Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్Telangana Charitra: అమరుల ఆశయాలు.. ఆత్మగౌరవ పాలన

Telangana Charitra: అమరుల ఆశయాలు.. ఆత్మగౌరవ పాలన

దూకుడు అబ్బాయిలాంటి ఆంధ్రతో, అమాయకురాలైన ఆడపడుచు తెలంగాణతో బంధం

సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జూన్‌ 2, 2014న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. స్వయం పాలనలో దశాబ్ది కాలాన అడుగిడుతున్న రాష్ట్ర అవతరణ వేళ ‘జూన్‌ 2 నుండి 21 రోజులపాటు దశాబ్ది ఉత్సవాలను’ జరుపుచున్న సందర్భంగా.. దీని చరిత్ర, సాధన ఉద్యమాలు, ఆత్మగౌరవ పాలనను పరిశీలిద్దాం.. తెలంగాణ చరిత్ర.. స్వతంత్ర హైదరాబాద్‌ రాజ్యాన్ని1724లో నిజాం ఉల్‌ ముల్క్‌ స్థాపించారు. దీనికి పూర్వమే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండనులు, చాళుక్యులు, కాకతీయులు, తెలంగాణలోని హైదరాబాద్‌, కరీంనగర్‌, ఓరుగల్లు కేంద్రంగా ప్రజారంజకంగా పాలించిన ఘన చరిత్ర ఉంది. వీరితో స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం పోరాడిన వీర వనితలు సమ్మక్క, సారలమ్మల ధిక్కార స్వరాలతో పాటు, నిజాం నిరంకుశత్వంపై తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసిన చరిత్ర కలిగిన నేల ఇది.. ఆ తర్వాత ఆంగ్లేయులు దేశానికి స్వాతంత్య్రం ప్రకటించాక యూనియన్‌ ప్రభుత్వం సైనిక చర్య జరిపి ఈ స్వతంత్ర రాజ్యాన్ని యూనియన్‌ ప్రభుత్వంలో కలపడం జరిగింది. ఆనాడే రాజును ఎదుర్కొన్న ధిక్కార స్వరాలు స్వతంత్రతనే కోరుకున్నారు. తర్వాత భారతీయ పాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతో తెలుగు భాష మాట్లాడే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలిపి1956 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఇది ససేమిరా తెలంగాణ ప్రజలకు ఇష్టం లేదు. ఆనాటి ప్రధాని నెహ్రూ 1956 మార్చి 5న నిజామాబాద్‌ సభలో ఈ రెండు ప్రాంతాల గురించి మాట్లాడుతూ.. దూకుడు అబ్బాయిలాంటి ఆంధ్రతో, అమాయకురాలైన ఆడపడుచు తెలంగాణతో బంధం వేశాము. అది ఎన్నాళ్లు నిలుస్తుందో! కాలమే నిర్ణయిస్తుందని సందేహపడ్డారు. తెలంగాణ సాధన ఉద్యమాలు.. స్వతంత్రత, స్వయం పాలన ఆకాంక్షతో తెలంగాణ రెండు తరాల ప్రజానీకం అకుంఠిత దీక్షతో పోరాడినారు. ఈ ఉద్యమ కాలం తొలిదశ ఉద్యమం, ఆ తర్వాత జరిగిన పోరాటం మలి దశ ఉద్యమంగా చరిత్రలో నిలిచిపోయింది. తొలిదశ ఉద్యమంలో తెలంగాణలోని కొన్ని వర్గాల మేధావులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. ఆ పోరాటంలో ఆనాటి యువత ప్రాణాలను త్యాగం చేసినారు. స్వార్ధ రాజకీయ పార్టీ (నాయకు)ల పదవి ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని నీరుగార్చినారు. ఆ తరువాత నివురు గప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ ఉద్యమ జ్వాలలు మలి దశ ఉద్యమానికి పోరును రాజేసింది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో స్వర్గీయ ప్రొఫెసర్‌ జయశంకర్‌, కాళోజీ, విద్యాసాగర్‌ జలనిపుణులు ప్రముఖుల సలహాల మేరకు విద్యార్థులు, మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యమాన్ని కొనసాగించారు. తొలి దశ ఉద్యమంలో రాజకీయ నాయ కుల