తెలుగు బాలసాహిత్యంలో బేతాళ కథల్లాగే కరాళ కథలకూ విశిష్ట స్థానముంది. ప్రముఖ రచ యిత, సినీ దర్శకులు, నిర్మాత శ్రీ విజయబాపినీడు సంపా దకులుగా ‘బొమ్మరిల్లు’ పత్రిక స్థాపించారు. బొమ్మరిల్లు సహాయ సంపాదకులుగా ప్రముఖ రచయిత్రి జె. రామ లక్ష్మి ఉండేవారు. బొమ్మరిల్లులో ప్రథమంగా నవంబర్ 1976లో కరాళ కథలు ప్రారంభమయ్యాయి. తొలి కరాళ కథను బొమ్మరిల్లు సంపాదకుడైన ‘విజయ బాపినీడు’ రాశారని చెప్పవచ్చు.
కరాళ కథలు అనగానే వనకు విల్లు చేత పట్టుక్కూర్చున్న అందమైన యువకుడూ, ఎదురుగా కూర్చున్న సుందరీమణులు గుర్తుకు వస్తారు. ఒకప్పుడు కరాళుడనే మాంత్రికుడు అడవిలో క్రూరమృగాలన్నింటినీ అందమైన యువతులుగా మార్చివేసి, వీరులను ఆకర్షించి అరాచకం సృష్టించసాగాడు. సవిత్వుకుడనే మహర్షి కరాళుడి ఆట కట్టించడానికి అందమైన రాకుమారుడిగా మారి ఆ కన్యలను తన ఎదురుగా కూర్చోబెట్టుకుంటాడు.అప్పుడు కరాళుడు మొదటి యువతిలోకి ప్రవేశించి సవిత్వుకుడికి ఓ కథ చెప్పి కథ చివర ఓ సందేహాన్ని లేదా సమస్యను సావిత్వుకుడిముందు పెట్టి ప్రశ్నిస్తాడు. సహేతుకమైన సమాధానం చెప్పమంటాడు. ఓ సవిత్వుక మహారాజా! తెలిసికూడా నా ఈ సందేహానికి సమాధానం చెప్పలేదో ఈ క్షణం నుంచీ నీవు నాకు బానిసవు‘అంటాడు కరాళుడు. సవిత్వుకుడు అనేక కోణాల్లో ఆలోచించి సరైన సమా ధానం చెబుతాడు.అప్పుడు సవిత్వుకుడికి ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి జంతువుగా మారి అడవిలోకి పరుగుతీస్తుంది.తిరిగి కరాళుడు రెండవ యువతిలోకి ప్రవేశించి సవిత్వుకుడికి కథను చెబుతాడు. కథ ముగింపులో తన సందేహాన్ని సవిత్వుకుడి ముందు ఉంచి సమాధానం చెప్పమంటాడు. సవిత్వుకుడు సరైన సమాధానం చెప్పడంతో ఆయువతి కూడా జంతువుగా మారి అడవిలోకి పరిగెడుతుంది. అలా కరాళుడు కథ చెప్పి ప్రశ్నించడం, సవిత్వుకుడు సమాధానాలు చెప్పడం తో కథలు సాగుతాయి. అలా ఈ కథల్లో సందేహాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. పిల్లల ఆలోచనా శక్తిని పెంపొం దించేలా ఉంటాయి. పిల్లల్లో సృజనాత్మకతను, మంచీ, చెడు విచక్షణ జ్ఞానాన్ని,సరైన నిర్ణయాత్మక శక్తిని ఈ కథలు పెంపొందిస్తాయి.ఆ విధంగా రచయితలు కథలను సృష్టిం చి ప్రతినెలా బొమ్మరిల్లు పత్రిక ద్వారా పిల్లలకు అందించే వారు. ఈ కథలు పిల్లలనే కాదు పెద్దలను కూడా ఆకర్షిం చేవి. అలా జొన్నలగడ్డ రామలక్ష్మి, జొన్నలగడ్డ రాజ గోపాల్, డి.కె.చదువులబాబు మొదలగు రచయితలు కరాళ కథలను అనేకం రాశారు. ఈవారం కేంద్రసాహిత్య పురస్కార గ్రహీత, సీనియర్ బాలసాహితీవేత్త డి.కె.చదువు రబాబు రాసిన కరాళకథను పరిశీలిద్దాం…
జయచంద్రుడి నిర్ణయం
ధవళగిరి రాజ్యంలో చక్రధారి అనే వైద్యుడు ఉండే వాడు. వైద్యశాలలు లేని ఆ రాజ్యంలో ఆయనకు చుట్టు పక్కల మంచి పేరుంది. పేద ప్రజలకు ఆయన చేసే సేవ అమూల్యమైనది. అత్యాశ లేకుండా తన ఖర్చులకు సరిపడ్డ ధనం మాత్రమే ఆశించేవాడు. ఆయన ఆస్తి పది ఆవులు మాత్రమే. అవి ఆయనకు జీవనోపాధి. చక్రధారికి నరేం ద్రుడు, జయచంద్రుడు అనే కుమారులు ఉన్నారు. వారు బ్రహ్మర్షి అనే సర్వవిద్యా సంపన్నుడైన గురు వద్ద చిత్ర లేఖనము, సంగీతము, రాజవిద్యలు అభ్యసిస్తున్నారు.
