Indian Airlines Closed in 25 years: గత వారం రోజులుగా.. వార్తా కథనాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో భారత విమానయాన సంస్థ ‘ఇండిగో’ హాట్ టాపిక్‌గా మారింది. సాంకేతిక లోపాలను కారణాలుగా పేర్కొంటూ అకస్మాత్తుగా రద్దయిన విమాన సర్వీసులు, ఫలితంగా ప్రయాణికుల అవస్థలు, ఎయిర్‌పోర్టులో గంటల తరబడి నిరీక్షణలు.. వెరసి ఇండిగోపై ప్రయాణికుల నిరసనను ప్రదర్శించాయి. ఒకప్పుడు సమర్థతకు మారుపేరుగా నిలిచిన ఈ భారతీయ విమానయాన సంస్థ.. ఇప్పుడు పలు కారణాలు చూపుతూ సర్వీసులను రద్దు చేయడంతో సంస్థ నిర్వహణ తీరుపై సర్వత్రా చర్చ మొదలైంది.
దేశీయంగా, అంతర్జాతీయ ప్రతిరోజూ 2,300 విమాన సర్వీసులను నడిపినస్తున్న అతి పెద్ద సంస్థ ఇండిగో.. 60 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు.. భారతీయ విమానయాన పరిశ్రమ గతాన్ని ఓసారి గుర్తు చేసుకునేలా చేశాయి. అంతా సవ్యంగా ఉన్నప్పుడు గగనయాన సంస్థలు మార్కెట్‌లో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వైభవాన్ని ప్రదర్శిస్తాయి. అయితే ఒక్కసారిగా ఆర్థిక పరిస్థితులు కుప్పకూలినప్పుడు, వ్యాపార నమూనాలు అనుకూలించకపోవడం, భాగస్వామ్యాల మధ్య సహకార లోపం ఫలితంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయేలా చేస్తాయి.
ఈ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గడిచిన పాతికేళ్లలో భారత్‌కు చెందిన 9 విమానయాన సంస్థలు.. తమ వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లోపే వాటి కథ ముగిసిపోయింది. అయితే ఈ కంపెనీల ఫెయిల్యూర్ కారణంగా ఇండిగో మరింత మార్కెట్‌ను కైవసం చేసుకోవడానికి దోహదపడిందనడంలో సందేహం లేదు. ఇది భారత మార్కెట్లో బ్రాండ్ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసింది.
- ఎయిర్ సహారా
ఇండిగో తక్కువ ఖర్చుతో విమాన సర్వీసులను ప్రారంభించడానికి చాలా కాలం ముందే.. భారత విమానయాన రంగంలో గుర్తుంచుకునే పేరు ఎయిర్ సహారా. 1991 లో ప్రారంభమైన ఎయిర్ సహారా సేవలు.. ఉత్తర భారతదేశం మొదలుకుని.. అంతర్జాతీయ గమ్యస్థానాలకు తన సేవలను విస్తరించింది. బోయింగ్ 737 లు, ఎయిర్‌బస్ A320 లను నడిపి ప్రముఖ సంస్థగా పేరు గాంచింది.
దాదాపు 16 ఏళ్ల దిగ్విజయ ప్రస్థానం తర్వాత ఏప్రిల్ 2007లో, జెట్ ఎయిర్‌వేస్.. ఎయిర్ సహారాను రూ. 1450 కోట్లకు కొనుగోలు చేసి, జెట్‌లైట్‌గా పేరు మార్చింది. అయితే ఆర్థిక ఒడుదొడుకుల కారణంగా జెట్‌లైట్, జెట్ ఎయిర్‌వేస్ రెండూ ఏప్రిల్ 2019లో కుప్పకూలిపోయాయి. దీంతో అధికారికంగా ఎయిర్ సహారా వారసత్వం ముగిసింది.
2. ఎయిర్ డెక్కన్
ఎయిర్ సహారా విమానయాన రంగంలో విస్తృతంగా సేవలు అందిస్తున్న సమయంలో 2003లో, ఎయిర్ డెక్కన్ భారతీయ ప్రయాణ అనుభూతిని శాశ్వతంగా మార్చేసింది. రైలు ఛార్జీల ధరకే విమానాలు నడపగలిగేలా కెప్టెన్ జీఆర్ గోపీనాథ్ విప్లవాత్మక ఆలోచనను ప్రవేశపెట్టారు. భారత్‌లో చిన్న నగరాలను అనుసంధానించే ATR 42, 72 విమానాలను తీసుకువచ్చారు. దీంతో ఎయిర్ డెక్కన్ సామాన్య ప్రయాణికుల విమానయాన సంస్థగా ఆదరణ అందుకుంది.