స్వార్థ పదవి ప్రయోజనాల కోసం ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించారని రాజకీయ పార్టీ (నాయ కు)లపై నమ్మకం లేని రోజులవి. ఆ వేళ కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ రావు తెలంగాణ ప్రజల్లో ఉప్పెనలా దాగి ఉన్న ఉద్యమ ఆకాంక్షను గ్రహించి ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే పార్టీని 2001-ఏప్రిల్‌27న స్థాపించారు. ఈ పార్టీ పూర్తిగా ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పడిందని చెప్పారు. అలా సింగిల్‌ ఎజెండాతో సభలు, సమావేశాలు జరుపుతూ ఆవేశ పూరిత తెలంగాణ యాస, భాష ప్రసంగాలతో జనంలో తెలంగాణ స్వరాష్ట్ర కాంక్షను ఎగిసిపడేలా చేశాడు. దానికి తోడు ప్రొఫెసర్‌ జయశంకర్‌, విద్యాసాగర్‌ తదితర ప్రముఖ మేధావులను ఆ సమావేశాలకు ఆహ్వానించడం జరిగింది. వారి నుండి తెలంగాణ ప్రాంతానికి ఇన్నేళ్లుగా జరుగుచున్న అన్యాయాన్ని ‘నీరు, నిధులు, నియామకాలు’ దోపిడి గురించి గణాంకాలతో సభల్లో సమావేశాల్లో ప్రసంగింపజేశారు. తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం ఇంటింటికి, గడప గడపకు చేరేలా ‘పల్లె నిద్ర’, కవులు, కళాకారులచే ‘దూం-దాం..’ కార్యక్ర మాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ముందుకు సాగింది. ఆ క్రమంలో ఉద్యమ నాయకుడిగా చంద్రశేఖర్‌ రావుపై ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. ఆ తరుణంలోనే ఆయన ‘ఆమరణ దీక్ష‘ చేపట్టారు. తెలంగాణ ప్రజలు, కుల సంఘాలు, మతాలు, పార్టీలు అందరూ ఇదే చివరి ప్రయత్నంగా భావించి, తెలంగాణ జేఏసీలుగా ఏర్పడి ఆమరణ దీక్షకు మద్దతును ప్రకటించారు. ఊరువాడ-పల్లె పట్నం ఏకమైన పరిణామాలు, ఉద్యమ తీవ్రత ఢిల్లీ పాలకులను కదిలించేలా చేశాయి. కేంద్ర ప్రభుత్వం దీక్షను విరమింపచేసి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 2009 డిసెంబర్‌ 9న ప్రకటించడం జరిగింది.. ఆ తర్వాత సీమాంధ్ర రాజీనా(డ్రా)మా కుట్రలు, ఆధిపత్య రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన కేంద్రం దీనికి ‘కన్సన్‌’ ఏకాభిప్రాయం కావాలని మళ్ళీ కాలయాపన చేయడం మొదలైంది. అదే తెగింపుతో చంద్రశేఖర్‌ రావుకు మద్దతుగా తెలంగాణ యావత్‌ ప్రజానీకం పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా తెలంగాణ రాజకీయ ఐకాస ఏర్పడింది. ‘జై తెలంగాణ’ అనే నినాదం నాటి వందేమాతర నినాదంలా సమర శంఖమై మారుమ్రో గింది. ఈ పోరాట ఉద్యమం ఉదృతితో విద్యార్థులు, కళాకారులు, కవులు, మేధావులు, జర్నలిస్టులు, లాయర్లు, ఉద్యోగులు సబ్బండ జనం నిరుపమానంగా పోరాట కార్యక్రమాలు తీసుకొని రిలే నిరహార దీక్షలు, బందులు, రైల్‌ రోకోలు, మిలియన్‌ మార్చ్‌, వంటావార్పులతో రోడ్డు పైకి వచ్చారు. ఇలా సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రజానీకం దశాబ్ద కాలంపాటు పాల్గొని సీమాంధ్ర పాలనను స్తంభింప చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించారు. చివరకు తెలంగాణ రాష్ట్రం 2014 జూన్‌ 2న ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి అనివార్యమైంది. ఇందులో ఎన్నో మలుపులు, త్యాగాలు, విద్యార్థులు, యువకుల బలి దానాలు, జరిగినాయి. వారి త్యాగాలు, అమరులైన వారి పేర్లు రాయడానికి పెన్నులో సిరా సరిపోదు, రాయడానికి పదాలు దొరకవు. ఎంత రాసినా తక్కువే.. ఇంకా కొంత మిగిలిపోతుంది. అలా శ్రీకాంతాచారి చితి పేర్చని మం టలు, కానిస్టేబుల్‌ కిష్టయ్య రుధిర ధారలు ఇలా.. