ఎన్నికల సమయంలో రాజకీయ సంబంధమైన సినిమాల జోరు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది కొత్తగా ప్రారంభమైన వ్యవహారం కాదు. దేశానికి స్వా తంత్య్రం వచ్చిన కొద్ది సంవత్సరాలకే ఈ ధోరణి ప్రారంభం అయింది. 1958లో ఎం.జి. రామచంద్రన్ కథా నాయకుడుగా ‘నాడోడి మన్నన్’ పేరుతో విడుదలైన చిత్రం ఈ కోవకు చెందినదే. ఇందులో ఎం.జి. రామచంద్రన్ మార్తాండన్ రాజుగానే కాక, తిరుగుబాటుదారు, విప్లక కారుడు అయిన వీరంగన్ గా కూడా ద్విపాత్రాభినయం చేశారు. ఆయనే ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించారు. కుట్రలు, కుతంత్రాలు, భావోద్వేగాలు, హాస్యం, శృంగారం, పోరాటాలు వగైరా రసాలన్నీ మేళ వించి నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో బ్రహ్మాండంగా ఆడింది. రాచరిక వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి, ప్రజలను కూడగట్టుకుని, ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేసిన వీరంగన్ పాత్రలో ఎం.జి.ఆర్ అద్భుతంగా నటించారు. ఈ చిత్రం విశేష జనాదరణ పొందింది. పేదల అణచివేత గురించి ఇందులో వీరంగన్ విప్లవాత్మకంగా ప్రసంగాలు చేసినప్పుడు సినిమా థియేటర్లన్నీ చప్పట్లతో మార్మోగి పోయేవి.
ఈ సినిమాను నిర్మిస్తున్నప్పుడు మొదట్లో జనానికి దీని పరమార్థం ఏమిటన్నది అర్థం కాలేదు కానీ, ఆ తర్వాత దీనిని డి.ఎం.కెకు చెందిన ప్రచార చిత్రంగా, పార్టీ మేనిఫెస్టోగా, సైద్ధాంతిక ప్రచారంగా అభివర్ణించడం మొదలుపెట్టారు. విచిత్రంగా ఈ సినిమాలో పార్టీ జెండా లుగా మధ్య మధ్య కనిపిస్తూ ఉంటాయి. అంతే కాదు, ఎం.జి.ఆర్‌ను నాడోడి మన్నన్ (తిరుగుబాటు నాయ కుడు) గా పిలవడం కూడా జరిగేది. మొత్తానికి ఆయన ఈ సినిమాతో ప్రజల్లో తిరుగుబాటు నాయకుడుగా స్థిరపడిపో యారు. ఆ తర్వాత ఆయన తమిళనాడులో ఏ ఎన్నిక ల్లోనూ ఓటమి పాలుకాలేదు. ఆ చిత్రం నిండా ఆదర్శాలు వల్లె వేయడం, సంస్కరణల గురించి మాట్లాడడం, అన్యా యాలను ఎదిరించడం, అణచివేతల మీద తిరుగుబాట్లు చేయడం వంటి సన్నివేశాలు, సందర్భాలు ఎక్కువగా ఉన్నందువల్ల ఇది ప్రజల కోసం తీసిన చిత్రంగా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.
బాలీవుడ్ చిత్ర పరంపర మొత్తానికి ఈ ధోరణి 2023 సంవత్సరంలో కూడా కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ తండ్రీ, కొడుకులుగా ద్విపాత్రాభినం చేసిన జవాన్ చిత్రం ప్రస్తుతం విజయ దుందుభి మోగిస్తోంది. ఈ చిత్రాన్ని చూసినవారికి ఎం.జి.ఆర్ మాదిరిగానే షారుఖ్ ఖాన్ కూడా ఏదో లక్ష్యంతో ఈ సినిమాలో నటించారన్న అభిప్రాయం కలుగుతుంది. ఆయుధ ఒప్పందాల్లో ముడు పులు తీసు కోవడం, రైతులు నానా కష్టాలూ పడుతుం డడం, వారికి కథానాయకుడు ఇతోధికంగా సహాయం చేయడం, వైద్య, ఆరోగ్య సదుపాయాల మెరుగుదల కోసం శ్రమించడం, ప్రజలు తమ ఓటు హక్కును జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని ఉద్బోధించడం వగైరా రాజకీయ అంశాలన్నీ ఈ చిత్రంలో కూడా పుష్కలంగా ఉన్నాయి. మరో కొద్ది నెలల్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో సరైన అభ్యర్థికి ఓటు వేయాలంటూ సూచనలు చేయడాన్ని బట్టి, పార్టీ పేరు చెప్పకపోయినా, ఈ సినిమా ఉద్దేశమే మిటో స్పష్టంగా అర్థం అవతూనే ఉంది.
