Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్INDIA Alliance: ప్రతిపక్ష కూటమిలో అన్నీ హంసపాదులే!

INDIA Alliance: ప్రతిపక్ష కూటమిలో అన్నీ హంసపాదులే!

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిపిందంటే ఎన్నికల ప్రచారం ప్రారంభం అయిపోయినట్టే లెక్క

ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న నానుడి ఇండియా కూటమికి అక్షరాలా వర్తిస్తుంది. ఈ కూటమి ఏర్పడి ఆరు నెలలు గడిచిపోయినా ఇంతవరకూ దారీ తెన్నూ కనిపించడం లేదు. మరో మూడు నెలల్లో ఎన్నికలు కూడా దగ్గర పడుతున్నాయి. అయితే, దాని నాయకత్వంలో ఇంకా సయోధ్య కుదరలేదు. సామరస్యం ఏర్పడలేదు. దాని ఎజెండా ఏమిటో ఇప్పటికీ నిర్ణయం కాలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే ఆరాటం తప్ప మరే ఆరాటమూ ఈ కూటమిలో కనిపించడం లేదు. వివిధ పార్టీల మధ్య విభేధాలను పరిష్కరించడానికి ఎటువంటి కృషీ జరుగుతున్న దాఖలాలు లేవు. సీట్ల పంపకం గురించి మాట వరుసకైనా చర్చించడం జరగడం లేదు. ఈ లక్ష్యాల దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి కానీ, కొన్ని పార్టీలు లౌక్యంగా పార్టీ సమావేశాలకు హాజరు కాక పోవడమో, సమావేశాలకు హాజరైనప్పటికీ ఇతర పార్టీలతో విభేదించడమో జరుగుతోంది. భిన్న సిద్ధాంతాలు, భిన్న ఆశయాలు, భిన్న ప్రయోజనాలు, భిన్న ఓటు బ్యాంకులు కలిగిన ఒక 28 పార్టీల కూటమిలో ఇటువంటి తీరుతెన్నులు సహజమేననడంలో సందేహం లేదు. అయితే, ఇంత మందకొడిగా, నత్తనడకగా నిర్ణయాలు తీసుకోవడం ఈ కూటమి స్థిరత్వం మీదే కాకుండా, కూటమి ఆశయాల మీద కూడా సందేహాలను రేకెత్తిస్తోంది. తీరా పది పదిహేను రోజుల్లో మీ
కూటమి మధ్య సామరస్యం ఏర్పడవచ్చు కానీ, ప్రజలలో ఈ కూటమి పట్ల నమ్మకం పట్ల నమ్మకం కలగడానికి మాత్రం కనీసం ఏడాది కాలం అవసరమవుతుంది.

- Advertisement -

ఇండియా కూటమికి చెందిన పార్టీల నాయకులు గత శనివారం కూడా సమావేశమయ్యారు కానీ, ఒక అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కు వేయడమే ఈ సమావేశంలో కూడా జరిగింది. ఈ 28 పార్టీల ప్రతిపక్ష కూటమికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే చైర్మన్ గా ఉండాలనే ప్రతిపాదనపై అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపక్ష కూటమిలో అతి పెద్ద పార్టీగా కాంగ్రెస్ ఈ పదవికి అర్హురాలనడంలో సందేహం లేదు. అయితే, ప్రతిపక్ష కూటమి తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. ఈ ఇండియా కూటమికి కన్వీనరుగా బీహార్ ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ పేరు ప్రతిపాదించడం జరిగింది కానీ, ఆయన ఈ ప్రతిపాదనను నిర్మొహమాటంగా తిరస్కరించారు. ఆయన ఆ పదవిని కోరుకోవడం లేదని కొందరు మంత్రులు తేల్చి చెప్పారు. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం ఆయనను కూటమికి చైర్మన్ ను చేయడంతో పాటు, ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే సమంజసంగా ఉండేదని అక్కడక్కడా వ్యాఖ్యానించడం ప్రారంభిం చారు. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కూటమి తర్వాతి సమావేశంలో
అయినా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అతి ముఖ్యమైన విషయం సీట్ల పంపిణీ. దీని గురించి విస్తృతంగా చర్చించాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే అనేక రాష్ట్రాల్లో సీట్ల పంపకానికి అవకాశమే లేదు. పశ్చిమ బెంగాల్, కేరళ, పంజాబ్ రాష్ట్రాల్లో కూటమిలోని పార్టీలు బద్ధ శత్రువులగా వ్యవహరిస్తున్నాయి.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పాలక బీజేపీకి గట్టి పోటీ ఇవ్వదలచుకున్న పక్షంలో ఈ కూటమి ఇప్పటికైనా గట్టిగా నడుం బిగించాల్సి ఉంటుంది. బీజేపీకి పరిస్థితులన్నీ బాగా అనుకూలంగా ఉన్నాయి. ఆ పార్టీకి బలమైన నాయకత్వం ఉంది. అది రాజకీయపరంగా, ఎన్నికల పరంగా నిర్దిష్టమైన వ్యూహాలతో సర్వసన్నద్ధంగా ఉంది. అయోధ్య రామమందిరం విషయంలో అది దేశ వ్యాప్తంగా భావోద్వేగాలు సృష్టించగలిగింది. ఇది ఆ పార్టీ విజయావకాశాలను గణనీయంగా పెంచే అవకాశం కూడా ఉంది. అది అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిపిందంటే ఎన్నికల ప్రచారం ప్రారంభం అయిపోయినట్టే లెక్క. ఇండియా కూటమి ఇంత నత్తనడక నడుస్తోందంటే పార్టీల నాయకులనే తప్పుపట్టాల్సి ఉంటుంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ తన విలువైన సమయాన్ని ఎంతగానే వృథా చేసింది. ఎన్నికల తర్వాత తాము ప్రతిపక్షాలతో బేరసారాలాడడా నికి సమయం మరింత అనుకూలంగా ఉంటుందని, తమ స్థితి బాగా మెరుగ్గా ఉంటుందని కాంగ్రెస్ భావించింది. చివరికి అలాంటిదేమీ జరగలేదు. ఇప్పుడు మరో పాదయాత్రతో తమ స్థితి బాగా మెరుగుపడుతుందని అది భావిస్తోంది.

ప్రస్తుతం ఇందులోని పార్టీలన్నీ తమ సొంత ప్రయోజనాలను కాపాడుకోవాలని, వీలైనంతగా మెరుగుపరచుకోవాలని భావిస్తున్నాయే తప్ప, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ద్వారా తమ సమష్టి ప్రయోజనాలను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంలో లేవు. ఇండియా కూటమి ఒక్క విషయంలోనూ ఏకాభిప్రాయానికి రాకపోవడం, దానికి ఒక స్పష్టమైన ఎజెండా అంటూ లేకపోవడం, పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు చేస్తుండడంతో అత్యధిక సంఖ్యాక ప్రజల్లో సైతం ఈ కూటమి తీరు పట్ల, గట్టి పోటీ ఇవ్వడం పట్ల, విజయావకాశాల పట్ల పూర్తిగా నిర్లిప్త పరిస్థితి ఏర్పడి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News