Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్30 Vs 24 parties: ఎన్డీఏ వర్సెస్ యూపీఏ

30 Vs 24 parties: ఎన్డీఏ వర్సెస్ యూపీఏ

తెరపైకి మళ్లీ అతుకుల బొంత కూటములు

24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో భేటీ అయి ఉమ్మడి అభ్యర్థులను లోక్ సభ బరిలోకి దించేందుకు కరసత్తు చేస్తున్నాయి. రెండు రోజులపాటు సాగే ఈ భేటీలో తరువాతి అడుగులు వేసేలా చర్చలు చేపట్టే ప్రయత్నంలో ఉన్నాయి విపక్షాలు. మూడు వారాల క్రితం పట్నాలో జరిగిన భేటీకి కొనసాగింపుగా ఈ సమావేశం బెంగళూరులో జరుగుతోంది. మొదటి రోజు భేటీకి రాకుండా రెండోరోజు వస్తున్నట్టు ఇప్పటికే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ఇటు అజిత్ పవార్ వర్గం శరద్ పవార్ తో భేటీ అవ్వటం మరో పెద్ద మలుపన్నది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం.
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, వీసీకే, ముస్లిం లీగ్, ఎండీఎంకే, సీపీఐ, సీపీఎం, శివ సేన, తృణముల్, సమాజ్వాదీ, డీఎంకే, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, పీడీపీ, ఐయుఎంఎల్, కేరళా కాంగ్రెస్, కేరళ కాంగ్రెస్ (ఎం) ఈ భేటీలో పాల్గొంటున్నాయి. చెప్పేందుకు 24 పార్టీలైనా వీటిలో చాలామటుకు ఉన్నవన్నీ ప్రాంతీయ, ఉపప్రాంతీయ పార్టీలే, దేశవ్యాప్తంగా వీరు ఎంతవరకు ప్రభావం చూపగలరు. బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా తమ ఉమ్మడి అభ్యర్థికే గంపగుత్తగా ఓట్లు పడేలా వీరి మధ్య సయోధ్య సాధ్యమవుతుందా వంటి ఎన్నో బేతాళ ప్రశ్నలున్నాయి. బీఆర్ఎస్, వైసీపీ, జేడీఎస్, ఏఐఎంఐఎం, టీడీపీ వంటి బలమైన ప్రాంతీయ పార్టీలు ఈ భేటీకి దూరంగా ఉండటం విశేషం.
లోక్ సభ ఎన్నికలకు ఏడాది కూడా లేదు ఈలోగా అన్ని పార్టీలు సొంతంగా అజెండాను, అభ్యర్థులను దాదాపు ఖరారు చేసుకున్నాయి. ఉదాహరణకు బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, ఒరిస్సాలోని నవీన్ పట్నాయక్ పార్టీ బీజేడీ ఈ వ్యూహాలపై పూర్తి సన్నద్ధంగా ఉంది. అమా గావ్, అమా బికాస్ (మన గ్రామం, మన అభివృద్ధి), అమా ఒడిస్సా, నబీన్ ఒడిస్సా (మన ఒరిస్సా, సరికొత్త ఒడిస్సా) వంటి స్లోగన్స్, స్కీములతో నవీన్ ఈ రేసులో దూసుకుపోతున్నారు. ఎన్డీఏ, యూపీఏ కూటములకు సమాన దూరంలో ఉంటూ, అవసరమైనప్పుడు అంశాల ప్రాతిపదికన మాత్రమే ఆయా కూటములకు మద్దతిచ్చే నవీన్ అపర రాజకీయ చాణక్యాన్ని మిగతా పార్టీలు అనుసరించే స్థితిలే లేవు.
ఇక యూపీఏ కాని సరికొత్త ఈ కూటమి విషయానికి వస్తే వీరిలో వీరికి ఎన్నో అభిప్రాయ-సైద్ధాంతిక విభేదాలున్నాయి. పైగా ఈ 23 పార్టీల్లో మాటమీద నిలబడని పార్టీల సంఖ్యే ఎక్కువ. మరి వీరు ఈ భేటీలో తీసుకునే నిర్ణయాల మీద నిలబడతారా అన్నది సందేహమే. జేడీయూనే తీసుకుంటే ఏమాత్రం నమ్మదగిన పార్టీ కాదనే ముద్ర ఉన్న నితీష్ 23 పార్టీల తీర్మానానికి కట్టుబడతారా? లోక్సభ బరిలోకి దిగబోయే ఉమ్మడి అభ్యర్థుల జాబితా సంగతి అటుంచితే అసలు ఈ పార్టీల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎవరో ఇప్పట్లో తేలేలా లేదు. ప్రతి పార్టీ పెద్దా తానే ప్రధాని అభ్యర్థి అంటూ పట్టుబట్టి కూర్చోవటం యూపీఏ లేదా ఇంకా పేరు పెట్టని కూటమికి అతిపెద్ద సవాలు.
ఇటు నేషనల్ డెమాక్రటిక్ అలయన్స్ భేటీ కూడా సమావేశమవుతోంది. వీళ్ల లక్ష్యం 2024 ఎన్నికలే అయినా 30 పార్టీల భేటీతో బీజేపీ ఎటువంటి ఏకసారూప్య అజెండాతో బయటికి వస్తుందనేది ఆసక్తికరమైన విషయం. ఎన్డీఏకు వ్యతిరేకంగా జట్టు కడితే తమ పార్టీలకు శివసేన, ఎన్సీపీల గతే పడుతుందని ఇతర పార్టీలన్నీ కలవరపడుతున్న వేళ ఎన్డీయే, యూపీఏల భేటీ రాజకీయ కాక రేపుతోంది. మనదేశ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనన్ని కొత్త సమీకరణాలు 2024 లోక్సభ ఎన్నికల్లో కనిపించబోతున్నాయి. అధికారమే పరమావధిగా పార్టీలన్నీ తమ పావులు కదుపుతుండటం విశేషం. ప్రీపోల్ అలయన్స్ ఎన్నికల తరువాత కూటమిలో కొనసాగుతుందనే అవకాశాలు తక్కువ, ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక సాగే బేరసారాలకు తలొగ్గకుండా ఉండటం ఏ పార్టీకి సాధ్యం కాదు, కాబట్టి గెలుపు గుర్రాలు ఏపార్టీకి చెందినవారైనా ఎన్నికల తరువాతైనా ఫిరాయించే అవకాశాలు సంపూర్ణంగా ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సాగుతున్న బీజేపీ, కాంగ్రెస్ కూటమి భేటీలన్నీ నీటి మీద రాతలే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News