Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Accidents killing more people in India says NBCR: లోప భూయిష్ఠంగా రవాణా...

Accidents killing more people in India says NBCR: లోప భూయిష్ఠంగా రవాణా వ్యవస్థ

దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా వాహన ప్రమాదాలు విజృంభిస్తున్నాయి. రోజుకు ఎంత లేదన్నా కనీసం 260 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నట్టు నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది. పాత వాహనాలు, పాత రోడ్లు, పాత నిబంధనలు, డ్రైవర్లు, ప్రజల్లో అవగాహన లోపం వెరసి ఏటా లక్ష మందికి పైగా వాహన లేదా రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలో పోగొట్టుకుంటున్నట్టు అధికారిక అంచనా. ఉత్తర ప్రదేశ్‌ లో గత 10వ తేదీన ఒక ప్రైవేట్‌ డబుల్‌ డెక్కర్‌ బస్సును ట్యాంకర్‌ ఢీకొనడంతో అక్కడికక్కడే 18 మంది ప్రాణాలు విడిచారు. అదొక పాతబడిన డబుల్‌ డెక్కర్‌ బస్సు. అందులో ఏ భాగమూ సరిగ్గా లేదు. దానికి కూడా బీమా కూడా ఎప్పుడో కాలం చెల్లిపోయింది. బస్సు దారి మళ్లినప్పుడు, ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నప్పుడు హెచ్చరించడానికి డబుల్‌ డెక్కర్‌ బస్సుల్లో సాధారణంగా ఒక అలారమ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ బస్సులో ఆ వ్యవస్థ కూడా లేదు.
ప్రభుత్వం గానీ, ప్రైవేట్‌ సంస్థలు గానీ ఇటువంటి రవాణా సౌకర్యాలను ఏర్పాటు చేసేటప్పుడు, రోడ్ల తీరుతెన్నులు, రోడ్డు పక్కన చిన్న వ్యాపారాలు, బస్సు వేగం, నిలుపుదల వ్యవస్థలు, దృష్టి సమస్యలు, బస్సు పరిస్థితి వగైరా అంశాలనన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. రవాణా వ్యవస్థలకు చెందిన అధికారులతో పాటు పురపాలక సంఘాలు లేదా నగర పాలక సంస్థల అధికారులు బస్సులు, ఇతర వాహనాల పరిస్థితులతో పాటు, రోడ్ల పరిస్థితిని కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే, ఈ విభాగాలకు చెందిన అధికారులు ప్రజలు చనిపోతే తప్ప వీటి గురించి ఆలోచించడం జరగడం లేదు. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ నివేదిక ప్రకారం, 2022లో దేశవ్యాప్తంగా 4.46 లక్షల రోడ్డు ప్రమాదాలు జరగ్గా, అందులో 1.71 లక్షల మంది చనిపోవడం, 4.23 లక్షల మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రులు పాలు కావడం జరిగింది. ఇంకా సుమారు 4.55 లక్షల పాత బస్సులు, వాహనాలు రోడ్ల మీద అడ్డూ ఆపూ లేకుండా తిరుగుతున్నాయి.
కాగా, 2023లో ఢిల్లీ ఐ.ఐ.టి దేశవ్యాప్తంగా ఒక రోడ్డు సర్వే నిర్వహించినప్పుడు, 2021లో ప్రతి లక్ష మందికి 11.3 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు వెల్లడయింది. ఇందులో కొన్ని ఫిర్యాదుకు రాని మరణాలు, ప్రమాదాలు కూడా ఉండవచ్చు. మొత్తానికి ప్రజా జీవితం తీవ్ర సంక్షోభంలో ఉన్నట్టు అర్థం అవుతోంది. వాహనాల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ వాటి వేగం మాత్రం వాయు వేగం స్థాయి లోనే ఉంటోంది. ఎన్ని నిబంధనలున్నా, ఎన్ని చట్టాలున్నా వాహనాల వేగం మాత్రం అదుపు కావడం లేదు. ఎక్కువ ప్రమాదాలకు వాహనాల అతి వేగమే కారణమని ఢిల్లీ ఐ.ఐ.టి వెల్లడిం చింది. ఉత్తర ప్రదేశ్‌ లో డబుల్‌ డెక్కర్‌ బస్సును ట్యాంకర్‌ ఢీకొన్నప్పుడు, బస్సులోంచి ప్రయా ణికులు బయటికి ఎగిరిపడ్డారని పోలీసులు తెలిపారు. బస్సు ఎంతో వేగంతో ప్రయాణిస్తుంటే తప్ప అటువంటిది జరిగే అవకాశం ఉండదు. పట్టణాలు, నగరాల్లోనే కాక, గ్రామాల్లో సైతం వేగ నియం త్రణ కోసం రవాణా అధికారులు, పోలీస్‌ అధికారులు స్పీడ బ్రేకర్లు, లైన్‌ మార్కింగులు వగైరాలను అనేకం ఏర్పాటు చేస్తుంటారు. ప్రమాదం జరిగిందంటే అందుకు బస్సు పరిస్థితి, మానవ తప్పిదమే ఎక్కువగా కారణాలు అవుతుంటాయి.
దేశంలో వాహన ప్రమాదాలను తగ్గించడానికి నిపుణులు మూడు మార్గాలను సూచిస్తున్నారు. ఇందులో ఒకటి- ప్రస్తుత రవాణా ప్రమాణాలను అధికారులు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం నైపుణ్యం కలిగిన సిబ్బందిని, ఆధునిక పరికరాలను ఏర్పాటు చేసుకో వాలి. భద్రతా ప్రమాణాలను, భద్రతా అవసరాలను అనుసరించని రవాణా ఆపరేటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థలు కూడా రోడ్డు పక్క వ్యాపారాలను ఇష్టారాజ్యంగా ప్రోత్సహించ కుండా, రోడ్డు భద్రత గురించి ఆలోచించాలి. రెండవది- వాహనాల నమోదు, భద్రతా ప్రమాణ పత్రాలు, పరీక్షా కేంద్రాలు, తనిఖీలు, పర్యవేక్షణ విషయాల్లో రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఆధునిక స్థాయి సౌకర్యాల కల్పన, సరికొత్త నిబంధనలకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మరణాలు, క్షతగాత్రుల సంఖ్య విషయంలో కూడా ఈ మంత్రిత్వ శాఖ సరైన గణాంకాలను ప్రచురించడం వల్ల ప్రజల్లో రోడ్డు ప్రమాదాల పట్ల అవగాహన పెరుగుతుంది. మూడవది-రోడ్డు ప్రమాదాల పట్ల, వాహనాల స్థితిగతుల పట్ల, భద్రత పట్ల ప్రజల్లో అవగాహన పెంచడానికి, వారిని చైతన్యవంతుల్ని చేయడానికి ప్రత్యేకంగా ప్రచారాన్ని చేపట్టాల్సి ఉంటుంది. క్వాలిటీ కంట్రోల్‌ వంటి విషయాల్లో అధికారుల ఉదాసీనత, చట్టాల నుంచి తప్పించుకోవడంలో రవాణా ఆపరేటర్లకు ఉన్న నైపుణ్యం వగైరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే ఇవన్నీ ఒక్క రోజులో జరిగే వ్యవహారాలు కావని, ఇందుకు చాలా కాలం పడుతుందని అర్థం చేసుకోవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News