Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Anti-incumbency: ప్రభుత్వ వ్యతిరేకతే ఓటమికి కారణమా?

Anti-incumbency: ప్రభుత్వ వ్యతిరేకతే ఓటమికి కారణమా?

ప్రభుత్వ పథకాల ప్రకటనలు, అమలులో సర్కారులు సర్కస్ చేస్తే ఇంతే

ఇటీవలి రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, మిజోరం, తెలంగాణ ఎన్నికల ఫలితాలను పరిశీలించిన వారికి ఈ ఫలితాలు కాస్తంత ఆశ్చర్యం కలిగించక మానవు. నిజానికి ఇక్కడి ప్రభుత్వాలు తలచిందొకటి, చివరికి జరిగిందొకటి. ఇక్కడి ప్రభుత్వాలు రకరకాలుగా ఎన్నికల ఫలితాలను ముందుగానే విశ్లేషించుకున్నాయి. సర్వేలు నిర్వహించాయి. తమకు తప్పకుండా విజయం సిద్ధిస్తుందనే ఆశాభావంతోనే చివరి వరకూ ఎదురు చూశాయి. ప్రభుత్వ వ్యతిరేకతే అశోక్ గెహ్లాత్, చంద్రశేఖర్ రావు, భూపేశ్ బాఘేల్ ల ఓటమికి ప్రధాన కారణమనుకునే పక్షంలో మధ్యప్రదేశ్ ఫలితాలు కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యతిరేకంగా ఉండాలి కదా? ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఏ విధంగా పనిచేస్తుందో పరిశీలించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా ప్రభుత్వాలు బలహీన వర్గాలకు, పేదలకు అందే విధంగా కొన్ని పథకాలు, కార్యక్రమాలను రూపొందించి అమలు చేస్తుంటాయి. సమాజ అవసరాలకు తగ్గట్టుగానే వ్యవహరిస్తుంటాయి. ఇక ప్రస్తుత ఎన్నికల రాజకీయాల ప్రకారం, ప్రభుత్వాలు అభివృద్ధి కంటే సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలకే ప్రాధాన్యం ఇవ్వడం కూడా ప్రారంభించాయి. కులాలవారీగా, మతాలవారీగా పథకాలను ప్రకటించడం కూడా దాదాపు ప్రతి రాజకీయ పార్టీ చేస్తున్న పనే.

- Advertisement -

ప్రజలను నిర్లక్ష్యం చేసినా, వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన పథకాలు, కార్యక్రమాలను సరిగా అమలు చేయకపోయినా ప్రజల నుంచి వ్యతిరేకత రావడమన్నది సహజమే. ప్రజల్లో ప్రభుత్వాల పనితీరు పట్ల ఏర్పడిన అసంతృప్తే క్రమంగా వ్యతిరేకతగా మారుతుంటుంది. ప్రభుత్వం మీద అభిమానం పోవడంతోనే అది తీవ్రస్థాయి వ్యతిరేకత కింద మారి పాలక పక్షాలను ఓడించడం జరుగుతుంటుంది. తెలంగాణ, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పాలక పక్షాలు ఘోర పరాజయం పాలవడానికి కారణం ఈ రకమైన తిరస్కారమే అయి ఉండాలి. దీనినే బహుశా రాజకీయ విశ్లేషకులు ప్రభుత్వ వ్యతిరేకతగా పరిగణిస్తుంటారు. తమ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న దన్న విషయాన్ని ప్రభుత్వాలు గ్రహించలేవా అన్నది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఒక విధంగా ఇది సాధ్యమయ్యే విషయమే. అయితే, వాస్తవ పరిస్థితులకు, పాలకుల కళ్లకు మధ్య ఒక అడ్డుగోడ, ఒక గాజు అద్దం అడ్డంగా వచ్చేయడం వల్ల వారికి అసలు విషయం అవగాహనకు రాదు. పాలకులకు అనుకూలమైన సందేశాలే వారికి అందుతుంటాయి. వారికి ఇష్టమైన కథనాలే వారికి చేరుతుంటాయి. ఈ అడ్డుగోడ, గాజు అద్దం అధికార యంత్రాంగమేననడంలో సందేహం లేదు.

