Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Permanent Commission for women in Indian coast guard: లైంగిక వివక్షపై సుప్రీం...

Permanent Commission for women in Indian coast guard: లైంగిక వివక్షపై సుప్రీం అక్షింతలు

శాశ్వత ప్రాతిపదికన ఒక కమిషన్

సైన్యంలో మహిళలకు కొన్ని ఉద్యోగాలలో అవకాశాలు కల్పించడంలోనూ, వారికి కొన్ని అధికారిక బాధ్యతలను అప్పగించడంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇంకా సంశయాలు, సందేహాలతో కొట్టుమిట్టాడుతూనే ఉంది. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఇచ్చిన తీర్పులు, రూలింగులు, ప్రజాభిప్రాయం మహిళలకు అనుకూలంగా ఉన్నప్పటికీ, కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా రక్షణ శాఖ గట్టి నిర్ణయం తీసుకోలేకపోతోంది. తీర ప్రాంత భద్రతా వ్యవస్థల్లో మహిళలకు అవకాశాలు పెంచడానికి తాము సందేహిస్తున్నామని, అక్కడి పరిస్థితులు నౌకా, సైనిక వ్యవస్థల్లో మాదిరిగా మహిళలకు అనువుగా, సౌకర్యంగా ఉండే అవకాశం లేదని
ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ మారుతున్న కాలంలో తాము ప్రభుత్వ వాదనతో ఏకీభవించలేమని అందుకు బదులుగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ప్రభుత్వం ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకోలేకపోయిన పక్షంలో తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది.

- Advertisement -

షార్ట్ సర్వీస్ కమిషన్ కు చెందిన కోస్ట్ గార్డ్ నేవిగేటర్ ప్రియాంక త్యాగి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ విధంగా స్పందించడం జరిగింది. సుమారు 14 ఏళ్ల పాటు తీర ప్రాంత భద్రతా దళంలో పనిచేసిన ప్రియాంక త్యాగికి అందులో కమిషన్ బాధ్యతలను అప్పగించకుండా ప్రభుత్వం వేరే బాధ్యతలను అప్పగించడం జరిగింది. కాగా, ఆమెకు కమిషన్ బాధ్యతలు అప్పగించడంపై తాము పునఃపరిశీలన జరుపుతామని, ఆమెకు తగ్గట్టుగా వ్యవస్థీకృత మార్పులు జరపడానికి అవకాశముందేమో పరిశీలించడానికి తామొక కమిటీనీ నియమించామని ప్రభుత్వం తెలియజేసింది. అయినప్పటికీ ప్రభుత్వ వాదనతో, అభిప్రాయాలతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. కేవలం పురుషాధిక్య భావజాలంతోనే ప్రియాంక త్యాగికి బాధ్యతలు అప్పగించడానికి ప్రభుత్వం సందేహిస్తోందంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. మహిళలు సరిహద్దుల వద్ద కాపలా కాయగలుగుతున్నప్పుడు, తీర ప్రాంతాలను కాపలా కాయడానికి అడ్డేమిటని సుప్రీం కోర్టు నిలదీసింది. మహిళా సాధికారికతను ప్రభుత్వం వెంటనే ఆచరణలో పెట్టడం
ప్రారంభించాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.

సైన్యంలోనూ, నౌకాదళంలోనూ మహిళలకు శాశ్వత ప్రాతిపదికన ఒక కమిషన్ ను ఏర్పాటు చేయాలని 2020లో సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. కోస్ట్ గార్డ్ కు కూడా ఇదే విధంగా కమిషన్ ను ఏ‍ర్పాటు చేయాల్సి ఉంటుంది. సైన్యంలోని ఇతర దళాలకు, విభాగాలకు కోస్ట్ గార్డ్ వ్యవస్థకు చాలా తేడా ఉందని, తీర ప్రాంత భద్రతా వ్యవస్థల్లో కొన్ని ఉద్యోగాలకు మహిళలు సరి పోరని ప్రభుత్వం వాదించడంలో అర్థం లేదని న్యాయస్థానం భావిస్తోంది. సైనిక దళాలలో మహిళలను పురుషులతో సమానంగా పరిగణించరన్న అభిప్రాయం ఒకటి నెలకొని ఉంది. మహిళలు కూడా పురుషులతో అన్ని విషయాల్లోనూ సమానమేనని ప్రభుత్వం ఇతర విషయాల్లో భావిస్తున్నప్పుడు సైనిక దళాల్లో మాత్రం వివక్ష చూపించడం, అర్హత కలిగిన
మహిళలను కూడా వీటికి దూరంగా ఉంచడం భావ్యం కాదనే అభిప్రాయం కలుగుతోంది. మహిళల పట్ల చివరికి ప్రభుత్వం కూడా పక్షపాత ధోరణితో, వివక్షతో వ్యవహరించడంలో అర్థం లేదని న్యాయస్థానం అభిప్రాయ పడింది.

చివరికి తనకు అన్యాయం జరుగుతోందంటూ ఒక మహిళా ఉద్యోగి సుప్రీంకోర్టుకు వెళ్లవలసి రావడం సిగ్గుచేటైన విషయం. సైనిక వ్యవస్థల్లోని ఇతర విభాగాల్లో కూడా మహిళలు ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారా అన్నది తెలియడం లేదు. న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం లేక వారంతా మౌనంగా ఉండిపోతున్నారా అన్న సందేహం కూడా కలుగుతోంది. మహిళా ఉద్యోగు లకు సహజంగానే న్యాయం జరగాలి తప్ప, వారు న్యాయస్థానాలను ఆశ్రయించే అగత్యం ఏర్పడ కూడదు. ముఖ్యంగా ప్రభుత్వ
సంస్థలో మహిళల పట్ల వివక్షతో, పక్షపాతంతో వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News