Wednesday, October 30, 2024
Homeఓపన్ పేజ్Alert: మరో 90 రోజుల్లో 10శాతం ప్రపంచ జనాభాకు కోవిడ్

Alert: మరో 90 రోజుల్లో 10శాతం ప్రపంచ జనాభాకు కోవిడ్

కరోనాను మానవాళి జయించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించటం, మాస్కులు అవసరం లేదని పేర్కొనడం ఎంత పెద్ద తప్పిదమో ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. చైనాను కబళించిన కరోనా రోజురోజుకీ కొత్త సవాళ్లు విసురుతోంది. ఓవైపు ఆకలి, నిరుద్యోగం, పేదరికం, రొటీన్ లైఫ్ లేక చైనా ప్రజలు అల్లాడుతున్నారు. మరోవైపు ఆంక్షలు, స్వేచ్ఛ లేకపోవటం వంటి కారణాలతో వీరు విసుగెత్తిపోతున్నారు. ప్రపంచంలోని పలు ప్రఖ్యాత శాస్త్రవేత్తలు కూడా చైనాలో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ, రానున్న రోజులు యావత్ మానవాళికి పెద్ద సవాలుగా మారనున్నాయని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

కరోనా రక్కసి మళ్లీ పడగ విప్పుతోంది. ప్రస్తుతానికి చైనా, జపాన్ ను వణికిస్తున్నా మరికొన్ని రోజుల్లో యావత్ ప్రపంచ దేశాలను తన గుప్పిట్లోకి తీసుకుంటుందనే అంచనా ఒకటి భయపెడుతోంది.

ఇప్పటికే జీరో కోవిడ్ ఆంక్షలతో ఊపరిడాక చైనీయులు నలిగిపోతున్నారు. తాజాగా అంతకంతకూ పెరుగుతున్న కేసులు వీరికి మరింత శిక్షలు విధిస్తున్నట్టు విపత్కర పరిస్థితులు సృష్టిస్తోంది. కొత్త సంవత్సరంలో హీనపక్షంలో కనీసం మిలియన్ మంది చైనీయులు మరణిస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు చైనా కేవలం లక్షల్లో కేసులు చూపిస్తూ, అధికారికంగా 5 మంది కరోనా రోగులు మృతి చెందినట్టు ప్రపంచ మీడియాకు న్యూస్ రిలీజ్ చేయటం విచిత్రంగా మారింది. నిజాలను కప్పిపెడుతూ, కరోనా వ్యాధి వ్యాప్తికి పరోక్షంగా చైనా సర్కారు రెడ్ కార్పెట్ వేస్తున్నట్టు పరిస్థితి తయారైంది. మరోవైపు అసలు చైనాలో పుట్టి, మళ్లీ చైనానే కబళిస్తున్న కరోనాకు చైనా ఆసుపత్రుల్లో చేస్తున్న చికిత్స ఏంటో అంతుచిక్కటం లేదు. ఇక కోవిడ్ టీకా విషయానికి వస్తే అదో చిదంబర రహస్యంగా మారింది. చైనీయులకు కోవిడ్ టీకాలు అందకపోగా, చైనాలోనే తయారైన ఆ టీకాల పనితీరుపై ఇప్పటికీ అనుమానాలు ఉండటంతో చైనా ప్రజలు ఎవరూ వాటి జోలికి పోవటం లేదు. పైగా క్లినికల్ ట్రయల్స్ కూడా ఈ టీకాలకు నిర్వహించిందీ లేనిదీ ఇప్పటికీ వెల్లడికి కాకపోవటం మరో దౌర్భాగ్యం. ఫిబ్రవరీ, మార్చి ఆఖరుకల్లా పరిస్థితులు సాధారణ స్థితికి రావాలంటే చైనాలో ఇప్పటినుంచే యుద్ధప్రాతిపదికన కోవిడ్ వ్యాప్తి నిరోధక చర్యలు చేపట్టక తప్పదు. కానీ ఈ చిత్తశుద్ధి జిన్ పింగ్ సర్కారుకు లేకపోగా, ప్రజలు కూడా సహకరించే పరిస్థితులు లేనేలేవు. ఈనేపథ్యంలో చైనా నుంచి ఈ వ్యాధి ప్రపంచంలోని వివిధ దేశాలకు విస్తృతంగా పాకే ప్రమాదాలు ఉన్నాయి. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఔషధాల కొరత వేధిస్తోంది.

