Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Adjustment is the only formula: సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం

Adjustment is the only formula: సర్దుకుపోతేనే సమస్యకు పరిష్కారం

సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ

ఆధునిక జీవన విధానంలో యంత్రాలతోటే రోజంతా గడిచిపోతుంది. ఆర్థికంగా అందరి కంటే ఎక్కువ ఎత్తులో ఉండాలని, ఉరుకుల పరుగులు తీస్తున్న మనుషుల మధ్య వివాహ బంధం పట్ల ఆసక్తి సన్నగిల్లుతోంది. ప్రస్తుత కాలంలో భార్య, భర్తల మధ్య స్పర్శ, మాటా ముచ్చటకు, శృంగారమునకు నోచుకోని కుటుంబాల సంఖ్య నానాటికి పెరిగిపొతున్నాయి. ఆ మధురాను భూతిని, ప్రేమాను రాగాలను, అప్యాయతను పొందలేక మానసిక సమస్యలతో జీవితాన్ని దుర్లభం చేసుకొంటున్నారు. మన దేశంలో పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు కుటుంబ వ్యవస్థకు మూలం ఏదైనా ఉందంటే మూడు ముళ్ల బంధంతో ఇద్దరి మధ్య బ్రహ్మముడితో రెండు జీవితాలను ఒకటి చేసేదే పెళ్లి. ఏడడుగులతో ఆరంభమైన వివాహ బంధం జీవితాంతం కొనసాగుతుంది. అందుకే పెళ్లి అంటే నూరేళ్ల పంట అని అంటూ ఉంటారు.
భారతదేశ వివాహ బంధాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. అంతటి గొప్ప ప్రాధాన్యత ఉన్న అందమైన అపురూపమైన ఈ ఏడడుగుల అనుబంధాన్ని ప్రస్తుత తరం యువతీ యువకులు క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయాలతో జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాయి కొన్ని జంటలు. పెద్దలు కుదర్చిన పెళ్లి అయినా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా వారి వివాహ బంధం మధ్యలోనే త్రుంచేస్తున్నారు. సర్దుకుపోతే సంస్కారం ఒక స్వర్గసీమ. కానీ ప్రస్తుతం పలువురు దంపతులు చిన్నచిన్న సమస్యలనే పెద్దగా చూస్తూ గొడవలు పడుతున్నారు. అనంతరం పెద్దల సమక్షంలో పంచాయితీలు, ఆ తరువాత పోలీస్‌ స్టేషన్ల వరకు చేరి విడిపోతున్నారు. పచ్చటి సంస్కారాన్ని విచ్ఛిన్నం చేసుకుంటున్నారు. వారికి పుట్టిన సంతానానికి తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తూ వారిలో మానసిక ఆందోళనకు కారణమవుతున్నారు. ఇలాంటి సంఘటనలకు కారణాలు ఏమైనా ఉమ్మడి కుటుంబంలో సర్ధిచెప్పే వారు ఉండేవారు. కానీ ప్రస్తుతం చిన్న చిన్న కుటుంబాల్లో చెప్పేవారు లేక భార్యాభర్తలు చిన్నచిన్న గొడవలకే పోలీస్‌ స్టేషన్‌ వరకు వెళ్లి పచ్చని సంసారాన్ని విచ్ఛినం చేసు కుంటున్నారు.
ఒంటరి కుటుంబం
గతంలో పెళ్లైన కొంతకాలం పాటు ఉమ్మడి కుటుంబంతో కలిసిఉండే వారు. ఇంటి యజమాని చెప్పిందే వేదం అన్నట్లుగా కుటుంబమంత నడుచుకునేవారు. ఇది కాస్త రానురాను ఉమ్మడి కుటుంబం కాస్త ఒంటరి కుటుంబంగా తయారైంది. దీంతో చిన్న చిన్న సమస్యలతో భార్యాభర్తలు పంతాలకు పోయి కాపురాన్ని కూల్చుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహిళా పోలీస్‌ స్టేషన్‌కు రోజుకు సుమారు 25 నుంచి 30మంది వరకు కుటుంబ సమస్యలతో పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, పది మంది ముందు చులకన చేసుకోవడంతో పాటు వారి గౌరవాన్ని కించపరుచు కుంటున్నారు.