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ సాధించుకోవడంతో చిరకాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ఆ ఉద్యమానికి కేసీఆర్‌ నాయకత్వం వ్యవహరించారు. త్యాగాలు చేసిన అమరుల బలిదానాలకు నా కలం అక్షర నీరాజ నాలు తెలుపు(పలుకు)తుంది. అలా తెలంగాణ ఆకాంక్ష ను భుజాన ఎత్తుకున్న పార్టీ నాయకునికే ఆత్మగౌరవ పాలన పగ్గాలు అందించారు. తెలంగాణ స్వరాష్ట్ర పాలనలో ఆనాటి అమరుల త్యాగాలు, ఆశలు, ఆశయాలు నెరవేరినాయా అంటే? కాదనలేం.. కానీ ఆశించిన స్థాయిలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు అనేది నిజం. ‘చేసింది పిసరంత చేయాల్సింది కొండంత’ ఉందనేది కాదనలేని నిజం. ఆత్మగౌరవ పాలకుల మాటల్లోనే ఆ వెలితి కనబడుతుంది. ఆత్మగౌరవ పాలన.. ఆనాటి ఉద్యమంలో సీమాంధ్రుల దోపిడీగా చెప్పుకునే ‘నీరు, నిధులు, నియా మకాల్లో’ ప్రగతిని సాధించుడే ప్రధాన కర్తవ్యంగా పాలన ముందుకు సాగుతుంది. మన నీరు మన ప్రాంతానికి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా మళ్లించ బడుతుంది.. మన నిధులు మన రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నాయి.. పాలనలో వినూత్నంగా అనేక సంక్షేమ పథకాలతో, అభివృద్ధి దిశ గా ప్రగతి పథంలో ముందుకు సాగుతూనే ఉంది. అందుకే మన దేశంలోనే అభివృద్ధిలో ముందున్న రాష్ట్రంగా కేంద్రం అనేక అవార్డులను ప్రకటించింది. విద్యుత్తులో గణనీయ ప్రగతిని సాధించాం. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలు, మండలాలు విస్తరించడం జరిగింది. అన్ని స్థాయిల్లో, అన్ని రంగాల్లో మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. అలాగే రాజధాని హైదరాబాద్‌ ప్రపంచ పటంలో వాణిజ్య పరిశ్రమలతో పాటు ఉత్పాదక కేంద్రంగా టీ-హబ్‌, ఐటి-హబ్‌, ఫార్మా- హబ్‌, మెడికల్‌ హబ్‌, విద్య రంగాలలో అభివృద్ధి చెందినది. అంతర్జాతీయ, జాతీయ స్థాయి ట్రేనింగ్‌ సెంటర్లు, మెట్రో నెట్వర్క్‌, భౌగోళిక, నైసర్గికంగా అన్ని హంగులు కలిగి విరాజిల్లుతుంది. ఇన్ని సౌకర్యాలు ఉన్న హైదరాబాద్‌ ఇండియాకు రాజధానై రాబోయే కాలంలో చరిత్ర సృష్టించనుంది. దేశంలోనే ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహం, పాలన సౌలభ్యం కోసం సచివాలయం, అమరుల త్యాగాల జ్ఞాపకార్థం అమర జ్యోతి నిర్మించారు. భిన్న సంస్కృతులు, మతాల మధ్య సామరస్యత నెలకొన్న దశాబ్ద కాలం స్వరాష్ట్ర పాలనలో ప్రగతి ప్రయాణం సాగిస్తూ నేడు ‘దశాబ్ది ఉత్సవాలలో జూన్‌ 2 నుండి 21 రోజుల’ పాటు ప్రగతి నివేదికలను ప్రజల ముందుంచనున్నారు. వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని ప్రతిబింబించేలా పల్లె నుంచి పట్నం దాకా ప్రజల భాగస్వామ్యంతో దశాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఉద్యమ కాలంలో నాడు సీమాంధ్ర నాయకులు మీకు పాలన చేతకాదని, అవమానాలు, అవహేళనలు, అపోహలకు గురైన తెలంగాణ నేడు దేశంలోనే అభివృద్ధి పథాన