ఒక కథ రాయటం వేరు !
చదవటం వేరు !!
చెప్పటం వేరు !!!
ఒక రచయిత తాను రాసిన కథను సొంతగా చూడకుండా చెప్పలేక పోవటం, ఒక కవి తాను రాసిన కవిత్వాన్ని వేదిక మీద సొంతగా వినిపించలేక పోవటం.. ప్రేక్షకులకు ఎంతో ఎబ్బెట్టు కలిగిస్తుంది. ఒక్కోసారి అసలు ఆ రచన తాను చేసింది కాదేమోననిపిస్తుంది. కారణం టెల్లింగ్ టెక్నిక్స్ తెలియక పోవటమే! అందుకే కథ చెప్పే కార్యక్రమంలో కూడా రచయిత చెప్పకుండా చదువుతూ కనిపిస్తుంటాడు. ఆకాశవాణి లాంటి శ్రవణ మాధ్యమాల్లో మనం కథ చదువుతాం. దృశ్య మాధ్యమాల ద్వారా హావ భావాలు ప్రదర్శిస్తూ కథ చెపితేనే బాగుంటుంది.
ఒకప్పుడు దూరదర్శన్ లో డాక్టర్ రావూరి భరద్వాజ తన చుట్టూత పిల్లల్ని కూర్చో పెట్టుకుని కథలు చెప్పటం మనకు తెలిసిందే ! బడికి వెళ్ళి అలసిపోయి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన చిన్నారుల్లో ఉత్సాహం నింపాలన్న ఆలోచనతో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ‘కతిందాం ‘ శీర్షిక ద్వారా ఆ కొరత కొంత తీరుస్తున్న విషయం మనకు తెలిసిందే !
కొందరు ప్రవచనకారులు, రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే మనం లీనమైపోయి వింటుంటాం. ఎందుకంటే వారి ఉపన్యాసాలలో పంచ్ లుంటాయి..పిట్ట కథలుంటాయి.. సామెతలుంటాయి.. జాతీయాలుంటాయి.. మాండలికాలుంటాయి..ఛలోక్తులుంటాయి.. విమర్శలుంటాయి..వెటకారాలుంటాయి.. హాస్యమూ ఉంటుంది. ఐతే వాటిని ఎప్పుడు ఎలా యేమేరకు వాడాలో అంతే వాడాలి. అప్పుడే అది శ్రోతలకు చేరుతుంది. ఇప్పుడు కథలు
చదివే కళ్లు తగ్గాయి, చూసే కళ్లు కూడా తగ్గి.. వినే చెవులు ఎక్కువయ్యాయి. ఇక మనం వినేవారినైనా కాపాడుకోవలసిన అవసరం ఉంది.
వినేవారి సంఖ్య పెంచాలంటే..
వారిని ఆకట్టుకునేలా చెప్పాలి. అది ఓ గొప్ప కళ. ఇక కథల విషయానికొస్తే మనిషి మనసును రాకెట్ వేగంతో ఊహా లోకాలన్నీ తిప్పి తీసుకొచ్చే మాయా తివాచి లాంటిది ‘స్టోరీ టెల్లింగ్’ ఫ్రక్రియ. కథల ప్రాముఖ్యాన్ని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ తెలియచేస్తూ ” మీ పిల్లలు తెలివి గలవారు కావాలంటే వారికి కథలు చెప్పండి. ఇంకా తెలివి గల వారు కావాలంటే మరిన్ని కథలు చెప్పండి ” అంటారు.
కథలు వినడం, చెప్పడం ఒక ఎడ్యుకేషన్ అని ఎందరో బాలసాహితీవేత్తల వాదన కూడా !. డాక్టర్ ఎం.హరికిషన్, డాక్టర్ దాసరి వెంకట రమణ యూ ట్యూబ్ ద్వారా కథలు చెప్పి మెప్పించారు. చొక్కాపు వెంకటరమణ ఈటీవీలో 100 వారాల పాటు 100 కథలు చెప్పి రికార్డు సృష్టించారు.
ఏ విషయమైనా కథలుగా చెపితే ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. ఏరంగం వారైనా మాట్లాడటం, చెప్పటం ద్వారా ఇతరులకు అర్ధమయ్యేలా చెప్పి ఒప్పించవచ్చు. ముఖ్యంగా చిన్న కథ రూపంలో చెప్ఫగలిగితే ఇక ఎదురే ఉండదు. ఐతే స్టోరీ టెల్లింగ్ అంత సులువైన ప్రక్రియ కాదు. ఇతరులను ఆకట్టుకునేలా కథ చెప్పి మెప్పించాలి. ఈ పక్రియ సులువు కాకున్నా.. కష్టం మాత్రం అస్సలు కాదు అంటారు ప్రముఖ ‘స్టోరీ టెల్లర్’ చొక్కాపు వెంకటరమణ. ఈ వారం మనం కథా తపస్వీ చొక్కాపు వెంకటరమణ తన అనుభవాన్ని రంగరించి మనకోసం సృష్టించిన ‘కథాకేళి కార్డులు’ – ది స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ గమనిద్దాం… చొక్కాపు వెంకటరమణ తన జీవితాన్ని బాలల కోసం, బాల సాహిత్యం కోసం అంకితం చేశారు. బాలసాహిత్య పరిషత్ అధ్యక్షులుగా గత పదిహేను సంవత్సరాలుగా సేవలందిస్తున్నారు. ఒక సీనియర్ జర్నలిస్టుగా, ఎడిటర్ గా, మెజీషియన్ గా, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులుగా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.
