Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్All India Radio Adilabad: బాలల మనోవికాసానికి పెద్దపీట వేసిన ఆకాశవాణి అదిలాబాద్

All India Radio Adilabad: బాలల మనోవికాసానికి పెద్దపీట వేసిన ఆకాశవాణి అదిలాబాద్

' కతిందాం ' గ్రాండ్ సక్సెస్

కథలు అంటే ఇష్టముండని పిల్లలు ఉండరు. ఒకప్పుడు అమ్మమ్మ, బామ్మ, తాతయ్యలు పిల్లలను చుట్టూత కూర్చోపెట్టుకోని కథలు చెపుతుంటే ఎంతో ఆసక్తిగా వినేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మారింది. కథలు చెప్పేవారు తక్కువయ్యారు. వినే వారు కూడా లేరు. ప్రస్తుతం మార్కులు, ర్యాంకులే కొలమానంగా చదువులు కొనసాగడం అందుకు కారణమని చెప్పవచ్చు.
ఈ పరిస్థితుల్లో పాఠశాలకు వెళ్ళి అలసిపోయి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారుల్లో ఉత్సాహం నింపాలన్న ఆలోచనతో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం బాలల మనోవికాసానికి ‘ కతిందాం ‘ శీర్షిక ద్వారా పెద్దపీట వేసింది.
ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 12 అక్టోబరు 1986న ప్రారంభిస్తే .. ‘ కతిందాం’ శీర్షికన పిల్లల కోసం మంచి మంచి కథలను వినిపించే కార్యక్రామాన్ని12 అక్టోబరు 2020 న ప్రారంభించారు.తెలంగాణ యాస, బాసలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్.ఎం. మనసు నిండ ..! ఈ కేంద్రం ద్వారా
అన్ని కార్యక్రమాల్లో తెలంగాణ మాండలికాన్ని వాడటం విశేషం. ఇలా తెలంగాణ యాస, భాసలు వాడుతున్న
ఒకే ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్ కూడ ఆకాశవాణి ఆదిలాబాదే !
‘ కతిందాం’ పిల్లల కార్యక్రమం గత మూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ప్రారంభించిన కొద్దిరోజులకే శ్రోతల హృదయాలు దోచుకుంది. అప్పటి కార్యక్రమ సంచాలకులు సుమనస్పతిరెడ్డి ఆలోచనతో రూపుదాల్చిన ఈ కార్యక్రమం ప్రస్తుత ముఖ్య కార్యక్రమాధికారి కె. రామేశ్వర్ చొరవతో నిరంతరంగా కొనసాగుతోంది. బుధవారం నుండి శనివారం వరకు రోజు సాయంత్రం 05.30 గంటలకు ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఎంతో ఆదరణ పొందుతోంది. ఇప్పటి వరకు 45 పైగా పిల్లల కథల పుస్తకాలు ఈ కార్యక్రమం ద్వారా చదివి వినిపించారు. బాల సాహిత్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీపురస్కారాలు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాలను అందుకున్న రచయితల కథల పుస్తకాలలోని కథలు చదివి వినిపిస్తున్నారు. అంతేకాదు, సాహిత్య రంగంలో పేరెన్నికగన్న కథకులు రాసిన పుస్తకాల్లోని పిల్లల కథలను ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులకు చేరవేస్తున్నారు. డి.కె.చదువులబాబు, పైడిమర్రి రామకృష్ణ, డాక్టర్ ఎం.హరికిషన్, గరిపెల్లి అశోక్, ఆకెళ్ల వెంకట సుబ్బలక్ష్మి, కంతేటి చంద్రప్రతాప్, కన్నెగంటి అనసూయ,పట్రాయుడు కాశీవిశ్వనాధం, సంగనభట్ల చిన్నరామకిష్టయ్య , ఆర్.సి.కృష్ణస్వామి రాజు వంటి అనేక మంది ప్రముఖ బాలసాహితీవేత్తలు రాసిన కథల సంపుటాలలోని కథలు ప్రసారం అయ్యాయి. తెలుగు వారి జానపద కథలు, గుడ్డేలుగు బల్గం, తాంబేలు ఇగురం, ఎంకటి కతలు, కిష్టడి కతలు, బృంధావనం, ఎగిరేకప్పలు – నడిచేపాములు, తాతయ్య కల వంటి అనేక కథా సంపుటాల నుంచి కథలు చదివి వినిపించారు.
నేటి బాలలు ఎక్కువగా ఆంగ్ల మాధ్యమాలలో చదవటం వలన ఎనిమిదో తరగతికి వచ్చినా సొంతగా తెలుగు కథల పుస్తకం చదవలేక పోతున్నారు. ఇప్పటి ఉరుకుల, పరుగుల జీవనశైలిలో పట్నాలలో తల్లొకచోట, తండ్రొకచోట ఉద్యోగాలు చేస్తున్నారు. పల్లెల్లో పొలం పనులు, కూలి పనులకు పోతూ పిల్లలతో ఎక్కువ సమయం గడిపలేక పోతున్నారు.
ఇక అనేక కారణాల వలన పిల్లలకు కథలు చెప్పే బామ్మలు, అమ్మమ్మలు తాతయ్యలు కూడా బాలలకు
దూరమవుతున్నారు. ఇలాంటి సమయంలో బాలలకు దగ్గరయ్యింది ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం. ‘ కతిందాం’ శీర్షిక ద్వారా బాలలకు కథలు చెప్పటం మొదలు పెట్టింది. బడి నుండి ఇంటికి రాగానే సాయంత్రం 05.30 గంటలకు రేడియో ముందు కూర్చోని ‘ కతిందాం ‘ కార్యక్రమంలో ప్రసారమయ్యే కథలకోసం ఎదురు చూస్తున్నారు.పిల్లలే కాదు.. పెద్దలు కూడా ఇంట్లో తమ పనులు చేసుకుంటూ
కథలు వినటం మొదలు పెట్టారు.