వెలుగొందుతుంది. కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణ నేడు దేదీప్యమానంగా విద్యుత్‌ కాంతులను వెదజల్లుతుంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నాలుగా మన సంస్కృతిని, అస్తిత్వాన్ని ప్రతిబింబించడం, భాష యాస ఆచారవ్యవహారాల పరిరక్షణ, మరుగున పడ్డ చరిత్ర పునరుద్దరణ, గ్రంథ ముద్రణ జరుగుచున్నది. నాటి ఉద్యమ నినాదమైన నియామకాల విషయంలో ఇచ్చిన హామీ మేరకు ఉపాధి, ఉద్యోగ కల్పన చేపట్టలేదనేది నిరుద్యోగ యువతలో బలంగా ఉంది. విద్య, వైద్యం, వ్యవసాయం కొంత మెరుగుపడినప్పటికీ, కేజీ టు పీజీ ఉచిత ఆంగ్ల నాణ్యమైన విద్య ‘కామన్‌ స్కూల్లో’ కుల, మతాలకు అతీతంగా అందిస్తామనే హామీ ఆశించిన స్థాయిలో నెరవేర లేదనే వాదన ప్రజల్లో ఉంది. నేడు ఆత్మ గౌరవ పాలనలో దశాబ్ద కాలంలో జరిగిన అభివృద్ధి పథకాలకు, వర్గాలకు తోడు ఇంకా నిరాదరణకు గురవుతున్న తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం పాలకులు దృష్టి సారించాలి. ఆనాడు కీలకంగా ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగుల సమస్యలు, ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చలేదనే ఆవేదనలో ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం నిర్దిష్టమైన ప్రణాళికతో టైం బాండ్‌ ప్రోగ్రాంతో ఆనాడు ఇచ్చిన హామీ ల మేరకు నియామకాల కార్యాచరణ చేపట్టి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపాలి. ప్రశ్నించే వారిని తమకు వ్యతిరేకులుగా భావించకుండా విధాన పరమైన ప్రశ్నలను, సూచనలను, సమస్యలను పరిష్కరించాలి. పాలకులు ఉద్యమ నాయకులు అయినప్పటికీ అధికార పంజరంలో ఉంటారు. అందువల్ల ప్రజలు ఎదుర్కొనే బాధలు, ఇబ్బందులు తెలియవు. తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడే వారికి స్వేచ్ఛ లేదనే అపవాదు రాకుండా చూడాలి. ప్రజాస్వామ్యబద్దంగా పాలన సాగాలి. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు రెండు తరాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న స్వ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు, నాటి అమరుల ఆశయాలు నెరవేర్చడం కోసం ప్రజా శ్రేయస్సుతో కూడిన సంక్షేమ పాలన సాగాలి. అప్పుడే అమరుల త్యాగాలకు న్యాయం చేకూర్చిన వారవుతారు. గతంలో సీమాంధ్ర పాలకులను విమర్శించాం? కానీ నేడు మన పాలనలో ఏ ఒక్కరికీ అన్యాయం జరగకుండా చూడాలి. చేసిన అభివృద్ధిని ప్రచారం చేయడంతో పాటు, చేయాల్సిన, మిగిలిపోయిన వర్గాలతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రజలందరికీ స్వరాష్ట్ర ఫలాలు చేరేలా తెలంగాణ రాష్ట్ర పాలన దశాబ్ధి ఉత్సవాలు తోడ్పడాలని భావిస్తూ.. పాలకులు తమకు నచ్చిన పని చేయడం కాకుండా ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం అనివార్యం.. ఈ తెలంగాణ మట్టిలో స్వేచ్ఛను కోరే ధిక్కార స్వరం ఉంది. రాజ్యాలను, రాజుల్ని ఎదిరించి పోరాడిన సామాన్యుల సాహస చరిత్ర ఉంది. ఆ పోరాట స్ఫూర్తి నుండే అధికారం చేపట్టిన పాలకులుగా తెలంగాణ సబ్బండ వర్గాల ఆకాంక్షలు నేర్చవేర్చబడాలని విశ్వసిస్తూ..
మేకిరి దామోదర్‌
సామాజిక విశ్లేషకులు
-9573666650.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News