గడిచిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి చేపలు, రొయ్యలు తదితర సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా ఏకంగా రూ.55 వేల కోట్ల ఆదాయం లభించింది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది ఏకంగా 27 శాతం అధికం. ప్రపంచవ్యాప్తంగా చేపలు, రొయ్యలు తదితర సముద్ర జీవాల ఉత్పత్తిలో మన వాటా 8 శాతం వరకు ఉంది. ప్రపంచం మొత్తమ్మీద చేపలు అత్యధికంగా ఉత్పత్తయ్యే దేశాల్లో మనది మూడో స్థానం. విదేశీ మారకద్రవ్యాన్ని అత్యధికంగా సంపాదించి పెడుతుండటంతో ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తాజా బడ్జెట్‌లో కొన్ని రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు.
ఇందులో ప్రధానంగా చేపలు, రొయ్యల మేత మీద ఇప్పటివరకు ఉండే 15% కస్టమ్స్ సుంకాన్ని ఒకేసారి 5%కు తగ్గించారు. మరో రకం దిగుమతి చేసుకునే మేత మీద ఇప్పటివరకు 30% కస్టమ్స్ సుంకం ఉండగా, దాన్ని కూడా 5% చేశారు. వీటితో పాటు.. వనామీ, మోనోడాన్ రకం రొయ్యపిల్లలు (సీడ్) మీద సుంకం 10%గా ఉండేది. దీన్ని కూడా 5% చేశారు. తద్వారా.. రొయ్యల పెంపకంలో అత్యంత కీలకమైన సీడ్, ఫీడ్ ధరలు గణనీయంగా తగ్గాల్సి ఉంటుంది. రొయ్యల పెంపకంలో చెరువు లీజు, దాని నిర్వహణ, నీళ్లు పట్టడం, చెరువుల్లో ఏరియేటర్లు పెట్టడం ద్వారా ఎప్పటికప్పుడు తగినంత ఆక్సిజన్ అందించడం లాంటివి ముఖ్యమైనవి. వీటన్నింటికీ చాలా ఖర్చు అవుతుంది. దీనికితోడు.. సీజన్ల వారీగా వ్యాపించే వైరస్‌ల వల్ల కూడా రొయ్యలకు ముప్పు పొంచి ఉంటుంది. వాటి నుంచి కాపాడుకునేందుకు పలు రకాల మందులు వాడాలి. అందులోనూ యాంటీబయాటిక్స్ వాడితే విదేశాలకు ఎగుమతి చేసేందుకు పనికిరావు. అందువల్ల ఇటీవలి కాలంలో హోమియోపతి మందులను కూడా రొయ్యల చెరువులకు వాడుతున్నారు. ఈ పోకడ ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాల్లో కనిపిస్తోంది.
భారతదేశం నుంచి ప్రధానంగా ఐస్‌లో ఫ్రీజ్ చేసిన రొయ్యలు ఎక్కువగా ఎగుమతి చేస్తారు. మన దేశం నుంచి ఎగుమతి అయ్యే మొత్తం బరువులో 40%, విలువలో 70% ఇవే ఉంటాయి. ఇవి కాక మిగిలినవి చేపలు, కటిల్‌ఫిష్, ఎండుచేపలు.. ఇలాంటివి ఉంటాయి. రొయ్యల తర్వాత అత్యధికంగా ఎగుమతి అయ్యేవి ఐస్‌లో ఫ్రీజ్ చేసిన చేపలు. వీటి ఎగుమతుల విలువ దాదాపు రూ.5,500 కోట్లు. మన దేశం నుంచి ప్రధానంగా అమెరికా, యూరోపియన్ దేశాలు, చైనా లాంటి వాటికి చేపలు, రొయ్యలు ఎగుమతి అవుతుంటాయి.
2020 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై)ని ప్రారంభించింది. దీనిద్వారా చేపలు, ఇతర ఆక్వా సంపద పెంచేతీరు, ఎగుమతులను గణనీయంగా మార్చాలన్నది లక్ష్యం. 2020 నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు.
