Sunday, July 7, 2024
Homeఓపన్ పేజ్All eyes are on farmers: అందరి దృష్టీ రైతుల పైనే!

All eyes are on farmers: అందరి దృష్టీ రైతుల పైనే!

రైతులకు గాలం వేస్తున్న పార్టీలు

ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీల దృష్టీ రైతుల మీద పడింది. రైతుల మీద వరాల వర్షం కురిపించడంలో పార్టీలు ఒక దానితో మరొకటి పోటీ పడుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గరిష్ట స్థాయిలో గోదుమకు మద్దతు ధరను ఆకాశమే హద్దుగా పెంచేసింది. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ కింద భూమి కలిగిన రైతు కుటుంబాలకు రూ. 6,000 వంతున నగదు బదిలీ చేపడుతున్నట్టు కూడా ప్రకటించింది. ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వం కంటే ఒక అడుగు ముందుకు వేస్తున్నాయి. తెలంగాణలోని పాలక భారత రాష్ట్ర సమితి (బి.ఆర్‌.ఎస్‌) ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రైతుల ఖాతాల్లోకి రూ. 10,000లను బదిలీ చేయబోతోంది. పైగా ఈ సొమ్మును క్రమక్రమంగా రూ. 16,000లకు పెంచుతామని కూడా ప్రకటించింది. ఈ పార్టీలలో వేటికీ కాంగ్రెస్‌ పార్టీ తీసిపోలేదు. తమ రైతు భరోసా పథకం కింద రైతులకు రూ. 15,000, వ్యవసాయ కూలీలలకు రూ. 12,000 ఇస్తామని ప్రకటించింది.
ఇతర రాష్ట్రాలలో కూడా నగదు బదిలీ, రుణ మాఫీ, ఉచిత విద్యుత్తు, గరిష్ఠ మద్దతు ధర వంటి వరాలను కురిపించడం జరుగుతోంది. ఈ వరాలను బట్టి అర్థమవుతున్నదేమిటంటే, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు దయనీయమైన, దుర్భరమైన జీవితాన్నిగడుపుతున్నారు. దేశ జనాభా దాదాపు సగభాగం వ్యవసాయం మీదే ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయ సామగ్రి, పరికరాల ధరలు పెరగడం, వాతావరణ మార్పులు, వ్యవసాయ ఉత్పత్తులకు తక్కువ ధరలు, ప్రతి ఏటా పునరావృతమవుతున్న రైతు సమస్యలకు ఇంతవరకూ పరిష్కారాలే లేకపోవడం వంటి కారణాల వల్ల వ్యవసాయ రంగం ఒకవిధమైన సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. ప్రభుత్వాలు తమకు అవసరమైనప్పుడు స్పందించడమే తప్ప దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొని, అమలు చేసే కార్యక్రమాన్ని పెట్టుకోవడం లేదు.
బాస్మతి బియ్యం ధరను టన్నుకు 1,200 డాలర్ల కనీస ఎగుమతి ధర నిర్ణయిస్తూ ప్రభుత్వం ఇటీవల ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల అత్యంత పోటీదాయకమైన అంతర్జాతీయ మార్కెట్లో రైతులు, వ్యాపారులు నష్టపోవడం జరుగుతుందే తప్ప ఏమాత్రం ప్రయోజనం ఉండదు. గోదుమ ఎగుమతుల మీద ఆంక్షలు విధించడం కూడా దాదాపు ఇటువంటి ఫలితాన్నే ఇస్తుంది. భారతీయ అంతర్జాతీయ ఆర్థిక సంబంధాల పరిశోధన మండలి అందించిన సమాచారం ప్రకారం, గత ఏడాది ప్రభుత్వం దేశీయ బహిరంగ మార్కెట్లో గోదుమను టన్నుల కొద్దీ కుమ్మరించి, వీటి ఎగుమతుల మీద ఆంక్షలు విధించడం వల్ల, రైతులు దేశవ్యాప్తంగా దాదాపు రూ. 40,000 కోట్లు నష్టపోవడం జరిగింది. ఇదే విధంగా ఎగుమతుల మీద ఆంక్షలను కొనసాగిస్తూ పోతే, రైతుల నష్టం దాదాపు రెట్టింపయ్యే అవకాశం కూడా ఉంది.
సాధారణంగా రాజకీయ పార్టీలు రైతులు, వ్యవసాయానికి సంబంధించి స్వల్పకాలిక ప్రయోజనాల మీద దృష్టి పెడుతుంటాయే తప్ప, శాశ్వత పరిష్కారాల కోసం ప్రయత్నించవు. అంటే, నిర్మాణాత్మక పరిష్కారాలను పట్టించుకోవు. ఆహార భద్రతను సాధించాలన్నా, గ్రామీణ ఆదాయాలను మెరుగుపరచాలన్నా, ప్రభుత్వాలు ఒక పోటీదాయకమైన, స్థిరాదాయం కలిగిన వ్యవసాయ రంగాన్ని సృష్టించాల్సి ఉంటుంది. భారత గ్రామీణ రంగం ప్రస్తుతం పాలు, కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, గోదుమలు, బియ్యం, పత్తి, చెరకు, చేపలు, పండ్లు, కూరగాయలు, టీ, మాంసాల ఉత్పత్తి వంటి అంశాలలో అగ్రస్థానంలో ఉంది. అంతర్జాతీయంగా పోటీ పడాలన్న పక్షంలో తప్పనిసరిగా గిడ్డంకులు, శీతల కేంద్రాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. రైతులు తరచూ తమ ఉత్పత్తులను వీధుల్లో, రోడ్లల్లో పారేయడం అన్నది విధానాల వైఫల్యాలు, లోపాలకు అద్దం పడుతుంటుంది. ప్రభుత్వాలు ఒకపక్క వాతావరణ మార్పుల నుంచి రైతులను కాపాడుతూనే, మరోపక్క విధాన నిర్ణయాల ద్వారా వారి బాగోగులను వృద్ధి చేయాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News