Thursday, September 19, 2024
Homeఓపన్ పేజ్Akhilesh Yadav image on rise: అఖిలేశ్‌ యాదవ్‌ ఆశలు, ఆశయాలు ఫలిస్తాయా?

Akhilesh Yadav image on rise: అఖిలేశ్‌ యాదవ్‌ ఆశలు, ఆశయాలు ఫలిస్తాయా?

ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఒకప్పుడు ములాయం సింగ్‌ యాదవ్‌ ఒక రారాజులా ఒక వెలుగు వెలిగారు. ఒక కుస్తీ వీరుడిగా రాష్ట్రంలోనే కాక, దేశంలో కూడా రికార్డులు సృష్టించారు. ముఖ్యంగా శత్రువును అవలీలగా కిందకు పడదోసే చక్రదావ్‌ అనే మల్ల విద్యలో ఆయనను మించిన వారు దేశంలోనే లేరని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆయన సమాజ్‌ వాదీ పార్టీని నెలకొల్పడం ద్వారా రాజకీయ గోదాములో కూడా కుస్తీ పోటీల్లో పాల్గొంటూ అనేక విజయాలు సాధించారు. అనేక జాతీయ స్థాయి రాజకీయ పోటీల్లో కూడా ఆయన రిఫరీగా వ్యవహరించారంటే ఆయన రాజకీయ బలం, పట్టు, పలుకుబడి ఏ పాటివో అర్థం చేసుకోవచ్చు. ఆయన వారసత్వాన్ని చాలా వరకూ దక్కించుకున్న ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ కూడా అనేక రాజకీయ విద్యల్లో ఆరితేరిన వ్యక్తే. రాజకీయంగా ఉన్నత స్థానాలకు ఎలా చేరుకోవాలన్నది ఆయన పూర్తిగా ఒంటబట్టించు కున్నట్టు కనిపిస్తోంది. గత లోక్‌ సభ ఎన్నికల దగ్గర నుంచి ఆయన కొన్ని కొత్త విద్యలను కూడా నేర్చుకోవడం జరిగింది.
లోక్‌ సభ ఎన్నికల నుంచి అఖిలేశ్‌ యాదవ్‌ ను 140 కోట్ల మంది ప్రజలే కాకుండా, 543 మంది పార్లమెంట్‌ సభ్యులు కూడా పట్టించుకోవడం, ప్రాధాన్యమివ్వడం ప్రారంభం అయింది. పలువురు ఎంపీలు, పార్టీల నాయకులు ఆయనతో స్నేహం కోసం ఆరాటపడుతున్నారు. ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి తిరుగులేని ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించిన అఖిలేశ్‌ గత లోక్‌ సభ ఎన్నికల్లో విజయం సాధించి, ఒక్కసారిగా జాతీయ స్థాయికి ఎదిగారు. తన స్థాయిని మరింత మెరుగుపరచుకోవడానికి ఆయన తాను చేయగలిగిన ప్రయత్నమల్లా చేస్తున్నారు. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ లో ఎన్‌.డి.ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు ధర్నా జరిపినప్పుడు ఆయన అందులో పాల్గొన్నారు. పదిమందికీ కనిపించడం, వినిపించడం ఎక్కువగా జరగాలన్నది ఆయన ఇప్పుడు నియమంగా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. ప్రాంతీయ స్థాయి కూడా జాతీయ స్థాయేనని ఆయన నిరూపించే ప్రయత్నంలో ఉన్నారు.
