Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్New chapter in Kashmir: ఇక కాశ్మీర్‌ చరిత్రలో కొత్త అధ్యాయం

New chapter in Kashmir: ఇక కాశ్మీర్‌ చరిత్రలో కొత్త అధ్యాయం

కశ్మీర్ కు పాత పీడ విరగడైంది

ఆర్టికల్స్‌ 370, 35(ఎ)లను రద్దు చేయడానికి సంబంధించి సుప్రీం కోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఇది ఏ విధంగా చూసినా భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతకు పుష్టినిచ్చే తీర్పు. నాలుగేళ్ల క్రితం అంటే 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్టికల్స్‌ ను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగానికి అనుకూలంగా ఉందే తప్ప రాజ్యాంగ విరుద్ధంగా లేదని కూడా అది తేల్చిచెప్పింది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలికమే తప్ప శాశ్వతంగా ఉండాల్సిన అంశం కాదని కూడా అది నిర్ధారించింది.
వాస్తవానికి జమ్మూ కాశ్మీర్‌ ప్రకృతి సౌందర్యానికి మారు పేరుగా ఉన్నాయి. ఎన్నో శతాబ్దాలుగా ఎందరో కవులు, గాయకులు, కళాకారులు, సాహసులు ఈ ప్రాంతం నుంచి ఉత్తేజం, ఉత్ప్రేరణ పొందారు. ఎందరో కావ్య రచయితలు తమ గ్రంథాల్లో కాశ్మీర్‌ అందాలను, రమణీయతను ప్రస్తుతించారు. అటువంటి రాష్ట్రం గత ఏడు దశాబ్దాల నుంచి హింసా విధ్వంసకాండలకు ఆలవాలమైపోయింది. భయాందోళనలు కలిగించే విధంగా అస్థిరత్వం ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలే కాక, దేశ విదేశాల పర్యాటకులకు సైతం ఇటువంటి రమణీయ రాష్ట్రం ఈ విధంగా రాక్షణ కృత్యాల్లో మునిగి తేలడం ఏమాత్రం నచ్చని విషయం.
ఈ రాష్ట్రం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో వెల్లివిరియాలని, తన అద్భుత అందాలను ప్రపంచానికంతటికీ తేటతెల్లం చేయాలని కోరుకోని వ్యక్తి దేశంలో ఉండకపోవచ్చు. ఈ ప్రాంతం సుస్థిరత గురించి, క్షేమం గురించి ఆందోళన చెందని వ్యక్తి దేశంలో ఉండడనే అనుకోవాలి. దీనినొక రాజకీయ అంశంగా మాత్రమే పరిగణించడానికి అవకాశం లేదు. ప్రజల మనోభావాలను, అభీష్టాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. జవహర్‌ లాల్‌ నెహ్రూ మంత్రివర్గంలో ఒక సభ్యుడుగా ఉన్న శ్యాంప్రసాద్‌ ముఖర్జీ ఒక మంత్రిగా ఎక్కువ కాలం కొనసాగేవారే కానీ, కేవలం కాశ్మీర్‌ కారణంగా ఆయన బయటికి వచ్చేయడం జరిగింది. ఆయన తన జీవితాన్ని పణంగా పెట్టి కాశ్మీర్‌ గురించి పోరాడడం జరిగింది. ఆయన పోరాటం కారణంగానే కోట్లాది మంది భారతీయ ప్రజలకు కాశ్మీర్‌తో భావోద్వేగపరమైన అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత కూడా పలువురు నాయకులు, పాలకులు కాశ్మీర్‌ పూర్వవైభవం గురించి ఆరాటపడుతూ వచ్చారు.