పాత పద్ధతుల్లో నిర్మించిన కొత్త సందేశాత్మక చిత్రంగా ఇది కనిపిస్తున్న మాట నిజమే. ఇందుకు భిన్న మైన గదర్ 2 చిత్రాన్ని చూసినవారికి కూడా ఇది రాజకీయ సందేశాత్మక చిత్రమనే వాస్తవం కళ్లకు కడు తూనే ఉంటుంది. అనిల్ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇది పాకిస్థాన్ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రం. బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ లు ప్రోత్సహించిన కేరళ స్టోరీని కర్ణాటక ఎన్నికల సందర్భంగా నిర్మించి విడుదల చేయడం జరిగింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభినందించడం కూడా జరిగింది. ఇస్లాం మతం గురించిన భయాందోళనలు, లవ్ జిహాద్ లు, కిడ్నాపులు, మతం మార్పిళ్లు, ఉగ్రవాద ధోరణులు వగైరాలన్నీ కల గలిపిన ఈ చిత్రం ఘనాతిఘన విజయం సాధించిందన డంలో సందేహం లేదు. ఇక 2024 ఎన్నికలు దగ్గర పడు తున్న కొద్దీ బాలీవుడ్ చిత్ర విచిత్రమైన చిత్ర కథనాలతో ముందుకు రావడానికి సిద్ధపడుతోంది. రాజకీయ నాయ కులు, రాజకీయ పార్టీలు చాలా ఏళ్లుగా అటు సినిమా లను, ఇటు మీడియాను తమకు అనుకూలంగా మలచు కోవడానికి, మార్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు సాగి స్తూనే ఉన్నాయి. నిజానికి, రాజకీయ ప్రాధాన్యం కలిగిన సినిమాల నిర్మాణమనేది 1939లోనే ప్రారంభం అయింది. మాస్టర్ వినాయక్ నిర్మించిన బ్రాందీ కీ బోతల్ అనే సినిమా గాంధీజీ ప్రవచించిన మద్య నిషేధాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మించినదే.
భావజాలాలతో నిర్మాణాలు ఇక 1950-60 సంవత్స రాల మధ్య నెహ్రూ సిద్ధాంతాల ఆధారంగా అనేక సినిమాలను విడుదల చేయడం జరిగింది. సామరస్యం, మత సహనం, బుజ్జగింపు ధోరణులు, సోషలిస్టు భావజా లం, ప్రగతిశీల భావాలు వంటి అంశాలతో అప్పట్లో అనేక సినిమాల నిర్మాణం జరిగింది. జాగృతి, అబ్ దిల్లీ దూర్ నహీ, నయా దౌర్, హమ్ హిందూస్థానీ, ధూల్ కా ఫూల్, ధర్మపుత్ర, హకీకత్ వంటి చిత్రాలు ఈ కోవకు చెందినవే. నెహ్రూ భావజాలాన్ని వ్యతిరేకిస్తూ తీసిన శ్రీ420, ప్యాసా, ఫిర్ సుబహ్ హోగీ, ఫుట్ పాత్, దో బీఘా జమీన్ చిత్రాలను ఎంతో హుందాగా నిర్మించడం జరిగింది. ఇవన్నీ ప్రజా సమస్యలకు అద్దం పడుతూ, ప్రజానుకూలంగా తయారైన చిత్రాలే. ఇవి జాతి నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యమి చ్చాయి. జాతీయవాద ధోరణులనే ఇవి ఎక్కువగా ప్రతి బింబించేవి. ఇందులో పెద్దగా మిర్చి మసాలాలను కూడా జోడించలేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టే పద్ధతులను అనుసరించలేదు. ఇదేరకమైన నెహ్రూ భావజాలంతో ఆ తర్వాత కూడా, ఇటీవల కూడా కొన్ని చిత్రాలు విడుదల య్యాయి. లగాన్, చక్ దే ఇండియా, బజరంగి బాయిజాన్ ఇటువంటి కోవకు చెందినవే.
ఇక 1982లో విడుదలైన ఆరోహణ్ అనే శ్యాం బెనగల్ చిత్రం వామపక్ష భావాలను బాగా సమర్థించింది. ఒక కౌలురైతు తన హక్కుల కోసం పోరాడి, రాష్ట్రంలో వామపక్ష ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని సాధించడం ఈ చిత్ర ఇతివృత్తం. అప్పట్లో పశ్చిమ బెంగాల్ లో ఏర్పడిన వామపక్ష ప్రభుత్వానికి మద్దతుగా ఈ సినిమాను నిర్మించ డం జరిగింది. అయితే, చిత్రాల నిర్మాణంలో క్రమంగా మార్పులు చోటు చేసుకోవడం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు సినిమా ప్రాధాన్యాన్ని బాగా అర్థం చేసుకున్నాయి. 2019లో బీజేపీకి అనుకూలంగా రెండు మూడు చిత్రాలు విడుదలయ్యాయి. 2016లో బీజేపీ ప్రభుత్వం యూరీలో మచేపట్టిన సర్జికల్ స్ట్రయిక్స్ మీద ఒక చిత్రం విడుదల యింది. ఆ తర్వాత మోదీ మీద ఒక బయోపిక్ విడుదల యింది. ఇందులో మోదీ పాత్రను వివేక్ ఒబరాయ్ పోషించారు. ఇందులో గోద్రా అల్లర్ల పూర్వాపరాలను వివరించడం కూడా జరిగింది. ఇక జర్నీ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ అనే పేరుతో మోదీపై వెబ్ సిరీస్ నిర్మాణం కూడా జరిగింది.