అధికారులతో జాగ్రత్త
అధికారం ఒంటబట్టడంతో కేవలం కాల్పనిక లేదా తప్పుడు కథనాలు వినడానికే పాలకులు ఇష్ట పడతారు. పాలకులు ఎటువంటి కథనాలను వినడానికి ఇష్టపడతారో అధికారులు అవే కథనా లను చిలవలు పలవలుగా వర్ణించి పాలకుల చెవుల్లో వేస్తుంటారు. పాలకులు ఏ పథకాన్ని అమలు చేస్తున్నా, ఏ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు వెడుతున్నా అధికారులు వాటి ఘన విజ యాన్ని గురించిన వార్తలు, కథనాలను మాత్రమే అధికారులకు చేరవేస్తుంటారు. ప్రతి పథకమూ విజయవంతం అయిందనే చెబుతారు. ప్రజల మీద వాటి ప్రభావం ఆశించిన దాని కంటే ఎక్కువగానే ఉన్నట్టుగా కూడా కథనాలు అల్లుతారు. అధికారులు తమకు చెప్పే కథనాలను పాలకులు ప్రశ్నించడం గానీ, సందేహించడం గానీ ఉండదు. సొంత విశ్లేషణ ద్వారా గానీ, రాజకీయ యంత్రాంగం ద్వారా గానీ నిజ నిర్ధారణ చేసుకోవడానికి
అవకాశం ఉన్నప్పటికీ, పాలకులు వాటిని పట్టించుకోరు. అధికారులు చెప్పిందే వారికి ఇంపుగా, వినసొంపుగా ఉంటుందనుకోవాలి. ఒక్కోసారి సొంత విశ్లేషణ లేదా పార్టీ యంత్రాంగం చెప్పేవి కూడా అధికారులు చెప్పే కథనాల కంటే అన్యాయంగా ఉండే అవకాశం కూడా ఉంది.

ఇక పథకాల అమలులో చూపించినంత హడావిడి, హంగామా వాటి గురించిన వాస్తవాలు తెలుసుకోవడంలో ఉండదు. ప్రకటించడమంటే అవి అమలు చేయడమనే, అవి అందరికీ అందుతున్నాయనే పాలకులు అనుకుంటారు. కనీసం అటువంటి భ్రమలో ఉంటారు. తమ పథకాలు సరిగ్గా అమలు జరిగి, ఆశించిన ఫలితాలు ఇవ్వడం కోసం వాటి మీద పర్యవేక్షణ ఉండాలని కూడా పాలకులు ఆలోచించరు. ఆత్మవిమర్శకు అవకాశమే ఉండదు. ఇతరులు విమర్శించినా పట్టించుకోరు. పైగా విమర్శించేవారి మీద పగలు, ప్రతీకారాలను పెంచుకుంటారు. కార్యాచరణ, కార్యనిర్వహణలలోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం ఏ దశలోనూ చేయకపోవడం వల్ల ప్రజల స్పందనను పట్టించుకునే అవకాశం ఉండదు. పథకాలను అమలు చేయడం తరువాయి పాలకులు భ్రమల్లో, ఊహల్లో తేలిపోతుంటారు. ఇవి విజయవంతం అయ్యాయనే అధికారిక సమాచారంతో వారు మరింత ఉత్సాహం పెంచుకుని, కొత్త పథకాలను ప్రకటించడం కూడా జరుగుతుంది. అధికార యంత్రాంగం కారణంగా అవి కూడా విఫలమవుతూనే ఉంటాయి.

అసత్య కథనాలు
విచిత్రమేమిటంటే, సాధారణంగా పాలకులు తమ రాష్ట్రంలో తమ పాలనా సంస్కృతిని మార్చడానికి ఇష్టపడరు. అసలు దాని జోలికి కూడా వెళ్లరు. ఆశించిన ఫలితాలను సాధించాలన్న పక్షంలో కార్యక్రమాల అమలు మీద తగినంత శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. సామాజిక న్యాయం పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. ఈ కార్యక్రమాల అమలు పారదర్శకంగా, వేగంగా ముందుకు సాగడానికి టెక్నాలజీ పద్ధతులను విస్తృతంగా
వినియోగించాల్సి ఉంటుంది. కార్యాలయాల్లో పెత్తందారీ పద్ధతులు కొనసాగుతూ ఉండడం, విపరీతంగా అవినీతి నెలకొని ఉండడం, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం పరాకాష్ఠలో ఉండడం, కొందరికి మాత్రమే సంక్షేమ ఫలాలు అందుతూ ఉండడం వంటి వాటితో ఎన్నో ఏళ్లుగా విసిగిపోయి ఉన్న సాధారణ ప్రజానీకానికి ప్రభుత్వం చెప్పే విజయాలు, సాఫల్యాల కబుర్లు తలకెక్కవు. వారు వాటిని ప్రగల్భాలుగానే
పరిగణించడం జరుగుతుంది. ఇ-గవర్నెన్సు కూడా అధికారుల దృక్పథంలో మార్పు తీసుకు రాలేకపోయింది. ప్రజల్లో అది ఏమాత్రం నమ్మకాన్ని పెంచలేకపోయింది. ప్రజల హక్కులను కాపాడే విధంగా, వారికి చెందాల్సిన పాలనా ఫలాలు వారికి చెందే విధంగా, సామాజిక విప్లవాలు, రాజకీయ ఉద్యమాలు చెలరేగే దాఖలాలు కూడా ఎక్కడా కనిపించడం లేదు. ఇటువంటి దశలో పాలనా యంత్రాంగం పేదలను, బలహీన వర్గాలను పట్టించుకుని తదనుగుణంగా పని చేసే అవకాశమే లేదు. ప్రస్తుత పాలనా యంత్రాంగ పనితీరు యథాతథంగా కొనసాగాలని పాలకులు కోరుకుంటు న్నందువల్ల,
దీనిని మార్చే ప్రయత్నమేదీ పాలకులు చేయనందువల్ల ప్రభుత్వం మీద ప్రజలు నమ్మకం పెట్టుకోవడం లేదా ఆశలు పెట్టుకోవడం వంటివి చోటు చేసుకునే అవకాశం లేదు.