తీరని ద్రోహం నిజానికి కాశ్మీర్‌కు ఘోరమైన అన్యాయం జరిగింది. అంతకుమించి దారుణమైన వంచన జరిగింది. కాశ్మీర్‌ విషయంలో వంచన జరగడమంటే దేశానికి, ఆ రాష్ట్ర ప్రజలకు కూడా ద్రోహం జరిగినట్టే లెక్క. ప్రజలకు జరిగిన అన్యాయానికి పరిష్కారం కనుగొనడం అనేది ఇక ప్రభుత్వాల బాధ్యత. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35(ఎ) అనేవి కాశ్మీర్‌ ప్రగతికి, అభివృద్ధికి ప్రధాన ప్రతిబంధకాలుగా మారిపోయాయి. ఈ అడ్డుగోడలను ఛేదించడం దాదాపు అసాధ్యమైపోయింది. పాలకులెవరూ వీటిని ఛేదించేందుకు సరైన ప్రయత్నం చేయకపోవడం వల్ల ఆ ప్రాంతం పేదరికంలో మగ్గిపోయింది. ఆ రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన పురోగతి లేకుండాపోయింది. కాశ్మీర్‌ లో ఉండేవారికే కాక, కాశ్మీర్‌ ను సందర్శించే వారికి సైతం ఈ వాస్తవం కళ్లకు కట్టింది. ఈ రాష్ట్రంలో వరుసగా ప్రభుత్వాలు ఏర్పడుతున్నా వాటికి రాష్ట్ర ప్రజల పురోగతి మాత్రం ఏమాత్రం మనసుకు ఎక్కలేదు. ఈ రెండు ఆర్టికల్స్‌ మాదిరిగానే వారి స్వార్థ చింతన కూడా రాష్ట్ర పురోగతికి అడ్డంకిగా తయారైంది.
ఇక్కడ ఒక్క విషయం అందరికీ తేలికగా అర్థమై పోతుంది. కాశ్మీర్‌ లోని మూడు కోట్ల మంది ప్రజలకు మాత్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని, రాష్ట్రంతో పాటు దేశాన్ని అభివృద్ధి చేయాలనే ఆశయం బాగా ప్రబలంగానే ఉంటూ వస్తోంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. హింసా విధ్యంసకాండలు, అనిశ్చిత పరిస్థితి, అస్థిరతలకు అతీతంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలని, తమ పిల్లల జీవితాలు బాగుపడాలని, వారు సరైన ఉద్యోగాలు చేసుకోవాలనే ఆశలు, ఆశయాలు అక్కడి ప్రజల్లో మెండుగా, నిండుగా ఉన్నాయన్న అభిప్రాయంలో తప్పేమీ లేదు. ఫలితంగా, ప్రజల మనోభావాలకు ప్రాధాన్యం ఇవ్వడమనేది ముఖ్యమైపోయింది. అనేక కార్యక్రమాలు, పథకాలు, ప్రణాళికల ద్వారా ప్రజల్లో నమ్మకం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది.
ఇందుకు ప్రయత్నాలు 2014 నుంచే ప్రారంభమయ్యాయి. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొద్ది రోజుల ముందు జమ్మూ కాశ్మీర్‌లో పెద్ద ఎత్తున వరదలు ప్రారంభమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రాష్ట్రం అల్లకల్లోలంగా తయారైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెంటనే శ్రీనగర్‌ వెళ్లి, అక్కడే కొద్ది రోజులుండి, పరిస్థితిని సమీక్షించడంతో పాటు వెయ్యి కోట్ల రూపాయల మేరకు సహాయం ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఆయన కాశ్మీర్‌ లోనే కొద్ది రోజులుండి, అక్కడి ప్రజల సాధక బాధకాలను తెలుసుకోవడం ప్రారంభించారు. అప్పటి నుంచి అక్కడి ప్రజల్లో అభివృద్ధికి సంబంధించిన ఆరాటం మరింతగా పెరిగింది. తమకు అభివృద్ధి అవసరమని, దశాబ్దాల తరబడి పాలకుల అవినీతితో ఇబ్బంది పడుతున్న తమకు ఈ పరిస్థితి నుంచి విముక్తి కల్పించాలని ప్రజలు కోరుకోవడం మొదలైంది.
కేంద్రం ప్రత్యేక శ్రద్ధ అప్పటి నుంచి కేంద్ర ప్రభు త్వంలోని మంత్రులు ఒకరి తర్వాత ఒకరుగా ఈ రాష్ట్రాన్ని సందర్శించడం, ప్రజలను కలుసుకోవడం, వారి సమస్యలు తెలుసుకోవడం, ఏదో ఒక అభివృద్ది పథకాన్ని ప్రారంభించడం జరుగుతూ వచ్చింది. 2014 మే నెల నుంచి 2019 మార్చి వరకు కేంద్ర మంత్రులు 159 పర్యాయాలు ఈ రాష్ట్రాన్ని సందర్శించారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి ఇదొక రికార్డు. మంత్రులు ఆ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా ప్రాథమిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉపాధిని కల్పించడం, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, హస్తకళల పరిశ్రమకు ఊతమివ్వడం జరిగింది. అంతేకాదు, జమ్మూ కాశ్మీర్‌లో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. క్రీడా మైదానాలలో ఆధునిక సౌకర్యాలను మెరుగుపరచడం, కొత్త మైదానాలను అభివృద్ధి చేయడం, వర్ధమాన క్రీడాకారులకు శిక్షణనివ్వడం, ఇతర రాష్ట్రాల నుంచి శిక్షణ నిపుణులను పంపించడం వంటివి కూడా జరిగాయి.
