చాలామంది పండితులు వాల్మీకి రామాయణం పైన అనేక వ్యాఖ్యానాలు చేశారు. విశిష్ఠమైన కవి గుంటూరు శేషేంద్ర శర్మ మాత్రం రామాయణ మహార్ణవాన్ని చిలికి నిగూఢాంశాలను వెలికి తీసారు. వాల్మీకి రామాయణ కథను కావ్యగానంగా వినిపిస్తూనే శ్రీవిద్యను ప్రబోధించారని శేషేంద్ర ఏ విధంగా నిరూపించారో చెప్పడం ఈవ్యాసం ఉద్దేశ్యం. ఆయన పుస్తకం ‘షోడశి రామాయణ రహస్యములు’’ఒక విభిన్న సాహిత్య నిధి. శ్రీసుందరకాండము కుండలినీ యోగమని, సీత పరాశక్తికి ప్రతీక అనీ సాధికారికంగా రుజువు చేయడమే ఈ ‘‘షోడశి’’ సారం. స్వరూపం. శేషేంద్ర సంస్కృతభాషా పాండిత్య ప్రకర్షతో పాటు, విభిన్న స్తోత్ర సాహిత్యాల్లో సమానార్థకాలను వివరించే విశ్లేషణ కనిపిస్తుంది. శ్రీసుందరకాండలో శ్లోకాలకు, లలితా సహస్రనామంలో సంస్కృత సమాసాలకు ఉన్న సమానత, శంకరుని సౌందర్య లహరిలో కొన్ని పదబంధాలకు, సమాసాలను కూడా సుందరకాండ శ్లోక వాక్యాలతో సరిపోల్చారాయన.
తదున్నసమ్ పాండురదంత మవ్రణమ్
శుచిస్మితమ్ పద్మపలాశలోచనమ్
ద్రక్ష్యే తదార్యావదనమ్ కదాన్వహమ్
ప్రసన్నతారాధిపతుల్యదర్శనమ్
అని ప్రసిద్ధమైన వాల్మీకి శ్లోకం. లంకలో సీతను వెదుకుతూ హనుమ నోట పలికించినదిది. ఆదికవి అనేక ఇతర శాస్త్రాలను నేపథ్యంలో ఉంచుకుని, శాస్త్ర స్పర్శ గల్గిన అర్థాలను స్ఫురింపజేసే శ్లోకాలను అల్లారు. ఇటువంటి కావ్యాలకు, ఇతర స్తోత్ర శాస్త్రాలకున్న పరస్పర సంబంధాలను శేషేంద్రఆవిష్కరించారు. ఈ వ్యాసంలో కేవలం ఒక్క అధ్యాయం గురించే ప్రస్తావన. ఇటువంటి రహస్యాలు ఇతర అధ్యాయాలలో ఎన్నో ఉన్నాయి.
కోరికలు కోరుతూ సుందరకాండ పారాయణం చేసేవారి సంగతి పక్కన బెడదాం. శ్రీసుందరకాండము వాల్మీకీయ రామాయణమునకు హృదయమనీ ఆ హృదయమునెరిగతే చాలుననీ ప్రబోధిస్తారు శేషేంద్ర. ’అందలి మహార్థములు తల్లి కృపవలన తోచిన వరకు కొన్ని మనవి చేతున’న్నారు. రామాయణమే గాయత్రీ గర్భితమంటూ ఇదొక రహస్య కోశమనడానికి బ్రహ్మాండ పురాణంలో ’’సమస్తమంత్ర రాజోయం ప్రబలో నాత్ర సంశయం‘‘ అనీ, ’’బీజకాండమితి ప్రోక్తం సర్వ రామాయణేష్వపి‘‘ అనే ప్రమాణాలు చూపారు. సుందరకాండ మొత్తం ఒక మహా మంత్రమనీ, దీని పారాయణచేత కలుగని సిధ్ది లేదని బ్రహ్మశాసనమనీ అర్థం వివరించారు.
