తెలంగాణా మాండలికం మీద, నేను రాసిన ‘వేరే భాష కాదు, మాండలికమే’ అనే వ్యాసాన్ని విమర్శిస్తూ, ‘మాండలికం కాదు, స్వతంత్ర సత్తా కలిగిన భాష’ అనే పేరుతో (అక్టోబర్ 31న) వచ్చిన వ్యాసం చూశాను (వ్యాసకర్త: సుంకిరెడ్డి నారాయణరెడ్డి). వ్యాసకర్త చేసిన వాదనలకు నా జవాబులు ఇవీ:
(1) తెలుగు భాషని నాలుగు మాండలికాలుగా భద్రిరాజు కృష్ణ మూర్తి విభజించడం ఒక “అకడమిక్ వర్గీకరణ మాత్రమే” అని వ్యాసకర్త తీర్పు! కానీ, ఆ ఎకడెమిక్ కార్యం, అపారమైన సమాచారం సేకరించి, ‘భాషాశాస్త్రం’లోనే భాగమైన ‘మాండలికాల అధ్యయనం’ (డైలెక్టాలజీ), ‘సామాజిక భాషాశాస్త్రం’ (సోషియో-లింగ్విస్టిక్స్) అనే రెండు శాఖల మీద ఆధారపడి చేసిన వర్గీకరణ.
(2) ‘ప్రామాణిక భాష’ ఎలా పుడుతుందో చెప్పడానికి, ‘యిద్దిష్’ భాష మాట్లాడే ఒక టీచరు 80 ఏండ్లనాడిచ్చిన ఒక చమత్కార నిర్వ చనాన్ని, భాషాశాస్త్రంలోని సూత్రంగా చెప్పారు వ్యాసకర్త. ‘సైన్యమూ, నావికా దళమూ ఉన్న మాండలికమే భాష’ అని ఆ టీచరు అన్నాడు. ‘యిద్దిష్’ భాషని జర్మన్ తదితర యూరోపియన్ భాషల మిశ్రమంగా భావించిన, భాషా శాస్త్రం తెలియని సామాన్యులు కొందరు హేళన చేసిన సందర్భంగా అతను అలా అన్నాడు. అంటే, సామాజిక పరిస్తితుల కారణంగానే ఒక భాష పట్ల జనాల వైఖరి ఏర్పడుతుందని అర్ధం. కానీ, ఇద్దిష్ టీచరు 1940లలో ఇచ్చిన నిర్వచనం కంటే ముందే, 1925లో, ‘ఆటో యెస్పర్సన్’ అనే భాషాశాస్త్రవేత్త, ప్రామాణిక భాష తలెత్తడానికి గల సామాజిక కారణాలను వివరించే శాస్త్రీయ నిర్వచనం ఇచ్చాడు. అవన్నీ తిరిగి ఇక్కడ చెప్పడం కాకుండా, భద్రిరాజు కృష్ణమూర్తి గారిచ్చిన నిర్వచనం చూద్దాం. “ప్రామాణికత అనేది ఒక రకమైన సామాజిక తీర్పు. భాషాప్రయోగాలకు (లింగ్విస్టిక్ యూసేజ్) ఒక సంక్లిష్టమైన సామాజిక విలువల్ని ఆపాదిస్తారు.- ఆ భాషాప్రయోగం స్వతహాగానే విలువగలిగి నదనీ, ఆ విలువేదో భాషాశాస్త్రపరంగానే అంతర్గతంగా ఉన్నదనే అర్ధం వచ్చేలా!” అంటే, మాండలికాలకుండే విలువ సామాజికమైనదేగానీ, వాటికి సహజంగా, అంతర్గతంగా ఉండేది కాదు.
