Tuesday, September 17, 2024
Homeఓపన్ పేజ్Parliament Special Session: ప్రత్యేక సమావేశాలపై వీడని మిస్టరీ

Parliament Special Session: ప్రత్యేక సమావేశాలపై వీడని మిస్టరీ

75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం మీద కూడా చర్చ

ఈ నెల 18 నుంచి ప్రారంభం కాబోయే అయిదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తోందో అంతుబట్టడం లేదు. ఈ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకునే ముందు కేంద్ర ప్రభుత్వం తమను సంప్రదించనే లేదని ప్రతి పక్షాలు ఫిర్యాదు చేస్తున్నాయి. ఈ మేరకు సెప్టెంబర్ 13న విడుదల చేసిన బులెటిన్ లో మొదటి రోజు సమావేశానికి సంబంధించిన సమాచారం మాత్రమే ఉంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల
కమిషనర్ల నియామక ప్రక్రియలో మార్పులు తీసుకువచ్చే బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. అయితే, ఈ బిల్లును అడ్డుకోవాలని ప్రతిపక్షాలు గట్టి ప్రయ త్నంలో ఉన్నాయి. వీరి
నియామకాల మీద ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో పట్టుండే అవకాశం ఉందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.

అంతేకాక, ఈ సమావేశాల్లో ప్రభుత్వం 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం మీద కూడా చర్చకు అవకాశం కల్పిస్తోంది. రాజ్యాంగ సభను ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్లమెంట్ సాగించిన ప్రగతి, సాఫల్యాలు, వైఫల్యాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, పాఠాలు వగైరాల గురించి ఈ సందర్భంగా ప్రస్తావించడానికి అవకాశం ఉంటుంది. ఈ అయిదు రోజుల సమావేశంతో పాత పార్లమెంట్ భవనానికి స్వస్తి చెప్పడం జరుగుతుంది. కొత్త పార్లమెంట్ భవనానికి గత మేలోనే ప్రారంభోత్సవం జరిగింది కానీ, ఏ కారణంగానో అక్కడ సమావేశాలు నిర్వహించడం మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. వర్షాకాల సమావేశాలను కూడా పాత భవనంలోనే నిర్వహించడం జరిగింది. ఈ అయిదు రోజుల ప్రత్యేక సమావేశాలను కూడా పాత పార్లమెంట్ భవనంలోనే నిర్వహించడం జరుగుతోంది. ఈ కొత్త పార్లమెంట్ భవనాన్ని ఎందుకు ప్రారంభించలేదో ఇంత వరకూ కారణాలు తెలియరాలేదు. పాత భవనానికి 1927జనవరిలో వైస్ రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభోత్సవం చేశారు. సర్ హెర్బర్ట్ బేకర్, సర్ ఎడ్విన్ లుట్యెన్స్ లు డిజైన్ చేయడం జరిగింది. అప్పట్లో దీన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని వ్యవహరించేవాళ్లు.
దీన్ని లార్డ్ ఇర్విన్ వృత్తాకారంలో నిర్మింపజేశాడు. వృత్తాకారం అనేది శాశ్వతత్వానికి ప్రతీక అని ఆయన భావించారు. మరో నాలుగేళ్లలో వందేళ్లు పూర్తవుతాయనగా ఈ పార్లమెంట్ భవనానికి పదవీ కాలం ముగుస్తోంది. దేశ జనాభా బాగా పెరిగిపోయినందువల్ల పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరగవలసిన అవసరం ఉందని, అందువల్ల పార్లమెంట్ భవనం కూడా విశాలమైనదిగా ఉండాల్సిన అవసరం ఉందని
కేంద్ర ప్రభుత్వం భావించింది. ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది భవనాల మీద ఆధారపడి ఉండదు. ఇది పాలక, ప్రతిపక్షాల చర్చలకు వేదిక. పాలక బీజేపీకి లోక్ సభలో సంఖ్యాబలం ఉంది కానీ, రాజ్యసభలో అతి పెద్ద పార్టీగానే కొనసాగుతోంది. రాజ్యసభలో బీజేపీకి ఆశించినంత సంఖ్యా బలం లేదు. అయినప్పటికీ, విచిత్రంగా ఇది అనేక బిల్లులను గెలిపిస్తూ వస్తోంది. కొన్ని సానుభూతి పార్టీలు,
మిత్రపక్షాలు దీనికి ఆ అవకాశం ఇస్తున్నాయి.
అయినప్పటికీ పార్లమెంటరీ పరిశీలనకు పాలక పక్షం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. ఏ విషయంలోనూ ప్రతిపక్షాలను కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు. ఏ విషయంలోనైనా తాము నియమ నిబంధనలకు కట్టుబడి ఉంటున్నామని పాలక పక్షం పేర్కొంటోంది. ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కావడానికి 31 గంటల ముందు ప్రభుత్వం ఆదివారం నాడు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడానికి పాలక, ప్రతిపక్షాల మధ్య చర్చలు, సంప్రదింపులకు ఏమాత్రం అవకాశం ఉండడం లేదు. ఆర్టికల్ 370లో సవరణల కోసం 2019 ఆగస్టు 5న పార్లమెంట్ ను సమావేశపరిచారు. కానీ, దీనికి సంబంధించిన చర్చలు గానీ, సంప్రదింపులు గానీ జరగలేదు. పాలక, ప్రతిపక్షాలు అనేక విషయాల్లో ఒకే తీరుగా వ్యవహరిస్తున్నాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల
గురించి ఊహాగానాలు చెలరేగుతున్నాయంటే అందుకు పాలక పక్షమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News