సంస్కృతి అనేది ప్రధానంగా భావజాల రంగానికి సంబంధించినది. ఇది వివిధ వ్యవస్థల్లో వివిధ రూపాల్లో వ్యక్తం అవుతుంది. సమాజంలో నిరంతరం మార్పులు జరుగుతున్నట్లే సంస్కృతిలోనూ మార్పులు జరుగుతూ ఉంటాయి. సమాజం సంస్కృతి పరస్పరం ప్రభావితం చేసుకుంటాయి. వర్గ సమాజాలలో ఆయా వర్గాలకు పరస్పర విరుద్ధ ప్రయోజనాలు ఉంటాయి. అందుకు అనుగుణంగా విరుద్ధ భావాలు వ్యక్తమౌతుంటాయి. అవి సంస్కృ తిలోనూ ప్రతిఫలిస్తాయి. ఒకానొక సమాజంలో ఆనాటి ఆధిపత్య వర్గపు భావాలే సాధారణంగా పై చేయిగా ఉంటాయి. సమాజంలో పరస్పర విరుద్ధ వర్గాల నడుమ వర్గ పోరాటాలు వివిధ స్థాయిలో జరుగుతున్నట్లే సాంస్కృతి కంగా కూడా భిన్నభావాల నడుమ సంఘర్షణ జరుగుతుంది.
మానవులు ఒకరితో ఒకరు కలిసి జీవించే క్రమంలో వారి సామాజిక ప్రవర్తన రూపుదిద్దుకుంటుంది. ఈ క్రమంలో మనం సమకూర్చుకునే భావా లు విలువలు అర్ధాలు వాటిని పొందుపరిచి వ్యాప్తి చేసే పద్ధతులు అన్నీ వివిధ వ్యవస్థల ద్వారా వ్యక్తమవుతాయి. వీటన్నింటినీ కలిపి సంస్కృతి అంటాం. మానవుల భావజాలాలతో సున్నితమైన భావోద్వేగాలతో సంస్కృతి ముడిపడి ఉంటుంది. సృజనాత్మక స్వభావం గల కవిత్వం ఇతర రూపాల సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నాటకం, క్రీడల వంటివి సంస్కృతిలో భాగం గా ఉంటాయి. ఇవిగాక కుటుంబపరంగా రక్తసంబంధీకు లతో కలిగి ఉండే సంబంధాల ద్వారా సంక్రమించే విలువలు, సంప్రదాయాలు, ఆచారాల వంటివి కూడా సంస్కృతిలో భాగంగా ఉంటాయి. భావోద్వేగాలతో ముడిపడి మన వ్యక్తిగత సామాజిక ప్రవర్తనను ప్రభావితం చేసే అంశాలనే మనం ప్రధానంగా సంస్కృతిగా పరిగణిస్తాం. వీటితోపాటు మేధోపరమైన కృషితో ముడిపడిన ప్రకృతి శాస్త్రాలు, సామాజిక శాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానం, తత్వశాస్త్రం వంటివి కూడా సంస్కృతిలో భాగం.
