Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: బాల సారస్వతం..పిల్లల విజ్ఞానం

Telugu literature: బాల సారస్వతం..పిల్లల విజ్ఞానం

పుస్తకాలు… మనందరి నేస్తాలు. పుస్తకం మస్తిస్కాన్ని పదును పెట్టే ఆయుధం. పుస్తకం మన తోడుంటే పదిమంది స్నేహితులు మన వెంట ఉన్నట్టే. అందుకే కందుకూరి వీరేశలింగం పంతులు పుస్తక ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతూ “చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో”” అన్నారు. పుస్తకం హస్త భూషణం అంటారు. పుస్తకం చేతిలో ఉంటే విజ్ఞానం తోడున్నట్లే. ఇట్లా చెప్పుకుంటూ పోతే పుస్తకం యొక్క ప్రాధాన్యత ఎంతటిదో తెల్వంది కాదు. పుస్తకం అమ్మ వంటిది. చదివితే కమ్మగుంటది . ప్రతి పదం, ప్రతి వాక్యం భవితకు బాటవుతుంది.ఇంతటి నేపథ్యం కలిగిన పుస్తకం యొక్క ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వందల కొద్ది కొత్త పుస్తకాలు మార్కెట్లోకి వస్తూనే ఉన్నాయి. ఈ పరంపర సాహిత్యం రంగంలో జోర్దార్ గా కనిపిస్తుంది. కవులు, రచయితలు, సాహిత్య సంస్థలు పుస్తకాలను వెలువరిస్తూనే ఉన్నారు. ఆధునిక యుగములో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగి కంప్యూటర్లు, సెల్ ఫోన్లు వాడుకలోకి వచ్చినంక పిల్లలు పుస్తక పఠనానికి దూరమయ్యారని అపోహ కొంతవరకు ఉంది. అందుచేత వారిలో భాషాభిమానాన్ని సృజనాత్మక రచనాభిరుచిని, నైతిక విలువలను పెంపొందింపజేసి వారిని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దడం ఈనాటి తక్షణ కర్తవ్యం. ఈ దిశలోనే అటు కవులు రచయితలు, ఇటు సాహిత్య సంస్థలు పుస్తకాల రూపకల్పనకు ఇతోధికంగా కృషి చేస్తూనే ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే తెలంగాణ సరస్వత పరిషత్తు బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అనేక గ్రంథాలను అందుబాటులోకి తెస్తున్నది. సారస్వత పరిషత్తు స్థాపితమైనప్పటినుండి నేటి వరకు ఈ రకమైన కృషిని అవిరళంగా కొనసాగిస్తున్నది . సమాజ వికాసానికి సహాయపడే సాహిత్యాన్ని అందిస్తున్నది. ఇటీవల కాలంలో సార్వసత పరిషత్తు శాంతా బయోటెక్ సంస్థ అధినేత వరప్రసాదరెడ్డి సౌజన్యంతో పిల్లల కోసం అనేక పుస్తకాలను వెలువరించింది. బాల సాహిత్యానికి సంబంధించి కవులు, రచయితలతో విస్తృతంగా చర్చలు నిర్వహించడంతోపాటు బాలల మూర్తిమత్వ వికాసానికి దోహదం చేసే అద్భుతమైన గ్రంథాలను అందించింది. మే 28,29 రెండు రోజులపాటు బాల సాహిత్య సమ్మేళనం నిర్వహించిన సదస్సులో ఆవిష్కరించిన గ్రంథాలే “బాలసారస్వతం పిల్లల కథలు” . ఇందులో ఐదు విభాగాలుగా పుస్తకాలు ఉన్నాయి. వీటితోపాటు భాషా సాహిత్య వైభవం, ఆరోగ్యం విజ్ఞానం వంటి ప్రాథమిక సమాచారాన్ని తెలియజేసే ఎంతో ఉపయుక్తమైన గ్రంథాలను కూడా వెలువరించింది. అంతేగాకుండా పదుల సంఖ్యలో వివిధ రచయితల పుస్తకాలు కూడా ఇదే వేదిక మీద నుండి ఆవిష్కరించబడినవి.
