Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్Article 370: ఆర్టికల్‌ 370 రద్దు సరైన నిర్ణయమే

Article 370: ఆర్టికల్‌ 370 రద్దు సరైన నిర్ణయమే

భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు, సందేహాలు తలెత్తినా ఇవి ఉపయోగపడతాయి

నాలుగేళ్ల క్రితం ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో ఇందుకు సంబంధించిన వివాదం పూర్తిగా సర్దు మణిగినట్టేనని భావించవచ్చు. అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ నిర్ణయానికి ఆమోదముద్ర వేయడంతో పాటు, దీని రద్దుకు అనుసరించిన పద్ధతుల్ని, ప్రక్రియల్ని కూడా గట్టిగా సమర్థించడం విశేషం. ఈ ఆర్టికల్‌ ను రద్దు చేయడాన్ని సమర్థించినవారు కూడా దీని రద్దుకు అనుసరించిన పద్ధతుల్ని తీవ్రంగా విమర్శించడం జరిగింది. అయితే, రాష్ట్ర శాసనసభ లేనప్పుడు రాష్ట్రపతికి, పార్లమెంటుకు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, బిల్లులు ఆమోదించడానికి అధికారం ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. ఆర్టికల్‌ 370ని రద్దు చేసే ముందు ఆర్టికల్‌ 356 కింద రాష్ట్ర శాసనసభను రద్దు చేసి, రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది.
ఈ తీర్పునకు ప్రధాన ఆధారంగా ఉండి, తీర్పు మీద ప్రభావం కనబరచిన అంశం ఏమిటంటే, ఇతర రాష్ట్రాలకు భిన్నంగా జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక సార్వభౌమత్వం ఏమీ లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పడం. ఇది భారతదేశంలో విలీనం చెందిన తర్వాత దీనికి ఎటువంటి సార్వభౌమత్యమూ వర్తించదని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఇక రాష్ట్రానికి ప్రత్యేక అధికారాలు కట్టబెట్టిన ఆర్టికల్‌ 370 ఒక తాత్కాలిక అంశం మాత్రమే. దీనిని అవసరమైనప్పుడు రద్దు చేయడానికి రాజ్యాంగమే అవకాశం కల్పించింది. ఇది మధ్యంతర ఏర్పాటు అని, అక్కర లేదనుకున్నప్పుడు దీనిని రద్దు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుందని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత రాష్ట్రపతికి తన అధికారాలు, చర్యల విషయంలో పరిమితులేవీ ఉండవని కూడా న్యాయస్థానం నొక్కి చెప్పింది. 1957లో భారతదేశంతో జమ్మూ కాశ్మీర్‌ విలీనం జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రత్యేక అధికారాలన్నీ రద్దయ్యాయని, ఆర్టికల్‌ 370 రద్దుకు అవకాశాలు ఏర్పడ్డాయని కోర్టు పేర్కొంది. దీని రద్దు విషయంలో రాష్ట్రపతికి అధికారాలు లేవనే వాదనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సి.వై. చంద్రచూడ్‌ తోసిపుచ్చారు. రాష్ట్ర శాసనసభను రద్దు చేసిన తర్వాత ఆ రాష్ట్రంపై రాష్ట్రపతికి ఎటువంటి అధికారాలూ లేవనడం అనేది దేశ సమగ్రతకు, సమైక్యతకు భంగకరమని ఆయన స్పష్టం చేశారు. ఇది విలీన ప్రక్రియకు విఘాతంగా మారుతుందని కూడా ఆయన పేర్కొన్నారు.
ఈ రాష్ట్రాన్ని విభజించి, కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. అయితే, సాధ్యమైనంత త్వరలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించి, దీనికి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని సుప్రీంకోర్టు సూచించింది. 2024 సెప్టెంబర్‌ 30 లోగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలని అది ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రతిపత్తిని కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించినందువల్ల రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని సవరించాల్సిన అవసరం లేదని అది పేర్కొంది. ఇక 370 రద్దు, జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి వంటి అంశాలతో పాటు సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించిన మరికొన్ని అంశాలపై కూడా రూలింగ్‌ ఇచ్చింది. ముఖ్యంగా ఆర్టికల్‌ 356 కింద రాష్ట్రపతికి ఉన్న అధికారాలను గురించి అది వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రపతి అధికారాలకు సంబంధించి భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు, సందేహాలు తలెత్తినా ఇవి ఉపయోగపడతాయి. మొత్తానికి ఈ తీర్పు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి నైతికంగా ఎంతో బలం చేకూరింది. కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా, ప్రతిపత్తి కల్పించడాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ ప్రభుత్వ ఆశయం పరిపూర్ణంగా నెరవేరినట్టయింది. ఆర్టికల్‌ 370 రద్దును, ఈ రద్దుకు అనుసరించిన ప్రక్రియను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కొన్ని ప్రతిపక్షాలు ఏం చేయబోతున్నాయన్నది తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News