కొత్త స్నేహాలు, సాన్నిహిత్యాలు
ఇటీవలి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది, ముఖ్యమంత్రి పదవిని కోల్పోయిన వై.ఎస్‌.ఆర్‌.సి.పి అధినేత వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి ఆహ్వానం మేరకు ఆయన ఆ ధర్నాలో పాల్గొనడం జరిగింది. రాష్ట్రంలో తన ప్రబల ప్రత్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్‌. చంద్ర బాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఎన్‌.డి.ఏలో భాగస్వామిగా ఉన్నందుకు జగన్మోహన్‌ రెడ్డి ఎన్‌.డి.ఏను వ్యతిరేకించడం జరుగుతోంది. తమ పార్టీకి పార్లమెంటులో 15 మంది సభ్యులున్న విషయాన్ని ఎన్‌.డి.ఏ ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోకూడదని చెప్పడమే జగన్మోహన్‌ రెడ్డి ఉద్దేశం. నిజానికి, అఖిలేశ్‌ యాదవ్‌ జగన్మోహన్‌రెడ్డిని కలుసుకోవడం చాలా తక్కువ. రాజకీయంగా గానీ, సామాజికంగా గానీ ఈ ఇద్దరు నాయకుల మధ్య ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు లేవు. అయినప్పటికీ జగన్మోహన్‌ రెడ్డి ఆహ్వానాన్ని అఖిలేశ్‌ మన్నించారు. ఇందుకు కారణంః అఖిలేశ్‌ యాదవ్‌ తన రాజకీయ పరిధిని ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి విస్తరించే ప్రయత్నంలో ఉన్నారు. 2029 లోక్‌ సభ ఎన్నికలకు ముందే సమాజ్‌ వాదీ పార్టీని జాతీయ స్థాయికి తీసుకువెళ్లే ఆలోచనలో కూడా ఉన్నారు.
ఇప్పుడాయనకు అందరినీ కలుపుకుని పోవాలనే ఆలోచన తప్ప మరో ఆలోచన లేదు. ఆయనకు జాతీయ స్థాయి నాయకుడు కావాలనే తపన పెరిగింది. కులతత్వం, కుల గణన వం రాజకీయ అంశాలను క్రమంగా దూరం పెడుతున్నారు. తండ్రి తనకు వారసత్వంగా ఇచ్చిన లోహియా సోషలిజానికి కూడా ఆయన స్వస్తి చెప్పారు. సమాజ్‌ వాదీ పార్టీకి సంబంధించినంత వరకూ ఆయనకు యాదవ కులం కూడా పట్టడం లేదు. తన పార్టీలో యాదవ ప్రాబల్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదనే అభిప్రాయంతో కూడా ఆయన ఉన్నారు. గత లోక్‌ సభ ఎన్నికల్లో 37 స్థానాలు సంపాదించిన దగ్గర నుంచి ఆయనకు పట్టపగ్గాలు లేవు. ప్రస్తుతం తాను సాదా సీదా రాజకీయ నాయకుడిని కాననే సంగతి ఆయనకు అర్థమైపోయింది. కొద్దిగా వ్యంగ్యం, వెటకారం, కవితలు, సాదా సీదా సిద్ధాంతాలను జోడించి అర్థవంతమైన ప్రసంగాలు చేయగలిగితే తాను జాతీయ స్థాయి నాయకుడు కావడానికి ఇబ్బందేమీ ఉండదని ఆయన భావించడం జరుగుతోంది. పాలక ఎన్‌.డి.ఎకి చంద్రబాబు నాయుడు ఎంత కీలకంగా మారారో, ప్రతిపక్ష ఇండీ కూటమికి తానంత కీలకమనే అభిప్రాయం కూడా ఆయనకు కలిగింది. ఆయన వీలైనంత మంది నాయకులను కలుసుకుంటున్నారు. ఇంటా బయటా వీలైనంత మంది విలేఖరులకు బైట్లు ఇవ్వడం కూడా జరుగుతోంది.