“బాలసారస్వతం- పిల్లల కథలు ” 1,2,3,4,5 విభాగాలలో మొదటగా పిల్లల కథలు -4 అనేది పిల్లల కోసం పిల్లలే రాసిన 31 కథలు ఉన్నాయి. ప్రతి కథ కూడా పెద్దలు రాసిన తీరుకు ఏవిధంగా తీసిపోవు. చక్కటి వస్తువు తీసుకొని అలతి అలతి పదాలతో పిల్లలు తాము మాట్లాడుకునే భాషలో చక్కగా రాశారు. ఏ కథ కూడా ఒకటి రెండు పేజీలకు మించి ఉండదు. ఇందులో “ముల్లును ముల్లుతోనే” అనే కథను నాగుపల్లి కి చెందిన పదవ తరగతి విద్యార్థి ఎ .సాయి ఎంతో చక్కగా రాశాడు. మిర్యాలగూడ కు సంబంధించిన పి. సబితా “ఎవరు గొప్ప” అనే కథను, “ఆల్ ది బెస్ట్” కథను కే.నవ్య శ్రీ రాయడం జరిగింది. అదేవిధంగా “మారిన దొంగ” కథను జిల్లెల్ల కు చెందిన నేహా, నిజామాబాద్ కు సంబంధించి వి.గాయత్రి “మానవత్వం” కథను ఎంతో అద్భుతంగా రాశారు. ఇట్లా 31 కథలను చక్కటి శీర్షికలతో పెద్దలను సైతం ఆకట్టుకునే విధంగా రాయడం జరిగింది. ఈ కథలన్నీ పుస్తక రూపంలో రావడం పట్ల ఆయా విద్యార్థులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు . ముందు ముందు కూడా తమ కలాలకు పదును పెట్టి మరిన్ని కథలు రాసే విధంగా ఈ పుస్తకం దోద పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పుస్తకమును తమ కళ్ళతో చూసుకున్నాక ఆయా విద్యార్థులు మస్తు ఖుషి పడతారు. జీవితంలో ఎప్పుడూ మర్చిపోనూ లేరు. ఇట్లా ఎంతో మంది రాసిన పిల్లల కథలను సేకరింపజేసి ఒక గ్రంథం రూపంలో రావడానికి సారస్వత పరిషత్తు చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిది. ప్రధాన సంపాదకులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, సంపాదకులు డాక్టర్ జె,చెన్నయ్య సంపదక సహకారం అందించిన డాక్టర్ పత్తిపాక మోహన్, గరిపెల్లి అశోక్ కొనసాగించిన నిర్విరామ శ్రమ నిజంగా బాల సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడేది. దాన్ని ఎవరు కాదనలేరు.

- Advertisement -
  అట్లాగే బాలసారస్వతం 1,2,3,5 పిల్లల కథల పుస్తకాలలో  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న  ప్రముఖ బాల సాహితీవేత్తలు, కొంతమంది ఉపాధ్యాయులు రాసిన అద్భుతమైన కథలు  చోటు చేసుకున్నవి. వీటిలో 97 కథలు. ఉన్నవి.  పిల్లల కథలు ఒకటో విభాగంలో వసుంధర రాసిన "అమ్మ దీవెన", "తాతయ్య నేర్పిన పాఠము" కె.వి లక్ష్మణ్ రావు, బివి పట్నాయక్ "గురుబ్రహ్మ", "పుట్టినరోజు జేజేలు" చెన్నూరు సుదర్శన్, "చదువే రా అన్నిటికి మూలం" కూచించి నాగేంద్ర, "ఆశించని ప్రతిఫలము" కల్లేపల్లి ఏడుకొండలు, "ఎగిరే పిట్ట" ఎన్నవెళ్లి రాజమౌళి, "ప్రయత్నిస్తేనే ఫలితం" కే వి సుమలత, "నచ్చిన పని" కన్నెగంటి అనసూయ, "బొమ్మ బాబోయ్"  పుల్లా రామాంజనేయులు, "నాలుగు గుండి గలు" షేక్ అబ్దుల్ హకీమ్  జానీ, "జమీందారు కోపం" పైడిమర్రి రామకృష్ణ , "ఆభరణం "డీకే చదువుల బాబు, "పున్నమి" కాశీ విశ్వనాథం పట్రాయుడు, "జేజమ్మ హారం" వురిమల్ల సునంద, "బహుమానం" ముక్కామల జానకిరామ్ ఇట్లా 24 మంది రచయితల   కథలు ఇందులో చోటు చేసుకున్నవి. ప్రతి కథ గురించి ఒక సమీక్ష రాయవచ్చు. కథలోకి లోతుగా వెళ్లలేదు. ఎందుకంటే ప్రతి కథ గురించి లోతుగా వెళ్లాలంటే సమీక్ష సరిపోదు. ప్రతి కథను పాఠకుడు స్వయంగా  చదివితే తప్ప  తృప్తి పొందలేరు. అట్లాగే పిల్లల కథలు -2 విభాగంలో "విత్తు చెట్టు" శేషారత్నం,"లైక్ -కామెంట్ -షేర్" డాక్టర్ హారిక చెరుకుపల్లి, "ది రోబో" డాక్టర్ ఎం సుగుణ రావు, "నన్ను క్షమించు నాన్న"  రామకృష్ణారావు, "ప్రేరణ" ఎన్ విజయలక్ష్మి, "మంచి పనులు" మునిశేఖరరెడ్డి, "సంస్కారం " ఎలమర్తి అనురాధ, "ఉత్తమ శిష్యుడు" దార్ల బుజ్జిబాబు, "బుడత " ఉండ్రాల రాజేశం , "కలిసి ఉంటే కలదు సుఖం " తిరుమల కాంతి కృష్ణ, "నిజాయితీ" దుర్గం బైతి ఇట్లా 24 కథలు ఇందులో చోటు చేసుకున్నవి. ప్రతి కథ పిల్లలతో పాటు పెద్దలు కూడా చదవ దగ్గవే. కాకుంటే కొన్ని కథల నిడివి పెద్దగా ఉన్నవి. పిల్లల స్థాయికి మించినవి కూడా ఉన్నవి. ఆయా ప్రాంతాల యాసకు అనుగుణంగా ఉన్నవి. కొన్ని ప్రాంతాల పిల్లలకు అర్థం కాకపోవచ్చు. 