పోటా పోటీగా పార్టీల చిత్రాలు మరో ప్రచార చిత్రం కాంగ్రెస్ విధానాలను తెగనాడింది. వివేక్ అగ్నిహోత్రి నిర్మించిన తాష్కెంట్ ఫైల్స్ అనే చిత్రాన్ని దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్‌లో అకస్మాత్తుగా, అనుమా నాస్పదంగా మరణించడంపై నిర్మించడం జరిగింది. విజయ్ గుట్టే నిర్మించిన యాక్సిడెంట్ ప్రైమ్ మినిస్టర్ అనే చిత్రాన్ని మన్మోహన్ సింగ్ పై నిర్మించారనే విషయం అర్థ మవుతూనే ఉంది. నెహ్రూ భావజాలానికి వ్యతిరేకంగా, బీజేపీ భావజాలానికి అనుకూలంగా సినిమాలు నిర్మాణం కావడమనేది ఎక్కువగానే జరుగుతోంది. పూర్తిగా బీజేపీని లేదా మోదీని సమర్థించే సినిమాలు కాకుండా దేశానికి సంబంధించిన చిత్రాల పేరుతో కూడా నిర్మాణాలు, విడుద లలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ సాఫల్యాలను ఇతివృత్తాలుగా చేసుకుని నిర్మాణమైన చిత్రాలు కూడా ఉన్నాయి. టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథా, మిషన్ మంగళ్ తదితర చిత్రాలను కేవలం ప్రభుత్వ పథకాల సాఫల్యాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించడం జరిగింది.
బీజేపీ దూకుడుతనాన్ని ప్రతిబింబిస్తూ హౌ ఈజ్ ది జోష్? అనే చిత్రం విడుదలయింది. భారత దేశాన్ని ఏలిన రాజులకు సంబంధించిన చిత్రాల నిర్మాణం కూడా జరి గింది. చరిత్రకారులు విస్మరించిన ఈ రాజుల చరిత్రలను చిత్రాలుగా నిర్మించడం ఈ మధ్య కాలంలో బాగానే ఊపం దుకున్నట్టు కనిపిస్తోంది. తన్హాజీ, మణికర్ణిక, సామ్రాట్ పృథ్వీరాజ్ వంటి చిత్రాలు ఒక విధంగా అర్థవంతమైనవే కానీ, సహజంగానే వీటిని బీజేపీ భావజాలమైన చిత్రా లుగా పరిగణించడం జరుగుతోంది. ఇక భారతదేశ పూర్వ వైభవాన్ని గుర్తు చేయడానికన్నట్టుగా, ఆదిపురుష్, బ్రహ్మా స్త్ర, రామసేతు చిత్రాల నిర్మాణం జరిగింది. ఈ చిత్రాలను కూడా బీజేపీ భావజాలానికి సంబంధించిన చిత్రాలుగా పరిగణించడం జరుగుతోంది. సమయం, సందర్భం అం దుకు బాగా అనువుగా ఉన్నట్టు కనిపి స్తోంది. ఇక హిం దుత్వ ప్రాభవాన్ని తెలియజేయడానికన్నట్టు 72 హూరైన్, అజ్మీర్ 92 అనే చిత్రాలు కూడా విడుదలయ్యాయి. ఇవి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే చిత్రాలుగా మీడియాలో, రాజ కీయ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాలన్నీ ఒక విధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించినవేననడంలో సందేహం లేదు.
ఎంత ప్రచారానికి సంబంధించిన చిత్రాలైనప్పటికీ, అవన్నీ విజయవంతం అవుతాయన్న గ్యారంటీ ఏమీ లేదు. తన్హాజీ, కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ చిత్రాలు తప్ప మిగిలి నవన్నీ ఘోరంగా దెబ్బ తిన్నాయి. బీజేపీకి అనుకూలంగా కంగనా రానౌత్ తో నిర్మించిన తేజస్, అక్షయ్ కుమార్ తో నిర్మించిన మిషన్ రాణిగంజ్ చిత్రాలు కూడా దారుణంగా విఫలమయ్యాయి. ఇటువంటి ప్రచార చిత్రాలను నిర్మించ డం, రాజకీయ ప్రచారానికి సినిమాలను ఉపయోగించు కోవడమన్నది ఒక్క భారతదేశానికే పరిమితం కాదు. జర్మనీ, రష్యా, ఆఫ్రికా దేశాల్లో కూడా అనేక దశాబ్దాల నుంచి ఈ ధోరణి కొనసాగుతోంది. ప్రపంచ రాజకీయ ధోరణుల ఆధారంగా హాలీవుడ్‌లో కూడా అనేక చిత్రాలు నిర్మాణమయ్యాయి. ఇటువంటి చిత్రాలు వాణిజ్యపరంగా విజయాలు సాధించే అవకాశాలు బాగా తక్కువ. ఈ చిత్రాలను బట్టి ప్రజల్లో మార్పు వస్తుందన్నది పూర్తిగా ఊహాగానమే.
- జి. రాజశుక