Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్How to write children stories?: బాలల కథలు - వస్తు సేకరణ

How to write children stories?: బాలల కథలు – వస్తు సేకరణ

బాల సాహిత్యం రచనకు మెళకువలు

కథల చందమామ మాచిరాజు కామేశ్వరరావు తన బాల్యంలో మొదలు ఉత్తరాలు రాయటం ద్వారానే రచనలపై ఆసక్తి పెంచుకున్నారని గతంలో మనం తెలుసుకున్నాం. మనం ఉత్తరాలు బంధువులకు, స్నేహితులకు రాయటం ద్వారా, వారు రాసిన ఉత్తరాలు చదవటం వలన కూడా అనేక కొత్త ‘ విషయాలు’ తెలుస్తుంటాయి. ఒక్కోసారి అవే మనం కథలు రాయటానికి ‘కథా వస్తువులు’ అవుతాయి. ఈ రాకెట్ యుగంలో కూడా సెల్ ఫోన్ లో మాట్లాడటమే కాదు.. తీరిక సమయాల్లో ఉత్తరాలు కూడా రాయాలి. చందమామ కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు వందల కథలు బాలల కోసం రాశారు. ముఖ్యంగా మంచి దయ్యాల కథలు ! ఆయన కథల కోసం ‘కథా వస్తువులు’ ఎలా సేకరిస్తారో..వాటికి ప్రాణం ఎలా పోస్తారో ఆ టెక్నిక్స్, టిప్స్, రహస్యాలు ఈ క్రింద తెలిపిన విధంగా పంచుకున్నారు.
కథా వస్తువు అంటే..