పిల్లల కోసం 100 పుస్తకాలకు పైగా రాశారు. బాల సాహిత్యంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ సాహితీ పురస్కారంతో పాటు ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం కూడా అందుకోవటం విశేషం. అంతేకాదు 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి ప్రపంచ రికార్డు సృష్టించారు. భారత దేశంలో తొలిసారిగా తెలుగులో కథలు చెప్పే పండుగను నిర్వహించారు.
‘తానా’ తెలుగు వారి కోసం తెలుగు తేజం, కథాకేళి పాఠ్యగ్రంథాలు అందంగా రూపొందించారు. ‘పిల్లలకు కథలు చెప్పే కళ’ పేరుతో గొప్ప పరిశోధనాత్మక గ్రంథం రాశారు. ‘క్లాస్ రూమ్ స్టోరీ టెల్లింగ్ ఫర్ టీచర్స్’ కాన్సెప్ట్ తో టీచర్లకు అనేక కార్యశాలలు నడిపారు. బాలసాహిత్య పరిషత్ ద్వారా డాక్టర్ దాసరి వెంకటరమణ, పైడిమర్రి రామకృష్ణలతో కలిసి బాలల కోసం కథారచన, గేయ, నవలల కార్యశాలలు నడిపారు. 2022 లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్ మెంట్ చొక్కాపు వెంకటరమణ పేరిట ప్రత్యేక పోస్టల్ కవర్ ను విడుదల చేసి గౌరవించింది. ఇక ఇప్పుడు
తెలుగులో ‘కథాకేళి కార్డులు’ సృష్టించి “వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు” విన్నర్ గా నిలిచారు.
ఈ కథాకేళి కార్డుల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం..
కథాకేళి కార్డులు ఎందుకు రూపొందించారంటే..
ఈ కార్డుల ద్వారా ఊహా శక్తి, క్రియేటివిటీ, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆత్మవిశ్వాసం, భాషా పటిమ, జ్ఞాపక శక్తి అంశాలను అభివృద్ధి చేసుకోవచ్చు. కథాకేళి కార్డులు ఎలాంటి వారినైనా ఆకర్షణీయంగా కథలు చెప్పేలా సిద్ధం చేస్తాయి. ఏ రంగం వారినైనా ప్రభావితం చేసి వారి లక్ష్యాన్ని సాధించేలా చేస్తాయి. విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అలవాట్లు, ఆచారాలు, నమ్మకాలు- మనకు పరిచయం చేస్తాయి. స్టేజి ఫియర్ ను పోగొట్టి వక్తృత్వ ప్రతిభను, భాష మీడా పట్టును పెంచుతాయి. ఇది కథల ద్వారా సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం పెంపొందిస్తుంది.
కథాకేళి కార్డుల ప్రత్యేకత ఏంటంటే ..
కొండంత విజ్ఞానాన్ని సంక్షిప్త కథాసారం ద్వారా అందిఐచవచ్చు. టీచర్స్, పేరెంట్స్, స్టూడెంట్స్, రైటర్స్, స్పీకర్స్, యాంకర్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రయినర్స్, సేల్స్ ప్రమోటర్స్, లాయర్స్, డాక్టర్స్ అన్ని రంగాల వారి అవసరాలు తీర్చే అక్షయ పాత్ర లాంటివిని చెప్పాలి.
కథలు చెప్పే చిట్కాలను అద్భుతంగా కమ్యూనికేట్ చేసే రంగుల హరివిల్లు- స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ కథలు చెప్పడంలో మోడర్న్ ట్రెండ్ ను పరిచయం చేస్తాయి. కథల మధ్యలో టైమింగ్ తో వాడదగిన ఫన్నీ ఫన్నీ ‘పంచ్’ దార పలుకులు శ్రోతలను రంజింప చేస్తాయి.
చిన్న కథలను పెంచటం- పెద్ద కథల నిడివిని తగ్గించటం ప్రతి కార్డుకీ రెండు వైపులా కథా విజ్ఞాన సర్వస్వం కూడా రూపొందించటం విశేషం. ఇందులో మొత్దం 130 కథలు చెప్పే టెక్నిక్స్, 120 పంచ్ దార పలుకులు, 78 కొసమెరుపు కథలతో మొత్తం 56 కలర్ ఫుల్ కార్డులు
రూప కల్పన చేశారు చొక్కాపు వెంకటరమణ. స్టోరీ టెల్లింగ్ లో కథ నిడివిని పెంచటం తగ్గించటం SCRIPT వల్ల సాధ్యం అంటారు చొక్కాపు వెంకటరమణ.