వాల్ స్ట్రీట్ జర్నల్ చెప్పేది నిజమైతే చాలా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినట్టు మనం నమ్మక తప్పదు. గత కొన్ని రోజులుగా చైనా దేశవ్యాప్తంగా పిట్టలు రాలినట్టు ప్రజలు కోవిడ్ కు బలయి, తనువు చాలిస్తున్నారు. ఇప్పటికే చైనాలోని అన్ని ఆసుపత్రులు పేషెంట్లతో కిక్కిరిసిపోతున్నాయి. ఎవరు కోవిడ్ బారిన పడినా, ఎంతమంది కరోనాతో అసువులు బాసినా వదిలేద్దాం అన్నట్టు చైనా సర్కారు పనితీరుందని హెల్త్ ఎకానమిస్ట్ ఫిగల్ డింగ్ చెబుతుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. చైనా రాజధాని బీజింగ్ లో కరోనాతో మృతి చెందిన వారికోసం ఉద్దేశించిన స్మశానంలో రోజులతరబడి శవాలతో బంధువులు పడిగాపులు కాస్తున్నారని, అయిన వారికి అంతిమసంస్కారాలు చేసేందుకు ఇక్కడికి చేరుకుంటున్నవారు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు బయటి ప్రపంచానికి ఆలస్యంగా తెలుస్తోంది. రేయింబవళ్లు ఇక్కడ శవదహనాలు చేస్తున్నా క్యూ లైన్లు మాత్రం పేరుకుపోతున్నాయని చైనా ప్రజలు మండిపడుతున్నారు. కానీ చైనా సర్కారు మాత్రం గత కొన్ని రోజులుగా బీజింగ్ లో కరోనా చావులు లేవని చెబుతూ, నవంబర్ 19-23 మధ్యకాలంలో కేవలం నలుగురే కోవిడ్ తో మరణించినట్టు అధికారికంగా ప్రకటన చేసి చేతులు దులుపుకుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే తీవ్ర పనిఒత్తిడితో స్మశానంలోని పనివాళ్లకు కోవిడ్ సోకి నానా అవస్థలు పడుతున్నారు. చైనాలోని 1.4 బిలియన్ జనాభాకు సరైన మందులు, ఆఖరుకి ఎమర్జెన్సీ కేర్, ముందస్తు నివారణకు కరోనా టీకాలు లేక కోవిడ్ సోకే అవకాశాలు అత్యధికంగా ఉన్న భయానక పరిస్థితుల మధ్య బతుకీడిస్తూ, దినగండం నూరేళ్ల ఆయుష్షులా గడపాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా చైనా ప్రభుత్వ నేషనల్ హెల్త్ కమిషన్ రిపోర్టు చూస్తే షాక్ అవ్వక తప్పదు. చైనా హెల్త్ కమిషన్ లెక్కల ప్రకారం తాజాగా మెయిన్ ల్యాండ్ చైనాలో 1,995 కేసులు మాత్రమే నమోదయ్యాయట.

అంత్యక్రియలు త్వరగా పూర్తి చేసేందుకు వేచి చూడాల్సిన అవసరం లేదనుకుంటే మాత్రం కనీసం 26,000 యువన్లు (3,730 డాలర్లు) చెల్లిస్తే కాసేపట్లోనే అంత్యక్రియలు పూర్తి చేసుకోవచ్చని చైనా ప్రజలు వెల్లడిస్తున్నారు. అంటే నిలువు దోపిడీ ఇస్తేకానీ అయిన వారి అంత్యక్రియలు త్వరగా పూర్తవ్వవు. కొంతమంది చేతిలో ఇంత డబ్బు లేక నాలుగు లేక 5 రోజులైనా మృతదేహాలను ఇళ్లలోనే పెట్టుకుని వేచి చూడక తప్పట్లేదు. చైనా ఉత్తర ప్రాంతంలో చలిగాలుల తాకిడి చాలా ఎక్కువగా ఉండటంతో వయసులో పెద్దవారు చాలాపెద్ద ఎత్తున కన్నుమూస్తున్నారు. పరిస్థితిని చూసి తట్టుకోలేక కొందరు చైనీయులు ట్విట్టర్, వీబో వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంపై పరిస్థితిని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే మీడియాతో మాట్లాడకూడదని చైనాలో కఠిన ఆంక్షలు ఉన్ననేపథ్యంలో అంతర్జాతీయ మీడియాతో మాట్లాడితే తమకు శిక్ష తప్పదని బాధితులు భయపడుతున్నారు.

