దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను 1954 నుంచి నేటి వరకు 50 మందికి అందజేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీకి చెందిన లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ లకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఈ అగ్రనేతలకు పురస్కారాలు అందజేయడంతో ఈ పురస్కార గ్రహీతలు దేశవ్యాప్తంగా ప్రజల మనసుల్లో జాతీయ స్థాయి హీరోలుగా గుర్తింపు పొందడం జరిగింది. నిజానికి ఎవరైనా దేశవ్యాప్తంగా నాయకులుగా గుర్తింపు పొందినప్పుడు వారు చిరస్థాయిగా మిగిలిపోవడం జరుగుతుంది. వారిని జాతీయ స్థాయి నాయకులుగా నిలబెట్టడం ద్వారా వారి నుంచి ప్రజలు స్ఫూర్తి పొందడం కూడా జరుగుతుంది. ఆధునిక భారతదేశ చరిత్రను మలుపు తిప్పిన వ్యక్తి అద్వానీ. పధ్నాలుగేళ్ల వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్)లో చేరిన అద్వానీ నరేంద్ర మోదీ కంటే ఎంతో ముందు హిందుత్వ సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్లడం జరిగింది. మోదీకి గురువు, మార్గదర్శి కూడా అయిన అద్వానీ అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం పోరాటాలు ప్రారంభించి, దేశ చరిత్రనే మలుపు తిప్పడం జరిగింది.
నిజానికి అప్పట్లో అయోధ్య రామమందిరానికి సంబంధించి అద్వానీ సాగించిన పోరాటాలు, ఉద్యమాలు రాజ్యాంగ పరిమితులకు ఒక సవాలుగా నిలిచారు. మత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారాలకు న్యాయస్థానాల ద్వారా పరిష్కారం కనుగొనవచ్చా అన్న మీమాంస దేశంలో ప్రారంభం అయింది. అయితే, ప్రజలదే సార్వభౌమాధికారమనే కొత్త అభిప్రాయం వేళ్లుపాతుకు పోవడంతో దేశం అనేక దశలలో అనేక విధాలుగా మార్పులు, చేర్పులకు లోనయింది. 2019 డిసెంబర్ లో సుప్రీంకోర్టు రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పునివ్వడం, 2024 జనవరి 22న మోదీ చేతుల మీదుగాప్రారంభోత్సవం జరిగిపోయాయి.
ఇక సామాజిక న్యాయ రాజకీయాల్లో కేంద్ర బిందువు వంటి వారు కర్పూరీ ఠాకూర్. ఒక్క బీహార్ రాష్ట్రంలోనే కాక, యావత్ హిందీ రాష్ట్రాల్లో ఆయన సామాజిక న్యాయం కోసం సాగించిన పోరాటాల ప్రభావం ఇప్పటికీ స్పష్టంగా కనిపిస్తూనే ఉంటుంది. ఆయన సాగించిన పోరాటాలు దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని సవాలు చేశాయి. 1970లలో రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూరీ ఠాకూర్ కారణంగా దేశంలో సామాజిక న్యాయం అనే అత్యవసర అంశానికి ప్రాధాన్యం పెరిగి, వివిధ పార్టీల తీరుతెన్నులు కూడా మారిపోయాయి. వాటి ప్రాధాన్యాలు, వాటి ఆలోచనా విధానాలు కూడా మారిపోయాయి. ఇందులో కొన్ని వర్గాలు బీజేపీతో కూడా మమేకం చెందాయి. పార్టీలో కొందరు ప్రముఖులు ఈ సామాజిక న్యాయ నినాదాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చినప్పటికీ, ఈ నినాదం కారణంగా ఆ తర్వాత పార్టీ దృఢపడడం, విస్తరించడం జరిగిందననేది కాదనలేని సత్యం. కర్పూరీ ఠాకూర్ కు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించడం ద్వారా పార్టీలోని సామాజిక న్యాయ శక్తులకు మరింత ఊతం లభించింది.
బీజేపీ నుంచి మొదటిసారిగా ప్రధానమంత్రిగా ఎన్నికైన అటల్ బిహారీ వాజ్ పేయీకి, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ సంస్థాపకుడు పండిట్ మదన్ మోహన్ మాలవీయాలకు 2015లోనూ భారత రత్న పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 2019లో ప్రణబ్ ముఖర్జీ, భూపేన్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ లకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించారు. ఈ పురస్కారాలను ప్రకటించడం అనేది సమకాలీన రాజకీయ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఈ పురస్కారాల చుట్టూ కూడా రాజకీయాలు అల్లుకుపోయి ఉంటాయి. కేంద్రంలోని పాలక పక్షాలను ఉపయోగపడతాయనే ఉద్దేశంతో తమిళనాడులో అన్నాడి.ఎం.కె అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.జి. రామచంద్రన్ కు, రాజ్యాంగ నిర్మాత బి.ఆర్. అంబేద్కర్ కు కూడా భారతరత్నను ప్రకటించారు. మొత్తం మీద అద్వానీ, కర్పూరీ ఠాకూర్ లకు భారతరత్న ఇవ్వడం ద్వారా బీజేపీ రెండు కీలక వర్గాలను సంతృప్తిపరచినట్టయింది. అందులో ఒకటి హిందుత్వవాదులు కాగా, మరొకరు వెనుకబడిన తరగతులవారు.