పండంటి కాపురానికి పది ఫార్మూలాలు

  1. అనుమానించడం మానసిక రుగ్మతయే
    ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాలు తీర్చలేని ఆదాయం, పెరుగుతున్న ఆర్థిక భారం భార్యాభర్తల మధ్య చిక్కులు తెచ్చిపెడుతోంది. ఆపై లేనిపోని అపోహలు, అనుమానా లతోటే జీవితం వెల్లదీస్తున్నారు. భర్త తనకు తెలియకుండా అత్త మామలకే సంపాదించిన డబ్బంతా ఇస్తున్నాడనే భార్య ఆరోపణ. పుట్టింటి వాళ్ళే తన భార్యకు లేనిపోని విషయాలు నేర్పుతున్నారని భర్త వాదన. దంపతులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే దాంపత్య జీవితం ఒడిదుడుకులతో వెల్లదీస్తున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సగం జీవితాలు అనుమానాలతోనే నాశనం అయిపోతున్నాయి కూడా. జీవితాంతం వెలుగు నీడలా ఉండే భాగస్వామిని అనుమానించడం అనేది ఒక మానసిక రుగ్మతయే.
  2. మధురమే దాంపత్య జీవితం
    భరించేవాడు భర్త అయితే, బాధలను పంచుకునేది భార్య. కష్ట సుఖాలలో భర్త అడుగు జాడల్లో నడుస్తూ కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తూ కలిసి ప్రయాణం చేయాలి. ఇదే క్రమంలో ఎన్నో రకాల ఒడి దుడుకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దాంపత్య బంధం సాఫీగా కొనసాగాలంటే ఒకరిపై మరొకరికి నమ్మకం ఉండాలి. దాపరికాలు, పక్క చూపు, అసంతృప్తి లేని బంధమే దంపతుల మధ్య కలకాలం సంతోషంగా ఉంటుంది. వీటిలో ఏది లోపించినా ఆప్యాయతకు, అనుబంధానికి ముప్పు వాటిల్లుతుంది. దాంపత్య జీవితంలో కలకలం రేగుతోంది. దాంపత్య జీవితమే మధురం అని గుర్తించాలి.
  3. సహాయం ఇచ్చిపుచ్చుకోవాలి
    పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లి అనేది తమలో వున్న భావనలను వ్యక్తపరుచుకుని, లోపాలను సరిదిద్దుకొని ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఒక సమస్య ఏర్పడితే, అందుకు తగ్గ పరిష్కార మార్గాన్ని వెతికేందుకు ఒకరికొకరు సహాయంగా వుండాలి. తమకు కావాలసిన వస్తువులు, అవసరాలు, రహస్యాలను దాచిపెట్టకుండా ఒకరికొకరు సహాయంగా ఉండగలగాలి. ఆర్థికపరంగా సమస్యలు వస్తే, వాటిని అధిగమించేందుకు ఇద్దరూ ప్రయత్నించాలి. అప్పుడే ఇద్దరి మధ్య దాంపత్య బంధం గట్టిపడుతుంది.
  4. ఎక్కువ సమయం భాగస్వామితో గడపాలి
    ప్రస్తుతకాలంలో వివాహం చేసుకున్నవారు కేవలం చిన్నచిన్న కారణాలకే విడాకులను తీసేసుకుంటున్నారు. తమ జీవిత భాగస్వామి తనతో ఎక్కువ సమయం కేటాయించడం లేదని లేదా స్నేహాపూర్వకంగా ఉండడం లేదనే భావనతో విడాకులు తీసేసుకుంటున్నారు. అనవసరంగా అనుమానాలను పెంచుకుని తమ అన్యోన్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సమయం కేటాయించలేని సమస్యలు ఉద్యోగస్తులైన దంపతుల మధ్యే ఎక్కువగా కనిపిస్తాయి. ఆఫీసులో సమయాన్ని గడపడం, పనిభారం ఎక్కువవడంతో ఒత్తిడికి గురై తమ భాగస్వామితో జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. ఒకరికొకరు తమ మనసులోని భావాలను వ్యక్తపరుచుకోలేకపోతున్నారు. దీంతో వారు అటు కలిసి వుండలేక, విడిపోయి వుండలేక ఏమి చేయాలో తోచక విడాకులు తీసేసుకుంటున్నారు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఆసక్తి చూపించాలి.