- Advertisement -

కథ ద్వారా చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏమిటి అనేది? అది చదువు విలువను గురించి కావొచ్చు, దేశ భక్తి గురించి కావొచ్చు, పర్యావరణ పరిరక్షణ మీద కావొచ్చు, పరోపకారం గురించి కావొచ్చు !
ముందు ‘ విషయం ‘ ఏమిటి అనేది నిర్ధారించుకున్నాక అప్పుడు కథ ఎలా మొదలు పెట్టాలి, ఎలా కొనసాగించాలి, ఎలా ముగించాలి అనేది ఆలోచించుకోవాలి. కథ ఆసక్తిగా చదవడానికి శైలి ప్రముఖ పాత్ర వహిస్తుంది. బాల సాహిత్యం అంటే చిన్న చిన్న పదాలతో సరళంగా సాగాలి. ఆరంభంలోనే కథ చదవాలనే ఆసక్తి కలగాలి. కథ ముందుకు వెళుతున్నకొద్దీ తరువాత ఏం అవుతుంది అనే ఉత్సుకత కలగాలి. ముగింపులో ఎవరూ వూహించని కొసమెరుపు వుంటే కథ విజయం సాధించి నట్లే! నేను చాలా కథలు ప్రయాణంలో వూహించినవి, ఎదుటి వాళ్ళ మాటల్లో గ్రహించినవి అయివుంటాయి. పిల్లల కథలు వ్రాయాలంటే ముఖ్యంగా మన పెద్దలు చెప్పిన నీతి సూత్రాలు, పద్యాలు, సామెతలు అద్భుతంగా పనికి వస్తాయి. ఒక సామెతను పట్టుకుని, దాని చూట్టూ కథ అల్లుకోవచ్చు. నేను చందమామ కథలు రాసేటప్పుడు తరచు సామెతల పుస్తకాలను తిరగ వేసేవాడిని. ప్రవచన కర్తల ప్రసంగాలు వింటే కూడా మనకు మంచి కథలు రాసే వస్తువు దొరుకుతుంది. ఇప్పటి వరకూ బాల సాహిత్యంలో అత్యధిక కథల ‘ దురాశ దుఃఖానికి చేటు ‘ అనే సామెత చుట్టూ తిరిగినవే! ‘ అపకారికి ఉపకారం ‘ ‘ అతి సర్వర్త వర్జయేత్ ‘ ‘ ఉప్పు కప్పూరంబు ‘ ‘ నిదానం ప్రధానం’ ‘ ఆలస్యం అమృతం విషం’ వగైరా, వగైరా సామెతలు, పద్యాలు విషయంగా తీసుకుని బాల సాహిత్యంలో వేల కొద్దీ కథలు వెలువడ్డాయి. కాలానుగుణంగా ఇప్పటి సమస్యలు నీటి కొరత, ప్లాస్టిక్ వినియోగం, మొబైల్ వ్యసనం, గుడ్ టచ్ బాడ్ టచ్ , విద్యాలయాల్లో టీజింగ్ వగైరాలు కూడా వస్తువుగా తీసుకుని చక్కటి కథలు రాయవచ్చు. వస్తువు ఏదైనా ముఖ్యంగా అది మంచి కథ అనిపించు కోవాలంటే ముగింపు అద్భుతంగా వుండాలి. వర్ధమాన రచయితలు ఇప్పటి వరకూ వచ్చిన బాల సాహిత్య పోకడలు అధ్యయనం చేసి నప్పుడు గొప్ప కథలు రాయగలరు. కథలలో కేవలం నీతి మాత్రమే కాదు, పిల్లల చేత కథ చదివించే వినోదం, హాస్యం కూడా వున్నప్పుడే ఆ కథలు పిల్లలు ఆసక్తిగా చదువుతారు. మేము చందమామ కథలు రాసేటప్పుడు కథ అంటే నాలుగైదు పేజీలు వుండాలి. అందుకే అనేక పాత్రలు, అనేక సంఘటనలు కూర్చి నప్పుడే ఒక కథ అయ్యేది.అందుకే విస్తారమైన కథా వస్తువు అవసరం అయ్యేది. ఇప్పుడు అన్నీ ఒకటి, రెండు పేజీల కథలే. అందుకే కథలో పెద్దగా మలుపులతో పని లేదు. ఇప్పుడు చిన్న సంఘటన తీసుకుని కూడా కథ రాసే ప్రయత్నం చేయవచ్చు. సరిఅయిన వస్తువు ఎన్నిక చేసుకున్నప్పుడే మంచి కథ ప్రాణం పోసుకుంటుంది. గమనించారు కదా..మాచిరాజు కామేశ్వరరావు కథా రచనా రహస్యాలు. వారు పైన మనకోసం విప్పిన రహస్యాలు అనుకరించి సులువుగా కథలు రాయవచ్చు.