ఇక ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఎన్నికల సమయానికి మాత్రమే పరిమితం కాలేదు. ఎన్నికల ఫలితాలలోని ఓట్ల తేడాలను బట్టి ఓటర్లు ఈ ప్రభుత్వం గురించి చాలా కాలం క్రితమే ఒక నిర్ణయానికి వచ్చినట్టు నిర్ధారణ అవుతుంది. ప్రజల మనసుల్లో తీవ్రస్థాయి తిరస్కార భావం ఏర్పడినందువల్ల ఆ తర్వాత ఎంత గొప్పలు పోయినా, ఎన్ని సాఫల్యాలు, ఘన విజయాలు ప్రకటించినా ఫలితం ఉండదు. జరగాల్సిన నష్టం ఎన్నికలకు ముందు చాలా కాలం క్రితమే జరిగిపోయింది. కార్యక్రమాలు, పథకాల అమలు విషయంలో వారు అధికారుల అభిప్రాయాలనే గట్టిగా నమ్ముతూ ఉండడం వల్ల వారికి ప్రజల్లో గూడుకట్టుకుంటున్న తిరస్కార భావం గురించి ఆలోచించే అవకాశం ఉండదు. పూర్తి స్థాయిలో కార్యక్రమాలు అమలవుతున్నాయా లేదా అని అధికారులను ఎవరూ అడిగే అవకాశం లేదు. వారు కూడా శ్రద్ధ తీసుకుని, క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉండదు. వారికి జవాబుదారీతనం కూడా ఉండదు.
పథకాల్లోని సాధక బాధకాలను వారు ప్రభుత్వ దృష్టికి తీసుకు రావడం జరగనే జరగదు. ప్రభుత్వాలు ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేస్తుంటే అధికారులు ప్రభుత్వాలను బుజ్జగించే లేదా మభ్యపెట్టే పనిలో ఉంటారు.

మధ్యప్రదేశ్ లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి, చత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో విజయం సాధించడానికి ఇవే కారణాలు చాలావరకు దోహదం చేశాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత కేంద్రంలో కూడా అదే పార్టీ అధికారంలో ఉండడం వల్ల బాగా తగ్గిపోయింది. రాష్ట్ర ప్రభుత్వంలోని లోపాలను కేంద్రం భర్తీ చేసింది. ఇటువంటి అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వాలకు లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకంటే, కేంద్ర ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా, విజయవంతంగా అమలు జరిగడం కూడా ఇందుకు ఒక కారణం. కేంద్ర ప్రభుత్వా నికి అంతర్జాతీయంగా పేరు వస్తుండడం, కొన్ని ప్రధాన సమస్యలను కేంద్రం పరిష్కరిస్తుండడం వంటివి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వానికి బాగా కలిసి వచ్చాయి. ఈ రాష్ట్రంలో ఎన్నికల విజయానికి శివరాజ్ సింగ్ కారణం కానందువల్లే ఆయనను ముఖ్యమంత్రిని చేయడం జరగలేదు. ఏతావతా, ప్రజల కోసం చేపట్టిన పథకాలను సమర్థవంతంగా, పటిష్టంగా అమలు చేయడమే ప్రజలకు కావాలి. పథకాలను పటిష్టంగా అమలు చేస్తున్నంత కాలం ప్రభుత్వ వ్యతిరేకత ఉండదు. ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఈ పథకాల బాధ్యతను పూర్తిగా అధికారులకు వదిలిపెట్టకుండా వాటి మీద పర్యవేక్షణ చేయడం, అధికారుల నుంచి జవాబుదారీ తనాన్ని ఆశించడం, వారు చెప్పే కాల్పనిక కథనాలు సొంత యంత్రాంగంతో నిర్ధారణ చేసుకోవడం జరిగితే ప్రభుత్వ వ్యతిరేకతకు అవకాశం ఉండదు.

– వి. సుదర్శనరావు, రాజకీయ విశ్లేషకుడు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News