చర్చలు, సంప్రదింపులు
ఈ మధ్య ఆయన తమ సమాజ్‌ వాదీ పార్టీ పార్లమెంటు సభ్యులతో సమావేశమై, నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌.డి.ఎ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా తాము ఎదిగే విషయమై సమాలో చనలు జరిపారు. ఇతర ప్రతిపక్ష నాయకులతో కూడా ఆయన వ్యక్తిగతంగానూ, సమష్టిగానూ చర్చలు, సంప్రదింపులు జరిపారు. ఆయన తన భార్య డింపుల్‌ యాదవ్‌తో కలిసి క్రమం తప్పకుండా లోక్‌ సభ సమావేశాలకు హాజరవుతున్నారు. పార్లమెంట్‌లో ఏ అంశం మీద చర్చ జరిగినా అందులో చురుకుగా, క్రియాశీలంగా భాగం పంచుకుంటున్నారు. ఇక ప్రముఖులు, పార్టీల నాయకులు నిర్వహించే విందు కార్యక్రమాలకు గైర్హాజర్‌ అయ్యే ప్రసక్తే లేదు. రాష్ట్రంలోనూ, రాష్ట్రం బయటా ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలిసినా ఏదో ఒక సమాచారాన్ని రాబట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆయన అనేక పర్యాయాలు కోల్‌ కతా, పాట్నా, చెన్నై, ముంబైలను సందర్శించడం కూడా జరిగింది.
మొత్తం మీద ఆయన రాజకీయ జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రెండేళ్ల క్రితం వరకూ ఆయన ఎక్కువగా లక్నోకే పరిమితమయ్యారు. పార్టీ సమావేశాల్లో పాల్గొనడం, సన్నిహితులను కలుసుకోవడం, అడపాదడపా శాసనసభ సమావేశాలకు హాజరు కావడం మాత్రమే జరుగు తుండేది. కొద్ది సమయం లభిస్తే కుటుంబంతో గడిపేవారు. ఫుట్‌ వాల్‌, క్రికెట్‌ ఆడుతుండే వారు. చాలా ఏళ్ల తర్వాత భారతదేశం జాతీయ స్థాయి హోదా కోసం ప్రయత్నిస్తున్న ఒక యువ నాయకుడిని చూస్తోంది. మమతా బెనర్జీ, ఎం.కె.స్టాలిన్‌, తేజస్వి యాదవ్‌ వంటి నాయకులు తమ స్వరాష్ట్రాలకే పరిమితం అవుతుండగా, అఖిలేశ్‌ యాదవ్‌ తమ పార్టీల ఎంపీలతోనే కాకుండా, ఇతర పార్టీల ఎంపీలతో కూడా సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు. గతంలో ఆయన కూడా సంకీర్ణాలను రూపొందించడంలో, విచ్ఛిన్నం చేయడంలో వీలైనంత కృషి చేశారు. కాంగ్రెస్‌, బహుజన్‌ సమాజ్‌ పార్టీలతో కలిసే ప్రయత్నం కూడా చేశారు. కానీ, ఇవేవీ విజయవంతం కాలేదు.
సరికొత్త వ్యూహాలు
జాతీయ స్థాయికి చెందిన పార్టీగా తన సమాజ్‌ వాదీ పార్టీని తీర్చిదిద్దడానికి ఆయన రకరకాల ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీలో కళంకిత నాయకులను, అసమర్థ నాయకులను గుర్తించి వారిని తొలగించే కార్యక్రమం కూడా చేపట్టారు. నిజానికి, కాంగ్రెస్‌ వ్యతిరేకతే ములాయం సింగ్‌ యాదవ్‌కు కొండంత అండగా ఉంటోంది. 2014 ఎన్నికల్లో ఆయన అమేథీలో రాత్రికి రాత్రి సమాజ్‌ వాదీ పార్టీ ఓట్లన్నీ రాహుల్‌ గాంధీకి పడేటట్టు చేసి ఆయన విజయంలో కీలక పాత్ర పోషించారు. 1998లో అటల్‌ బిహారీ వాజ్‌ పేయీని విశ్వాస తీర్మానంలో ఓడించిన తర్వాత సోనియా గాంధీ ప్రధానమంత్రి కాకుండా అడ్డుపడింది ములాయం సింగ్‌ యాదవే. తమ 39 మంది ఎంపీలు సోనియా గాంధీకి మద్దతునివ్వరంటూ ఆయన రాష్ట్రపతికి లేఖ ఇవ్వడం జరిగింది. రెండు మూడేళ్లు గడిచే సరికి ఆయన సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి కావడానికి మద్దతు తెలిపారు.