ఇవన్నీ కలిసి మానవుల వ్యక్తిత్వాలు పెంపొందే పరిణామానికి దోహ దం, ప్రభావితం చేస్తాయి. ఏ దిశగా మానవుల వ్యక్తిత్వాల పరిణామానికి సంస్కృతి దోహదం చేస్తుంది అన్న దాన్ని బట్టి సమాజ పరిణామ క్రమం వేగవంతం అవ్వడంగానీ, మందగించడం గాని జరుగుతుంది. మానవులు తమ మనుగడను కొనసాగించే క్రమంలో ప్రకృతి శక్తులతో నిరంతరం సంబంధం కలిగి ఉంటారు. తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఉత్పత్తి చేస్తారు. ఈ ఉత్పత్తి సమిష్టిగా జరుగుతుంది. సమిష్టిగా జరిగే ఉత్పత్తి క్రమం లో పరస్పర సమన్వయం కోసం మానవులకు భావవ్యక్తీకరణ అవసరమైంది. ఇందుకోసం భాష, లిపి, చిత్రలేఖనం, సామూహిక క్రీడలు, నృత్యాలు వంటి రూపాలను మానవులు ఆవిష్కరించుకున్నారు. ఈ క్రమంలో ఈ రూపాలు భావ వ్యక్తీకరణకు కూడా తోడ్పడసాగాయి. అవి మానవుల సమిష్టి సంస్కృతి ప్రతిరూపాలు. అంటే సంస్కృతి మానవుల సమిష్టి శ్రమజీవన క్రమంలో ఆవి ర్భవించి పెంపొందింది. ఉత్పత్తి ఎంత విస్తృతంగా, వైవిధ్యంగా పెంపొం దుతూ వచ్చిందో అంత విస్తృతంగాను వైవిధ్యభరితంగాను వారి సంస్కృతి పెంపొందుతూ వచ్చింది.
శ్రమ పెంపొందుతున్న కొద్దీ సంస్కృతి కూడా పెంపొందింది. సంస్కృతి పెంపొందిన క్రమంలో కూడా శ్రమను మరింత పెంపొందించడానికి దోహ దం చేసింది. ఇది గతితార్కిక సంబంధం. ప్రజలు అంటే సంపదను సృష్టించే వారు మాత్రమే కాదు, విలువలను కూడా అనునిత్యం సృష్టిస్తూ ఉంటారు. సౌందర్యం, మేధస్సు ఆ క్రమంలో వికసిస్తూనే ఉంటాయి. తాత్విక ఆలోచన లు, కవిత్వం వగైరాలన్నీ ఆ ప్రజల సమిష్టి జీవన క్రమంలో నుంచే రూపొందు తాయని ఒక సందర్భంలో గోర్కి చెప్పాడు. సమాజంలో ఉనికిలో ఉన్న సా మూహిక జీవనం, సామూహిక విలువలను ఆ విలువలతో కూడిన సంస్కృ తిని పెంపొందించింది. సమిష్టితత్వం, ఉమ్మడి కట్టుబాట్లు ఆ సంస్కృతి సారాంశంగా ఉండేవి. అవి ఆనాటి కళలో, సాహిత్యంలో, ఆటల్లో, పండుగల్లో ప్రతిబింబించేది.
ఆ తర్వాత వ్యక్తిగత ఆస్తి ఏర్పడటంతో సమాజంలో దోపిడీ మొదలైంది. దానితో పాటే వర్గ సంఘర్షణ కూడా మొదలైంది. వ్యక్తిగత ఆస్తిరక్షణ దోపిడీ వర్గాల ప్రధాన లక్ష్యమయ్యింది. ఈ క్రమంలోనే ఆస్తి వారసత్వం సమస్య ముందుకు వచ్చింది. అది స్త్రీలను అసమానులుగా, హక్కులు లేనివారిగా మార్చింది. పురుషాధిక్యత ఒక సామాజిక విలువగా దోపిడీ వర్గాలు సమాజ సంస్కృతిలో ప్రవేశపెట్టాయి. వ్యక్తిగత ఆస్తి ఏర్పడి ప్రజలలో చీలిక తెచ్చింది. వాళ్ల మధ్య సంబంధాలలో శత్రుత్వం నెలకొంది. సర్దుబాటు సాధ్యంకాని వైరు ధ్యాలు ఏర్పడ్డాయి. ఆ విధంగా వ్యక్తిగత ఆస్తి సమాజంలోని సమిష్టి తత్వాన్ని దెబ్బతీసి దాని స్థానంలో వ్యక్తి కేంద్రంగా ఉండే నేను అనే భావనను ముందుకు తెచ్చింది. ఈ క్రమంలో ప్రజలు భౌతికంగానూ, మానసికంగానూ బానిసత్వానికి నెట్టబడ్డారు. వాళ్ళ సమిష్టి శక్తిసామర్థ్యాలు నీరుగారి పోయా యి. సమిష్టి జీవన క్రమంలో ప్రకృతిలో జరిపే పోరాటంలో వారు పొందిన తాదాత్మకత, వారి కవితాశక్తి, వారిలో అప్పటికప్పుడు ఎగిసిపడే సృజనాత్మ కత అన్ని క్రమంగా నాశనం అయ్యాయి.