  5. ఆఫీసు సమస్యలను అర్థం చేయించాలి
    వృత్తి, ఉద్యోగ ధర్మాల్లో మీకు తప్పనిసరి హాజరు కావాల్సిన మీటింగ్స్‌ ఉంటే మీ భాగస్వామి అర్థం చేసుకోకుండా తను చెప్పిన పని కావాలనో, సమయానికి ఇంటికి వచ్చేయాలనో పట్టుబడితే మీ భాగస్వామి మీ వృత్తికి సరైన ప్రాముఖ్యత నివ్వడంలేదనే అర్థం చేసుకోవాలి. పైగా అయినదానికి, కానిదానికి, మీరు మారిపోయారని మిమ్మల్ని నిందిస్తుంటే ఇటు ఉద్యోగం వదులుకోవాలా లేక భాగ స్వామిని సంతోషపెట్టాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మీ కెరీర్‌ వల్లనే మీరు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారనిపిస్తే, ఈ వృత్తితోనే మన ఈ జీవితాన్ని అనుభవిస్తున్నామని భావిస్తే భాగస్వామిలో మార్పు తేవడం తప్ప వేరే మార్గం ఉండదు.
  6. మధుర క్షణాలను నెమరువేసుకోవాలి
    ఒకవేళ వివాహ జీవితంలో నిత్యం గొడవలు లేదా తగాదాలు ఏర్పడితే, వాటిని మర్చిపోయేందుకు మీ వివా హ జీవితాన్ని మళ్లీ కొత్తగా ప్రారంభించేందుకు ఆసక్తి చూపించాలి. ఇలాంటి ప్రణాళికలు మహిళలకే సాధ్యమవుతుంది. దంపతులు దూరంగా వుంటున్నప్పుడు తమ మధ్య ఇంతకు ముందున్న మంచి విషయాలు, క్షణాల గురించి గుర్తుచేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇవి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే మీ జీవిత భాగస్వామి మీద మీకు ఎంత ప్రేముందో వారికి తెలియజేసేటట్లు చేయాలి. మీరు మీ హావభావాలతో వారిని ఆకట్టుకునేలా చేసుకో వాలి. అప్పుడే ఇద్దరి మధ్య వున్న దూరం తగ్గుతుంది. జీవన ప్రయాణాన్ని తిరిగి సంతోషంగా కొనసాగించవచ్చు.
  7. క్షమాపణ చెప్పండి
    దంపతుల మధ్య ఏదైనా సమస్య వచ్చి తగాదాలు ఏర్పడినప్పుడు దానికి గొడవ పడకుండా ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం ఎంతో ఉత్తమమైన పద్ధతి. ఇటువంటి పద్ధతిని అనుసరిస్తే ఒకరిమీద ఇంకొకరికి ప్రేమ చిగురిస్తుంది. అసలు ఆ తప్పు ఏమి జరిగిందో కూడా గుర్తించలేరు. ఇద్దరిలో తప్పు ఎవరు చేసినా, ఒకరి కొకరు దానిని పరిష్కరించుకోవడానికి సహాయపడాలి. అప్పుడే మీ మధ్య వున్న దాంపత్య జీవితం బాగుంటుంది. జీవిత భాగస్వామికి క్షమాపణ చెప్పడంలో వెనకాడోద్దు.