మొత్తానికి అఖిలేశ్‌ యాదవ్‌ తన తండ్రి స్థాయికి ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. కుటుంబంలో కూడా ఆయన తనకు ఎదురు లేకుండా చేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో 2012లో శాసనసభ ఎన్నికలు జరగడానికి ముందు ములాయం అఖిలేశ్‌ యాదవ్‌ను ఉత్తర ప్రదేశ్‌ సమాజ్‌ వాదీ పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఆయన రాష్ట్రవ్యాప్తంగా సైకిల్‌ యాత్ర చేయడంతో ఆయన ప్రాధాన్యం బాగా పెరిగింది. ఆయన కారణంగానే అప్పట్లో ఆయన పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఆయన కుటుంబంలోనే కాక, అధికార యంత్రాంగంలో, పార్టీలో ములాయం మద్దతుదార్లందరినీ క్రమంగా తొలగించడం ప్రారంభించారు. దాంతో ములాయం ఆయనను పార్టీ నుంచి తొలగించారు. అఖిలేశ్‌ వెంటనే ములాయంను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. 2017 నుంచి పార్టీకి ఆయనే పూర్తి స్థాయి అధిపతిగా మారిపోయారు. సలహాదారు లేని నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది అఖిలేశ్‌ యాదవేనని చెప్పాలి. ఎన్విరాన్మెంటల్‌ ఇంజనీరింగ్‌ లో డిగ్రీ చేసిన అఖిలేశ్‌ పర్యావరణాన్నే కాక, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా మార్చడాన్ని ఒంటబట్టించుకున్నారు.
యాదవుల బలంతోనే ఆయన అయిదు పర్యాయాలు శాసనసభకు గెలిచినప్పటికీ, ఆయన ఏనాడూ యాదవులను తన చుట్టూ చేర్చుకోలేదు. దేశాన్ని పాలించాలన్న పక్షంలో ఒకే కులానికి కట్టుబడి ఉండడం మంచిది కాదని ఆయన తన కుటుంబ సభ్యులకు చెబుతుంటారు. ఇప్పు డాయన వెనుకబడిన తరగతులు, అల్పసంఖ్యాక వర్గాలు, దళితులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన దేనికీ తొందరపడే వ్యక్తి కాదు. అయిదుసార్లు శాసనసభ్యుడిగా, 38 ఏళ్లకే ముఖ్యమంత్రిగా, 45 ఏళ్లకు పార్లమెంటు సభ్యుడుగా ఎదిగిన అఖిలేశ్‌ రాజకీయంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఆయన సాధారణంగా ఎర్ర టోపీతో కనిపిస్తుంటారు. అంతమాత్రాన ఆయనలో వామపక్ష భావజాలం ఉందని అనుకోకూడదు. ఆయన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌ యోగీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. ముఖ్య మంత్రిగా యోగి, ప్రతిపక్ష నాయకుడుగా అఖిలేశ్‌ చాలా హుందాగా వ్యవహరిస్తుంటారు. ఈ ఇద్దరికీ రాష్ట్రామే మొదటి ప్రాధాన్యం. ఈ ఇద్దరికీ ప్రధానమంత్రి కాగల అవకాశాలు కనిపిస్తు న్నాయి. ఇక రాహుల్‌ గాంధీ కూడా ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన నాయకుడే అయినందువల్ల రాహుల్‌, అఖిలేశ్‌ లలో ఎవరికి ప్రాధాన్యం, ప్రాభవం ఉన్నాయి? ఇది 2027లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో ఈ విషయంలో తేలిపోతుంది. అఖిలేశ్‌ ఒక విధంగా మిత్రులతోనూ, శత్రువులతోనూ తలపడాల్సి వస్తోంది. ఎవరి ఆసక్తులు, అభిప్రాయాలు వారికున్నాయి.

  • ఎస్‌. సదానంద మూర్తి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News