తెలంగాణా ప్రాంతం కోదాడకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త పుప్పాల కృష్ణమూర్తి. బాలసాహిత్యంలో
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం కీర్తి, సాహితీ పురస్కాలు అందుకున్నారు. బాలలకోసం ఎన్నో కథలు రాశారు. మరి పుప్పాల కృష్ణమూర్తి కథా వస్తువులు ఎలా ఎంచుకుంటారో..వాటిని కథగా ఎలా మలుస్తున్నారో తన అనుభవాలను, రహస్యాలను ఇలా పంచుకున్నారు. మనం చెప్పాలనుకున్న విషయాన్ని కథ ద్వారా తెలియపరచడమే “కథా వస్తువుగా” భావిస్తాను. రోగికి ఒక టాబ్లెట్ ఇచ్చి, మింగించేటప్పుడు షుగర్ కోటింగు చేసి మింగిస్తాము. అది కడుపులోకి పోయిన తర్వాత అసలు మందు పని చేయడం మొదలు పెడుతుంది. ఈ షుగర్ కోటింగ్ అన్నది సులభంగా తీసుకోవడానికి అనుసరించే ప్రక్రియ. ఇదే విధంగా మనం చెప్పాలనుకున్న విషయాన్ని అందమైన కథ రూపంలో పాఠకుడికి అందిస్తాము . కథలో స్థల కాలాదులు, ఎత్తుగడ, దృశ్యము, పాత్రలు, వారి సంభాషణలు, శైలి, శిల్పము, ముగింపు మొదలగు చాలా అంశాలు ఉంటాయి. వీటన్నిటి గురించి పిల్లలకు మొదలే చెప్తే గందరగోళములో పడిపోతారు. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టము కదా. కాస్త రాయడం వచ్చిన వారికి, అనగా కొన్ని కథలు రాసిన వారికి ఈ విషయాలు అర్ధమవుతాయి. అందుకే వాటి గురించి తర్వాత తెలుసుకుందాం.
మనం తీసుకున్న ఇతివృత్తాన్ని కథ రూపంలోకి మార్చే క్రమంలో ఇందులోని కొన్ని అంశాలైనా .. తప్పక అందులో నిబిడీకృతమై ఉంటాయి. నా అనుభవంలో చూసిన సంఘటన గురించి చెప్తాను. నేను సాధారణంగా ప్రతిరోజు ఉదయం వాకింగ్ కు లేదా ఈతకు వెళ్తాను. హుజూరు నగర్ లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలోకి వాకింగ్ కి వెళ్ళేవాడిని. ఓ సారి కాలేజీ ఎదురుగా చింతచెట్టు కింద భార్యాభర్తలిద్దరూ కొలిమి పెట్టుకుని కొడవళ్ళు, కత్తులు కత్తుల్లోనూ రకరకాల కత్తులు మాంసం కొట్టేవి, కల్లు గీసేవి, చెప్పు తోలును కోసేవి, ఇంటిలో కూరగాయలు కోసుకునేవి మొదలగినవి తయారు చేస్తున్నారు. భార్య సమ్మెటతో ధాతి మీద ఉన్న ఇనుప ముక్క మీద దెబ్బ వేస్తుంటే, భర్త సటీకంతో కొడుతూ, ఆ ఇనుముతో పరికరం తయారు చేస్తున్నాడు. నేను వస్తూ, పోతూ వారిని చూసేవాడిని. వాకింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ మైదానంలో రెండు గుర్రాలు కనిపించాయి గడ్డిమేస్తూ. ఒక గుర్రం బక్క చిక్కి ఉంది. రెండో గుర్రం కాస్త పుష్టిగా ఉంది. వాకింగ్ చేసుకుంటూ ఆ రెండు గుర్రాలని, చెట్టు కింద కొలిమి పెట్టుకుని పనిముట్లు తయారు చేస్తున్న బయటి కమ్మరి గురించి ఆలోచించినప్పుడు ఒక కథ పుట్టింది. అదే ‘ బక్క గుర్రం – బలిసిన గుర్రం’ కథ.