S — చిన్న కథను పెద్దదిగా చెప్పటం: అర నిముషం కథలో కొత్త పాత్రలు చేర్చి, సంఘటనలు చేర్చి 5 నిముషాల కథగా పెంచి చెప్పాలి.
C — సృజనాత్మకత: అలా చేయాలంటే మీలోని క్రియేటివిటీకి పని చెప్పాలి.
R — పెద్ద కథను తగ్గించి చెప్పడం: పెద్ద కథను సంక్షిప్తం చేసి కట్టె కొట్టె తెచ్చే’ పద్ధతిలో చిన్నదిగా చెప్పాలి.
I — ఊహాశక్తి: కథను పెంచాలన్నా, తగ్గించాలన్నా మీ ఊహాశక్తి పదునుగా ఉండాలి.
P — ఉపయోగపడేలా : కథలు ప్రయోజనాత్మకంగా ఉండాలి. అర్థం కానివిగా, పేలవంగా ఉండ కూడదు.
T — పరిమిత సమయంలో : కథ 3 నుండి 5 నిముషాల వ్యవధిని దాటకుండా సమయ పరిమితి పాటించాలి.
కథాకేళి కార్డులలో అనేక కథలు దర్శనమిస్తాయి. అందులో బావి పౌరుల కథలు, రేపటి పౌరుల కథలు, సహాయం కథలు, నిర్ణయం కథలు , అత్యాశ కథలు, లాజిక్ కథలు, కలవరం కథలు, కంగారు కథలు ,జనం కథలు, విమర్శ కథలు , మూఢనమ్మకాల కథలు, భయం కథలు, చదువు కథలు, మూర్ఖుల కథలు, అవినీతి కథలు, వైద్యుల కథలు, కోర్టు కథలు, సైకాలజీ కథలు, వ్యక్తిత్వ వికాస కథలు, నమ్మకం కథలు, వ్యాపార తంత్రం కథలు, ఏకాగ్రత కథలు .శవ్యక్తిత్వం కథలు, స్వభావం కథలు, సహనం కథలు, మానవ సంబంధాల కథలు, హ్యూమన్ రిలేషన్స్ కథలు, ఉపాధ్యాయుకు కథలు, స్టోరీ టెల్లర్స్ కథలు, అనుభవం కథలు, తెలివి కథలు ,ఉపాయం కథలు, మానవ సంబంధాల కథలు, సీనియర్ సిటిజన్ కథలు మనం గమనించవచ్చు.
కథలు చెప్పేకళను
STORY TELLING ద్వారా టెక్నిక్స్ ఇలా చెపుతారు.
S — కథాంశం:
వినేవారికి ఉపయోగపడే కథాంశాన్ని ఎంపిక చేసుకోవాలి.
T — సమయ పరిమితి:
కథ సంక్షిప్తంగా ఉందా 3 నుండి 5 నిముషాల్లో కథ ముగించాలి. పేవరు. పుస్తకం లేకుండా కథని ప్రాంతం చేసుకొని చెప్పాలి.
0 — సొంతదనం:
R — హేతుదృక్పథం:
మూడ నమ్మకాలు పెంచకుండా హేతుబద్ధమైన కథలు చెప్పాలి.
Y — కొత్తదనం:
T — చెప్పే పద్ధతి:
కథ ఎప్పుడు విన్నా కొత్తగా ఉండాలి. కథ ఆసక్తి కరంగా చెప్పాఊహించని మలుపులు తిప్పాలి.
E — వినోదభరితంగా:
కథ సరదాగా హాస్యపూరితంగా ఉండాలి.
L — భాషాభివృద్ధి:
భాషను అభివృద్ధి పరిచేలా కథ ఉండాలి. వినడం అనే నైపుణ్యం పెరగాలి.
L — శ్రవణ నైపుణ్యం:
1 — ఆసక్తి కలిగేలా
N — వివాద రహితంగా:
కథలో ఎవరినీ కించపరచడం విమర్శించడం, ఉండ కూడాను.
G — మంచి ముగింపు:
కథ ముగింపు ఆహ అనిపించాలి. ఇలాంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి.కొత్త చిట్కాలు నేర్పే 130 స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్, కథల మధ్యలో వాడదగిన 120′ పంచ్’ దార పలుకులు,
ఆశ్చర్యం కలిగించే 78 కొస మెరుపు కథలు ఉంటాయి. ఇలా అన్నీ కలిపి 56 కార్డులు ఉన్నాయి.
ఈ కార్డుల సెట్ కోసం చొక్కాపు వెంకటరమణను సెల్ నెం. 92465 20050 ద్వారా సంప్రదించి మీరు పొందవచ్చు.*
( వచ్చేవారం మరో బాలసాహితీవేత్త రచనల గురించి పరిశీలిద్దాం)
— పైడిమర్రి రామకృష్ణ
( కోశాధికారి – బాలసాహిత్య పరిషత్ )
సెల్ : 92475 64699.