ధవళగిరిని ధవళేంద్రుడు పరిపాలిస్తుండే వాడు. ఆయనకు స్వార్థమే తప్ప ప్రజలబాధ పట్టదు. రాజ్యంలో సరియైన ప్రజా సౌకర్యాలు లేవు. కానీ అధిక పన్నులు వసూలు చేసి ప్రజలను కష్టపెట్టేవాడు. ఓ రోజు రాజ భటులు పన్నుల వసూళ్లకు చక్రధారి దగ్గరకు వెళ్లారు. పది ఆవులకు గానూ సంవత్సరానికి రెండు ఆవులను పన్నుగా చెల్లించాలన్నారు. ఇంకా ఇంటి పన్ను, వృత్తి పన్ను అం టూ ఏవేవో లెక్కలు చెప్పారు. అంత ధనం తన వద్ద లేదని చక్రధారి అంటే, ఉన్న ఆవులను తోలుకొని పోతామన్నారు. ఆయన అడ్డుకున్నాడని దురుసుగా త్రోసేశారు. చక్రధారి తల స్తంభానికి గుద్దుకుని బలమైన దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మరణించాడు. భటులు పట్టించుకోకుండా వెళ్లిపోయారు. విషయం తెలిసి నరేంద్రుడు, జయచం ద్రుడు వచ్చి తండ్రి అంత్యక్రియలు పూర్తి చేశారు. తండ్రి మరణం కుమారులను కృంగదీసింది. నరేంద్రుడు ప్రజా ద్రోహియైన ధవళేంద్రుడిని హతమారుస్తాను అంటూ ఆవే శంగా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. అన్నయ్యను ఆపడానికి జయచంద్రుడు చేసిన ప్రయత్నం వృధా అయింది. జయ చంద్రుడు తిరిగి బ్రహ్మర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఆరు మాసాల పాటు ఉండి తన విద్యలకు తుది మెరుగులు దిద్దుకుని తనంతటివాడు లేడని గుర్తింపు పొందాడు.
రాజు ధవళేంద్రుడికి దివ్య ప్రియ అనే కుమార్తె ఉంది. ఆమె అద్భుత సౌందర్యరాశి. తల్లి లేని ఆమెను ధవళేం ద్రుడు ప్రాణంతో సమానంగా పెంచాడు. రాకుమారికి చిత్రలేఖనం, సంగీతం అంటే ప్రాణం. కూతురు అభీష్టం మేరకు రాజు ప్రతి సంవత్సరం చిత్రలేఖనం, సంగీతం తో పాటు విలువిద్య పోటీలు కూడా ఏర్పాటు చేసి గెలుపొం దిన వారికి బహుమతులు ఇచ్చేవాడు. ప్రతి సంవత్సరం లాగే ఈ యేడు కూడా పోటీలు ఏర్పాటు చేస్తూ రాజ్య మంతటా చాటింపు వేయించాడు. జయచంద్రుడు గురువు ఆశీస్సులు తీసుకుని పోటీలలో పాల్గొనటానికి రాజధానికి బయలుదేరాడు. ఓ రోజంతా ప్రయాణం చేసి అర్ధరాత్రి వేళకు నగరం పొలిమేరలోకి చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయాడు. బాటకు ఎడమవైపున కొద్ది దూర ములో ఓ ఆలయం కనిపిస్తే అందులో ఆ రాత్రికి తల దాచుకొని ఉదయం వెళ్ళవచ్చుననుకొని అటుగా నడి చాడు. పాడుపడిన ఆలయం ప్రాంగణంలో అడిగిడిన అతడికి లోపల నుంచి మాటలు వినిపించాయి. అదేమిటో వినాలనుకుని చటుక్కున గోడవారగా ఓ మూల నక్కాడు జయచంద్రుడు.