(3) ‘మాది ప్రామాణికం, మీది మాండలికం’ అని నేను అంటాననీ (ఎక్కడంటినో!), అది ఆధిపత్య అహంకారం అనీ, ఆధిపత్య స్వభావం నా నరనరానా జీర్ణించుకపోయింది’ అనీ నిరాధారమైన వ్యాసకర్త ఆరోపణ. ప్రతాపరెడ్డి వ్యాసానికి నేను రాసిన స్పందనలో ఏమంటిని? ‘తమది గొప్ప భాష అనీ, తెలంగాణ భాష అల్పమైందనీ’ ఆంధ్ర ప్రాంతంవారు భావిస్తారని ప్రతాపరెడ్డి అన్నప్పుడు, అలా భావించడం ‘అగ్న్యానపు అహంకారం’ అని గదా నేను అన్నది? అదే వ్యాసంలో, నేను అన్న ఇతర మాటలు కూడా వ్యాసకర్త కండ్లకి కనపడలే? “ఎవరి భాష గురించి వాళ్ళూ, ఎవరి మాండలికాల గురించి వాళ్ళూ, ఆత్మ స్తుతి చేసుకుంటే, అంతకు మించి సంకుచిత్వం ఉండదు” అన్న నాలో “ఆధిపత్య స్వభావం నరనరానా జీర్ణించుకుపోవడం” ఎలా సాధ్యమో పాఠకులే చెప్పాలి. ఇది నా వ్యక్తిత్వం మీద నిరాధారమైన దాడి.
(4) “రాజకీయంగా యుద్ధం చేసి గెలిచినం” అని వ్యాసకర్త ప్రగల్బాలు! యాడ గెలిచినం? ‘ఈచ పోయి, ఈచం కాటొచ్చినట్టు’, “కొండముచ్చు పోయి, కోతి వచ్చినట్టు”, ఆంధ్రా దొరలు పోయి, తెలంగాణా దొరలు నెత్తినెక్కిన్రు! గీ గెలుసుడు కూడా ఒక గెలుసుడేనా? సామాజిక తెలంగాన, ప్రజాస్వామిక తెలంగాన అన్న రాజకీయ నినాదాలు సోయి లేకుంట, గాయబైనయ్!
(5) “మా భాషను మాండలికం అనడాన్ని మేం అంగీకరించం” అని వ్యాసకర్త భీషణ ప్రతిగ్న్య! మాండలికాన్ని పట్టుకుని, భాష అనుడు ఎట్లున్నదంటే, ‘కండ్లకు గంతలు గట్టుకొని, పగటిల సీకటి అన్నట్టు’న్నది! “కండ్ల ముందు కాకి ఎత్తకపోతాంటే, లేదులేదు గద్ద ఎత్తకపోయింది” అన్నడట మునపటికొకాయన!
(6) ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు, ఒకరు చెప్పేది ఇంకోరికి ఎంత ఎక్కువగా అర్ధం అవుతుందో (“డిగ్రీ ఆఫ్ మ్యూచువల్ ఇంటెలిజిబి లిటీ”), దాన్నిబట్టి, వాళ్ళు మాట్లాడేది ఒకే భాషలోని మాండలికాలా, వేరువేరు భాషలా అనేది తెలుస్తుంది -అనే భాషాశాస్త్రంలోని సూత్రం పట్టణ విద్యావంతులకు మాత్రమే వర్తిస్తదనీ, గ్రామీణ ప్రజలకు వర్తించదనీ వ్యాసకర్త వాదన. మరి ఆంధ్రా పట్టణ విద్యావంతులు తెలంగాణా మాండలికంలో రాసినవాటిని ఇష్టపడరని షికాయత్ ఎందుకు?
(7) ఒకరు మాట్లాడేది ఇంకోరు అర్ధం చేసుకుంటే, వారిద్దరిదీ ఒకే భాష- అనే సూత్రం, పట్టణ విద్యావంతులకే వర్తిస్తుందని ఒకచోట అన్న వ్యాసకర్త, మరుక్షణమే, అసలు ఆ సూత్రాన్ని భాషా శాస్త్రమే తిరస్కరించిందనడం వింతగా వుంది! పైగా, ఉదాహరణగా డేనిష్, నార్వేజియన్ భాషల్ని తీసుకురావడం! ‘రాజకీయ, సాంస్కృతిక కారణాల వల్ల “పరస్పర అర్థావగతి” ఉన్నవాటిని (భాషలను) కూడా వేర్వేరు భాషలుగా పరిగణించడం జరుగుతుంది’ అని పి.ఎస్. సుబ్రమణ్యం చెప్పారట. కానీ, సుబ్రహ్మణ్యంగారు చెప్పనిదొకటి ఉంది. ‘డైలెక్ట్ కంటిన్యూయం’. అంటే, ఒకే భాష, ఒక ప్రాంతం నించీ, వరసగా ఇంకో ప్రాంతానికీ, అక్కణ్ణించీ ఇంకో ప్రాంతానికీ పోయినకొద్దీ, ఆ భాష వాడకంలో మార్పులు కనిపిస్తాయి. కానీ అవి వ్యాకరణం వంటి మౌలిక మార్పులు కాదు. పైగా, డేనిష్ వాళ్ళూ, నార్వేజియన్లూ ఒకప్పుడు ఒకే పాలన కింద అనేక వందల సంవత్సరాలున్నారు. అందువల్ల రాజకీయ వైరుధ్యాల వల్ల, తర్వాత అలా అనుకోవడం మొదలెట్టారు. కానీ, అది భాషాశాస్త్రం ప్రకారం నిలిచే వాదన కాదని సుబ్రహ్మణ్యంగారు చెప్పలేకపోయారు.
