శాస్త్ర విజ్ఞానానికి, మత విశ్వాసాలను ఎప్పుడూ పొత్తు కుదిరని చాలా మంది భావన. అయితే ఆ భావన తప్పు అని నిరూపించారు, యోగి పుంగవులు, స్వామి జ్ఞానానంద. ఒక వైపు యోగాభ్యాసం కొనసాగిస్తూ, ధ్యాన నిమగ్నుడై, సమాధి స్థితికి చేరుకుని, విదేశాలలో భౌతిక శాస్త్రంలో రేడియో ధార్మికతపై విశేష పరిశోధనలు చేసి, వివిధ పదవులు నిర్వహించి, కర్మయోగిగా విఙ్ఞాన శాస్త్ర రంగంలో విశేష కృషి చేశారు. ఆల్బర్ట్ అయిన్ స్టెయిన్, జగదీశ్ చంద్ర బోస్, స్వామి జ్ఞానానంద వంటివారు ఆ రెంటికి ఉన్న అవినాభావ సంబంధాన్ని చక్కగా వివరిస్తూ రెండు ఒకదానికొకటి అవసరమని, అప్పుడే మానవ జాతి పురోగతి అని విస్పష్టంగా చెప్పి, ఆచరించి మార్గ దర్శనం చేశారు. మతం మరియు విజ్ఞాన సంశ్లేషణ మానవాళికి మేలు చేస్తుందని ఆయన నమ్మారు. యోగా సాధన మరియు సైన్స్ అధ్యయనం కొన్ని సారూప్యతలను కలిగి ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రాథమిక యోగ అభ్యాసాలు అంటే మనస్సు మరియు శరీరంపై పాండిత్యం పొందడానికి ఒక వ్యక్తికి శిక్షణ ఇవ్వడం అని నొక్కి చెప్పారు.
స్వామి జ్ఞానానంద పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దగ్గర గొరగనమూడి అగ్రహారంలో 1896 డిసెంబర్ 5న జన్మించారు. అయన అసలు పేరు భూపతి రాజు లక్ష్మీ నరసింహ రాజు. తండ్రి రామ రాజు మహా వేద విజ్ఞానఖని. నరసాపురం టైలర్ హైస్కూల్ లో ప్రాధమిక మాధ్యమిక ఉన్నత విద్య నేర్చి , తణుకులో చదివే రోజుల్లో 1908లో శ్రీ వాసుదేవానంద సరస్వతి ద్వారా ‘వాసు దేవ మంత్రం’ ఉపదేశం పొందారు. నాటి నుండి ఆద్యాత్మిక చింతనాను రక్తులై, వివాహం జరిగినా రామకృష్ణ పరమహంస లాగానే దాంపత్య జీవితం గడిపారు. తండ్రి లైబ్రరీలో ఉన్న అరుదైన వేదాంత గ్రంథాలన్నీ చదివి, దివ్యజ్ఞాన గ్రంథాలు రామకృష్ణ వివేకానంద గ్రంథాలు పఠించి బాలగంగాధర్ ఉపన్యాసాలతో ప్రేరితుడై అజ్ఞాతంగా ఉన్న త్యాగ వైరాగ్యాలు బయటపడి ,1917 డిసెంబర్ 21న స్కూల్ ఫైనల్ పరీక్షా ఫలితాలలో నంబర్ కనపడనందున, విరక్తితో ఇల్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్ళి పోయారు. ముందుగా నేపాల్‌లోని బుద్ధుడి జన్మ స్థలం లుంబిని వెళ్ళారు. ఆశ్రమాలలో నివసించి, అందుబాటులో ఉన్న ఆహారం తీసుకున్నారు. తర్వాత పదేళ్లు దేశ సంచారంలో, పెద్దల దర్శనలతో జీవితాన్ని చదువుకున్నారు. హిమాలయాలకు చేరి అక్కడ యోగాభ్యాసం చేస్తూ మరో పదేళ్లు సార్ధక జీవనం సాగించారు. వేదాధ్యయమాన్ని మాత్రం విడువ లేదు. పైగా అన్ని వేదోపనిషత్తుల సారాన్ని అవగాహన చేసి కొన్నారు. మానసిక వికాసం పొందారు. ఢిల్లీ, హరిద్వార్ మీదుగా ఋషీకేశ్ చేరి స్వర్గాశ్రమమలో సాధన చేశారు. ఫలితంగా శ్రీ కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం పొందేవారు. ఆయన తీవ్ర యోగ సాధన చూసి యోగి రాజ్ అని సంబోధించే వారు. తర్వాత ఆబూ పర్వతం చేరి, గురు శిఖరంపై ఉన్న దత్తాత్రేయ గుహలో ఆరు నెలలు పశ్చిమోత్తాన ఆసనంలో సాధన చేసి, నీలకంఠ మహాదేవ్ లో హఠయోగ ప్రక్రియలు సాధించి, సవికల్ప సమాధి పొంది శ్రీ కృష్ణ దర్శన భాగ్యం పొందేవారు. రుషీ కేశ్ లో శరశ్చంద్ర అనే సిద్ధ పురుషుడు ఆయన 25వ ఏట ఉపదేశం చేసి ‘స్వామి జ్ఞానానంద’ అనే దీక్షానామమిచ్చారు. గురువుల అనుమతితో బారాముల్లా వెళ్లి సంత్ సింగ్ గుహలో నాలుగు నెలలు ప్రాణాయామ ఆసన ధ్యానాలు చేశారు. శ్రీనగర్ కాళీ పర్వతంపై గుహలలో కొంత కాలం తపస్సు చేశారు. జాడీపురా యాపిల్ తోట కుటీరంలో ధ్యాన నిమగ్నుడై నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళేవారు. కైలాస మానస సరోవర యాత్రలు చేసి అక్కడ కూడా తపమాచరించి, యోగ సాధన అనుభూతులను స్వామి జ్ఞానానంద 30 పూర్ణ సూత్రాలుగా రాశారు .