ఆ మాటలను బట్టి వారిలో ఒకడు పొరుగు దేశం గూడచారి, రెండో వాడు తన అన్న నరేంద్రుడని అతడికి అర్థమయింది. ధవళగిరి పొరుగున విజయగిరి అనే దేశం ఉంది. ఆ దేశపు రాజుతో నరేంద్రుడు చేతులు కలిపాడు. అతని పథకం ప్రకారము ఓవీణను తయారు చేయించి గూఢచారి ద్వారా పంపాడు విజయగిరి రాజు. ఆ వీణలో బొటనవేలు పరిమాణంలో రెండు విషపు బాణాలు ఎవరికీ అనుమానం రాని విధంగా అమర్చబడి ఉన్నాయి. సంగీతం పోటీలలో నరేంద్రుడు పాల్గొంటాడు. వీణ వాయిస్తూ గురి చూసి మీట నొక్కగానే బాణాలు కంటికి అందని వేగంతో ధవళేంద్రుడి శరీరంలోకి దూసు కెళ్తాయి. రాజు మరణించి సైనికులు, అధికారులు అయో మయంగా, అజాగ్రత్తగా ఉన్న ఆ సమయంలో విజయగిరి సైన్యం మెరుపు దాడి చేసి ధవళగిరి రాజ్యాన్ని ఆక్రమి స్తుంది. విజయగిరి రాజు ప్రతినిధిగా ధవళగిరికి నరేం ద్రుడు రాజవుతాడు. వారి మాటల ద్వారా ఈ పథకం జయచంద్రుడికి పూర్తిగా అర్థమైంది. అతడు మెల్లిగా అక్కడి నుండి తప్పుకొని ఆగకుండా వెంటనే నగరంలోకి వెళ్ళాడు. రాజును కలుసుకుని తాను విన్నది చెప్పి హెచ్చరించాడు. రాజు వెంటనే నగరం చుట్టూ గట్టి కాపల ఏర్పాటు చేయిం చాడు. సైన్యాన్ని అప్రమత్తం చేశాడు. మర్నాడు రాజధాని నగరం అలంకరణలతో మెరిసిపోయింది. ప్రత్యేకంగా నిర్మించిన భవన ప్రాంగణంలో ఘనంగా పోటీలు ప్రారం భమయ్యాయి. ధవళేంద్రుడు, యువరాణి దివ్య ప్రియ సింహాసనాలపై పక్కపక్కనే ఆశీనులయ్యారు. ముందుగా విలువిద్య పోటీలు ఏర్పాటయ్యాయి. ఆ పోటీలలో జయ చంద్రుడు విజేత అయ్యాడు. తర్వాత చిత్రలేఖనం పోటీలు జరిగాయి. ఆ పోటీలలో జయచంద్రుడే ప్రథమ విజేత అయ్యాడు. జయ చంద్రుడు వేసిన బొమ్మను చూసి దివ్య ప్రియ పరవశించింది. అతడు ఠీవీ, విలువిద్య కౌశలం చిత్తలేఖన ప్రావీణ్యం రాకుమారిని ఆకర్షించాయి. సం గీతం పోటీలలో కూడా జయ చంద్రుడు పాల్గొంటున్నాడని తెలిసి దివ్య ప్రియ అబ్బురపడింది. ఒకే వ్యక్తి వివిధ రకాల పోటీలలో పాల్గొనడం అదే ప్రథమం. అందువల్ల ఆమె దృష్టిలోనే కాక,ధవళేంద్రుడి దృష్టిలో కూడా జయచం ద్రుడు ప్రత్యేక గుర్తింపు పొందాడు. అప్పటికే ఆయనకు జయచంద్రుడు పొరుగురాజు పథకాన్ని గురించి చెప్పి ఉన్నాడు. సంగీతం పోటీలకు నరేంద్రుడు వచ్చిఉన్నాడు. అతడు తమ్ముని కౌగిలించుకొని అభినందిస్తూ ‘సంగీతంలో నీతో పోటీ పడాలని ఉంది అన్నాడు.
జయ చంద్రుడు అన్న మాటలకు నవ్వాడు. అతని కోరికపై నరేంద్రుడికి, జయ చంద్రుడికి పోటీ ఏర్పాటు చేశారు. ధవళేంద్రుడు దివ్య ప్రియ పక్కపక్కనే ఆశీనులై ఉన్నారు. కొద్ది దూరములో ఉన్న వేదికపైకి అన్నదమ్ములు చేరుకున్నారు. అప్పుడు జయచంద్రుడు సైగచేశాడు. వెం టనే రాజభటులు నరేంద్రుడిని చుట్టుముట్టి బంధించారు. జయచంద్రుడు, నరేంద్రుడి వీణను చేతిలోకి తీసుకుని అందులోని విషపు బాణాలను తీసివేశాడు. తర్వాత జరి గిన సంగీతం పోటీలలో జయచంద్రుడు విజేత అయ్యాడు. అతని ప్రతిభకు అందరూ మంత్ర ముగ్దులయ్యారు. ‘నీవు సర్వవిద్యా ప్రవీణుడివి. నాకు ప్రాణ దాతవు. నీకు ఏం కావాలో కోరుకో!’ అన్నాడు ధవళేంద్రుడు.