బక్క గుర్రం, బలిసిన గుర్రం అనే రెండు గుర్రాలు మైదానంలో మేస్తున్నప్పుడు బలిసిన గుర్రం బక్క గుర్రాన్ని” నీ యజమాని ఎవరు ? నువ్వు ఏం చేస్తుంటావు!?” అని అడిగింది. అందుకా బక్క గుర్రం ” మా యజమాని కొలిమి పెట్టి రైతులకు కావలసిన వ్యవసాయ పరికరాలు, బీద వాళ్లకు కావలసిన పనిముట్లు తయారు చేసి ఇస్తుంటాడు. వాళ్ళు ఇచ్చే, ఐదు పది రూపాయలు తోటి కుటుంబాన్ని సాదుకుంటూ, నా తిండికి కావలసిన ఉలవలు కొంటుంటాడు. గిరాకి బాగా వచ్చి పనిముట్లు అమ్ముడుపోతే, ఉలవలు కొని వండి పెడతాడు. పెట్టకుంటే పచ్చిక మీదనే ఆధారపడి బతుకుతాను . ఎందుకంటే తను పేదవాడు కనుక నాకు కావలసిన ఆహారాన్ని ఎక్కువ కొనలేడు. ఈ ఊళ్లో ఇంక పని లేదు అనుకుంటే, సామానంతా బండిలో వేసుకొని మరో ఊరికి పోతుంటాము . తిండి పెట్టినా, పెట్టకున్నా చాకిరీ తప్పదు !” అన్నది బక్క గుర్రం. దానికి బలిసిన గుర్రం, బక్క గుర్రం మీద జాలి చూపిస్తూ, తన శరీర ఆకృతికి , అందానికి గర్వపడిపోతూ ” నన్ను రేసుగుర్రం అంటారు. నా తిండి కోసం మా యజమాని నెలకు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెడతాడు. నా ఆరోగ్యం చూసుకోవడానికి ప్రత్యేకంగా ఒక డాక్టర్ ఉన్నాడు. ఇద్దరు పనివాళ్ళు ఉన్నారు. మా యజమాని నానా చెత్త కాకుండా, పుష్టికరమైన ఆహారాన్ని ఇస్తుంటాడు. నాకు పస్తులు ఉండటం అన్నమాట తెలియదు. నేను ఆరోగ్యంగా బలంగా ఉండి, అన్ని గుర్రాల కంటే ముందుగా పరిగెత్తితేనే, మా యజమానికి డబ్బులు వస్తాయి . నా మీద పందాలు కాసి అనేకమంది కోటీశ్వరులు అయ్యారు. బికారులు కూడా అయ్యారు! ” అంది గుర్రం గర్వంగా హావ, భావాలు ప్రదర్శిస్తూ.
అప్పుడా బక్క గుర్రం “ నేను సంసారాలు మోస్తుంటాను. నువ్వు సంసారాలని కూలుస్తుంటావు. అందుకే నేను ఇలా ఉన్నాను. నువ్వు అలా ఉన్నావు” అని అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. పై కథలో శారీరక కష్టం చేసే పేదవాడు ఆహార కొరతను ఎదుర్కొంటూ తిండికి తిప్పలు పడుతూ , బక్కగా ఉంటాడని, బలిసిన వాడు తిండి పుష్టి కలిగి, అందంగా, లావుగా ఉంటాడని, పరులను ముంచుతుంటాడని అంతర్లీనంగా తెలియజేయడం జరిగింది. ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పొచ్చు.
కథా వస్తువు అన్నది మన నిత్యజీవితంలో కనిపించే అనేక సంఘటనల నుంచి, ధృశ్యాల నుంచి ఆలోచనల మేరకు ఉద్భవిస్తుంది. నేను కథా వస్తువు ఎక్కడెక్కడ నుంచి తీసుకుంటాను అన్నది తెలియజేస్తాను.