(8) ‘తెలంగాణ భాష’ అనడం “రాజకీయ, సాంస్కృతిక ఆత్మగౌరవ సమస్య” అనీ, భాషాశాస్త్రం తమకే మద్దతు ఇస్తున్నదనీ, వ్యాసకర్త వాదన. మద్దతు ఇస్తున్నది భాషాశాస్త్రం కాదు. బూర్జువా రాజకీయ శాస్త్రం. అయినా, తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిగా వున్నా, ఆ రెండు రాష్ట్రాలలోనూ ఉన్నది లాభాలూ, వడ్డీలూ, కౌళ్ళూ, వర్తక కమిషన్లూ అనే దోపిడీ ఆదాయాల్ని రక్షించే రాజకీయాలే కదా? ఇంక సంస్కృతులు అంటారా, రెండు రాష్ట్రాలలోనూ, కుల భేదాలూ, స్త్రీపురుష అసమానత్వం, మూఢనమ్మకాలూ కలిసిన సంస్కృతులే గదా ఉన్నది?
(9) ‘తెలంగాణ ఎందుకు ప్రత్యేక భాష?– అనేదానికి, నిర్మాణాత్మక సాక్ష్యాలు అంటూ ఇచ్చిన ఉదాహరణలన్నీ రూప భేదాలే గానీ, అర్ధాల్ని మార్చేసే భేదాలు ఏమాత్రం కాదు. జాగా చాలదు కాబట్టి, వ్యాసకర్త ఇచ్చిన ఒక్క ఉదాహరణ మాత్రమే చూద్దాం. వచ్చినాడు (రాయలసీమ) >వచ్చిండు (తెలంగాణ) >వచ్చాడు (మధ్యాంధ్ర). ఈ మాటల్లో, ‘వచ్’ అనేది క్రియా మూలం. ‘డు’ అనేది పుమ్లింగం. మూడు ప్రాంతాల మాటల్లోనూ ఉన్నది ఒకటే కాలం: భూతకాలం. కాకపోతే, దాన్ని సూచించే ‘మధ్య ప్రత్యయానికి’ (ఇన్ఫిక్స్) 3 రూపాలున్నాయి. ‘యినా’, ‘యిన్’, ‘యా’. ఈ 3 రూపాలకీ ఒకటే అర్ధం: భూతకాలాన్ని సూచిం చడం. భాషాశాస్త్రపరంగా, ఈ 3 రూపాల్లో, ఒకటి ఎక్కువ విలువగలదీ, ఇంకోటి తక్కువ విలువగలదీ కాదు. వీటిల్లో ఒకటి ఎక్కువదీ, ఇంకోటి తక్కువదీ అనే దురభిప్రాయానికి కారణం, ఇందాక, కృష్ణమూర్తి గారిచ్చిన నిర్వచనంలో చెప్పినట్టు, సామాజిక విలువని భాషా ప్రయో గానికి ఆపాదించడం అన్నమాట.