యోగాలో బేసిక్స్ నేర్చుకొంటే మనసు, మెదడు, శరీరాలపై పూర్తి స్వాధీనం కలుగుతుందని సోదాహరణంగా ఉపన్యసహించే వారు స్వామీజీ. 1920లలో, మత ప్రసంగాలు ఇవ్వడం ప్రారంభించారు. అనేక భక్తి కవితలు రాశారు. పూర్ణ శాస్త్రాలు అయన ప్రధాన సంకలనం. ఇక దృష్టి భౌతిక విషయాలపై ఉంచి, 1930 ప్రారంభంలో జర్మనీ వెళ్ళి, గ్రాడ్యుయేషన్ చేశారు. చార్లెస్ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ డోల్షెక్‌తో కలిసి మూడేళ్లపాటు పని చేయడానికి చెకోస్లోవేకియాలోని ప్రేగ్‌కు వెళ్లారు. విశ్వ విద్యాలయంలో ఆయన పరిశోధన ఎక్స్-రే స్పెక్ట్రోస్కోపీలో ఖచ్చితమైన పద్ధతుల అభివృద్ధికి దారితీసింది. 1936లో లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగంలో పనిచేయడానికి అంగీకరించారు. 1940-43 మధ్య బీటా రే స్పెక్ట్రోస్కోపీపై ఆయన చేసిన కృషి ద్వారా పిహెచ్‌డి. సాధించారు. తరువాత యుఎస్‌కు వెళ్లి మిచిగాన్ విశ్వ విద్యాలయంలో అనేక రేడియోధార్మిక ఐసో టోపులతో బీటా రే స్పెక్ట్రోస్కోపీపై తన పరిశోధనను కొనసాగించారు. 1939 నుండి వ్రాస్తున్న ‘హై వాక్యూమ్; పై తన పుస్తకం రాయడం పూర్తి చేశారు.
భారత ప్రధాని నెహ్రూ ఆహ్వానంపై భారత దేశం వచ్చి, నేషనల్ ఫిజిక్స్ లేబరేటరి పరమాణు విజ్ఞాన పరిశోధనా విభాగం అధిపతిగా 17 ఏళ్ళు సేవలందించారు. 1954లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక విజ్ఞాన విభాగం మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసి, 10 ఏళ్ళు ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా పని చేసి, అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు. జూలై 1, 1956 న ప్రత్యేక న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం ప్రారంభించబడింది. 1958 నాటికి డిపార్టుమెంటుకు ఒక భవనం పూర్తయింది, అయన ప్రొఫెసర్, విభాగాధిపతిగా పదోన్నతి పొంది, 1965 వరకు ఆ పదవిలో కొనసాగారు. 1965 నుండి 69 వరకు ఎందరికో మంత్రం దీక్ష అనుగ్రహించారు.
స్వామి జ్ఞాపకార్ధం పరమాణు భౌతిక శాస్త్రంలోని ప్రయోగశాలకు స్వామి జ్ఞానానంద పరమాణు పరిశోధన ప్రయోగశాల (Swami Jnanananda Laboratories for Nuclear Research) గా నామకరణం చేశారు. జ్ఞానానంద రచించిన పూర్ణ సూత్రాలు తెలుగులోకి అనువదించబడ్డాయి. పరమాణు భౌతిక విజ్ఞాన ప్రాథమిక పాఠాలు, ఫిలాసఫీ ఆఫ్ యోగ, రాజయోగ గ్లిమ్సెస్, హై వాక్యుయా మొదలైనవి ఆంగ్లంలో ముద్రించబడ్డాయి.
పదవీ విరమణ చేసిన తరువాత, ఆయనను ఎమెరిటస్ ప్రొఫెసర్‌గా నియమించగా, మరణించే వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆచార్యోత్తములు, పరమహంస, దర్శనవేత్త, కర్మయోగి అయిన స్వామి జ్ఞానానంద 1969 సెప్టెంబరు 21 తేదీన సౌమ్య సంవత్సర భాద్రపద శుద్ధ దశమి ఆదివారం ఉదయం 7-45 గంటలకు 73వ ఏట పరమపదించారు.
- రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494
(నేడు స్వామి జ్ఞానానంద వర్ధంతి)