సుందరకాండం అంటే సౌందర్యకాండమంటూ ‘సౌందర్యం సర్వదాయకం అనడంలో సౌందర్యం ఏమిటి? శంకరాచార్య సౌందర్యలహరిలోని సౌందర్యం, లలితా సహస్రనామ స్తోత్రం సౌందర్యం, శ్రీమహా త్రిపుర సుందరీ విద్యా విషయములు, లలితా త్రిశతియందు కూడా ఉన్న సౌందర్య ఉపాసన’ ఉన్నదన్నారు. బ్రహ్మాండ పురాణంలో శ్రీరామధ్యాన పద్ధతులను ఒక్కొక్కకాండమునకు ఒక్కొక్కటి చొప్పున వివరిస్తూ సుందరకాండమును చంద్రబింబ సమాకారంతో పోల్చారని వివరించారు. ‘షోడశ నిత్యా ప్రపూర్ణయగు శక్తికి ఇది విశేషణం’ అని సమన్వయించారు. చంద్రుని షోడశ కళలు, దేవీ షోడశ నిత్యలు సమానములని సౌందర్యలహరిలో 32 శ్లోకం పైన లక్ష్మీధర వ్యాఖ్యలో కూడా ఉందని మరో ప్రామాణికం చూపారాయన.
ఎవరో ఉపాసకుడు ఇష్టదేవతా సాక్షాత్కారము ఎప్పుడగునో అని పడే ఆవేదన ’తదున్నసమ్‘ శ్లోకంలో శేషేంద్రకు కనిపించింది. ఆర్యావదనమ్ అన్న మాటలో పరాశక్తి అనిపించింది. పద్మపలాశలోచనమ్ అంటే ’యా సా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయతాక్షీ‘ అనే శ్రీసూక్త పదబంధాలను గుర్తుకు తెస్తుంది. ’’శుద్ధాయై నమః, దరస్మేర ముఖాంబుజాయై నమః, విమలాయైనమః, పద్మనయనాయై నమః, తాపత్రాయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రికాయైనమః, రాకేందు వదనాయైనమః‘‘ అనే లలితా సహస్రనామాలకు శ్రీసుందరకాండములో సీతకు వాల్మీకి మహర్షి వాడిన ఉపమానములకు సరిపోతాయనీ ఇవన్నీ పరాశక్తి అన్వయములేననీ, కొన్ని భావములు కుండలినీ శక్తి పరముగా వాల్మీకిఅన్వయించారన్నారు. అందుకు అనేక దృష్టాంతములను షోడశి పుస్తకంలో చదవవచ్చు. ఈ అర్థాలు తెలుసుకుంటూ మొత్తం శ్రీసుందరకాండను పరిశీలించిస్తే అందులో గుప్త స్వరూపము సాక్షాత్కరిస్తుందని శేషేంద్ర వివరించారు. ప్రమాణాలను విశ్లేషిస్తూ శబ్దాశ్రితములు, భావాశ్రితములు, ప్రకరణాశ్రితములు అని వర్గీకరించారు. సీత ప్రతిపత్కళ అనీ, ధ్రువ కళ అనీ, ఆ ప్రతిపత్కళయే పరాశక్తి అనీ వాల్మీకి ఉపమానాలు వాడినారని శేషేంద్ర వివరణ.
