Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్A shocking survey National Health Mission: ఆరోగ్య సంరక్షణలో అధమ స్థానం?

A shocking survey National Health Mission: ఆరోగ్య సంరక్షణలో అధమ స్థానం?

ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలో ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలకు సంబంధించి నిర్వహించిన ఒక సమగ్ర సర్వేలో కొన్ని దిగ్భ్రాంతికర విశేషాలు వెలుగు చూశాయి. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌.హెచ్‌.ఎం) కింద పనిచేస్తున్న ప్రజారోగ్య కేంద్రాలలో 80 శాతం కేంద్రాలు సిబ్బంది, ప్రాథమిక సౌకర్యాలు, మందులు, రోగ నిర్ధారణల వంటి కీలక విషయాలకు బాగా దూరంగా ఉన్నాయని ఈ సర్వేలో తేలింది. జిల్లా ఆస్పత్రుల నుంచి ఉప ఆరోగ్య కేంద్రాల వరకు దేశవ్యాప్తంగా సుమారు 2.01 లక్షల ఆరోగ్య కేంద్రాలు ఈ హెల్త్‌ మిషన్‌ నిర్వహణలో ఉన్నాయి. ఇందులో 40,451 కేంద్రాల మీద సర్వే జరిగింది. ఇందులో భారతీయ ప్రజారోగ్య ప్రమాణాలకు తగ్గట్టుగా ఉన్నది 20 శాతం, 8,098 కేంద్రాలు మాత్రమే. మిగిలిన 80 శాతం ఆరోగ్య కేంద్రాల్లో కనీస సౌకర్యాలు 40 శాతం కూడా లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇదంతా చెదురు మదురుగా జరిగిన సర్వే అయినందువల్ల పూర్తి స్థాయి ఫలితాలను వీటిని బట్టి బేరీజు వేయడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వం సర్వేల పేరుతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఆరోగ్య కేంద్రాలపై చర్యలు తీసుకోవడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. అయితే, కేవలం 20 శాతం ఆరోగ్య కేంద్రాలపై మాత్రమే తనిఖీలు చేపట్టడం, చర్యలు తీసుకోవడం మొత్తం పరిస్థితిని ప్రతిబింబించే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పూర్తి స్థాయిలో సర్వే చేపట్టడం వల్ల యథార్థ స్థితి వెలుగు చూసే అవకాశం ఉంటుంది. దేశంలో అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా పేద ప్రజానీకానికి దగ్గరగా ఉండే ఆరోగ్య సంరక్షణ కేంద్రాల మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపల దేశంలోని సుమారు 70,000 ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను భారతీయ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతామంటూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలతో సంతృప్తిపడి ప్రయోజనం లేదు. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ప్రమాణాలను పెంచడాన్ని ప్రభుత్వం ఒక సవాలుగా తీసుకుని బృహత్తర కృషి జరపాల్సి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ కేంద్రాల ప్రమాణాలకు సంబంధించినంత వరకూ అత్యున్నత నేషనల్‌ క్వాలిటీ అష్యూరెన్స్‌ స్టాండరడ్స్‌ స్థాయిలో ఉండాల్సిన ఈ కేంద్రాలు సాధారణ భారతీయ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలకు తగ్గట్టుగా లేకపోవడం ఆందోళనకర విషయం.
దేశంలో సుమారు 80 శాతం ఆరోగ్య కేంద్రాలు మొదటి పరీక్ష అయిన భారతీయ ఆరోగ్య సంరక్షణ ప్రమాణాలకు తగ్గట్టుగానే లేవంటే, ఇక అత్యున్నత ప్రమాణాలకు చేరుకోవడానికి ఎంత కాలం పడుతుందన్నది ఆలోచించాలి. స్పష్టమైన లక్ష్యాలతో, సరైన కాల వ్యవధులతో, రాబోయే కేంద్ర బడ్జెట్‌ లో భారీగా నిధులు కేటాయిస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఈ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు ఏ ప్రమాణాలనూ చేరుకునే అవకాశం లేదు. దేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు పూర్తిగా కుప్ప కూలిపోలేదు కానీ, కోవి్‌డ తర్వాత వాటి పని అధ్వానంగా తయారయిందన్న విషయం మాత్రం నిజం. కోవి్‌డ కాలంలో ఆరోగ్య కేంద్రాలు పటిష్ఠంగానే పనిచేశాయి. ఆ తర్వాత మళ్లీ వాటి మీద శ్రద్ధ తగ్గినట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ కేంద్రాల పరిస్థితిని చూసినవారికి కోవి్‌డ లాంటి మరో ఉపద్రవం ముంచుకొస్తే దేశం పరిస్థితి ఏమిటనే ఆందోళన కలుగుతోంది.
వాస్తవానికి, 2022-23లో కేంద్ర బడ్జెట్‌ లో 2.66 శాతం నిధులను ఆరోగ్య సంరక్షణకు కేటాయించడం జరిగింది. 2023-24 నాటికి అది 2.06 శాతానికి తగ్గిపోయింది. 2024-25 మధ్యంతర బడ్జెట్‌ లో ఆరోగ్య సంరక్షణకు కేటాయించింది 1.99 శాతం నిధులు మాత్రమే. దేశంలో అన్ని స్థాయి ల్లోనూ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు మెరుగుపడాలన్న పక్షంలో ఈ రంగానికి కేటాయింపులు పెంచక తప్పదు. దేశంలో ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రాథమిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి కనీసం 2.5 శాతం నిధులను కేటాయించక తప్పదని 2017లో విధానపరమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోవిడ్‌ విసిరిన సవాళ్లను, దేశంలో శిశు మరణాలు పెరుగు తుండడాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం తమ బడ్జెట్‌ కేటాయింపులను పెంచడమే తప్ప తగ్గించడం ఏమాత్రం భావ్యం కాదు. దేశంలో ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయ డానికి రాబోయే కేంద్ర బడ్జెట్‌ ఒక సదవకాశమని గుర్తుంచుకోవాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News