Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Alimony for Muslim women BJP hails SC verdict: సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

Alimony for Muslim women BJP hails SC verdict: సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు

క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్ లోని సెక్షన్‌ 125 ప్రకారం ముస్లిం మహిళలకు కూడా భరణం వర్తిస్తుందంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏ విధంగా చూసినా చరిత్రాత్మకమైనదనే చెప్పాలి. చట్టం ప్రకారం ఏ హక్కయినా అందరికీ సమానమేనని, దీన్ని ఆచార, సంప్రదాయాలు, మత నిబంధనలు, ప్రత్యేక చట్టాలేవీ తీసేసుకోలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విడాకులు తీసుకున్నప్పుడు మహిళలకు చెల్లించేది భరణమే తప్ప దానం కాదని, అది వారి ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బి.వి. నాగరత్న, అగస్తీన్‌ జార్జ్‌ మాసీ తేల్చి చెప్పారు. ఎవరు ఏ మతానికి చెందినవారైనా, వారి విడాకుల విధానం ఎటువంటిదైనా ఈ ప్రాథమిక హక్కు తప్పనిసరిగా వర్తిస్తుందని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్ సెక్షన్‌ 125 కింద తన భార్యకు విడాకుల అనంతరం భరణం ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును మహమ్మద్‌ అబ్దుల్‌ సమద్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దానిపై సుప్రీంకోర్టు ఈ రూలింగ్‌ ఇచ్చింది. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాలా, వద్దా అని నిర్ణయించవలసింది ముస్లిం మహిళల (విడాకుల హక్కుల పరిరక్షణ) చట్టం (1986) మాత్రమేనని సమద్‌ వాదించారు. అయితే, సుప్రీంకోర్టు ఈ వాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. సెక్షన్‌ 125 ఒక లౌకిక చట్టమని, ఇది మతంతో సంబంధం లేకుండా మహిళలందరికీ వర్తిస్తుందని, ముస్లిం మహిళలు ఈ చట్టం కింద భరణం పొందడానికి పూర్తిగా అర్హులని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
కాగా, ఈ తీర్పు ఒక విధంగా షా బానో కేసును తిరగదోడింది. సెక్షన్‌ 125 కింద విడాకులు పొందిన మహిళలు భరణం పొందడానికి అవకాశం ఉందని అప్పట్లో షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. షా బానో కేసు తర్వాత 1986 నాటి చట్టాన్ని అమలులోకి తీసుకు రావడం జరిగింది. సెక్షన్‌ 125 ప్రకారం ముస్లిం మహిళలకు లభించే హక్కుకు ఇది పరిమితులు విధించే విధంగా ఉంది. అయితే, సెక్షన్‌ 125కు పరిమితి విధించే హక్కు, అధికారం ఏ చట్టానికీ లేవని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ఈ సెక్షన్‌ కింద అనేక సంవత్సరాలుగా న్యాయస్థానాలు వెలువరిస్తున్న తీర్పులు ముస్లిం మహిళలకు సమాన హక్కులు కల్పిస్తూ వస్తున్నాయని, ఈ సెక్షన్‌ అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు సమానంగా వర్తిస్తుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు భరణం ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్టు ఈ తీర్పు ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఇక 2001లో జరిగిన డేనియల్‌ లతీఫ్‌ కేసులో కూడా సుప్రీంకోర్టు ముస్లిం మహిళలకు అనుగుణంగానే రూలింగ్‌ ఇవ్వడం జరిగింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కో్‌డ ప్రకారం ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులంటూ 2009లో కూడా ఒక తీర్పు నిచ్చింది.
ఇది ఇలా ఉండగా, విడాకులు పొందిన ముస్లిం మహిళలు సెక్షన్‌ 125 కిందే కాకుండా, 1986 నాటి ముస్లిం మహిళల రక్షణ చట్టం కింద కూడా భరణం పొందవచ్చని పాట్నా హైకోర్టు రూలింగ్‌ ఇచ్చింది. ముస్లిం మహిళలకు భరణం ఇవ్వడానికి సంబంధించి అనేక పర్యాయాలు సుప్రీంకోర్టుతో సహా అనేక న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినప్పటికీ, దీనిపైన న్యాయస్థానాలను ఆశ్రయించడం ఆగలేదు. ప్రత్యేక చట్టంగా రూపొందించిన 1986 నాటి చట్టమే సెక్షన్‌ 125 కంటే శక్తివంతమైనదనే వాదన కొనసాగుతూనే ఉంది. ఈ సుప్రీంకోర్టు దీనిపై చివరిసారిగా స్పష్టమైన తీర్పునిచ్చింది. విడాకులు పొందిన ముస్లిం మహిళలు సెక్షన్‌ 125, 1986 నాటి చట్టం మధ్య దేనినైనా ఎంచు కోవచ్చని సుప్రీం కోర్టు పునరుద్ఘాటించింది. ఇతర చట్టాలన్నిటికంటే రాజ్యాంగమే ఉన్నతమైందని, సమాన హక్కులనేవి అందరికీ తరతమ భేదం లేకుండా వర్తిస్తాయని చెబుతూ, ముస్లిం మహిళలకు కూడా అన్ని హక్కులూ వర్తిస్తాయని, ఆర్థిక, సామాజిక సమానత్వ సూత్రాలకు వారు అర్హులేనని అది తేల్చి చెప్పింది. గత కొన్ని దశాబ్దాల కాలంలో భారతదేశం సమానత్వపరంగా ఏమేరకు పురోగతి సాధించిందనేది ఇటువంటి చట్టాలు, తీర్పులు చెప్పకనే చెబుతున్నాయి. రాజకీయాలు, ఘర్షణవాదాలకు అతీతంగా ఉమ్మడి పౌర స్మృతి వైపు అడుగులు వేయడానికి ఇది నాంది పలికింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News