ఫుట్‌ బాల్‌ క్లబ్బులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీనగర్‌లో అఫ్షాన్‌ ఆషిక్‌ అనే యువతి పలువురు ఆమెపై రాళ్ల వర్షం కురిపించినప్పటికీ ఫుట్‌ బాల్‌లో రాణించడం అక్కడి మార్పుకు అద్దం పట్టింది. ఇక ఇక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం అనేది కాశ్మీర్‌ ప్రజల జీవితాలను చరిత్రాత్మకమైన మలుపు తిప్పింది. అక్కడ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడమనేది కేంద్ర ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా పరిణమించింది. జరగరానిది జరిగితే కేంద్ర ప్రభుత్వమే కుప్పకూలడం జరుగుతుంది. అయితే, ఈ రాష్ట్రంలో తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలన్న కృత నిశ్చయంతో కేంద్ర ప్రభుత్వం సాహసానికి ఒడిగట్టింది. పిల్లలకు, మహిళలకు ఎటువంటి అపకారం జరగకుండా ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంది. పంచాయతీల్లోని ప్రధాన్‌ లతో ముందుగానే సమావేశం ఏర్పాటు చేసి, వ్యూహాన్ని తయారు చేసి ఎన్నికలు విజయవంతంగా నిర్వహించింది. వాస్తవానికి ఆ రాష్ట్రంలో మాన ప్రాణాలకు విలువ లేదు. ఎస్‌.సిలు, ఎస్‌.టిలు, మహిళలు, పిల్లలు, ఇతర బలహీన వర్గాలు చాలా ఏళ్లుగా నానా అగచాట్లూ పడుతూ వచ్చారు.
2019 ఆగస్టు 5న ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన తర్వాత నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. శాసన సభ, పార్లమెంట్‌ ఎన్నికలను తప్ప మిగిలిన స్థానిక సంస్థలన్నిటినీ నిర్వహించి, స్థానికులకు పాలనను అప్పగించడం జరిగింది. ఈ అభివృద్ధిని చూసి, శరణార్థులు సైతం ఈ రాష్ట్రానికి తిరిగి రావడం ప్రారంభమైంది. రాష్ట్రంలో సౌభాగ్య, ఉజలా, ఉజ్వల పథకాలను అమలు చేయడంతో పాటు, పెద్ద ఎత్తున మరుగు దొడ్లు నిర్మించడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడం, విద్యుత్‌ సౌకర్యాలు, నీటి సౌకర్యాలు కల్పించడం, ప్రాధమిక సౌకర్యాలను అభివృద్ధి చేయడం వంటివి పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించి, కేంద్ర పర్యవేక్షణలో వీటిని పకడ్బందీగా అమలు చేయడం మొదలుపెట్టింది. ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. జమ్మూ, కాశ్మీర్‌, లడఖ్‌లో శాంతి పవనాలు వీచడంతో పాటు, అభివృద్ధి ఫలాలు అందరికీ అందడం మొదలైంది. ఇక ప్రజల కలలు, ఆశలు, ఆశయాలు వమ్మయ్యే ప్రసక్తి లేదు. వారి దృష్టంతా ప్రస్తుతం భవిష్యత్తు మీద కేంద్రీకృతమై ఉంది. నిరాశా నిస్పృహల స్థానంలో ఆశలు పెరిగాయి. ప్రజల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. తల్లిదండ్రులు నిర్భయంగా తమ పిల్లలను స్కూళ్లకు పంపించగలుగుతున్నారు. ఆర్టికల్‌ 370, 35(ఎ)ల రద్దుతో కాశ్మీర్‌ కు ఒక ముఖ్యమైన పీడ వదిలిపోయిందని ఇప్పుడు కాశ్మీర్‌ను సందర్శించిన వారెవరికైనా అనిపిస్తుంది.

  • జి. రాజశుక
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News