Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Rohanam novel by Mudigonda Sivaprasad: చారిత్రక నవలా రచయిత ముదిగొండ

Rohanam novel by Mudigonda Sivaprasad: చారిత్రక నవలా రచయిత ముదిగొండ

పోలవరం ప్రాజెక్టు పుట్టుపూర్వోత్తరాలను నేపథ్యంగా చేసుకుని డాక్టర్‌ ముదిగొండ శివప్రసాద్‌ రాసిన 101వ నవల ‘రోహణం’ చదివిన వారికి ఆయన ఎంతటి చారిత్రక నవలా రచయితగా ప్రసిద్ధుడో అర్థం అవుతుంది. దీని చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తూనే ఆయన ఆధునిక సంఘటనలను కూడా వీటికి జతచేసి ఈ అద్భుతమైన నవల రాయడం జరిగింది. ఆయన ఏది రాసినా ఆద్యంతం చదివిస్తారు. ఆయన ఉపయోగించే పదజాలం అద్భుతంగా ఉంటుంది. సూటిగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టి చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. ఒక సాధారణ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని చరిత్రకు సంబంధించిన నేపథ్యంతో నవలలు రాసి, తెలుగు సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని ఆయన సృష్టించారు. ఆయన రాసిన శ్రీలేఖ, శ్రావణి వంటి నవలలు ఎంతగా తెలుగు ప్రజల మనసులకెక్కాయంటే, ఆయన ఆ నవలల్లో పేర్కొన్న పేర్లను తల్లితండ్రులు తమ పిల్లలకు పెట్టడం ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనూ, కింగ్‌ కోఠీలోని మహిళా కళాశాలలోనూ బోధనను కొనసాగిస్తూనే ఆయన నవలా రచనను కూడా ముందుకు తీసుకువెళ్లారు.
చరిత్రలపై పరిశోధన, లోతైన అధ్యయనాలలో మునిగి తేలే శివప్రసాద్‌ ముందుగా తన వంశం మీదే పరిశోధన చేసి అనేక కొత్త విశేషాలను కనుగొన్నారు. 2000 ఏళ్ల క్రితమే తమ వంశం వారు కాశ్మీర్‌ వలస వచ్చారని, దీని గురించి చరిత్ర గ్రంథాలలో రాసి ఉందని ఆయన వెల్లడించారు. అక్కడ నుంచి కాశీకి, అక్కడి నుంచి తెలంగాణకు వలస వచ్చిన తర్వాత కాకతీయులు ఈ ముదిగొండవారికి అగ్రహారాన్ని ఇవ్వడం జరిగిందని, ఆ తర్వాత కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడంతో వీరంతా కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలి వెళ్లారని ఆయన చెప్పారు. ఆంధ్రులకు చరిత్రే లేదనే ప్రచారం ఎక్కువగా ఉండడంతో ఆయన ఈ అపప్రధను తొలగించడానికి చరిత్ర సంబంధమైన నవలల రచనకు నడుం బిగించారు. ఒక సామాన్యుడిని లక్ష్యంగా తీసుకుని ఆయన చారిత్రక నవలలు రాయడం ప్రారంభించారు. ఒక సాధారణ గృహిణికి కూడా చరిత్ర తెలియాలన్న లక్ష్యంతో ఆయన చిన్న చిన్న చారిత్రక అంశాలను ఇతివృత్తాలుగా చేసుకుని ఆయన అనేక చారిత్రక నవలలను రాశారు. సాధారణ ప్రజలకు సైతం చారిత్రక అంశాలు తెలియాలన్న ఉద్దేశంతో తాను చేపట్టిన ప్రయత్నం చాలావరకు విజయవంతం అయినట్టు ఆయన తెలిపారు. ఒకపక్క అసలైన చరిత్రకు సంబంధించిన పరిశోధనలు, అధ్యయనాలను కొనసాగిస్తూనే ఆయన తన నవలలను కొనసాగించారు. వ్యాసాలు, నవలలు, కథలు, కవితలు అన్నీ కలిపి మొత్తం మీద ఆయన 135 రచనలు చేశారు. వీటిల్లో చాలా భాగం ఇంగ్లీషు, హిందీలతో సహా ఇతర భాషల్లోకి అనువాదం అయ్యాయి.
ఆసక్తికర విషయమేమిటంటే, ఆయన ఆంధ్రప్రదేశ్‌ లోని అమరావతి ప్రాంతం మీదే ఆరు నవలలు రాశారు. ఈ ప్రాంతానికి అమరావతి అని పేరు పెట్టాలని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడుకు ఆయన గురువు పాపయ్య రాజ్యులు చెప్పారు. అమరావతికి దగ్గరలో ఉన్న వైకుంఠ పురానికి ఆ పేరు పెట్టాలని కూడా ఆయనే చెప్పారు. ఇవాళ వెంకటాద్రి నాయుడు అంటే ఎవరో తెలియకుండా చేశారు. ఇప్పుడు ఆ ప్రాంతంలోని రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 1940 డిసెంబర్‌ 23న ప్రకాశం జిల్లా ఆకులల్లూరు గ్రామంలో జన్మించిన ముదిగొండ శివప్రసాద్‌ కల్పన కన్నా వాస్తవికతే బలమైంది. చారిత్రక నవల అనేది వాస్తవాన్నే కల్పనగా రాసే ప్రక్రియ. చారిత్రక నవలలు చదివితే ఏమొస్తుందని చాలామంది అడుగుతుంటారు. చారిత్రక నవలలు చదవడమంటే వేల సంవత్సరాలనాటి కాల పరిస్థితుల్లోకి మనం పయనించడమే. ఒక రకంగా మన ఆయుష్షు వేల సంవత్సరాలకు విస్తరించడమే. వేల సంవత్సరాల నుంచి ఇప్పటి దాకా జీవించడమే” అని ఆయన చెబుతుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News