మానవ వికాసాన్ని నాగరిక చైతన్యాన్ని కాంక్షిస్తూ ఎన్నో భావజాలాలు చరిత్రలో ఉనికిలోకి వచ్చాయి. రాజకీయ వ్యవస్థలను చరిత్రలోని పరిణామా లను అవి వ్యాఖ్యానించాయి. సమాజ సాహిత్య కళా సంబంధం గురించి ప్రత్యేకంగా ఎవరూ చెప్పనవసరం లేదు. దేనికంటే అది వాస్తవం కాబట్టి. ఆధునిక యుగంలో సమాజ సాహిత్య కళా సంబంధాలు అనే భావన ముం దుకు వచ్చింది. దాన్ని పరిశీలించే పద్ధతులు తయారయ్యాయి. ఈ భావన పరిచయం లేని పాత రోజుల్లో కూడా సమాజ సాహిత్య కళా సంబంధాలు కొనసాగాయి. అందుకే పాత సాహిత్యంలో ఆనాటి సమాజం కనిపిస్తుంది. గత కాలాన్ని చరిత్ర రచనగా మలచడానికి చరిత్ర పరిశోధకు లకు సాహిత్యం, కళలు ఒక ముఖ్యమైన ఆధారంగా ఉన్నాయి. సాహిత్యం, కళలో కనిపించే సమాజాన్ని చట్టం ఆనాటి వాస్తవ చరిత్ర ఏమైయుండొచ్చు అనే పరిశీలన చేస్తుంది. కాబట్టే సమాజం లేకుండా కళలు సాహిత్యాలు లేవు. సమాజ కళా సాహిత్య సంబంధాలను మొత్తంగా చరిత్రను అర్థం చేసుకోవడానికి, శాస్త్రీయ సామాజిక సిద్ధాంత పద్ధతి తప్పనిసరి అవసరం. సమాజంలోని ఏ కారణం వల్ల కళాసాహిత్యంలో మార్పు వచ్చింది, తద్వారా కళా సమాజ సాహిత్య సంబంధాలలో మార్పు ఎలా వచ్చింది, మౌలికంగానే అది చరిత్ర నిర్మాణ క్రమాన్ని ఎలా ప్రభావితం చేసింది అనే ప్రశ్నలకు సిద్ధాంత పద్ధతి నుంచే సమాధానాలు వెతుక్కోవాలి. లేకపోతే కంటికి కనిపించిన వాటిని, ఇష్టమైన వాటిని మాత్రమే ఏకరువుపెట్టే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి కళాసాహిత్య సంబంధాలను విశ్లేషించుకోవడానికి కాదు, వాటిని ప్రగతిశీలంగా, గతిశీలం గా మార్చాలనుకుంటే కూడా శాస్త్రీయ పద్ధతి తప్పనిసరి. ఇదంతా రచనా సంబంధమైనది కాబట్టి సృజనాత్మకతను శక్తివంతం చేసుకోవడానికి అటు రచయిత క్రియాశీలతతో ఇటు శాస్త్రీయ పద్ధతిలో అర్థవంతమైన సమన్వయం సాధించాల్సిందే.
___________________________________________________
READ ALSO:
కులం కావాలా? సమానత్వం కావాలా?
చర్చ పెట్టండి.. నిర్ణయాలు తీసుకోండి
పేరుకేనా ‘ప్రజా’ప్రభుత్వాలు?