జయచంద్రుడు దివ్య ప్రియను వివాహమాడాలను కుంటున్నాను అన్నాడు. దివ్యప్రియ అంగీకరించడంతో ధవళేంద్రుడు వారి వివాహం వైభవంగా జరిపించాడు. జయచంద్రుడిని రాజుగా ప్రకటించి రాజ్యాభిషేకం చేశా డు. రాజైన మరుక్షణం జయచంద్రుడు కారాగారంలో ఉన్న నరేంద్రుడిని విముక్తి గావించి తన అంతరంగిక సలహాదారునిగా నియమించుకున్నాడు.
కరాళు డింతవరకే కథను చెప్పి ఓ సవిత్వుక మహా రాజా! జయచంద్రుడి ప్రవర్తన నాకు అగమ్య గోచరంగా ఉంది. ధవళేంద్రుడిని చంపి రాజు కావాలనుకున్న నరేం ద్రుడి పథకాన్ని విఫలం చేసి కారాగారంలో వేయించాడు. ధవళేంద్రుడి ప్రాణాలు కాపాడి రాకుమారిన కోరి రాజ్యా నికి రాజయ్యాడు. రాజైన మరుక్షణం రాజుపై హత్యా ప్రయత్నం చేసిన రాజ ద్రోహి అయిన నరేంద్రుడిని విడు దల చేసి ఉన్నత పదవిని కట్టబెట్టాడు. రాజును చంపి సిం హాసనం ఎక్కాలి అనుకున్న రాజ ద్రోహిని నమ్మి ఉన్నత పదవి ఎందుకిచ్చాడు? సోదరుడననే స్వార్థంతో అలా చేశాడా? జయచంద్రుడు చేసిన పని మూర్ఖంగా ఉంది కదా! ఈ ప్రవర్తన వెనుక మరేదైనా కారణ ముందా? నా సందేహానికి సమాధానం చెప్పకపోయావో ఈ క్షణం నుంచి నీవు నాకు బానిసవు అన్నాడు.
దీనికి సావిత్వుకుడిలా బదులిచ్చాడు ‘ధవళేంద్రుడు సమర్ధుడైన రాజు కాడు. వారి తండ్రి మరణం, పేదల కష్టాలు ధవళేంద్రుడు ఎలాంటివాడో చెప్పకనే చెబుతాయి. ధవళేంద్రుడిని ఆ కారణంతోనే నరేంద్రుడు హతమార్చడా నికి పూనుకున్నాడు. అసమర్థుడైన రాజును అంతమొం దించి రాజు కావడానికి నరేంద్రుడు పథకం వేశాడు. నరేం ద్రుడి మంచితనం ఎలాంటిదో చిన్నప్పటినుంచి జయచం ద్రుడికి తెలుసు. నరేంద్రుడి పథకాన్ని విఫలం చేయడం ద్వారా వాడు హంతకుడు కాకుండా జయచంద్రుడు కాపా డాడు. నరేంద్రుడిని తాత్కాలికంగా కారాగారంలో వేయిం చి ధవళేంద్రుడిని తృప్తి పరిచాడు. ఎలాంటి కష్టనష్టాలు లేకుండా ఆ రాజ్యానికి రాజయ్యాడు.తర్వాత నరేంద్రుడిని అంతరంగిక సలహాదారునిగా నియమించుకున్నాడు. బ్రహ్మర్షి లాంటి మహానుభావుడి వద్ద శిష్యరికం చేసిన సర్వ విద్యా ప్రవీణుడిని, ప్రజాక్షేమాన్ని కోరేవాడిని రాజ్యా నికి మంచిరాజు ఉండాలని కోరుకునేవాడిని తన అంత రంగిక సలహాదారులుగా నియమించుకోవడంలో జయ చంద్రుడు సరైన నిర్ణయం తీసుకున్నాడు. మంచి పరిపా లన అందించాలనే ఆశయం గల నరేంద్రుడు ఆ పదవికి అన్ని విధాల అర్హుడు ఇందులో జయ చంద్రుడి స్వార్థం లేదు అని వివరించాడు.
అది సరియైన సమాధానం కావడంతో సవిత్వకుడికి ఎదురుగా ఉన్న కన్యపై కరాళుడి ప్రభావం నశించి ఆ యువతి పెద్దపులిగా మారి అడవిలోకి పరుగు తీసింది.
(వచ్చేవారం బాలసాహిత్యంలో బేతాళ కథల గురించి తెలుసుకుందాం)
- పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
92475 64699.