Homeఎడిటోరియల్ / బహుళBC-ism literature: బీసీవాద సాహిత్యానికి కొత్త చేర్పు

BC-ism literature: బీసీవాద సాహిత్యానికి కొత్త చేర్పు

BC-ism literature: తెలంగాణ నేల గర్వించదగ్గ యువ పరిశోధకుడు అట్టెం దత్తయ్య. గొర్ల కాపరి నుంచి ఢిల్లి యునివర్సిటీ దాక ఎదిగిన తన జీవితం ఒక గొప్ప ప్రేరణాపాఠం. పరిశోధనలో, సాహిత్య విమర్శలో కృషి చేస్తూ సాహిత్యంలోని ఖాళీలను పూరిస్తున్నాడు. దత్తయ్య ‘మహాభారతంలో సం వాదాలు – సమగ్ర పరిశీలన’ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా పొందాడు. పరిశోధన గ్రంథాల మీద పరిచయ వ్యాసాలు రాయించి సారాంశం పుస్తకాలను తేవడం చరిత్రలో నిలిచిపోయే పని. సామాజిక అవసరాన్ని గుర్తించి రచన చేయడంలోనే ఒక సృజనకారుడి గొప్పతనం తెలుస్తుంది. బీసీ వాద సాహిత్యం మీద విస్తృతంగా పనిచేస్తున్న వాళ్ళలో దత్తయ్య ఒకరు. బీసీ కులవృత్తుల మీద వచ్చిన కథలను ఒకచోట చేర్చి వాము, మోకు, రేవు మొద లైన కథా సంకలనాలను తీసుకొని వస్తున్నాడు. ‘తెలం గాణ బిసి వాద సాహిత్యం’ అనే విలువైన పరిశోధనా గ్రంథాన్ని తీసుకొని వచ్చాడు. బిసివాద సాహిత్యాన్ని ఒక చోట చేర్చి, వర్గీకరించి, విశ్లేషించి భవిష్యత్‌ అడుగులు ఎటువైపు వేయాలో చెప్పిన పరిశోధన ఇది.

- Advertisement -

ఈ పుస్తకంలో బిసి వాద సాహిత్యాన్ని ప్రక్రియల పరంగా విభజించుకొని ఒక్కో కుల వృత్తి గురించి వచ్చిన సాహిత్యాన్ని విశ్లేషించాడు. పద్యం, పాట, వచన కవిత, కథ, నవల, సాహిత్య విమర్శ మొదలైన ప్రక్రియల్లో బిసి వాద సాహి త్యాన్ని ప్రతిబింబించే రచనలు ఏవేవి వచ్చామో చెబుతూ ఆయా జీవితాల గురించి వివరించాడు. బిసి కులవృత్తులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఒకచోట పొందుపరచడం ఈ గ్రంథం ప్రత్యేకత. బిసి వాద సాహిత్యం మీద పరిశోధన చేయాలనుకునే పరిశోధకులకు ఈ పుస్తకం దారిదీపం. తెలంగాణ బిసి వాద సాహిత్యం -పరిచయం అనే మొదటి వ్యాసంలో బిసి వాద సాహిత్యం పునాదుల గురించి సమగ్రంగా చర్చించాడు. జి. లక్ష్మీనరసయ్య సంపాద కత్వంలో ‘చిక్కనవుతున్నపాట’ బహు జన కవితా సంకలనం వచ్చినపుడు జరిగిన వాదవివాదాలను ప్రస్తావిస్తూ ‘వెంటాడే-కలాలు-వెనుకబడిన కులాలు’ సంకలనం రావడానికి దారితీసిన పరిస్థితులన్నింటినీ గుర్తు చేస్తాడు.

అన్ని సాహిత్య ఉద్యమాలలాగే బిసి వాద సాహిత్యం విస్తృతంగా రాకపోవడానికి గల కారణాలను, కుట్రలను విశ్లేషించాడు. ‘బిసి లను హిందుత్వం పేరుతో కొందరు, దళితులలో ఒకరిగా మరికొందరు, బహుజనుల పేరుతో ఇంకా కొందరు, దళిత బహుజనులుగా మరి కొందరు చూపిస్తున్నారు. రకరకాల గొడుగులను కప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సామా జికంగాను, సాహిత్యపరంగాను ఒక రకమైన కుట్ర’ అని స్పష్టంగా తన వ్యాసంలో పేర్కొన్నాడు.
‘తెలంగాణ పద్య కవిత్వం – బిసి వాదం’ అనే వ్యాసం రచయిత అధ్యయనాన్ని తెలుపుతుంది. పాల్కురికి సోమనాథుడి బసవ పురాణం మొదలుకొని దోరవేటి శ్రమదేవోభవ కావ్యం వరకు పద్యంలో చిత్రించిన బిసి జీవితం గురించి వివరించాడు. పాట ప్రక్రియలో బిసి కులవృత్తుల గురించి విశ్లేషిం చడానికంటే ముందు ఆశ్రిత కులాల్లో పాటతో ఉండే సం బంధం గురించి చెబుతాడు. ‘అనంతమైన మౌఖిక, జానపద సాహిత్యం అచ్చులోకి వచ్చినపుడే బిసిల అసలైన అస్తిత్వ సాహిత్యం తెలుసుకున్న వాళ్ళం అవుతాం’ అని చెప్పిన మాటలు ఎంతో విలువైనవి. ఇవి ఆశ్రిత కులాల్లోని కథాగానాలను రికార్డు చేయ వలసిన బాధ్యతను గుర్తు చేస్తాయి.