Also Read: https://teluguprabha.net/telangana-district-news/hyderabad/a-series-of-fire-accidents-in-hyderabad/
కానీ ఈ ఆచరణ ఆర్థికంగా వేగవంతమైన విస్తరణకు దోహదపడలేదు. ఫలితంగా ఆర్థికాభివృద్ధి జరగలేదు. విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. ఎయిర్ సహారాను 2008లో కొనుగోలు చేసింది. దానికి సింప్లిఫ్లై డెక్కన్ అని, తరువాత కింగ్‌ఫిషర్ రెడ్ అని పేరు మార్చారు. అయితే కింగ్‌ఫిషర్ కుప్పకూలిన సమయంలో, ఎయిర్ డెక్కన్ ప్రస్థానం సైతం ముగిసిపోయింది.
- పారామౌంట్ ఎయిర్‌వేస్
భారతీయ విమానయానంలో ఇలా వచ్చి అలా వెళ్లి పోయి చరిత్రలో లిఖించబడని సంస్థ ఏదైనా ఉంది అంటే అది పారామౌంట్ ఎయిర్‌వేస్. 2005లో దీనిని ప్రారంభించారు. ప్రీమియం సీట్లకు పోటీ ధరలను ప్రవేశపెట్టి ఒక ప్రత్యేకమైన థీమ్‌తో ఈ రంగంలోకి ప్రవేశించింది. దక్షిణాది వ్యాపార ప్రయాణికులను లక్ష్యంగా చేసుకున్న ఈ సంస్థ.. ఎంబ్రేర్ E170/190 విమానాన్ని పూర్తి బిజినెస్ క్లాస్ పిచ్‌తో రూపొందించింది.
అయితే, చట్టపరమైన వివాదాలు, బకాయిలు పెండింగ్‌లు, ఆర్థిక దుర్వినియోగం కారణంగా 2010లో లైసెన్స్ సస్పెన్షన్‌కు పారామౌంట్ ఎయిర్‌వేస్ గురైంది. దీంతో ఆ ఎయిర్‌లైన్ మళ్లీ గగనయానానికి నోచుకోలేదు.
- కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
భారత కార్పొరేట్ చరిత్రలో అత్యంత నాటకీయ పతనంగా పేరుగాంచిన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్. 2005లో విజయ్ మాల్యా దీనిని ప్రారంభించారు. లాంజ్‌లు, గౌర్మెట్ భోజనాలు, అగ్రశ్రేణి సేవలతో విమానయానంలో ప్రత్యేక ఆకర్షణనను సంతరించుకుంది. ఎయిర్ డెక్కన్‌ను కొనుగోలు చేయడంతో పాటు అంతర్జాతీయ విమానయాన సంస్థగాను కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విస్తరించింది.
అయితే లగ్జరీ సౌకర్యాలు పెరిగినట్లుగా ఈ సంస్థ ఆదాయం పెరగలేదు. అధిక ఇంధన ధరలు, అధిక వ్యయం, అసమర్థమైన విమానాల ప్రణాళిక తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీశాయి. దీంతో సిబ్బందికి జీతాలు చెల్లించలేకపోయింది. విమాన సర్వీసులు నిలిచిపోయాయి. బ్యాంకులకు రూ. 7000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. దీంతో కింగ్‌ఫిషర్ లైసెన్స్ అక్టోబర్ 2012లో సస్పెండ్ అయింది. ఈ ప్రభావంతో ఆడంబరమైన సర్వీసుల శకానికి ముగింపు పలికింది.
- జెట్ ఎయిర్‌వేస్
1993లో ప్రారంభమైన ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ చాలా ఏళ్లపాటు నమ్మకానికి మారుపేరుగా సేవలందించింది. 2007 లో ఎయిర్ సహారాను కొనుగోలు చేసింది. అయితే ఆ సమయంలోనే తక్కువ ఛార్జీలతో ఇతర విమానయాన సంస్థలు పోటీ ఇవ్వడంతో సంస్థపై ఒత్తిడి పెరిగింది. దీంతో అప్పులు పెరిగి జెట్ తన కార్యకలాపాలను కొనసాగించలేకపోయింది.
దీంతో ఏప్రిల్ 2019లో, జెట్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. పునరుద్ధరణ బిడ్‌లు దాఖలు చేసినప్పటికీ, కార్యరూపానికి నోచుకోలేదు. నవంబర్ 2024లో, సుప్రీంకోర్టు లిక్విడేషన్‌కు ఆదేశించడంతో జెట్ ఎయిర్‌వేస్ దాని అధ్యాయానికి అధికారికంగా ఫుల్‌స్టాప్ పెట్టేసింది.
