భారతీయ సంగీత చరిత్రలో కొన్ని స్వరాలు కాలాన్ని దాటి తరతరాలకు జీవం పోస్తుంటాయి. అలాంటి అరుదైన స్వరాలలో ఒకటి ఆశా భోస్లే స్వరం. ఆమె స్వరం కేవలం పాటలను పాడలేదు.. భావాలను పాడింది, యుగాలను పాడింది, మనసు లను పాడించింది. ఆమె గానప్రస్థానం వ్యక్తిగత ప్రయాణం ముగింపు మాత్రమే కాదు; ఒక సంగీత యుగం అస్తమయం వైపు సాగుతున్న సంకేతంలా అనిపిస్తోంది. ఈ అస్తమయం విషాదంతో కూడుకు న్నదైనా, అదే సమయంలో అపారమైన గౌరవంతో కూడిన వెలుగును కూడా వెదజల్లుతోంది.
ఆశా భోస్లే పేరు వినగానే మనకు గుర్తుకొచ్చేది ఒకే తరహా గానశైలి కాదు. ఆమె గాత్రం అనేక రంగులను ధరించిన ఒక సంగీత వర్ణచిత్రంలా ఉంటుంది. శృంగార గీతాల నుంచి భక్తి గీతాల వరకు, కబరే నుంచి ఘజల్ వరకు, ఫోక్ నుంచి పాప్ వరకు.. ఏ రూపంలోనైనా ఆమె స్వరం సహజంగా ఒది గిపోయింది. భారతీయ సినీ సంగీతంలో ఇంత విస్తృత పరిధిని సొంతం చేసుకున్న గాయని మరెవరూ లేరని చెప్పడం అతిశయోక్తి కాదు.
ఆమె సంగీత ప్రయాణం ప్రారంభమైన కాలం సులభమైనది కాదు. కుటుంబ పరిస్థితులు, వ్యక్తిగత బాధలు, పరిశ్రమలో ఉన్న పోటీ- ఇవన్నీ ఆమెను పరీక్షించాయి. అయినప్పటికీ, ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రతి సవాల్‌ను ఒక అవకాశంగా మార్చుకుంటూ, తన స్వరాన్ని ఒక శక్తిగా మలుచుకుంది. అదే ఆశా భోస్లే ప్రత్యేకత. ఆమె విజయం కేవలం ప్రతిభతో మాత్రమే సాధ్యపడలేదు; పట్టుదల, క్రమశిక్షణ, సంగీతంపై ఉన్న అపారమైన ప్రేమ కూడా అందులో భాగమయ్యాయి.
ఆమె స్వరం ఒకే తరానికి పరిమితం కాలేదు. 1950ల నుంచి 2000ల వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఆమె తన ప్రభావాన్ని కొనసాగించడం ఒక అసాధారణ ఘనత. కాలం మారింది, సంగీతం మారింది, శైలులు మారాయి, కానీ ఆశా భోస్లే స్వరం మాత్రం మారలేదు. అది ఎప్పటికప్పుడు కొత్త తరానికి అనుగుణంగా మారుతూ, తన ప్రాముఖ్యతను నిలబెట్టుకుంది. ఈ సామర్థ్యం చాలా కొద్దిమంది కళాకారులకే సాధ్యమవుతుంది.
ఆమె గాత్రంలో ఒక ప్రత్యేకమైన జీవం ఉంది. ప్రతి పాటలో భావం, ఉత్సాహం, మాధుర్యం కలగలిపిన ఆ స్వరం వినేవారికి ఒక ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఒక పాటలో చిలిపితనం కనిపిస్తే, మరొక పాటలో లోతైన బాధ కనిపిస్తుంది. ఇంకొక పాటలో ఉత్సాహం ఉరకలేస్తే, మరో పాటలో తాత్వికత వినిపిస్తుంది. ఈ విభిన్నతే ఆమెను ఇతర గాయనుల నుంచి ప్రత్యేకంగా నిలబెట్టింది. సంగీత దర్శకులతో ఆమెకు ఉన్న అనుబంధం కూడా విశేషమైనది. ఓపీ నయ్యర్, ఆర్‌డీ బర్మన్ వంటి సంగీత మేధావులతో ఆమె కలయిక భారతీయ సినీ సంగీతానికి కొత్త దిశను చూపించింది. ఆ పాటలు కేవలం అప్పటి కాలా నికే పరిమితం కాలేదు; ఇవాళ కూడా అదే ఉత్సా హంతో వినిపిస్తున్నాయి. ఒక మంచి గాయకురాలు పాటను పాడుతుంది; కానీ గొప్ప గాయకురాలు పాటను చిరస్థాయిగా నిలబెడు తుంది. ఆశా భోస్లే ఆ రెండో వర్గానికి చెందినవారు.
ఆమె జీవిత ప్రయాణంలో వ్యక్తిగత బాధలు కూడా తక్కువగా లేవు. అయినప్పటికీ, వాటిని ఆమె తన కళలోకి మార్చుకుంది. బాధను సంగీతంగా, ఒంటరితనాన్ని స్వరంగా, అనుభవాన్ని భావంగా మార్చడం ఆమెకు సాధ్యమైంది. అందుకే ఆమె పాటలు వినేవారికి అంత లోతుగా తాకుతాయి. ఒక గాయని తన జీవితాన్ని తన గానంలో కలిపినప్పుడు మాత్రమే అలాంటి మాధుర్యం సాధ్యమవుతుంది.
ఇప్పటి తరానికి ఆశా భోస్లే కేవలం ఒక గాయని మాత్రమే కాదు; ఒక ప్రేరణ. సంగీతం అంటే ఏమిటి? కష్టాల్లో ఎలా నిలబడాలి? కాలానికి అనుగుణంగా ఎలా మారాలి? అనే ప్రశ్నలకు ఆమె జీవితం ఒక సమాధానం. ఆమె ప్రయాణం కొత్త తరానికి ఒక మార్గదర్శకం.
ఆమె పాడిన వేలాది పాటలు ఇంకా ఎన్నో తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి. ఆమె సృష్టించిన సంగీతం ఎప్పటికీ జీవిస్తుంది. ప్రజల హృదయాల్లో ఆమెకు ఉన్న స్థానం ఎప్పటికీ మారదు. ఒక గాయని తన కాలాన్ని దాటి నిలిచిపోయినప్పుడు మాత్రమే అలాంటి గౌరవం లభిస్తుంది.
ఈ రోజు ఆశా భోస్లే గానప్రస్థానం సాయంకాలాన్ని తాకుతున్న వేళ, మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఒక కళాకారిణి అస్తమయం అంటే కేవలం ఆమె ప్రయాణం ముగింపు కాదు; ఆమె సృష్టించిన వెలుగును గుర్తుచేసుకునే సమయం. ఆమె పాటలు మనతో ఉన్నంతకాలం, ఆమె స్వరం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. అదే నిజమైన అమరత్వం. అందుకే ఆశా భోస్లే అస్తమయం ఒక మహత్తరమైన వారసత్వానికి నిశ్శబ్ద నివాళి. ఆమె గానం మన సంస్కృతిలో ఒక చిరస్థాయి స్వరంగా నిలిచిపోతుంది. ఆమె పేరు వినిపించిన ప్రతిసారి, భారతీయ సంగీత చరిత్రలో ఒక స్వర్ణయుగం గుర్తు కు వస్తుంది. అదే ఆశా భోస్లే గొప్పతనం.
ఎల్లబోయిన వెంకటేశ్వర్లు

