దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ‘ఇండియా’ పేరుతో 28 పార్టీలతో ప్రతిపక్ష కూటమి ఏర్పడిందో లేదో, పత్రికా స్వేచ్ఛ మీద దాడి ప్రారంభం అయిపోయింది. దేశంలోని 14 మంది టీవీ యాంకర్లను బహిష్కరిస్తూ ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల క్రితం ఇందుకు సంబంధించిన జాబితాను కూడా విడుదల చేసింది. నిజానికి ఇది ఆందోళన కలిగించే పరిణామం. కొన్ని టీవీ చానళ్లలో నిర్వహించే చర్చలు, గోష్టులలో రాజకీయ నాయకులను మోతాదు మించి విమర్శించడం, అవమానించడం, దుర్భాషలాడడం వంటివి నిత్యకృత్యాలయిపోయాయి. తాము బహిష్కరించిన చానళ్లు, యాంకర్ల విషయంలో ఇండియా కూటమి నాయకుల ఫిర్యాదు ఏమిటంటే, యాంకర్లు ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తేయడం, ప్రతిపక్షాలను అధోగతికి లాగేయడం చేస్తున్నారు. మరో ఆరోపణ కూడా వారి నుంచి వినవచ్చింది. తమకు డబ్బు చెల్లించినవారికి ఎక్కువగా అవకాశాలివ్వడం, వారితో ప్రతిపక్షాలను లేదా ప్రత్యర్థులను తిట్టించడం కూడా నిత్యకృత్యమై పోయిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. యాంకర్లు తమ వృత్తికి సంబంధించిన బాధ్యతలకు, విలువలకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదని ప్రతిపక్షాలు అభిప్రాయ పడుతున్నాయి.
కొందరు యాంకర్లు చర్చలు, గోష్ఠుల సమయంలో జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నా, మధ్య మధ్య తమ పక్షపాత వైఖరిని ఏదో విధంగా ప్రదర్శిస్తూనే ఉన్నారని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. పార్టీల మధ్య చిచ్చుపెట్టడానికి, ద్వేషాన్ని రగల్చడానికి కూడా ప్రయత్నిస్తున్నారని ఇది విమర్శిస్తోంది. అయితే, ఇందుకు సమాధానంగా ఇండియా కూటమి తీసుకున్న చర్యలు ఈ కూటమి లక్ష్యాలను, ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దేశంలో అసమ్మతికి, విమర్శలకు స్థానం లేకుండా పోతోందని, విమర్శలు చేసేవారిపై దాడులు జరపడం ఎక్కువైపోయిందని విమర్శించే ప్రతిపక్షాలే ఈ విధమైన బహిష్కరణ చర్యలకు ఒడిగట్టడం వల్ల వారి పత్రికా స్వేచ్ఛ లక్ష్యంతో పాటు ఇతర లక్ష్యాలకు కూడా విలువ లేకుండా పోతోంది. వృత్తి విలువలకు కట్టుబడి, నిజాయతీగా, నిబద్ధతగా వ్యవహరించే మీడియా ప్రతినిధులు, యాంకర్ల మీద కూడా దీని ప్రభావం పడుతోంది. ఇది పత్రికా స్వేచ్ఛకు విఘాతంగా మారుతోంది.
విచిత్రమేమిటంటే, ఈ కూటమిలోని భాగస్వామ్య పక్షాలు సైతం తమ రాష్ట్రాలలో, తమ ప్రాంతాలలో, తమకు చెందిన ఛానల్స్ లో ఇదే విధమైన ద్వేషపూరిత వ్యవహారాలను కొనసాగించడం జరుగుతోంది. ఇదే విధంగా పాలక పక్షం మీద అవాకులు, చవాకులు ప్రచారం చేయడం జరుగుతోంది. దేశంలో లౌకికవాద, ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరిస్తామని పాట్నా సమావేశంలో ఘనంగా ప్రకటించిన ఇండియా కూటమి పార్టీలు పత్రికా స్వేచ్ఛ విషయంలో తమలోని అసహనాన్ని అనేక విధాలుగా వ్యక్తం చేస్తున్నాయి. ఈ కూటమి సభ్యులు సైతం చెప్పేదొకటి చేసేదొకటి అనే అభిప్రాయం బయటికి వస్తోంది. ఈ కూటమిలోని 28 పార్టీలలో 11 పార్టీలు వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాయి. ఇందులోని జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ అనేక సంవత్సరాలు కేంద్రంలో అధికారం చలాయించింది. అవి పత్రికా రంగంలో ఇటువంటి కుహానా విలువలనే ఇతోధికంగా ప్రోత్సహించాయి. తర, తమ బేధాలు పాటించాయి. చర్చల ద్వారా, సంప్రదింపుల ద్వారా పరిష్కరించు కోవాల్సిన సమస్యల్ని ద్వేషపూరితంగా అడ్డుకున్నాయి.
నిజానికి ఇటువంటి రాజకీయాలు, కార్యకలాపాల కారణంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రతీకార రాజకీయాలే బీజేపీని పెంచి పోషించాయి. అసమ్మతిపై అసహనాన్ని వెళ్లగక్కాయి. ఇప్పటికీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రతిపక్షాలు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. సంకుచిత రాజకీయాలను అనుసరించే విషయంలో, స్వార్థ ప్రయోజనాల కోసం పత్రికలను వాడుకునే విషయంలో ప్రతిపక్షాలు కూడా ఏమాత్రం వెనుకబడి లేవనేది నిర్వివాదాంశం. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ సంస్థ స్వేచ్ఛగా, స్వతంత్రంగా వ్యవహరించినా సహించేది కాదన్నది అందరికీ అనుభవైకవేద్యమే. ఇప్పుడు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు మీడియాతో సహా ప్రతి రాజ్యాంగ సంస్థనూ ఉక్కుపాదంతో అణగదొక్కేస్తున్నాయి. దేశంలోని 14 మంది యాంకర్లను బహిష్కరించడం వల్ల ఇండియా కూటమికి ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. దాని విజయావకాశాలను పెంచకపోవచ్చు.