___________________________________________________
నేడు రోజురోజుకు ఫాసిస్టు ధోరణులు మన నైతికతని దెబ్బతీయాలని చూస్తున్న ఈ దశలో కూడా ప్రజలు తరాల పాటు పోరాటాల వారసత్వాన్ని సమున్నతంగా ఎత్తిపట్టి కృషి కొనసాగిస్తున్నారు. నెత్తురొడిసి పోరాడుతు న్నారు. ఎక్కడి నక్సల్బరి, ఎక్కడి శ్రీకాకుళం, ఎక్కడి గోదావరి లోయ -ఈ సుదీర్ఘ 52 ఏండ్ల ప్రయాణం తర్వాత మూడు తరాల యవ్వనంతో అరుణో దయ పునర్వికసిస్తూనే ఉంది. రాబోయే విప్లవాల వెల్లువకు, ప్రజాస్వామిక ఆందోళనకు, ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా సాహిత్య సాంస్కృతిక భావ జాలాలను సన్నాహకం చేయడమే ఈనాటి కళా రంగ కర్తవ్యం.
ఈ 52 ఏండ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి- వెలుగు లను, విజయదరహాసాలను, కన్నీటి చారికలను, అనుభవాలను అరుణోదయ 7వ రాష్ట్ర మహాసభల సందర్భంగా సమీక్షించుకుంటుంది. మార్క్సిజంలోని విమర్శనాత్మకతే అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య చైతన్యం. చరిత్ర పట్ల అంతులేని తార్కిక విశ్వాసంతో పాటు వినయం, వినడం, నేర్చుకోవడం, తనలోకి తాను తొంగి చూసుకోవడం, పునర్ సంఘటితం కావడం అరుణో దయ జీవధాతు. దీనివల్లే చారిత్రక శక్తుల సంఘర్షణలో నుండి పుట్టిన అరుణోదయ సాంస్కృతిక రంగంలో ఒక చరిత్ర కాగలిగింది. ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విప్లవోద్యమంలో వచ్చిన చీలికల్లో తాను చీలింది. ఎవరి వేదికలకు వారుగా విడిపోయింది. ఈ చీలికలను అధిగమిస్తూ సామ్రాజ్యవాద విష సంస్కృతి మనుషుల మెదళ్లను విషతుల్యం చేస్తుంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కాసుల కబంధహస్తాలలో కళలు సాహిత్యం నలిగిపోకుండా ప్రజలను ఎల్లవేళలా జాగరుకతతో ఉంచాలి. ప్రజా కళాకారుడు అనేవాడు అరుణదయ నాగన్నలా త్యాగజీవిగా ప్రజల్లో ఉంటూ ప్రజల కొరకు పనిచేస్తూ ప్రజా చైతన్యమే తన కర్తవ్యంగా భావించాలి. నీళ్లలోని చేపలా ప్రజలతో కలిసిపోవాలి. సమాజంలో నెలకొన్న ఆకలి కేకలు గద్దె మీద కూర్చున్న వాళ్లకి వినిపించేలా గానం చేయాలి. కష్టాలు, కడగండ్లు దృశ్యరూపం చేస్తూ ప్రజల దీనగాధలు కాలు మీద కాలేసుకుని కడుపులో చల్ల కదలకుండా ఉన్న పాలకుల చెవులకు వినిపించే పాటలను కైగట్టాలి.
మార్క్సిజం- లెనినిజం -మావో ఆలోచనా విధానం నుండి పొందిన శాస్త్రీ య సోషలిజమే సైద్ధాంతిక భూమికగా ఉన్న అరుణోదయ ఈ మహాసభల సందర్భంగా తన విధానాలకు మరింత పదులు పెట్టాలి. కామ్రేడ్ కానూరి తాత, అరుణోదయ రామారావు, పలస బిక్షం, వై.వెంకన్న, కోడి శ్రీరాములు, పైలం సంతోష్, రడం శ్రీను తదితరులకు ఈ సందర్భంగా విప్లవ జోహార్లు. వారు అందించిన ఆశయ బాటలో కొనసాగుదాం.
–
ఆవునూరి మధు
సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు

