చైనాలో పుట్టిన కరోనా ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది కరోనా తర్వాత ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టి సానిటైజర్ కొట్టి బయట తిరగాలి లేకపోతే బ్రతుకు గల్లంతవుతుంది.

రంజుగానూ పీల్చు రక్తంమ్ము జలగలు
నల్లి దోమ పేను నరులు జగతి
వీటి కన్న మించి పిల్తురు నాయకుల్
పసిడి మూట దోసపాటి మాట.
నేటి రాజకీయ నాయకులు వారి పదవులు కోసం అనేక వాగ్దానాలు చేసి ప్రజల సొమ్మును దోచుకొని వారి భవిష్యత్ తరాల కోసం దాచుకుంటున్నారు జలగలు పీల్చే రక్తం కంటే భయంకరంగా రాజకీయ నాయకులు ఈ సమాజాన్ని దోచుకుంటున్నారు అని కవి భావన.

కులము మతము లంటు కుమ్ములాటలు వద్దు
అన్నదమ్ములేను అందరమ్ము
కలిసి యున్నవేళ కల్గును బలిమియు
పసిడి మూట దోసపాటి మాట.
భిన్నత్వంలో ఏకత్వం అయిన భారతదేశంలో నేడు కులాల పేరుతో మతాల పేరుతో ఎన్నో కొట్లాటలు జరుగుతున్నాయి చివరికి . వన భోజనాలు కూడా కులభోజనాలుగా మారాయి కులాలను పక్కనపెట్టి అందరము అన్నదమ్ముల్లాగా కలిసి ఉంటేనే సమాజానికి మేలు జరుగుతుందని దోసపాటి నాగేశ్వరావు గారి అభిప్రాయం.
విద్య గలిగియున్న వినయంబు గలుగును
వినయమున్న యెడల విద్య గలుగు
వినయ విద్య మనకు వెలలేని భూషణల్
పసిడి మూట దోసపాటి మాట.
ఈ సమాజంలో ప్రతిభావంతుడైన పౌరుడుగా ఎదగాలి అంటే విద్యా వినయము రెండూ ఉండాలి విద్య లేకుండా వినయమున్నవినయం లేకుండా విద్య ఉన్న విజయం లభించదు కాబట్టి విద్యా వినయములతో కూడిన యువత నేడు మన సమాజానికి కావాలి అని కవి దోసపాటి నాగేశ్వరావు గారి భావన. ఇంత మంచి సాహితి శతక పద్యాలను అందించిన దోసపాటి నాగేశ్వరరావు గారికి సాహితీ అభినందనలు దోసపాటి నాగేశ్వరరావు గారి కలం నుండి మరెన్నో కవిత పద్య సంకలనాలు వెలువడాలని ఆశిద్దాం.

కవి సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి
9912197694

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News