బిసివాద సాహిత్యం వచనకవిత రూపంలో ఎక్కువ వచ్చిందని చెబుతూ అరవై పేజీల్లో తన విశ్లేషణను సమగ్రంగా చర్చిస్తాడు. ఏ కులవృత్తి గురించి దత్తయ్య మాట్లాడాలని అనుకుంటాడో ఆ కులానికి సంబంధించిన కులవృత్తి నైపుణ్యం, ఈ సమాజానికి వాళ్ళు అందించిన సేవ, ఈ సమాజం వాళ్ళను చూసిన తీరు మొదలైన విషయాలను ప్రస్తావించి తర్వాత ఆ కులవృత్తి మీద వచ్చిన సాహిత్యాన్ని విశ్లేషిస్తాడు. బిసి కులాల్లోని సాధకబాధకలు, కులవృత్తి నైపుణ్యం, సామాజిక గౌరవం గురించి చర్చిస్తున్నప్పుడు రచయిత సామాజిక దృష్టి కోణం స్పష్టం అవు తుంది. ఒక్కో కులం గురించి ప్రాథమిక అవగా హనను కల్పిస్తూ ఆయా కులాల మీద వచ్చిన సాహిత్యంలోని సామాజిక, రాజకీయ, సాంస్కృ తిక కోణాలను పరిశీలించాడు. బిసి వాద సాహిత్య విమర్శలో భాగంగా వివిధ పత్రికల్లో, పుస్తకాలకు రాసిన ముందు మాటలలో బిసి సాహిత్యం మీద వచ్చిన వ్యాసాల గురించి వివరించాడు. ఏయే ప్రక్రియలలో ఎంత సాహిత్య విమర్శ వచ్చిందో కూలంకషంగా చర్చించాడు. బిసి కుల వృత్తుల నుంచి నవలలు, సాహిత్య విమర్శ ఇంకా రావల్సిన అవసరాన్ని అట్టెం దత్తయ్య తన గ్రంథంలో చెప్పాడు.

గొల్లకుర్మలు, ఉప్పరులు, దర్జీలు, విశ్వ బ్రాహ్మణలు, నాయీ బ్రాహ్మణులు పద్మశాలీలు, గౌండ్లు, కుమ్మరులు, వడ్డెరులు, ముదిరాజులు, గంగపుత్రులు, రజకలు, ఇంకా ఆశ్రిత కులాల మీద వచ్చిన సాహిత్యాన్ని విశ్లేషించాడు. ఏయే కులాల మీద ఎంత సాహిత్యం వచ్చింది? ఇంకా ఏయే కులాల మీద రావాల్సిన అవసరం ఉంది? అనే ఒక స్పష్టమైన అవగాహనను ఈ వ్యాసాలు అందిస్తాయి. బిసి వాద సాహిత్యం మీద వచ్చిన పుస్తకాలను, వాటి ముందుమాటలను, సాహిత్య వ్యాసాల చర్చలను వ్యాస ప్రారంభంలో ఉటం కిస్తూ ఒక చర్చను స్వాగతిస్తున్నట్లు వ్యాసం ఎత్తుగడ ఉంటుంది. ప్రతి వ్యాసం అకడమిక్‌ విమర్శగా సాగుతుంది. ప్రక్రియలవారీగా అందు లోనూ కులాలవారీగా విభజించుకొని విశ్లేషిం చడం వలన ఈ వ్యాసాలకు సమగ్రత వచ్చింది. రేపు ‘తెలంగాణ బిసి వాద సాహిత్యం’ గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం అందుకుంటున్న సందర్భంగా..

 

తగుళ్ళ గోపాల్‌
కవి, విమర్శకులు
9505056316

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News