తాం స్మృతీమివ సందిగ్ధాం బుద్ధింనిపతతితామివ,
విహతా మివచ శ్రద్ధా మాశాం ప్రతిహతా మివ
సోపసర్గాం యథా సిద్ధిం బుద్ధిం సకలుషామివ,
’’అభూతేనాపవాదేనకీర్తిం నిపతితామివ‘‘
అని అశోకవనంలో శోకించే సీత స్థితిని వివరించారు. అంటే ‘‘సీత సందిగ్ధమైన స్మృతి వలె నున్నది. పతితమైన బుద్ధి (సంపద) వలె, నిహతమైన శ్రధ్ధ వలె, ప్రతిహతమైన ఆశవలె, విఘ్నముగల సిద్ధివలె, సకలుషమైన బుద్ధి వలె, అపవాదముచేత పతితమైన కీర్తివలె, విచ్ఛిన్నమయిన ఆయతి వలె, లోపింపబడిన ఆజ్ఞవలె ఉన్నది. ఎంత గొప్ప ఉపమానాలు ఇవి? సీత భర్తతో కలిసి ఉండి ఉంటే ఆమె స్మృతి, బుద్ధి, శ్రద్ధా, ఆశ, సిద్ధి, బుద్ధి, కీర్తి, ఆయతి, ఆజ్ఞల వలె ఉంటుందన్నదే వాల్మీకి భావమని చెప్పారు. ’ఈ అసామాన్యములైన ఉపమానములు మహర్షికెట్లు స్ఫురించెనో కదా‘ అని ఆశ్చర్యపోతూ ఈ స్మృత్యాది శబ్దములన్నీ జగన్మాత పరాశక్తి నామములని తేల్చినారాయన. దేవీ సప్తశతి లోని ఏయే అధ్యాయములలో ఆ నామముల ప్రస్తావన ఉందో పేర్కొన్నారు. దేవీ భాగవతములో కూడా ఇటువంటి పోలికలను చూపారు. భావాశ్రితములైన శాస్త్రధ్వనులను వివరిస్తూ సీత కుండలినీ శక్తి అని వాల్మీకి ఏ విధంగా సూచించారో శేషేంద్ర చాలా ఉదాహరణలతో వివరిస్తారు. అనేక సార్లు సీతను తాపసి అనీ, తపస్వినీ అని వాల్మీకి సంబోధిస్తారు. ఏదైనా రహస్యము సూచించదలచినచో ఒక శబ్దమును పలుమార్లు ప్రయోగించడం వాల్మీకి లక్షణం అన్నారు. మనం ఒకసారికాకపోయినా రెండో సారో లేక అయిదోసారో గుర్తిస్తామని, గుర్తించాలని వాల్మీకి తపన. సీత పరాశక్తి, తపస్వినీ అని చెప్పడమే వాల్మీకి ఉద్దేశ్యము అని శేషేంద్ర తేల్చారు. ’’భూమౌ ఆసీనాం‘‘ అని సీత భూమి యందు కూర్చుని యున్నదని చెప్పడం వెనుక విశేషార్థమున్నదని గమనించాలి. ఆ పదం యాదృచ్ఛికంగా వాడింది కాదు. సామాన్యవిషయమే అని వదలకుండా కావాలని మనం చర్వణం చేయడం కోసం వాడినదని అర్థం చేసుకోవాలని వివరించారు రచయిత.
అట్లాగే ’సర్పాకారము‘ అని ’పన్నగేంద్ర వధూమివ‘ అని ఆడుపాము వలె చుట్టుకుని యున్నదని ఆదికవి వర్ణించారు. ఇది కావ్యరామణీయకము కాదు. పరిపాటిగా వాడే ఉపమానమూ కాదు. ’పన్నగ‘ తోపాటు ’వధూ‘ శబ్దమును కలిపినారు. ’భుజగ నిభమధ్యుష్ట వలయ‘ అని ఆదిశంకరులు ’సౌందర్యలహరి‘లో శక్తిని వర్ణించిన రీతిలోనే ఈ వర్ణన కూడా ఉందని శేషేంద్ర విశ్లేషించారు. కుండలినీ మూలాధార చక్రమున చుట్టచుట్టుకొని సర్పాకారముతో ప్రలపించుచుండునట. ఊరుపులతో ఉదరమును, బాహువులతో పయోధరములను, కప్పుకుని సీత ఏడ్చుచున్నదట. అంటే శరీరమును చుట్టచుట్టుకొని అని యే గదా? ఇదే అధ్యుష్ట వలయం, ఈ స్థితినే లక్ష్మీధర వ్యాఖ్యలో ’’ముఖేన పుచ్ఛం సంగృహ్వ‘‘ అని వర్ణించారు. ’’అధోముఖ ముఖీ బాల విలప్తు ముపచక్రమే‘‘ అని వాల్మీకి మరొక చోట సీతను బాలగా వర్ణిస్తారు. బాల అనడం ఇక్కడ పరాశక్తిని సూచిస్తున్నదని శేషేంద్ర అన్వయించారు. ’’సీత సర్పాకారముతో ముఖమున పుచ్ఛముంచుకుని మూలాధారమున ప్రలపించుచుండు కుండలినీ శక్తి‘‘ అని మహర్షి సూచించుట చేతనే మహర్షి హనుమ చేత 16 వ సర్గ యందు ‘‘ఈమెయే నా అన్వేషణా ఫలితమని చెప్పించును‘‘ అని శేషేంద్ర వివరించారు. మరొక చోట ’హలముఖ క్షత‘ అనే శబ్ద ప్రయోగంపైన శేషేంద్ర అద్భుతమైన విశ్లేషణను వివరణను షోడశి పుస్తకం 42-43 పేజీలలో చదవవలసిందే.