  సారస్వత పరిషత్తు వెలువరించిన బాల సరస్వతం మూడు విభాగంలో "గురి" మొలకలపల్లి కోటేశ్వరరావు, "తరిమే కుక్క తస్మాత్ జాగ్రత్త" మాచిరాజు కామేశ్వరరావు, "తొర్రి" జానీ తక్కెడశిల , "గాంధీ చెట్టు" పుప్పాల కృష్ణమూర్తి, "నేర్చుకుంటే లాభం" కంచనపల్లి వెంకట కృష్ణారావు, "పాలు తాగిన గణపతి" డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు, "బొమ్మలు "డాక్టర్ టీ సంపత్ కుమార్, "ఎందుకంటే " ఆకళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, "మొక్కల గోపయ్య" సంగనభట్ల చిన్న రామకిష్టయ్య, "జై జవాన్ జై కిసాన్" బెహరా ఉమామహేశ్వరరావు, "చెట్టు మాట్లాడింది" డాక్టర్ వి ఆర్ శర్మ, "స్ఫూర్తి "యు. విజయ శేఖర్ రెడ్డి, "బుద్ధి తెచ్చుకున్న భూమయ్య" గుడి పూడి రాధిక రాణి, ఇట్లా 24  కథలు దీనిలో చోటు చేసుకున్నాయి. ఇందులోని ప్రతి కథ కూడా  పిల్లలు ఆకర్షించేవిగా ఉన్నాయి . అయితే కొన్ని కథలు మాత్రం  గతంలో పత్రికల్లో వచ్చినవే అవడం కొంత నిరాశపరిచేవే. 
   అలాగే బాలసారస్వతం పిల్లల కథలు- 5    విభాగం గ్రంథంలో  25 కథలు చోటు చేసుకున్నవి. డాక్టర్ సిరి రాసిన "ప్రవర్తన", చొక్కాపు వెంకటరమణ రాసిన "చిట్టి గురువులు", సమ్మెట ఉమాదేవి "మనోరథం",  భూపాల్  గారి "ప్రిన్సిపల్ సార్", డాక్టర్ పత్తిపాక మోహన్ గారి "ప్రజ్ఞ", నారం శెట్టి ఉమామహేశ్వరరావు రాసిన "మనోబలం",  దాసరి వెంకటరమణ రాసిన "కొత్త స్నేహితుడు", "అమ్మ మాట" బూర్లే నాగేశ్వరరావు, ముంజలూరి కృష్ణకుమారి  "సాయం" కథ, కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి  రాసిన "ఆలోచన", మొర్రి గోపి  "గంగిరెద్దు మేళం", వైరాగ్యం ప్రభాకర్ "మారిన సోమరాజు", చంద్ర ప్రతాప్ కంతేటి "మాస్టారు అంటే...", డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు "అత్తా కోడళ్ళు", బెలగాం భీమేశ్వరరావు "రక్షణ కోటలు", "బేరం" ఆర్ సి కృష్ణస్వామి రాజు, శీలం భద్రయ్య "పెద్దపులి", జే శ్యామల "మా మంచి పిల్లి", రెబ్బ మల్లికార్జున్ "బుద్ధి చెప్పిన చెట్టు",  దివాకర్ల "హామీ" కథలు.... ఇట్లా 24 కథలు ఇందులో ఉన్నవి. ఈ పుస్తకంలో ఉన్న కథలన్నిటిని పరిశీలిస్తే కొన్ని పిల్లల స్థాయికి మించి  పది పేజీలు దాటినవి. పిల్లలు చదవడానికి అనుగుణంగా లేవు అనేది నా అభిప్రాయం. కథ ఎంత నిడివి తక్కువగా ఉంటే అంత మంచిది. కథలు చదువుతున్నంత సేపు  ఇంకా ఇంకా చదవాలి అనిపించాలి. చదివినంక  పిల్లల మెదళ్ల లో నిలబడాలి. కొంతమంది కొత్తగా రాసిన వారు కూడా ఇందులో ఉన్నారు. ప్రతి కథలో ఏదో ఒక నీతిని  రప్పించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ పిల్లల