మెయిన్ ల్యాండ్ చైనాలో కోవిడ్ మరణాలను సర్కారు దాచుతోందని పరిస్థితి స్పష్టంగా చెబుతోంది. చైనాలోని పరిశ్రమలు అత్యధికంగా మూతపడే పరిస్థితుల్లో ఉన్నాయి. కూలీలు, ఉద్యోగులు వచ్చి పనిచేసే పరిస్థితి లేకపోగా, ఒకవేళ కష్టనష్టాలకు వెరసి పనిచేసినా జీతం డబ్బులు మాత్రం కంపెనీలు ఇచ్చే ఆర్థికస్థితిలో లేకపోవటంతో ఇక్కడి ప్రజలు ఆర్థికంగా చితికిపోతున్నారు. షాంఘై సిటీతోపాటు చాలా ప్రాంతాల్లో వచ్చే నెల చివరి వరకు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.

చైనాలో సింప్టమ్యాటిక్ కోవిడ్-19 ఇన్ఫెక్షన్స్ ప్రబలుతున్నాయి. నిత్యం కొత్త కేసులు వస్తుండగా ఆసుపత్రుల్లో చేరేందుకు బెడ్లు లేక చైనా ప్రజలు అల్లాడుతున్నారు. పదేపదే లాక్ డౌన్లు విధించినా కరోనా ఇక్కడ అదుపులోకి రాకపోవటంతో పాటు ప్రజలు లాక్ డౌన్లపై విరుచుకుపడుతూ తిరుగుబాటు చేసేస్తున్నారు. దీంతో ఆంక్షలను విధించాలన్నా సర్కారు బెదిరిపోతుండగా, అమలులో ఉన్న ఆంక్షలను సైతం చైనా ప్రజలు ఖాతరు చేయటం లేదు. ఓవైపు కొత్త కేసులు, మరోవైపు మరణాల సంఖ్య కనివినీ ఎరుగని రీతిలో ఉన్నా చైనా సర్కారు మాత్రం వాటిని ప్రకటించకుండా దాచేస్తుండటం చైనా ప్రజలకే ఆగ్రహాన్ని తెస్తోంది. టాప్ సైంటిస్ట్ ఎరిక్ ఫీగ్ల్ డింగ్ అంచనా ప్రకారం రానున్న 90 రోజుల్లో మిలియన్ల మంది ప్రజలు కోవిడ్ కారణంగా మరణిస్తారని, ముఖ్యంగా చైనాలు 60 శాతం మందికి కోవిడ్ వస్తుందని, భూమిపైన 10 శాతం మంది జనాభాకు ఈ అంటువ్యాధి సోకి తీరుతుంది. ఇదే నిజమైతే కరోనా నుంచి మనమంతా చాలా జాగ్రత్తగా ఉండితీరాల్సిందే. వ్యక్తిగతంగా మనం శుభ్రంగా ఉంటూనే, అవసరమైనతే తప్ప బయటికి, జన సమూహంలోకి వెళ్లకుండా ఉండటం సురక్షితం.

చైనా పరిస్థితి ఇలా ఉంటే మనదేశంలో జీరో కోవిడ్ అనే పరిస్థితి లేకపోగా కొత్తగా 112 కేసులు నమోదుకాగా 3,490 కేసులు యాక్టివ్ కేసులుగా అధికారికంగా భారత ప్రభుత్వం వెల్లడించింది. మనభారతీయులు ఎక్కువగా న్యూ ఇయర్ కోసం అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తుంటారు, పైపెచ్చు విదేశీయులు కూడా మనదేశానికి వివిధ కారణాలతో పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యలను కఠినంగా చేపడితే మనదేశంలోనూ కొత్త కోవిడ్ కేసులు,కొత్త కోవిడ్ వేరియంట్లు విజృంభించకుండా ఉంటుందని నిపుణులు సర్కారుకు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News