  1. ఎక్కడ ఘర్షణ ఉంటుందో అక్కడ కథా వస్తువు దొరుకుతుంది. ఘర్షణ అంటేనే రెండు విభిన్న ఆలోచనలు కలిగిన వ్యక్తులు సంఘర్షించటం. అక్కడ ఏదో సమస్య ఉంటుంది. సమస్యను తెలుసుకొని మూలాలలోకి వెళితే మనకు సులభంగా ‘ కథా వస్తువు’ దొరుకుతుంది. రచయితలు వారి వారి ఆలోచనల మేరకు కథగా మలుచుకుంటారు.
  2. నేను ఎక్కువగా పల్లెల్లో ఉండే జానపదులను కలుసుకుంటూ ఉంటాను. నాగరికత అనే పైత్యం ఇంకా పట్టుబడని వారిని. వారు చెప్పే జానపద కథలు, గేయాలు అద్భుతంగా ఉంటాయి. ప్రపంచంలో ఏ రచయిత కూడా జానపద కథలు కంటే గొప్ప కథలు రాసి ఉండడు. నా కథలకు ఎరువుగా వానిని తెలుసుకుంటాను.
  3. నేను పల్లెలోకి పోయినప్పుడు, లేదా పట్టణంలో ఉన్ననూ, నాకంటే పెద్ద వయసు వాళ్లతో కూర్చొని వాళ్ల జీవితా అనుభవాలు అడుగుతుంటాను. అవి ఎంతో బాగుంటాయి. వివిధ వృత్తుల వారు తారసపడుతుంటారు వారు మాట్లాడే సంభాషణలో జీవితం ఉంటుంది. చిన్న కథ / పెద్ద కథ అయినా అందులోంచి అనేకం తీసుకోవచ్చు.
  4. అన్నిటికంటే ముందు కథ రాయాలనుకున్నవారు, మంచి చదువరి అయి ఉండాలి. విభిన్న కథలు, నవలలు, వ్యాసాలు,చదవడం- నాటకాలు, సినిమాలు మొదలగు దృశ్యమాధ్యమాలని చూడటం చేయాలి . ఇలాంటివన్నీ మనకు ‘ కథా వస్తువు ‘దొరకడానికి దోహదం చేస్తాయి. మన ఆలోచనల విస్తృతి పెంపు కోసం ఉపయోగపడతాయి.
  5. రచయిత కావాలనుకునే వారు ముందు వినడం నేర్చుకోవాలి. సమాజంలోని విభిన్న వ్యక్తుల బాధలు గాథలు వివరిస్తున్నప్పుడు, వాటిని పైపైన కాకుండా, సమస్యల మూలాల్లోకి వెళ్లి అంతర్ నేత్రంతో రచయిత దర్శించ గలగాలి.
  6. సమాజాన్ని లోతుగా పరిశీలించాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు వాటి మధ్య అంతరాలు వాటికి ప్రాతినిధ్యం వహించే మనుషులు ప్రవర్తించే తీరుపై కనీస అవగాహన ఉండాలి.
  7. మనం తీసుకున్న కథలోని పాత్రల స్వభావం, వాటి పరిమితులు, ఆయా ప్రాంత స్వభావముపై రచయితకు అవగాహన ఉండాలి.
  8. రచయిత అయినవాడు నిరంతరం చదువుతూ ఉండాలి. మారుతున్న సమాజ పోకడలు తెలిసి ఉండాలి. ప్రపంచ పరిణామం మొదలు, స్థానిక సమాజం వరకు కొంతమేరకైనా అవగాహన ఉండాలి.
  9. గత సాహిత్యమే కాక, సమకాలీన రచయితల రచనలు ఎప్పుడూ చదువుతూ ఉండాలి. రచనా రంగంలో వచ్చే మార్పులు , విభిన్న రచయితల రచనల పోకడలు, ఫిలాసఫీ, మొదలగునవి తెలిసి వస్తాయి.
  10. సాటి రచయిత ఓ మంచి కథ రాసినప్పుడు, అభినందించ గలిగే హృదయ సంస్కారం ఉండాలి. కుట్రలకు, కుతంత్రాలకు దూరంగా ఉండగలిగినవాడే సార్వజనిన సాహిత్యాన్ని సృష్టించగలడు. తన మనసులో మాలిన్యం లేకుంటేనే మంచి కథలు వస్తాయి. మంచి కథా వస్తువులు పుడతాయి.

పైన పేర్కొన్న పది విధాలుగా పుప్పాల కృష్ణమూర్తి కథా వస్తువులు సేకరిస్తూ వాటికి జీవం పోస్తున్నారు. ఈ ప్రముఖులు చెప్పిన తమ అనుభవాలు, సూత్రాలు ఆచరిస్తూ మనం సులువుగా ‘కథా వస్తువులు’ సేకరించవచ్చు.

( వచ్చేవారం ఏ వయసు బాలలకు ఎలాంటి కథా వస్తువులు ఎంచుకోవాలో తెలుసుకుందాం.)

——- పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
సెల్ : 92475 64699.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News