ఇంకొక చోట రావణునితో సీత …’’ఈ త్రిలోకములందు నీవుగాక మరెవ్వరును ధర్మాత్ముని పత్నినైన నన్ను కోరరు‘‘, అని చెప్పడంలో ’’నేను ముల్లోకములకు తల్లిని నన్నెవ్వరు ఇట్లు కోరరు. నీవు కోరుట నీ వినాశమునకే‘‘ అనే అర్థం ఉంది. ’’సామాన్యకావ్యార్థమే అయినచో ముల్లోకముల సంగతి ఏల? ఆమె జగన్మాత అని ధ్వనించుటకే ఈ విధంగా వాల్మీకి చెప్పా‘‘రని శేషేంద్ర వివరిస్తారు. హనుమ నీవెవరవు అని అడిగినప్పుడు ’’నేను రాముని యింట 12 ఏండ్లు మానుష భోగములు అనుభవించుచుంటిని‘‘ అని సీత చెప్పినారట. అంటే తాను ’’మానుషేతర కాంతనే అయినప్పడికీ మానుషీ రూపమున సంచరించుచున్నాన‘‘ను భావము గోచరిస్తున్నదని కనుక లోతుగా పరిశీలించినట్లయితే ’’నేను కేవలము మానుష కాంతనని భ్రమింతువేమో నన్ను సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి గా ఎఱుగుము‘‘ అని సూచన అనీ, ’అహం సర్వ కామ సమృద్ధినీ‘ అని అనుట ముఖ్యము. ’’దేవీ భాగవతములో మాతశ్శంకరి కామదే‘‘ అనీ ’’అశ్వదాయి, గోదాయి, ధనదాయి, మహాధనే దినంమే జుషతాం దేవి సర్వ కామార్థ సిద్దయే‘‘ అని శ్రీ సూక్తములోనూ, ’’ఓం కామ్యాయై నమః‘‘ అని లలితా సహస్రనామస్తోత్రంలో పోలికలను రచయిత చూపారు. రామ వియోగ దుఃఖము చేత తన హృదయము బ్రద్దలగుట లేదు. ’’నా హృదయము పాషాణము గానీ లేక అజరామరము గానీ అయి ఉండును‘‘ (అశ్మసారమిదం నూన మథవా ప్యజరామరం హృదయం మమయేనేదం నదుఃఖే నావశీర్యతే) అని సీత మరొక సందర్భంలో అనడాన్ని ప్రస్తావిస్తూ, ’పాషాణము‘ అంటే అక్కడ సరిపోయేది. కాని ’అజరామరము‘ అని వాడడం వల్ల అది మంత్ర హృదయమవుతున్నదని రచయిత భావన. ’’ఆమె హృదయము ఆనందము, కనుకనే దుఃఖేనావశీర్యతే అనగా దుఃఖముచేత నశించనిది, ఆనందలబ్ది కలిగిన వాడు దుఃఖమున కతీతుడు, దుఃఖము వానినంటదు, ఆ ఆనందము అజరామరము, లేక అశ్మసారము.అశ్మసారము అంటే పరమాత్మవలె బలమైనది, యుక్తమైనది, శ్రేష్టమయినది, స్థిరమైనది. శబ్దములను వాటి స్వరూప స్వభావములనెఱిగి, ఆ సందర్భమును బట్టి, విశేషార్థములు సూచించాలన్న లక్ష్యంతో సూచ్యప్రాయముగా ప్రయోగిస్తూ రహస్యాలు అందించడమే మహర్షి వాల్మీకి చేసిన ప్రయత్నం‘‘ అని శేషేంద్ర వివరించారు. వాల్మీకి ఎంత గొప్ప ప్రయోజనాన్ని తెలియజెప్పేందుకు ఎంతటి శబ్దాలను ప్రయోగించారో ఆయన కావ్య రచనా వైభవం ఎంత అద్బుతమో వివరిస్తారు.