  8. మాట పొదుపు పాటించాలి
    ఎంతో ఆతృతతో ఇంటికి వచ్చి, ఒక ముఖ్యమైన ప్రాజెక్టుకి మిమ్మల్ని హెడ్‌ బాస్‌ చేశారని మీరు చెప్తే, మీ బాస్‌తో చనువుగా ఉండబట్టే లేదా లంచం ఇవ్వడం వల్లనే మీకు ఆ పొజిషన్‌ వచ్చిందని సూచన ప్రాయంగానో, ఎత్తి పొడుపు మాటలతో మాట్లాడితే నరకప్రాయమే అవుతుంది. కాని ఈ తరహా అభిప్రాయమే సాధారణంగా సమాజంలో ఉంటుంది. అది మీ భాగస్వామి అభిప్రాయం కూడా అయితే అది మార్చాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి అభిప్రాయాన్ని, మాటలను ఏమాత్రం సహించేది లేదని వారికి తెలపాలి. అభినందించక పోయినా ఫర్వాలేదు కానీ కించపరిచే మాటలతో మాట్లాడితే మనసు గాయపడుతుందని గుర్తించండి.
  9. పరిష్కార మార్గాన్ని వెతకాలి
    పెళ్లయిన ప్రతి జంట తమలో వుండే మైనస్‌ పాయింట్లను ముందుగా గుర్తించుకోవాలి. ఏదైనా ఒక చిన్న సమస్య వస్తే దాని గురించి అనవసరంగా మాట్లాడి టైమ్‌ని వృధా చేయకుండా పరిష్కారమార్గాన్ని వెతుక్కోవాలి. అవసరమైతే ఒకరికొకరు తమ జీవనశైలి విధానాన్ని మార్చుకో వడానికి కూడా సిద్ధపడాలి. అప్పుడే ఇద్దరి మధ్య ఉండే బంధం బలపడుతుంది. భార్యాభర్తలిరువురు ముందు తమ వైఖరిని మార్చుకోవడానికి ప్రయత్నించాలే తప్ప భాగస్వామి మైనస్‌ పాయింట్లతో పదేపదే అరవద్దు.
  10. ఫ్యామిలీ కౌన్సెలర్‌ను సంప్రదించండి
    భరించేవాడు భర్త అయితే, బాధలను పంచుకునేది భార్య. సుఖ దుఃఖాలను సమపాళ్లలో అనుభవిస్తూ, ఇద్దరూ కలిసి జీవితమనే నావలో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ క్రమంలో జీవిత భాగస్వాముల బంధం కొనసాగాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం, ఒకరి సమక్షంలో మరొకరు సంతోషంగా ఉండడం ముఖ్యం. చిన్నచిన్న సమస్యలకే భార్యాభర్తల బంధం బలహీనపడితే వారి పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కూడా సమస్యలతో సతమతమవుతారు. ఫ్యామిలీ కౌన్సిలర్‌ను సంప్రదించడం ద్వారా దంపతుల సమస్యలు పరిష్కారం అవుతాయి.
    కౌన్సెలింగ్‌ ద్వారా సమస్యకు పరిష్కారం
    గతంలో ఉమ్మడి కుటుంబాలుగా ఉండే వారు దీంతో ఎలాంటి గొడవలు వచ్చేవి కావు. ఒక వేల వచ్చిన ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరిని సమన్వయం చేసి పంపించేవారు. అప్పుడు కుటుంబాల్లో విలువలు, మర్యాద, గౌరవం, భయం భక్తి ఉండేది. అవి ప్రస్తుతం లేకపోవడంతో కుటుంబాల్లో చిన్నచిన్న గొడువలకు, పంతాలకు వెళ్లి పెద్దగా చేసుకుంటున్నారు. మొదట క్షణికావేశంతోనే ఏవెవో మాట్లాడుతారు. కౌన్సెలింగ్‌ ద్వారా 80శాతం కుటుంబాలు కలిసి పోతున్నారు.
    డా॥అట్ల శ్రీనివాస్‌ రెడ్డి
    రిహాబిలిటేషన్‌ సైకాలజిస్ట్‌, ఫ్యామిలీ కౌన్సెలర్‌
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News