కథలు కాబట్టి  ప్రతి రచయిత పిల్లల స్థాయికి ఎదిగి రాయాలి. చాలావరకు అలా రాసినవే ఉన్నవి . కాకుంటే కొన్ని కథలు లేవు. పిల్లలు ఇష్ట ఇష్టాలు ఎలా ఉంటాయో తెలుసుకుని కథ ఎలా రాస్తే పిల్లకు శ్రద్ధ ఉంటుందో  ఆలోచించి రాస్తే అటువంటి కథలు మాత్రమే నాలుగు రోజులపాటు నిలబడతాయి. ఏదో నా పేరు రావాలి. నా కథకు అందులో చోటు కల్పించబడాలి  అనే ఉద్దేశంతో రాస్తే ఆ కథలు పిల్లలకు చేరువ కావు. ఏది ఏమైనప్పటికీ   పిల్లల కథలు- బాలసాల స్వతం  ఐదు విభాగాలను గనుక పరిశీలిస్తే  కొంతమంది పేరుగాంచిన రచయితలు కూడా  తమ కథలలో  ఉపయోగించిన భాష కానీ, శైలి కానీ పిల్లలు ఆకర్షించే విధంగా లేవు. ఎనబయ్  శాతం కథలు పర్వాలేదు అనిపించే విధంగా ఈ పుస్తకాలలో ఉన్నవి. అయితే ప్రతి కథకు   సంబంధిత  బొమ్మలు ఉంటే  పిల్లలను మరింతగా ఆకర్షించేవి.
  మొత్తం మీద  తెలంగాణ సారస్వత పరిషత్తు రూపొందించిన ఈ  ఐదు పిల్లల కథల పుస్తకాలు బాలలకు వరాలని చెప్పవచ్చు. ఇవి ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకాలు.  ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ బాలసాహితీవేత్తలతో పాటు చేయి తిరిగిన ఉపాధ్యాయుల కథలు ఇందులో రంగరించి రాశిగా  పోయబడినవి. ప్రతి పుస్తకానికి అందమైన ముఖచిత్రం వేయబడింది. దుండ్రపల్లి బాబు అందించిన ముఖచిత్రాలు  పిల్లలే కాకుండా పెద్దలను సైతం ఆకర్షించే విధంగా ఉన్నవి. ప్రతి పుస్తకం 90 పేజీలకు మించకుండా పిల్లలు సులువుగా ఉపయోగించే తీరులో ఉన్నవి. ప్రతి పుస్తకం ధర 80 రూపాయల గా నిర్ణయించారు. బాల సాహిత్య సమ్మేళనానికి  విచ్చేసిన ప్రతి ఒక్కరికి  సారస్వత పరిషత్తు వారు ఈ పుస్తకాలను ఉచితంగా అందజేయడం ముదావాహము. బాల సారస్వతం  పిల్లల కథల పుస్తకాల రూపకల్పనకు  కృషిచేసిన  తెలంగాణ సారస్వత పరిషత్ కు, గరిపెల్లి అశోక్, డాక్టర్ పత్తిపాక మోహన్, మరియు గౌరవ సలహా మండలి సభ్యులు  చొక్కాపు వెంకటరమణ, పోతుల నారాయణ, యాదా నారాయణ, డాక్టర్ భూపాల్, డాక్టర్ దాసరి వెంకటరమణ, డాక్టర్ వి ఆర్ శర్మ, సుధామ , వేదాంత సూరి, డాక్టర్ సిరి, డాక్టర్ అమరవాది నీరజ, పైడిమర్రి గిరిజ, పైడిమర్రి రామకృష్ణ చక్కటి డిజైనింగ్ చేసిన టి నవీన్, పరిషత్ సిబ్బంది ముఖ్యంగా గోపాల్ రెడ్డి గారికి  ప్రత్యేక కృతజ్ఞతలు. తమ తమ రచనలు అందించిన బాల సాహితీవేత్తలకు,తెలుగు ఉపాధ్యాయులకు  హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకాలు బాలల లోకంలో  సంచరించాలని కోరుకుందాం.

    -కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి
    9441561655
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News