మరొకచోట ’’మయా రామస్య రాజర్షే ర్భార్యయా పరమాత్మనః‘‘ అని సీత హనుమకు చెప్పినమాట. అంటే సీత తాను పరమాత్మ భార్య అని నిర్ద్వంద్వంగా ప్రకటించింది. భక్తుడైన హనుమ సీతను పరాశక్తిగా జగన్మాతగానే గుర్తించినాడు. అందుకే ‘‘తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమ ద్యథేతరత్‘‘ అని పోల్చుకున్నాడట. అంటే ఇదివరకు ఆమె కట్టిన వస్త్రముఅదే (రావణుడు అపహరించడానికి పూర్వమున్నదే) ‘‘ఎట్లనగా పూర్వమున్న వర్ణమెట్లు శ్రీమత్తో అట్లేయిదియును శ్రీమత్తు. ఇది కనిపించే వాచ్యార్థము. వర్ణము శ్రీమత్ అనుటకు కాంతిమంతమని అర్థము చెప్పితే సరిపోదు. సీతను శ్రీం అనే బీజాక్షరముతో అభిన్నమని ఎఱిగిన వాడు హనుమ అని వాల్మీకి సూచిస్తున్నాడనే సూచ్యార్థాన్ని గమనించాలి’’. అదే రహస్యమనీ శేషేంద్ర వివరించారు.
వాల్మీకి కవి భావాల్ని మనమంతా గమనించాలని శేషేంద్ర ఆరాటం. కవి భావాన్ని తెలుసుకోకపోవడాన్నిచాలా విమర్శించారు. ’’మహర్షి గరుత్మంతుడై ఎగురుచుండగా ఆయననందుకొనుటకు మనం కాకియై ప్రయత్నించడం వంటి‘‘దట. ఇది పరిశీలనా చక్షువులకు ముముక్షువులకు గోచరించకపోదు అని శ్రీ శేషేంద్ర నమ్మకం. నిజానికి శేషేంద్రకున్న ఇంతటి పరిశీలనా చక్షువు మరెవరికైనా ఉంటుందా?
అప్పుడు ఇంత విస్తరంగా వాల్మీకి చెప్పిన ఆ ధ్వనిని గుర్తించకపోతే ’’అది పురాకృత దుష్కృత ఫలితమే గాని అచ్చట అట్టి ధ్వని లేకగాదు‘‘ అని వ్యాఖ్యానించారు. మన పురాకృత పుణ్య విశేషం మహాకవి శేషేంద్ర ఈ రహస్యాలను వివరించడం.
శ్రీసుందరకాండమంతా ఈ విధంగానే రహస్యాలతో నిండి ఉంది. భాషామాత్ర పాండిత్యంతో ఇది అర్థం కాదు. ఇది పరమార్థం. అహంకారం చూడనీయదు. దురభిమానం అర్థం చేసుకోనీయదు. అన్యథా కలుగులాభాలను చూసే వారికి ఇది అర్థం కాదు. మహర్షి జిజ్ఞాసువు. కనుక యోగి అయిన హనుమతో ఈ విధంగా చెప్పించారు (మనకు). ఈ రహస్యాలు ఎంత చెప్పినా అర్థాంతర విషయములను వ్యంగ్యార్థములను గురించి ఇట్టి పరమార్థముల గురించి ఎంత వివరించినా చాలామంది అహంకార దురభిమానులకు ఆ బుద్ధి శోభించే అవకాశం లేదు. అట్టివారు కార్యములను పాడు చేయుదురు. వారికి కార్యసిధ్ధికలుగదు. ఇట్టిమహార్థములు గోచరింపవు. మరొకరు చెప్పినను వారి పూర్వజన్మ దుష్కృతము వారి నానందింపనీయదు అని రచయిత తీవ్రంగా విమర్శించారు. ఇదంతా ’’శ్రీసుందరకాండ పేరెట్లు వచ్చినది?‘‘ అనే అధ్యాయంలో శేషేంద్రశర్మ వివరించారు.
- మాడభూషి శ్రీధర్