ఆక్వా ఎగుమతుల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆదాయం సంపాదించాలని, దీని ద్వారా 50 లక్షల మందికి ఉపాధి కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎఫ్ఐడీఎఫ్) కింద రూ.20వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్రీడింగ్ సెంటర్లు, ఆక్వా పార్కులు, రొయ్యల పెంపకం, ప్రాసెసింగ్ యూనిట్లు, ఫిషింగ్ హార్బర్లు, ల్యాండింగ్ సెంటర్లు, చేపల మార్కెట్లు, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, కోల్డ్ చైన్ సదుపాయాలు, రవాణా సదుపాయాలను బలోపేతం చేసి, ఆక్వారంగంలో ఉత్పాదకతను మరింత పెంచాలన్నది ఎఫ్ఐడీఎఫ్ ప్రధాన లక్ష్యం. ఇందుకు అవసరమైన నిధులను నాబార్డ్ సమకూరుస్తుంది.
ఇన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు అందుతున్నా.. ఇదంతా నిజంగా ఆక్వా రైతు వరకు వెళ్తుందా అన్నదే ప్రధాన ప్రశ్న. ఉదాహరణకు ఎరువుల ధరలు బస్తాకు వంద రూపాయలు తగ్గించినట్లు కేంద్రం ప్రకటించినా, క్షేత్రస్థాయిలో రైతు వరకు వెళ్లేసరికి ఆ ప్రయోజనం దాదాపుగా అందదు. ఎరువులు, పురుగుమందుల దుకాణాలు నిర్వహించే వ్యాపారులు రైతులకు అప్పుగా ఆ సరుకులను ఇవ్వడంతో.. పెట్టుబడి కోసం ముందు, వెనక చూసే రైతులు ఆ వంద రూపాయల తగ్గింపు గురించి అడిగే ధైర్యం చెయ్యరు. సరిగ్గా అలాగే సీడ్ మీద పన్ను తగ్గించినా, ఫీడ్ మీద పన్ను భారీగా తగ్గించినా, వాటి ధరలు మళ్లీ ఆక్వారైతుకు తగ్గుతాయన్న ఆశలు ఏమాత్రం కనిపించడం లేదు. సీజన్ మొత్తం రొయ్యలను చంటిపిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటూ కాపాడుకుంటూ వచ్చే రైతు.. చివరకు పట్టుబడి పట్టేసరికి అక్కడికి వచ్చిన వ్యాపారి చెప్పినదే రేటుగా ఉంటుంది.
ఎకరానికి రొయ్యల సాగుకు సుమారుగా రూ. 7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుంది. గత కొన్నేళ్లుగా సగటున ఎకరానికి 3-3.5 టన్నుల దిగుబడి మాత్రమే వస్తోంది. రైతు దగ్గరకు వచ్చేసరికి కిలోకు కేవలం రూ.200 చొప్పున మాత్రమే ఇస్తున్నారు. కానీ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసుకునేవారు మాత్రం కిలోకు దాదాపు 7 డాలర్ల చొప్పున… అంటే సుమారు 600 రూపాయలు సంపాదిస్తున్నారు. తాజాగా బడ్జెట్లో ప్రకటించిన రాయితీల కారణంగా వారికి మరో ఒకటి లేదా రెండు డాలర్లు ఎక్కువ వస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ, ఏడాది మొత్తం కష్టపడిన రైతుకు మాత్రం సగటున ఎకరానికి 2 నుంచి 4 లక్షల వరకు నష్టం వస్తోంది. ఎక్కడో అదృష్టవంతులకు తప్ప లాభాలు రావట్లేదని, ఒకప్పుడు కోట్ల రూపాయలు సంపాదించిపెట్టిన రొయ్యల సాగును ఇప్పుడు మానలేక చేస్తున్నామని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంతానికి చెందిన సుబ్బరాజు వాపోతున్నారు.
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌లో రాయితీలు ప్రకటించగానే రొయ్యల ఫీడ్, ఎగుమతి కంపెనీల షేర్లు భారీగా పెరిగాయి. దీన్ని బట్టే ఆ ఫలితాలన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో అర్థమవుతుంది. రాయితీల ఫలాలు కిందివరకు వెళ్లి, రైతుకు కూడా ఎంతోకొంత మేర లాభం చేకూరితేనే కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఉద్దేశం సరిగ్గా నెరవేరినట్లవుతుంది.
సమయమంత్రి చంద్రశేఖరశర్మ