అయిదు రాష్ట్రాలలో మళ్లీ ఎన్నికల శంఖారావం మోగింది. దేశంలో 5 రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్నాయంటే, అవి 2024లో జరగబోయే లోక్ సభ ఎన్నికలకు సెమీ ఫైనల్ లాంటివనడంలో సందేహం లేదు. ఇవి జాతీయ పార్టీకు, కొత్తగా ఏర్పడిన ఇండియా కూటమికి తప్పకుండా అగ్నిపరీక్ష లాంటివే అవుతాయి. చత్తీస్ గఢ్, మిజోరం, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల శాసనసభ జరగబోతున్న ఎన్నికలు కీలకమైనవే కానీ, వాటిని సెమీ ఫైనల్స్ గా పరిగణించడం భావ్యం కాదని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో వివిధ సమస్యలు ఉండడమే దీనికి కారణం. ఈ రాష్ట్రాల జనాభాలో చాలా మంది ఇతర దేశాలకు దీటుగా ఆధునిక పోకడలు, ధోరణులు సంతరించుకున్నవారు. ఏ రాష్ట్ర ప్రాధాన్యాలు ఆ రాష్ట్రా లవి. దేశ సమస్య లను, రాష్ట్ర సమస్యలను వేటికవిగా పరిగణించడమన్నది ఇప్పుడు కొత్త ట్రెండుగా కూడా మారింది. అయితే, ఈ రాష్ట్రాల ఎన్నికలలో స్పష్టంగా కనిపిస్తున్న వైవిధ్యం, వైశిష్య్యత ఏమిటంటే, ఇందులో మూడు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే గట్టి పోటీ ఉండబో తోంది. మిజోరం, తెలంగాణ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
హిందీ భాషను ఎక్కువగా మాట్లాడే జనాభా ఉన్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, చత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలలో బీజేపీ తమ విధానాలను, కార్యక్రమాలను, అభివృద్ధి పథకాలను చూపెట్టి ఓట్లు సంపాదించే ప్రయత్నం చేయడం సహజం. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ కూడా కులాధారిత జనాభా గణన గురించి, తాము చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి ఓట్లు ఆశించే అవకాశం ఉంది. ఈ పార్టీ తప్పనిసరిగా తమ అభ్యర్థుల ఆధారంగానే ప్రజలను ఆకట్టుకోవాల్సి ఉంటుంది. రాజస్థాన్ లో అశోక్ గెహ్లాత్ ప్రభుత్వం తాము చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ఇప్పటికే ప్రచారం చేయడం ప్రారంభించింది. అయితే, అక్కడ పార్టీ అభ్యర్థులకు గెహ్లాత్ కు ఉన్నంత ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉండడం లేదు. ఆయన ప్రభుత్వం మళ్లీ విజయం సాధిస్తుందా, అసలు ఆయనే గెలుస్తాడా అన్న సందేహం కూడా ఉంది. ఆయన శాసనసభ్యులకు ఆయన మీద నమ్మకం లేదు. పైగా కుమ్ములాటలు ఈ పరిస్థితిని మరీ జటిలం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొద్దిగా ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పటికీ, కేంద్రంలో బీజేజీ జాతీయంగా, అంతర్జాతీయంగా సాధిస్తున్న విజయాలు, మోదీ ప్రభావం, కాంగ్రెస్ బలహీనతలు ఈసారి కూడా బీజేపీకి విజయం కట్టబెట్టవచ్చు.
చత్తీస్ గఢ్ లో ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ఎంతో కష్టపడి తమ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతిని, కుమ్ములాటలను తగ్గించగలిగారు. రైతులకు రుణ మాఫీ వంటి సంక్షేమ పథకాలు ఆయనకు కొమ్ముకాసే అవకాశం ఉంది. ప్రాంతీయతా భావాలను కూడా ఆయన సద్వినియోగం చేసుకునే సూచనలున్నాయి. ముఖ్యంగా ఆయన వివిధ ధాన్యాలకు ఇస్తున్న గిట్టుబాటు ధరలు, పంటలకు కల్పించిన బీమాలు వగైరాలను ఆయనను తప్పకుండా ఆదుకునే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీకి మరో ఆత్మవిశ్వాసం కూడా ఏర్పడింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీకి తమ బలమెంతో తెలిసి రావడం, అది ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే ధీమా ఏర్పడడం వల్ల బాఘేల్ ప్రభుత్వానికి తమ మీద తమకు నమ్మకం బాగా పెరిగింది. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా తమకు తిరుగుండదనే నిశ్చితాభిప్రాయం కూడా ఏర్పడింది.
ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే, కర్ణాటకలో విజయాలు నమోదు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం పెరిగింది. ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. పాలక భారత రాష్ట్ర సమితికి గట్టి పోటీ ఇవ్వగలమనే నమ్మకం ఏర్పడింది. ఇక్కడ బీజేపీ మూడవ స్థానంలోకి కూడా రావడం కష్టమేనని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ రాష్ట్రంలో ఓట్లు చీల్లే అవకాశం ఉన్నందువల్ల భారత రాష్ట్ర సమితిపై తాము విజయం సాధించడానికి అవకాశాలు పెరిగాయనే అభిప్రాయంలో కూడా ఉంది. మిజోరంలో జోరమ్ పీపుల్స్ మూవ్ మెంట్ ఊపందుకోవడంతో ఈ రాష్ట్రంలో కొన్ని సమీకరణాల్లో మార్పు వచ్చింది. సాధారణంగా ఇక్కడ రెండు పార్టీల మధ్యే పోటీ ఉంటుంది. ఇప్పుడది మూడు పార్టీల పోటీగా మారింది. ముఖ్యమంత్రి జోరంతాంగా నాయకత్వంలోని మిజో నేషనల్ ఫ్రంట్ పొరుగున ఉన్న మణిపూర్ రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా తమ విజయం ఖాయమని గట్టి నమ్మకంతో ఉంది. అక్కడ బీజేపీ అప్రతిష్టపాలయినందువల్ల , దాని ప్రభావం మిజోరం మీద పడి, తాము విజయం సాధించడం ఖాయమని ఆయన అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ పరిణామాలన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అంచనా వేసే పక్షంలో ఈ రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు సెమీ ఫైనల్స్ కావనీ, ఈ రెండు జాతీయ పార్టీల మధ్య కొద్దిగా పోటీ పెరిగే అవకాశం మాత్రం ఉందనీ అర్థమవుతుంది.
5 states elections a Semi-finals: జాతీయ పార్టీలకు సెమీ ఫైనల్స్
ఈ ఎన్నికల్లో సత్తా చాటేదెవరో?