(10) తెలంగాణా మాండలికంలో ఉన్నంత “ప్రాచీనత”, ఆంధ్రా మాండలికాల్లో లేదు కాబట్టి, ‘తెలంగాణా తెలుగు’ అనేది మాండలికం కాదనీ, ’భాష’ అనీ వ్యాసకర్త వాదన. ప్రాచీన రూపాలు కొన్ని మాండ లికాల్లో ఉండడానికీ, కొన్నింటిలో ఉండకపోవడానికి కారణాల కోసం ‘చారిత్రిక భాషా శాస్త్రం’లో (హిస్టారికల్ లింగ్విస్టిక్ లో) అంతర్గత పునర్నిర్మాణం (ఇంటర్నల్ రీకనస్ట్రక్షన్) అనే పరిశోధనా పద్ధతి ద్వారా వెతికితే దొరుకుతాయి.
(11) ‘తెలంగాణ భాషా కథల సంపుటి రావడం’ నాకు ఇష్టం లేదని వ్యాసకర్త నింద! గీయనకు ఎట్ల ఎరకా, నాకు ఇష్టం లేదని! నేనేడనన్నా గట్ల రాసింటినా, కూసింటినా? తెలంగాణా మాండలికంలో చాలా గొప్ప కవితలు రాసిన ‘భాను’ (తెలిదేవర భానుమూర్తి) గిప్పుడు లేడుగానీ, గాయన ఉండిఉంటే, నా సంగతి చెప్పెటోడే! 1970లో, భాను పరిచయం అయినప్పుడు, అతను తెలంగాణా మాండలికంలో రాసిన ‘ఆల్లు ఊరోల్లు’, ‘డబ్బుకొట్టు తాతా, డబ్బుకొట్టు, దొరకొడుకు పెండ్లైతు న్నది’, ‘ఆడు, బండలకొట్టి బతికెటోడు, ఎండల బడి ఏడుస్తుండు’ అనే కవితల్ని విని, పరవశుణ్ణై, నేనే ఆ కవితల్ని స్వయంగా తీసికెళ్ళి, ‘వసుధ’, ‘జీవనాడి’ అనే మాసపత్రికల్లో ప్రచురింపజేశాను. ఆ తర్వాత ఆ ఆసక్తితోనే, సోషియో లింగ్విస్టిక్ టాపిక్‌గా, ‘హైదరాబాదు తెలుగు’ మీద పి.హెచ్.డి చేశాను. ఇవన్నీ తెలియకుండా, తెలంగాణా మాండలిక వ్యతిరేకిగా నన్ను చిత్రించడాన్ని ఏమనుకోవాలె? తెలంగా నల ఒక సామెతున్నది: ‘చేతగానోనికి నిందలెక్కువ! చెడగొట్టేటోనికి అబద్ధాలె క్కువ!’ గట్లున్నది!
(12) సంగిశెట్టీ, స్కైబాబాల రచనలతో నాకు పరిచయం లేనట్టూ, అందువల్లనే వాళ్ళ ప్రకటనని విమర్శించినట్టూ, వ్యాసకర్త పెడర్ధం! నాకు వాళ్ళ రచనలతో పరిచయం ఉండబట్టే, వాళ్ళ ఆ ఆశయానికీ, ఆ ప్రకటనలో వాడిన మాండలికానికీ సంబంధం లేదని అన్నాను. “మీ ప్రామాణిక భాషా చట్ర ప్రభావం వలన, పత్రికల పరిమితుల వలన వాళ్లు అట్లాంటి ప్రకటన ఇచ్చిండ్రు తప్ప వాళ్లకు భాష రాకకాదు. అది గుర్తుపెట్టుకోండ్రి” అని వ్యాసకర్త హెచ్చరిక! గట్టి కమిట్మెంటున్నోల్లు, ఆశయాలకు విరుద్ధంగా శైలిని మార్చుకుంటరా? తెలుగుప్రభగానీ, ఆంధ్రజ్యోతిగానీ, తెలంగాణా మాండలికంలో రాసినవాటిని ఇంతదాంక ఎన్నడూ యెయ్యలేదా? నేనే 2010 జూన్‌ల, నీ లెక్క, నన్ను బద్నాం చెయ్యనీకి కోషీస్ చేసినోల్లకు, మొత్తం మాండలికంలనే జవాబిచ్చిన: ‘మల్ల జెప్తున్న ఇనుండ్రి! బక్వాస్ తోని బహెస్ నడ్వది!’ అని. గిప్పుడూ గదే మాట అనవల్సివస్తున్నది.
బి.ఆర్.బాపూజీ