- ట్రూజెట్
పూర్తిగా రీజినల్ కనెక్టివిటీతో ప్రారంభమైన ట్రూజెట్ 2015లో ATR ఎయిర్‌క్రాఫ్ట్‌తో తన సేవలను మొదలుపెట్టింది. ఈ బ్రాండ్ టైర్- 2, టైర్- 3 ప్రయాణికుల డిమాండ్ లక్ష్యంగా సేవలు అందించింది. దురదృష్టవశాత్తు కొవిడ్ మహమ్మారి కారణంగా నష్టాలు, ఆర్థిక ఒత్తిడితో ఫిబ్రవరి 2022లో తన సర్వీసులను నిలిపివేసింది. అయితే ఎయిర్‌బస్ A320 లతో పునరుద్ధరణకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపినప్పటికీ, ట్రూజెట్ ప్రస్తుతానికి సేవలు అందించడం లేదు.
- గో ఫస్ట్
గో ఎయిర్ నుంచి గో ఫస్ట్‌గా పేరు మార్చుకుని తక్కువ ఛార్జీలతో సేవలు మొదలుపెట్టిన ఈ సంస్థ.. 2005 నుంచే విమానయాన ఒడిదుడుకులను తట్టుకుని నిలబడింది. అయితే ప్రాట్ & విట్నీ నుంచి తీవ్రమైన ఇంజిన్ సరఫరా సమస్యలు ఎదుర్కొంది. ఫలితంగా సగానికి పైగా విమానాలను నిలిపివేసింది. తర్వాత 2023లో ఊహించని పతనానికి ఎదుర్కొంది. ఆచరణీయమైన పునరుద్ధరణ ప్రణాళిక లేకపోవడంతో అప్పులు చివరికి రూ. 6521 కోట్లు దాటాయి. దీంతో NCLT (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) 2025లో లిక్విడేషన్‌కు ఆదేశించింది. ఫలితంగా సేవలకు ముగింపు పలికింది.
- విస్తారా
ఇతర మాదిరిగా కాకుండా, విస్తారా నష్టాల కారణంగా మూసివేయబడలేదు.
టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంగా 2015 లో విస్తారా ప్రారంభమైంది. అయితే ఇతర సంస్థల మాదిరిగా విస్తారా నష్టాల కారణంగా తన సేవలను ముగించలేదు. తక్కువ కాలంలోనే స్థిరమైన వృద్ధిని సాధించింది. కానీ టాటా విమానయాన ఏకీకరణ తర్వాత దాని గుర్తింపు, విమానాల సముదాయం, ప్రయాణాల వివరాలు ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోకి రావడంతో విస్తారా ఉనికి ఎక్కువగా ప్రపంచానికి తెలియలేదు. నవంబర్ 2024లో ఎయిర్ ఇండియాలో విలీనం అయినప్పుడు ఈ బ్రాండ్ అధికారికంగా ఉనికి కోల్పోయింది.
- AIX కనెక్ట్
ఎయిర్ ఏషియా ఇండియా నుంచి AIX కనెక్ట్‌గా పేరు మార్చుకున్న ఈ సంస్థ త్వరగానే కనుమరుగైపోయింది. ఎయిర్ ఇండియాను టాటా స్వాధీనం చేసుకున్న తర్వాత, గ్రూప్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, AIX కనెక్ట్‌లను ఒకే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బ్రాండ్ కింద విలీనం అయింది. దీంతో 2024 నాటికి, AIX కనెక్ట్ పేరు ఉనికిలో లేదు. దాని కార్యకలాపాలు, విమానాలు ఇప్పుడు విస్తరించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి.
ధనిక ప్రయాణికులకే కాదు సాధారణ ప్రజలకు సైతం గగనయాన సేవలు అందాలనే లక్ష్యంతో పాటు వ్యాపార రంగంలో ఆర్థిక వృద్ధి ఆశిస్తూ విమానయాన సంస్థలు నెలకొన్నాయి. కానీ వాటి మనుగడకు ఆశయం కంటే ఆర్థిక అవసరం కూడా ఎంతో ముఖ్యమని ఈ 9 విమానయాన సంస్థల చరిత్ర ప్రదర్శిస్తుంది. అధిక నిర్వహణ వ్యయాలు, అస్థిర ఇంధన ధరలు, లీన్ మార్జిన్లు, నియంత్రణ ఒత్తిడి, ఇతర సంస్థల నుంచి పోటీ.. వీటి కారణంగా ఈ రంగం లాభాలను చూసే కష్టతరమైన పరిశ్రమలలో ఒకటిగా నిలిచాయి.