- Advertisement -


ఆకాశవాణి ఆర్జేలు పిల్లలను ఆకట్టుకునేలా కథలను చదివి వినిపిస్తున్నారు. కథకుడు ఎంత గొప్పగా, సులభశైలిలో కథ రాసినప్పటికీ చదివే విధానం బాగుండకుంటే అది శ్రోతలను ఆకట్టుకోదు.ముఖ్యంగా బాలలకు కథ వినిపించటం అంత సులభంకాదు.కమ్మని కంఠమే కాదు .. భాష,యాస పై పట్టు ఉండాలి. స్పష్టంగా చదవ గలగాలి. సంభాషణలు వచ్చినప్పుడు పాత్రకు తగ్గట్టు గొంతుమార్చి హావభావాలు వ్యక్తపర్చినప్పుడే ఆ కథ బాలలకు చేరుతుంది.కతిందాం కార్యక్రమంలో కథలు చదివి వినిపించే అర్జేలు
ఇ.వరలక్ష్మీ, జి.జ్యోతి, టి. స్రవంతి వంటి వారు కథలు చదువుతుంటే పిల్లలతో పాటు పెద్దలు కూడా కథలు వింటూ ఊహాలోకంలో విహరిస్తారు. కథలు చదివి వినిపించటంలో ఎవరి శైలి వారిదే. ఇంట్లో మాట్లాడుకున్నట్టు, తెలంగాణ యాసలో కథలు చెప్పి మెప్పిస్తున్నారు. బాలలకు చేరువవుతున్నారు.
పూర్వం పిల్లలు సొంతగా కథలు చదువుకునేవారు.తర్వాత చూడటానికి ఇష్ట పడ్డారు. ఇప్పుడు చూసే సమయం కూడా లేని ఉరుకులు, పరుగుల మధ్య వినటానికి ఆసక్తి చూపుతున్నారు.తమ పనులు చేసుకుంటూ చెవితో వినటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఆకాశవాణి కార్యక్రమాలు వినటానికి రేడియో కచ్చితంగా ఉండనవసరం లేదు.సెల్ ఫోన్లో లింక్ ద్వారానో,యాప్ ద్వారానో ఒకచోటి నుండి మరోచోటికి ప్రయాణిస్తూ కూడా వినే సౌకర్యాలున్నాయి.
‘కతిందాం’ కార్యక్రమాన్ని ‘న్యూస్ ఆన్ ఎయిర్ ‘ యాప్ ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా వినవచ్చు.
‘న్యూస్ ఆన్ ఎయిర్’ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని, ఓపెన్ చేసి,భాషగా తెలుగును ఎన్నుకొని, పై వరుసలో ఉన్న రేడియో బొమ్మను నొక్కితే రాష్ట్రాలవారీగా రేడియో కేంద్రాల పట్టిక వస్తుంది. అందులో తెలంగాణ కింద కనిపించే అదిలాబాద్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోని ప్రసారాలు చాలా స్పష్టటంగా వినచ్చు.
అమ్మమ్మలు,బామ్మలు,తాతయ్యలు కథలు చెప్పటం కుదరని ఈరోజుల్లో ఆలోటును ఆకాశవాణి ఆదిలాబాద్ ‘కతిందాం’ పిల్లల కార్యక్రమం ద్వారా తీరుస్తుంది.బడి నుండి ఇంటికి వచ్చిన బాలలకు మానసిక ఉల్లాసాన్ని, వ్యక్తిత్వ వికాసాన్ని, మంచి చెడుల తారతమ్యాన్ని తెలుపుతూ ఆనందాన్ని కలిగించటంలో ‘ కతిందాం ‘ కార్యక్రమం ఎంతో ఉపయోగ పడుతున్నది.
అతికొద్ది సమయంలోనే కేవలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల బాలలకూ చేరింది. ఇప్పుడు మన దేశంలోనే కాదు .. ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు బాలలు ఈ కార్యక్రమాన్ని వినగలుగుతున్నారు. అమెరికా లోని రాష్ట్రాల నుంచి కూడా వాట్సప్ ద్వారా, ఫోన్ ల ద్వారా కథలు విని ఆభినందిస్తున్నారు. ‘ కతిందాం’ పిల్లల కార్యక్రమం ఇంత విజయవంతంగా నడవటానికి కారణమైన ముఖ్య కార్యక్రమాధికారి రామేశ్వర్ కేంద్రేతో పాటు ఆదిలాబాద్ ఆకాశవాణి సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. 2024లో కూడా ‘ కతిందాం ‘ ద్వారా మరిన్ని మంచి మంచి కథలు చదివి వినిపిస్తూ ఆకాశవాణి ఆదిలాబాద్ బాలలకు మరింత చేరువ కావాలని ఆశిద్దాం.

— పైడిమర్రి రామకృష్ణ
సెల్ : 92475 64699

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News