Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్విపక్షంలో అప్పుడే అశాంతి, అసమ్మతి

విపక్షంలో అప్పుడే అశాంతి, అసమ్మతి

సార్వత్రిక ఎన్నికల్లో తమ సంఖ్యాబలాన్ని 99కి పెంచుకుని ఆనందోత్సాహాల్లో మునిగి తేలు తున్న కాంగ్రెస్‌ పార్టీకి ఆ ఆనందం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. దేశంలోని ఆ పార్టీ రాష్ట్ర శాఖల్లో చాలా భాగం అంతర్గత కుమ్ములాటలు, సిగపట్లతో వీధిన పడుతున్నాయి. ఈ పరిస్థితిని తీవ్ర విషయంగా పరిగణించి అధిష్ఠానం తక్షణ చర్యలు తీసుకోని పక్షంలో ఈ కలహాలు, కుమ్ములాటలు కార్యకర్తల స్థాయికి వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ ఏడాది చివరిలోనూ, 2025 లోనూ జరగబోయే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావలసిన పార్టీ వెంటనే నడుం బిగించాల్సిన అవసరం ఉంది. దేశంలో సుమారు 16 రాష్ట్ర శాఖల పరిస్థితి ఏమీ బాగాలేదని, పార్టీలో అశాంతి ప్రబలుతోందని, పార్టీ నాయకుల్లో ఓర్పు, సహనాలతో పాటు, బాధ్యత కూడా లోపిస్తోందని ఇప్పటికే అధిష్ఠానానికి అనేక నివేదికలు అందాయి.
ఆంధ్రప్రదేశ్‌ లోని కాంగ్రెస్‌ శాఖలో పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్‌. షర్మిలకు, ఇద్దరు కార్యాచరణ అధ్యక్షులకు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దీని ఫలితంగా, పార్టీ కమిటీలన్నిటినీ రద్దు చేయడం జరిగింది. విజయవాడలోని పార్టీ కార్యాలయానికి తాళాలు వేయడం కూడా జరిగింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బి.ఆర్‌.ఎస్‌) నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆపరేషన్‌ ఆకర్ష్‌ పేరుతో ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతుండడంతో పార్టీలో కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఇతర పార్టీల నుంచి నాయకులను తమ పార్టీలో చేర్చుకోవడానికి సీనియర్‌ నాయకులు ఏమాత్రం సహించలేకపోతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా రాను రాను అసమ్మతి పెరుగుతోంది. మరి కొందరు మంత్రులను ఉప ముఖ్యమంత్రులుగా ప్రమోట్‌ చేయాలంటూ కొందరు నాయకులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ఏం చేయాలో తెలియక ముఖ్యమంత్రి , ఆయన వర్గీయులు తలలు పట్టుకుని కూర్చున్నారు.
ఇక మహారాష్ట్రలో కాంగ్రెస్‌ కీచులాటలు ఇప్పటికే చాలావరకు రోడ్డెక్కాయి. రాష్ట్ర శాఖలోని నాయకులు బహిరంగంగానే విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారు. ముఖ్యంగా ముంబై శాఖ అధ్యక్షుడి మీద ఇతర నాయకులంతా కారాలు, మిరియాలు నూరుతున్నారు. ఆయనను ఆ పదవి నుంచి తప్పించే వరకూ తాము విశ్రమించేది లేదని వారు ఢంకా బజాయించి చెబుతున్నారు. వారు రాష్ట్ర శాఖ అధ్యక్షుడినే కాదు, అధిష్ఠానాన్ని సైతం ధిక్కరించడం జరుగుతోంది. ఏకంగా 16 మంది సీనియర్‌ నాయకులు ముంబై నగర అధ్యక్షడి మీద తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ప్రస్తుతం ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, రాజస్థాన్‌, ఉత్తర ప్రదేశ్‌ శాఖల్లో కూడా కుమ్ములాటలు, సిగపట్టు ముమ్మరం అవుతున్నాయి. పార్టీ శాఖల అధ్యక్షులకు, ఇతర నాయకులకు ఏమాత్రం పొసగక బహిరంగంగానే విమర్శలు చేసుకోవడం జరుగుతోంది.
రాష్ట్ర శాఖలు బలంగా ఉన్నప్పుడే జాతీయ స్థాయిలో పార్టీ శక్తిమంతంగా ఉండే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ అగ్ర నాయకత్వం బలంగా లేకపోవడంతో పార్టీ రాష్ట్ర శాఖలు యథేచ్ఛగా వ్యవహరించడం జరుగుతోంది. ఎన్నికల ముందు కూడా పార్టీ రాష్ట్ర శాఖల్లో లుకలుకలున్నప్పటికీ ఎన్నికల దృష్ట్యా వేచి చూసే ధోరణి కనిపించింది. ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుంచి మళ్లీ కుమ్ములాటలు ఊపందుకున్నాయి. వీటిని సాధారణ విభేదాలుగా తీసిపారేయడానికి వీల్లేదు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్‌ ఇప్పటికైనా కల్పించుకుని పార్టీ రాష్ట్ర శాఖలను ఎంత త్వరగా చక్కదిద్దితే అంత మంచిది. రాజస్థాన్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో అసమ్మతి జ్వాలలను ఆర్పడానికి వీరు చాలా కాలంగా ప్రయత్నించడం జరుగుతోంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఏ ప్రభుత్వాన్ని నిలదీయడం మీద పార్టీ ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోంది.
కేంద్రంలో ఎన్‌.డి.ఏ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పార్టీని ఎదుర్కో వాలన్నా, రాబోయే శాసనసభ ఎన్నికల్లో విజయాలు సాధించాలన్నా కాంగ్రెస్‌ పార్టీ సంఘటితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పార్లమెంటులో అతి శక్తిమంతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ విధంగా అంతర్గత కలహాలు, కుమ్ములాటల్లో నిమగ్నమయ్యే పక్షంలో ఈ పార్టీపై నమ్మకముంచి 2019 నాటి కంటే ఎక్కువ స్థానాలిచ్చిన ప్రజల నమ్మకం సడలిపోవడానికి అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News